సబ్ ఫీచర్

ప్రజాస్వామ్యంలో రాచరిక పోకడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన కాలం నుండి మధ్య యుగాలు ముగిసే వరకూ ఏ దేశంలోనైనా చక్రవర్తి లేదా మహారాజు సర్వం సహాధిపతులుగా పాలించేవారు. వారు చేయాలనుకున్నదీ, చేసిందే చట్టం! ప్రజాభిప్రాయంతోను, ప్రజావసరాలతోనూ వారికి సంబంధం లేదు. రాచరిక ఆధిపత్యానికి లోబడి వారి విలాసాలకు, వారు చేసే యుద్ధాలకూ ప్రజలు పన్నులు కడుతూ కష్టాలు భరించాల్సిందే. ఆధునిక యుగం ప్రారంభమై, ప్రజల్లో ‘వ్యక్తి స్వాతంత్య్ర భావన’ పెరిగినప్పటి నుండి పాలనా వ్యవస్థలో మార్పు వచ్చింది. పాలకుల్ని ఎంపిక చేసుకోవడంలో, పాలనా వ్యవస్థల నిర్వహణ, అభివృద్ధి పథకాల చర్చల్లో ప్రజల ప్రమేయం పెరగడం మొదలైంది. ఈ ప్రక్రియ నుండే ప్రజాస్వామ్య వ్యవస్థ రూపుదిద్దుకుంది. ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలున్నాయి. వాటిలో కొన్ని ప్రజాస్వామ్య అంతఃసూత్రాలైన ప్రజా ప్రమేయం, క్రమశిక్షణతో నడుస్తున్నాయి. ఇందుకు ఉదాహరణలుగా బ్రిటన్, అమెరికాలను తీసుకోవచ్చు.
జనాభా ప్రాతిపదికనైతే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో వుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చాలాకాలం ఈ ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగానే మనుగడ సాగించింది. 21వ శతాబ్దం ప్రారంభమైనప్పటి నుండి రాజకీయాల సంవిధానంలో పెడ పోకడలు పొడసూపుతున్నాయి. ప్రజాధిపత్యం కాకుండా ‘వ్యక్తి ఆధిపత్య’ పోకడ పెరగడం మొదలైంది. మన దేశంలో అయిదేళ్లకోసారి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలేర్పడతాయి. యుపిఎ హయాంలో 2014 వరకూ కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు పాలన సాగించింది. ఆ పాలనలో జనాభిప్రాయానికి భిన్నంగా తప్పులెన్నో జరిగాయి. కొన్ని ఒప్పులు కూడా జరిగాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బిజెపికి, రాష్ట్రాల్లో వేరువేరు పార్టీలకు ప్రజలు ఓట్లు వేశారు. ఫలితంగా ప్రభుత్వాలు మారాయి. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పోకడే! అయితే ఇప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు భిన్నమైన సూచనలను ప్రకటిస్తున్నాయి. ‘కాంగ్రెస్ రహిత భారతదేశాన్ని తయారుచేస్తామ’ని కేంద్ర ప్రభుత్వంలోని అధినాయకులు ప్రకటిస్తున్నారు. తెలంగాణలో తెరాస తప్ప ఇతర పార్టీ ఏదీ కూడా ఉండకూడదని అధికారంలో ఉన్న నాయకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వమే శాశ్వతంగా వుండాలని, మరే పార్టీకి అవకాశమివ్వకూడదని అక్కడి అధినాయకత్వం అంటున్నది. ఉత్తరప్రదేశ్‌లో మొన్నటి వరకూ కుటుంబ పాలనే సాగింది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో వారసత్వం ‘ఘనీభవించి’ పోయింది! ఈ పోకడలన్నీ రాచరిక వ్యవస్థకు దగ్గరగా, ప్రజాస్వామ్యానికి దూరంగా ఉంటున్నాయి.
