సబ్ ఫీచర్

ప్రకృతి ‘వికృతి’ కారాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి అంటే చెట్లూ చేమలు, కొండకోనలు, నదులు, పర్వతాలు మా త్రమే కాదు. పక్షులు, జంతువులు, జలచరాలు-సమస్త జీవరాశి కూడా. అనంతంగా సాగే ప్రకృతి సమగ్ర జీవన గమనంలో ఇవన్నీ వివిధ అంగాలు. ప్రకృతిలో ఇవన్నీ పరస్పర విరుద్ధములైన ప్రవృత్తితో, వ్యతిరేకాత్మక గుణములతో కనిపించినప్పటికీ ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒకదాని అవసరాన్ని మరొకటి తీర్చేందుకు ప్రకృతి సహజ సిద్ధంగా చేసిన ఏర్పాటు. వీటన్నింటి సహజ మనుగడలోనే మన జీవన సంతులనం ఇమిడి ఉంది. వీటిలో దేనిని నష్టపరిచినా ప్రకృతిలో సంతులనం దారుణంగా దెబ్బతింటుంది.
ఈరోజు మనం నివసిస్తున్న ఈ ప్రపంచం తీరు ప్రస్తుతం వున్న లక్షల కోట్ల రకాల జీవాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ జీవరాశులే రాళ్లని సైతం కరిగిస్తాయి, మట్టిని తిరగబెడతాయి. వానలు కురవడానికి కారణమవుతాయి. ఈ జీవరాశులు బతికే తీరునుబట్టి వాతావరణంలో వాయువుల సమ్మేళనం మారుతూ ప్రపంచాన్ని మారుస్తుంది. ఈమధ్య ‘డిస్కవరీ చానల్’లో దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు. అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలలో కట్లపాము ఒకటి. దాని విషం నుండి రక్తపోటు (బిపి)కి మందు తయారుచేస్తారట. దక్షిణ ఆఫ్రికాలో చాలా ప్రమాదకరమైన తేళ్లుంటాయి. వాటి విషం నుండి కూడా కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులకు ఔషధాలు తయారుచేస్తారట.
‘పసిఫిక్ యూ’ అనే ఒక చెట్టు ఉంది. చాలా కాలం అది ఎందుకూ పనికిరాదనే అనుకున్నారు శాస్తవ్రేత్తలు. ఆ చెట్టును అసహ్యించుకున్నారు కూడా. కానీ పరిశోధన చేసి ఆ చెట్టునుండి ‘టాక్సాల్’ అనే రసాయనాన్ని వెలికి తీసారు. ఇప్పుడు ఆ పదార్థం కొన్ని రకాల ట్యూమర్లను తగ్గించడానికి తయారుచేసే ఔషధాలలో అన్నింటి కన్నా ఎక్కువగా ఉపయోగపడుతోంది.
సముద్రంలో ఉండే కొన్నిరకాల సూక్ష్మజీవులకు చమురు తిని, ఆరగించుకోవడం చేతనవుతుంది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడల నుండి చమురు ఒలికినపుడు ఈ సంగతి గమనించారు. ఆ బాక్టీరియాను తెచ్చి పరిశ్రమల వ్యర్థ పదార్థాల వద్ద పెరగనిస్తే పర్యావరణ పరిశుభ్రతకు దోహదపడుతుందని పరిశోధనలు చేస్తున్న శాస్తవ్రేత్తలు అంటున్నారు. సముద్రంలోను, మంచినీటిలోను జీవరాశి తరిగిపోతున్నది. సముద్రం ఆమ్లంగా మారుతోంది. సముద్రాలలో నానాటికీ వేడిమి పెరుగుతోంది. అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయి. ప్రకృతిలో మార్పులు సహజమే అయినప్పటికీ గత మూడు శతాబ్దాల్లో ఈ మార్పు తీరు ఆందోళనకరంగా మారింది. అందులో మనిషి ప్రమేయం ఎక్కువగా కనపడుతోంది. ఇది మనిషి మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది.
మన బతుకు మనం బతుకుతూ వెళతాం. కానీ మన మనుగడ పేరుతో ఎన్నిరకాల జంతువులను, వృక్షాలను నాశనం చేస్తున్నామన్న సంగతి మనకు పట్టదు. అడవుల అవసరం లేదు, చెరువుల అవసరం లేదు. కూడు, గూడు రెండూ ఉంటే చాలనుకుంటున్నాము. మన వరకు జీవితం సుఖంగా గడిచిపోతే బావుండును అనుకుంటున్నాము. ఫలితంగా ఎన్నో రకాల అరుదైన జంతు, వృక్ష జాతులు పూర్తిగా లేకుండా పోతున్నాయి. సాధారణంగా పరిణామ క్రమంలో భాగంగా కొన్ని జీవులు అంతరిస్తాయి సహజంగా. అలా పోవాలి కూడా. కానీ మనిషి కారణంగా అందుకు వెయ్యి రెట్ల జీవాలు అంతరించిపోతున్నాయి. ప్రకృతిలో సహజంగా వుండే వైవిధ్యం నిలబడితే, అది ప్రకృతిగా మిగులుతుంది. మనిషి కారణంగా దాని తీరు మారితే అది ‘వికృతి’ అవుతుంది. అందుకే ప్రకృతిని రక్షించడం అంటే వీటన్నింటినీ రక్షించడం. ఇదియే ప్రకృతి ధర్మము. ప్రకృతిలో ప్రతి దానిలోను మన ఆరోగ్యానికి సహకరించే ఓషధీ గుణాలున్నాయి. వాటన్నింటినీ రక్షించుకుంటేనే మనకు శాంతి, సౌఖ్యం దక్కుతాయి.

- దుగ్గిరాల రాజకిశోర్ సెల్: 80082 64690