సబ్ ఫీచర్

రాహుల్‌పై నిందలు తగునా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు’- అన్న నానుడి ప్రస్తుతం ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా’ అయిన కాంగ్రెస్‌కు చక్కగా సరిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు చేసిన తప్పిదాలే ప్రస్తుతం వారి పాలిట పెనుశాపంగా మారాయి. కాంగ్రెస్ నేతల వైఖరి- ‘అయితే నా గొప్ప.. కాకపోతే నీ ఖర్మ’ అన్న చందాన ఉంటోంది. దేశంలో 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాల పాలవుతున్నది. అయితే, ఈ ఓటములన్నింటికీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని బాధ్యుడుగా చేస్తూ విమర్శలు చేయడం మిగతా రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. యువకుడైన రాహుల్‌ను అసమర్ధునిగా చిత్రీకరించేందుకు అటు స్వపక్షం, ఇటు ఇతర రాజకీయ పార్టీల నేతలు ప్రయత్నిస్తుండటం గమనార్హం. కాంగ్రెస్ వాసన అంటే గిట్టని ఓ వర్గం మీడియా అయితే రాహుల్ గాంధీకి ‘ఐరన్ లెగ్’అని పే రు పెట్టింది. ఆయనను అలా వ్యక్తిగతంగా కించపరచడం సరికాదు. కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలకు ఆయన ఒక్కడే కారకుడు కాదు.
దేశ ప్రజలలో రాజకీయ చైతన్యం పెరిగింది. అవినీతి, అక్రమాలను వారు స హించడం లేదు. సహనం అనేది భారతీయులకు పుట్టుకతో వచ్చింది. అందువల్లనే వారు ఒక రాజకీయ పార్టీకి అధికారం కల్పించిన తరువాత, సదరు పార్టీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా సహిస్తారు. ఎన్నికల సమయంలోనే తమ ఆగ్రహాన్ని చూపిస్తారు. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ ఇదే జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిత్వంలో దశాబ్ద కాలం పాటు సాగిన యుపిఎ పాలనలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న నేతలను కట్టడి చేయడంలో అటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇటు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విఫలమయ్యారు. అందుకు వారికి ప్రజలు అందించిన కానుకే వరుస పరాజయాలు.
2014 ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా పర్యటించి, ‘అవినీతి, అక్రమాలకు తావులేని సుపరిపాలన అందిస్తాన’ని ప్రచారం చేయడమే. ఆయన చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించి, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమికి పట్టం కట్టారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేయకుండా గత మూడు సంవత్సరాలుగా సుపరిపాలన అందించడానికి ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి అయిన తరువాత మోదీ ప్రజల ఆదరాభిమానాలను పొందటంలో సఫలీకృతులైనందునే బిజెపికి వరుస విజయాలు లభిస్తున్నాయి.
ప్రజలు అవినీతిని అసహ్యించుకుంటున్నారని అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్ శాసనసభ ఎన్నికలే. ఉత్తరప్రదేశ్‌లో అవినీతి, అరాచకం పెచ్చుమీరడంతో అక్కడి ప్రజలు సమాజ్‌వాదీ పార్టీని చిత్తుగా ఓడించి, బిజెపికి ఘన విజయం కట్టబెట్టారు. పంజాబ్‌లోనూ ఇదే జరిగింది. పంజాబ్‌లో అకాలీదళ్-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం దశాబ్ద కాలంగా అధికారంలో ఉండగా పలు అక్రమాలు చోటుచేసుకొన్నాయి. అందువల్లనే అక్కడి ప్రజలు అకాలీదళ్-బిజెపి కూటమిని చిత్తుగా ఓడించి, కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు. పార్టీ ఏదైనా, నాయకుడు ఎవరైనా, ప్రజలు మాత్రం అవినీతిని సహించడం లేదనడానికి ఇలా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
ఇకనైనా కాంగ్రెస్ పార్టీ రథసారధులు సోనియా, రాహుల్ కళ్లు తెరవాలి. అవినీతి మకిలితో భ్రష్టుపట్టిన నాయకులను పక్కనపెట్టి, పార్టీలో యువతకు ప్రాధాన్యం కల్పించాలి. అప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీని కొంతవరకైనా విశ్వసించే అవకాశం ఉంది. కాలానుగుణంగా మార్పులు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పొందటం దుర్లభమే అవుతుంది. తమ పార్టీకి అంటిన అవినీతి మకిలిని తుడుచుకోవడానికి పార్టీ నాయకత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాహుల్ గాంధీ ఎన్నికలను పక్కనపెట్టి, ముందుగా పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అలా జరగనంతకాలం, కాంగ్రెస్ పార్టీకి ఎవరూ నాయకత్వం వహించినా వరుస పరాజయాలు మాత్రం తప్పదు.
*

- పి.మస్తాన్‌రావు