సబ్ ఫీచర్

జుకర్‌బర్గ్‌కు, మావోలకు ఎంత తేడా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక ప్రపంచం తీరును అనూహ్యంగా మార్చిన ప్ర ముఖులలో ‘ఫేస్‌బుక్’ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఒకరు. కేవలం ముప్ఫై ఏళ్ల వయసులోనే ఆయన ఈ ఘనత సాధించారు. సామాజిక మీడియాలో సంచలన వేదికగా ‘ఫేస్‌బుక్’ను స్థాపించాక పిన్న వయసులోనే జుకర్‌బర్గ్ లక్షల కోట్ల రూపాయలు ఆర్జించి, మానవాభ్యుదయానికి భారీగా విరాళాలు ప్రకటించారు. భవిష్యత్‌లో ఇంకా పెద్దఎత్తున ధనాన్ని దానం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. 19వ శతాబ్దంలో కార్ల్ మార్క్స్ చూసిన పెట్టుబడిదారులకు, 21వ శతాబ్దపు జ్ఞాన పెట్టుబడిదారులకు ఎంత తేడా ఉందో మనకు ఇట్టే అర్ధమవుతోంది.
జుకర్‌బర్గ్ ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇదే విశ్వవిద్యాలయంలో అర్ధాంతరంగా ఆయన తన విద్యకు స్వస్తిపలికి ఫేస్‌బుక్ విస్తృతికి కృషి చేశారు. ఇప్పుడు అదే విశ్వవిద్యాలయం ఆయన సాధించిన ఘనతకు ‘గౌరవ డాక్టరేట్’ను ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన ప్రపంచ యువతను ఉత్తేజ పరిచే విధంగా ప్రసంగించారు. విద్యార్థులు, యువతనే గాక అన్ని వర్గాల వారు ఆ ప్రసంగ పాఠంలోని అంశాలను తమకు అన్వయించుకోవచ్చు. ముఖ్యంగా కాలం చెల్లిన రాజకీయాలు చేస్తున్న పార్టీలు సైతం తమ దృక్పథాన్ని సరిచూసుకోవలసిన అవసరాన్ని ఆ ప్రసంగం సూచిస్తున్నది.
‘వర్తమాన సాంకేతిక పరిజ్ఞానం’ అనే ఇరుసుపై ఈ ప్రపంచం పరిభ్రమిస్తోందన్న వాస్తవం తెలియనంతకాలం ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు మార్గదర్శనం చేయలేదు. విచిత్రమేమిటంటే వామపక్షాలు, వామపక్ష తీవవాద పార్టీలైన నక్సల్స్ గ్రూపులు ఇంకా కాలం చెల్లిన సిద్ధాంతాలతోనే సమయం గడుపుతున్నాయి. ఆవిరి యంత్రాల కాలం నాటి చైతన్యంతో రూపొందించిన మార్క్సిజం- ప్రస్తుత 21వ శతాబ్దం సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లిన కాలానికీ ఉపయుక్తమని చెప్పడం ప్రజల్ని ఇంకా వెనుకబాటుతనంలోకి నెట్టివేయడమే అవుతుంది.
కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని మావో ఉన్నతీకరించాడని చెప్పే మావోయిస్టులు చాలా రాష్ట్రాల్లో తమ విధ్వంస కార్యకలాపాల్ని, నరమేధాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. జుకర్‌బర్గ్ ప్రసంగం వింటే వారి కార్యక్రమాలు ఎంత అనాగరికమో, ఆటవికమో అవగతమవుతుంది.
జుకర్‌బర్గ్ హార్డర్డ్ వర్సిటీలో ప్రసంగిస్తూ- ‘అనేక సంస్థలు అభివృద్ధి పరచిన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని మార్చేసింది.. ఇంకా మార్పు ఎంతో ఉంది.. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. సమాజాన్ని ఒక్క తాటిపైకి ఈ పరిజ్ఞానం తీసుకురావడమే గాక సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుంది’ అన్నారు.
సమాజంలో సమానత్వ నిర్వచనాన్ని ప్రతి తరం మరింతగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఓటు కోసం, పౌర హక్కుల కోసం పోరాటాలు జరిగాయి. వర్తమాన కాలానికొచ్చేసరికి సమాజం తీరుతెన్నులు బాగా మారిపోయాయి. దీనికి అనుగుణంగా కొత్తతరం శ్రమించాల్సి ఉంటుందని కూడా జుకర్‌బర్గ్ అన్నారు. ఈ ఒక్క అంశాన్ని ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించి, అధ్యయనం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. వర్తమాన సమాజంలో సమానత్వమంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడమే. ఆ జ్ఞానాన్ని, అవగాహనను అందరికీ అందించడమే! ఈ స్పృహ చాలా రాజకీయ పార్టీల్లో కనిపించదు. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ అయితే ఆధునిక పరిజ్ఞాన ప్రభావాన్ని పసిగట్టడానికి తిరస్కరిస్తూ ఇంకా 19వ శతాబ్దపు మార్క్స్ భావనలే బంగారుబాటలు వేస్తాయని, మానవాళికి గొప్ప రహదారిని ఏర్పరుస్తాయని ఊదరగొట్టడం విడ్డూరం.
