సబ్ ఫీచర్

ట్యాబ్‌లు వద్దు.. పుస్తకాలే ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్టు సమాచార సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో ప్రవేశించి సంప్రదాయ పద్ధతుల నుండి దేశాన్ని అత్యాధునిక దిశగా మలుపుతిప్పింది. గ్రామస్థాయిలోని పంచాయతీ కార్యాలయం మొదలు అంబరవీధిలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు వరకూ సమాచార సాంకేతిక పరిజ్ఞానం అగ్రస్థానాన నిలిచింది. దాంతో మనిషి దైనందిన జీవన సరళిలోనే పెనుమార్పు వచ్చింది. టెలిఫోన్లు నుండి సెల్ ఫోన్లు, బ్లూత్‌లు, రిమోట్ సెల్ ఫోన్లు, శాటిలైట్ ఫోన్లు, ఎక్కడి నుండో ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, ఎసిని ఆపరేట్ చేసుకునే సదుపాయం, ఆఫీసుల్లో పర్సనల్ కంప్యూటర్‌ను ఎక్కడి నుండో అప్‌లోడ్, డౌన్‌లోడ్ చేసుకునే వీలు టెక్నాలజీ అందించింది. ఈ ప్రభావం అన్ని విభాగాలతో పాటు విద్యారంగంపైనా పడింది.
శాటిలైట్ పాఠాలు, ఆన్‌లైన్ పాఠాలు, డిజిటల్ పాఠ్యపుస్తకాలు, వెబ్ ఆధారిత అభ్యసనం, ఐసిటి సదుపాయం, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రొఫెసర్లు, విద్యావేత్తల పాఠాలను నేరుగా తరగతి గదిలో కావల్సినపుడు వినే సదుపాయం.. ఇలా ఒకటేమిటి? విద్యారంగం స్వరూపం సమూలంగా మారిపోయింది. సంప్రదాయ పాఠశాలలు ఆధునికతను సంతరించుకుని తరగతి గదిని ఆధునిక పోకడలతో తీర్చిదిద్దుతున్నాయి. ఉపాధ్యాయులు కూడా తమ బోధనను డిజిటల్ రూపంలోకి మార్చుకుని ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’లో చెబుతున్నారు. దాంతో విద్యార్ధులు సైతం డిజిటల్‌కు మారాల్సి వచ్చింది. రోజూ కిలోల బరువున్న బ్యాగులతో స్కూళ్లకు వస్తున్న విద్యార్ధుల చేతికి ఇపుడు ట్యాబ్‌లు వచ్చేశాయి. పాఠ్య పుస్తకాలు, నోట్సులు, ఆన్‌లైన్ పరీక్షలు, విశే్లషణలు, మార్కుల జాబితాలు, ప్రగతి సూచికలు, తదుపరి మూడు నెలల కార్యాచరణ మొత్తం అంతా ఎప్పటికపుడు ట్యాబ్‌ల్లో ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేస్తుంటే దానిని విద్యార్ధులు ఫాలో అవుతూ నేర్చుకుంటున్నారు. అయితే, ప్రగతి పథంలోకి దేశం దూసుకువెళ్తున్నా చాలా వరకూ విద్యార్ధులు ట్యాబ్‌ల విషయంలో నిరాసక్తతే ప్రదర్శిస్తున్నారని తాజా సర్వే తేల్చింది.
స్కూల్ పుస్తకాలకు అనుబంధంగా ట్యాబ్‌లు ఉంటే ఫర్వాలేదు, కాని వాటి స్థానాన్ని ట్యాబ్‌లతో భర్తీ చేయడం మాత్రం ఆహ్వానించదగింది కాదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ముంబయి కేంద్రంగా ఉన్న ఒక సంస్థ జైపూర్ , అహ్మదాబాద్, సూరత్, బరోడా, ముంబయి, పూణె, నాగ్‌పూర్, నాసిక్ నగరాల్లో 2,000 మంది తల్లిదండ్రులతో మాట్లాడినపుడు 67 శాతం మంది పాఠ్యపుస్తకాలు కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల వల్ల విద్యార్ధులు జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదం ఉందని, ఏకాగ్రత దెబ్బతింటుందనే భావనను తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పిల్లలకు నష్టమే అని 68 శాతం మంది అభిప్రాయపడగా, 42 శాతం మంది తల్లిదండ్రులు ఈ ఉపకరణాల వల్ల విద్యార్ధులు చదువు తప్ప మిగిలిన పనులన్నీ చేసే ప్రమాదం ఉందని అన్నారు. ప్రధానంగా ట్యాబ్‌ల్లో వీరు సినిమాలు, కార్టూన్లు, వీడియోలు చూస్తారని పేర్కొన్నారు. ఆచితూచి విద్యార్ధులకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అందించాలని నిపుణులు చెబుతున్నారు. నేటి తరంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అందించకుండా నిరోధించలేం, ఒక సారి ఇచ్చాక ఇంటర్‌నెట్‌ను ఆపలేం, ఇంటర్‌నెట్‌లోకి వెళ్లారంటే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.. అందుకే- తల్లిదండ్రులూ బహుపరాక్ అంటున్నారు బాలల మనో విశే్లషకులు.

- బివి ప్రసాద్