సబ్ ఫీచర్

పని సంస్కృతి.. ప్రగతికి దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రార్ధించే పెదవుల కన్నా పని చేసే చేతులు మిన్న’ అన్న మాటలు పని ప్రాధాన్యతను చెప్పక చెబుతున్నాయి. అందుకే- ‘వర్క్ ఈజ్ గాడ్’, ‘వర్క్ ఈజ్ వర్షిప్’ అని, ‘పనే దైవం’, ‘పనే పూజ’ అని పెద్దలు చాలా అర్థవంతంగా, ప్రయోజనాత్మకంగా చెప్పారు. ఈ సృష్టిలో ప్రతి మనిషీ ఒక కారణజన్ముడే. చిన్నదో, పెద్దదో ఏదో ఒక పని చేసి సమాజంలోని నలుగురికి తోడ్పడేందుకే జన్మించాడు. సంఘ జీవితంలో ఆదాన ప్రదానాల కోసం ప్రతి ఒక్కరూ తమకు వచ్చిన, తమకు నచ్చిన ఏదో పనిని చేయాల్సిందే. లేకుంటే మానవ మనుగడ కష్టమవుతుంది. పనిలోనే జీవన భృతి ఉంది, శారీరక ఆరోగ్యం ఉంది, మానసిక ఉల్లాసం ఉంది, సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి ఇమిడి ఉన్నాయి.
‘కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయ’ని అంటారు. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల గురించే కాదు ఈ మాటలు. ప్రతి వ్యక్తి పనీ పాటా లేకుండా కేవలం తిని కూర్చుని వళ్లు పెంచి సోమరిపోతులా తయారైతే సహజ వనరులు, దేశ సంపద కూడా క్రమంగా తరిగిపోతాయి. పనిలోనే- వస్తుఉత్పత్తి, సేవాభావం, అంకితభావం, సమాజాభివృద్ధి అనే మహత్కార్యాలు, మహోన్నత ఆశయాలు దాగి ఉన్నాయి. ఇవి దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాదు, నైతిక విలువల వైపు, మానవతా విలువల వైపు ప్రజలను నడిపిస్తాయి. సామాజిక విలువలు, నీతి, న్యాయం, ధర్మం ఏ దేశంలో పుష్కలంగా ఉంటాయో ఆ దేశాన్ని ప్రపంచం మొత్తం నెత్తిన పెట్టుకుని గౌరవిస్తుంది.
పని ధ్యాస ఉన్నవాడికి పాడు ఆలోచనలు మనసులోకి అసలు రావు. ఆ ఏకాగ్రత, ఆ లక్ష్య సాధన, ఆ కష్టించే తత్వం, ఆ స్వేద బిందువులోని పవిత్రత మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దుతుంది. ‘ఐడిల్ మాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్‌షాప్’- అన్నట్టు ఏ పనీ లేకుండా చేతులు ముడుచుకుని ఖాళీగా కూర్చున్నవాడి బుర్రను- ‘కష్టపడకుండా డబ్బులు ఎలా దొరుకుతాయా?’ అన్న పురుగు తొలిచేస్తూ ఉంటుంది. ‘అప్పనంగా డబ్బులు ఎక్కడ దొరుకుతాయి..? పక్కవాడి పర్స్ కొట్టేస్తోనో..? ఏ పడతి మెళ్లోని మంగళసూత్రం లాగేస్తోనో..? లేకుంటే దొంగ సర్ట్ఫికెట్ సృష్టించి పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఏ పథకంలోనో దూరిపోతేనో..? అని నేరాన్నో, అతి తెలివి తేటలనో ఆశ్రయించే ప్రయత్నం చేస్తాడు. ఇంతకన్నా తేలికైన పని- అభిమానాన్ని చంపుకుని ఎవరి ముందైనా చెయ్యి చాచి అడుక్కోవడం..
దేశంలో నేరస్థులు, బిచ్చగాళ్లు అధిక సంఖ్యలో వీధివీధినా విస్తరించడానికి కారణం వాళ్లకు చేయడానికి పని దొరక్కపోవడం, సోమరితనం. నేరస్థులలో రకరకాలు ఉన్నట్టే, బిచ్చగాళ్లలోను రకరకాలు ఉన్నారు. నిజంగా పని చేసే శక్తి లేక, బీదరికం వల్ల ఏ గుడిమెట్లమీదో కూర్చుని అడుక్కునేవాళ్లు ఒకరకమైతే, పార్కింగ్ ప్లేస్‌లలో, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పసిపిల్లల్ని చంకనేసుకుని ఎండలో తిరుగుతునో, కనికట్టు గాయాలు, కాలిన బొబ్బలు చూపిస్తునో జనం సానుభూతిని పొంది డబ్బు రాబట్టాలని చూసేవాళ్లు మరో రకం. ఇదో రకమైన దోపిడీ! ఎక్కడ యాచకులు, నేరస్థులు ఉంటారో ఆ దేశంలో అభివృద్ధి అనేది కల్ల. అందుకే గతంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదంతో దేశంలో పేదరికాన్ని పారదోలే ఫ్రయత్నం చేసింది. దేశం నుంచి పేదరికం పోవాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు ప్రజలందరికీ ఏదో ఒక ఉపాధి చూపించాలి! కొందరిలో నేర ప్రవృత్తి తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఈ వ్యవస్థలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక చింతన, ధర్మాచరణ, మంచి చెడుల విచక్షణా జ్ఞానం ఏదో ఒక రూపంలో వెల్లి విరియాలి. ప్రతి జైలు ఒక శిక్షణాలయంగా, కౌనె్సలింగ్ సెంటర్‌లా మారిపోవాలి. అప్పుడే అది నేరరహిత సమాజంగా రూపుదిద్దుకుంటుంది. దైవపూజ, గురుభక్తి.. ఇలాంటివన్నీ పుణ్యం తెచ్చిపెట్టడానికి. చనిపోయాక స్వర్గలోక ప్రాప్తికి అనుకుంటే అది సరికాదు. మనిషి మనిషిలా, మనీషిలా జీవించడానికీ, భయరహిత, పాపరహిత సమాజాన్ని సృష్టించడానికీ ప్రధానంగా ఇవి తోడ్పడతాయని తెలుసుకోవాలి.