ఇపుడు అన్ని రంగాల్లో ‘ఆటోమేషన్’ దూసుకెళుతున్న తరుణంలో ఎదురవుతున్న సవాళ్ళకు పరిష్కారం మార్క్సిజం దరిదాపుల్లో కనిపించదు. జుకర్ బర్గ్ మాత్రం ఈ విషయమై సాంత్వన కలిగించే రీతిలో ప్రసంగించారు. ఆటోమేషన్ వల్ల లక్షలాది ఉద్యోగాలు ఊడిపోతాయని ఆందోళన చెందవద్దని, కొత్త ఉద్యోగాల సృష్టికి కొత్తతరం తప్పక బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. సంప్రదాయ పద్ధతిలోగాక వినూత్న రీతిలో నైపుణ్యాలను ఒడిసి పట్టుకోవడంతో ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉందన్నారు. కొత్తతరం ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాలని పిలుపునిచ్చారు. సృష్టిస్తారన్న విశ్వాసాన్ని సైతం వ్యక్తం చేశారు.
తనలాంటి ‘మిలీనియల్స్’ ఒక దేశానికో, ప్రాంతానికో పరిమితం కాకుండా ప్రపంచ పౌరులుగా తమకు తాము పరిగణించుకోవాలని సూచన చేశారు. పురోగతి కోసమే గాక జీవిత పరమార్థానికి తమ లక్ష్యాలు ఉపకరించాలని, అటువైపుగా నవతరం దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. 33 ఏళ్ల జుకర్‌బర్గ్ ఆలోచనల వ్యక్తీకరణ ఎంత పరిణతి చెందిందిగా ఉందో మనం ఊహించవచ్చు. మొత్తం మావవాళి లక్ష్యంగా ఆయన మార్గనిర్దేశనం చేస్తున్నారు.
ఈ పరిణామాలను, సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చే మార్పును భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా పసిగట్టారు. అందుకే ఆయన ‘డిజిటల్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’ లాంటి గొప్ప కార్యక్రమాలను రెండేళ్ళ క్రితమే చేపట్టారు. సిలికాన్ వ్యాలీని ఒకటి, రెండుసార్లు సందర్శించి అక్కడి నిపుణులతో తన ఆలోచనలు మోదీ పంచుకున్నారు. భారతదేశానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను ఆహ్వానించారు. అందులో భాగంగా ప్రపంచ శ్రేణి ఐటి సంస్థలు భారతదేశానికి వచ్చాయి. మరికొన్ని వస్తున్నాయి. ప్రపంచంతో కలిసి భారతదేశం నడిచేందుకు మార్గం మరింత సుగమం అయింది.
గతంలో వచ్చిన మూడు పారిశ్రామిక విప్లవాల సందర్భంగా భారతదేశం కొంత వెనుకంజలో ఉండటం కారణంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధిని సాధించలేక పోయామన్న వాదన ఇప్పటికీ బలంగా వినిపిస్తోంది. తాజాగా నాల్గవ పారిశ్రామిక విప్లవ సమయంలో మాత్రం ఆ పొరపాటు దొర్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచ పరిస్థితులు సైతం అందుకు అనుకూలంగా ఉండటం ఒక వరంగా భావిస్తున్నారు.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి సంస్థలు పనిచేస్తున్నాయి. వాటి చుట్టూ ఉండే వాతావరణం ఇక్కడి వారికి పరిచయమవుతోంది. ఇప్పుడు బిగ్ డేటా, ఎనలటిక్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ బిగ్ డేటా అండ్ అనలిటిక్స్’ అన్న అంతర్జాతీయ కేంద్రం హైదరాబాద్‌లో నెలకొల్పే అవకాశాలున్నాయి. నాస్‌కామ్ ఈమేరకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల రిలయన్స్ ప్రవేశపెట్టిన ‘జియో’ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అద్భుతమైన దృష్టికోణంతో ముందుకెళుతున్నారు. ప్రధాని మోదీ కలలను సాకారం చేసేందుకు తనవంతు పాత్రను ఆయన బలంగా పోషిస్తున్నారు.
నాల్గవ పారిశ్రామిక విప్లవానికి భారతదేశమే నాయకత్వం వహిస్తుందన్న ఆశావాదాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని చేజిక్కించుకుని దేశం సుసంపన్నం కావాలని ఆయన ముఖేశ్ ఇటీవల ఒక సదస్సులో చెప్పారు. ఆ అర్హతలు దేశానికి దండిగా ఉన్నాయని కూడా ఆయన సాధికారికంగా ప్రకటించారు.
ఒకప్పటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చుకుని కొత్త దాన్ని ఏర్పాటుచేసుకునే బాదరబందీ భారతదేశానికి లేదని ఏకంగా డిజిటల్ రంగంలోకి దూకడం ఎంతో బరువును, ఖర్చును మోయాల్సిన అవసరం లేదని, ఇది గొప్ప వరంగా భావించాలని కూడా ఆయన అంటున్నారు. భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానం సూచించగలదన్న గట్టి విశ్వాసాన్ని మార్క్ జుకర్ బర్గ్, ప్రధాని మోదీ, ముకేశ్ అంబానీ లాంటి వివిధ రంగాలవారు చెబుతున్నారు. అవును.. ఇదంతా నిజమేనని తాజా పరిస్థితులు ఘోషిస్తున్నాయి- ఒక్క మావోయిస్టులు తప్ప!

- వుప్పల నరసింహం