సామాన్య పౌరుడికి కూడు, గూడు, గుడ్డ వంటి కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. కనుక ఆ మూడూ లభ్యమయ్యే పనిని వారికి చూపించి ఉపాధి కల్పించాలి. శారీరక శ్రమతో పనిచేసే కార్మికులు, కర్షకులు, కూలీలు, వృత్తిపనుల వాళ్లు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. వారికి పని చూపించడం, పంట నష్ట సమయాల్లో రైతులను ఆర్థికంగా ఆదుకోవడం, కల్తీలేని విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించి వారి వృత్తిపనికి బాసటగా నిలవడం ప్రభుత్వాలు ఎ లాంటి రాజకీయాలకు తావులేకుండా తక్షణమే చేయాల్సిన పనులు. పెద్ద చదువులు చదువుకుని మేధాశక్తితో పనిచేసే యువతకు ఉద్యోగాలు కల్పించడం, ప్రభుత్వ- ప్రైవేటు సంస్థల్లో వాళ్లకు ఉపాధి చూపించడం కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పనే! ఆ పని చేయలేని పాలకులను యువత విమర్శిస్తుంది, ఎదురు తిరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలోనే ఈ మధ్య కొంత విమర్శలకు గురి కావడంతో కేసిఆర్ వెంటనే తప్పు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఫలితంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ ప్రకటనలు వేల కొద్దీ రాబోతున్నాయని అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఈ విషయంలో అధ్వానంగా ఉంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ‘బాబు వస్తే జాబు వస్తుందనే’ నినాదం నవ్వులపాలై, ప్రభుత్వం అపఖ్యాతిని మూటగట్టుకుంటోంది. ఈ విషయంలో యువత ధర్మాగ్రహానికి వెంటనే స్పందించకపోతే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని పరిస్థితులు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నాయి.
కార్పొరేట్ కాలేజీల్లో బోలెడు ఫీజులు కట్టి, లక్షలకొద్దీ డొనేషన్లు కట్టి తాము చదువుకున్నది నిరుద్యోగిగా బతకడానికేనా? అని యువతరం ప్రశ్నిస్తే నాయకులు తెల్లమొహం వేయాల్సి వస్తుంది. యువతకు పని లేకపోవడం అన్నది రాష్ట్ర సమస్య మాత్రమే కాదు, దేశ సమస్య కూడా! ఇక్కడ పని దొరక్కుంటే యువశక్తి విదేశాలకు తరలిపోతుంది. ఆ దేశ అభివృద్ధికి వారి మేధస్సు ఉపయోగపడితే మనకు శూన్యహస్తాలే మిగులుతాయి. నిరుద్యోగ యువత మనసులో ఒక్కసారి నిరాశా నిస్పృహలు, కోపావేశాలు చోటుచేసుకున్నాయంటే అవి శాంతిభద్రతలకే పెను సవాల్‌గా మారే ప్రమాదం ఉంది.
మిగతా విషయాల్లో ఎలా ఉన్నా, పని ప్రస్తావన వచ్చినపుడు మాత్రం ఎవరైనా చైనాను మెచ్చుకోకుండా ఉండలేరు. అక్కడ ప్రతి మనిషి ఒక పని రాక్షసుడు. ప్రతి ఇల్లు ఒక కుటీర పరిశ్రమ. అక్కడ జరిగేటంత వస్తు ఉత్పత్తి మరే దేశంలోను జరగదు. అగ్రరాజ్యం అమెరికా వెళ్లి చూసినా అక్కడి ప్రతి వస్తువు మీదా ‘మేడ్ ఇన్ చైనా’ అని ఉంటుందే గానీ, ‘మేడ్ ఇన్ అమెరికా’ అని వుండదు. అయితే, చైనాలో తయారయ్యే వస్తువుల నాణ్యత మీద ప్రపంచ ప్రజలందరికీ కొన్ని అనుమానాలున్నాయి. అది వేరే విషయం. దేశంలో ప్రజలందరికీ పని దొరకాలన్నా, విదేశీ దిగుమతుల సంఖ్య తగ్గి, స్వదేశీ ఉత్పత్తి పెరగాలన్నా ‘మేక్ ఇన్ ఇండియా’ ఒక్కటే మంత్రమని గుర్తించారు కనుకనే మన ప్రధాని నరేంద్ర మోదీ ఆ నినాదాన్ని దేశ ప్రజల చేత అనిపించి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అది ప్రచారం బాగా అయి అందరి మనసుల్లో బలంగా నాటుకుని ప్రయోగాల దిశగా పరుగులు తీస్తే అప్పుడు ప్రతి ఒక్కరు పనిమంతులవుతారు. దేశం మొత్తం ధనవంతమైనది అవుతుంది కూడా.

-కొఠారి వాణీ చలపతిరావు