నేడు జాతీయస్థాయిలో నిలబడినవి రెండే పార్టీలు. కాంగ్రెస్, బిజెపి. మిగిలినవన్నీ ప్రాంతీయ పార్టీలు, చిన్నాచితకా పార్టీలు. ఇవి ఎప్పటికీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచలేవు. ఇప్పుడు బిజెపి ‘కాంగ్రెస్ రహిత’ భారతదేశం అంటున్నదంటే, కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతే మిగిలిన ఒక జాతీయ స్థాయి పార్టీ అయిన బిజెపి ఈ దేశాన్ని ఎప్పటికీ పాలించవచ్చునని వారి అభిప్రాయం కావచ్చు. ఇది విపరీతమైన ఆలోచనే! ప్రస్తుతానికి కాంగ్రెస్ నిర్వీర్యమైపోయింది. కానీ జాతీయ ఉద్యమంలోను, పునరుజ్జీవోద్యమంలోను ఆనాటి నాయకులు, ఆ పార్టీ వహించిన పాత్రను చరిత్ర నుండి చెరిపివేస్తారా? స్వాతంత్య్రం తరువాత దేశ పునర్నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించిన డా.రాజేంద్రప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభభాయ్ పటేల్, లాల్‌బహదూర్ శాస్ర్తీ, ఇందిర, రాజీవ్, పి.వి.నరసింహారావు మొదలైన నాయకులను ప్రజలు మరిచిపోవాలా? ఇందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారా?
‘బిజెపి రహిత భారతదేశం’ కావాలనీ కాంగ్రెస్ వారు కానీ, ఏ ఇతర పార్టీలవారు కానీ కోరుకోవడం కూడా అలాంటి విపరీతమైన భావనే! ‘సెక్యులరిజ’మని చెప్పుకునేవారు ఏం చెప్పినా కూడా, బిజెపి ఒక జాతీయ వాద పార్టీ! అందువల్ల కాంగ్రెస్, బిజెపిలు దేశవ్యాప్తంగా బలంగానే ఉండాలి. వీటిలో ఒకపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు రెండవ పార్టీ పార్లమెంటులో బలమైన ప్రతిపక్షంగా ఉండాలి! అలనాడు జయప్రకాశ్ నారాయణ క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకుని ‘సర్వోదయ’ ఉద్యమంలోకి వెళ్లాలనుకున్నప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ ఆయనకు హితవు చెప్పాడు. ‘ఆ ఉద్యమంలోకి వెళ్లకు. క్రియాశీలకంగానే ఉండు. కాంగ్రెస్‌లో ఉండడం ఇష్టం లేకపోతే ఒక మంచి ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయి. ప్రజలు నీ మాటలను నమ్ముతారు. ప్రజాస్వామ్యంలో సమర్ధవంతమైన ప్రభుత్వమెలా అవసరమో, సమర్ధవంతమైన ప్రతిపక్షమూ అలాగే అవసరం’ అన్నారు. ప్రశ్నించే ప్రజలు, ప్రతిపక్షమూ ఉంటేనే ప్రజాస్వామ్యం!
రాష్ట్రాల విషయానికొస్తే- అధికారంలో ఉన్న తమ పార్టీ తప్ప మరో పార్టీ ఆ రాష్ట్రంలో ఉండకూడదని, అసలు ప్రతిపక్షమే ఉండకూడదని కొందరి కోరిక. అనువంశిక పాలన కొన్నిచోట్ల! అధికారానికి రాగలిగే ఓట్లు పొందగలిగితే అయిదేళ్లపాటు తామే రాజులు! అందుకే పెద్ద ఓట్ల బ్యాంకులున్న కులాలు, వర్గాలకు ఎన్నికల్లో ఉచితాలు, వరాలు, రాయితీలు గుప్పించేసి అధికారాన్ని పొందడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇది అశాస్ర్తియమైన ఆర్థిక పంపిణీ అని ఆర్థిక శాస్తవ్రేత్తలు, నిపుణులు చెబుతున్నా కూడా ఎవరూ వినడం లేదు. ఉచిత పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తమైపోతున్నాయి! ప్రభుత్వాలు, ప్రతిపక్షాల పార్టీలు చూపుతున్న లెక్కలు నమ్మదగినవిగా వుండడం లేదు. ప్రజలు నిశ్శబ్దంగా ఉండడం కన్నా ప్రభుత్వాలను, ప్రతిపక్షాలను ప్రశ్నించగలిగితేనే మార్పు వస్తుంది. మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజలదే! ‘యథారాజా తథాప్రజా’ అనే వారు గతంలో. ఇప్పుడు ‘యథా ప్రజా, తథా రాజా’ కావాలి! ఉంటే ప్రజాస్వామ్యం ఉండాలి! లేకపోతే రాచరిక వ్యవస్థ ఉండాలి. ప్రజాస్వామ్యంలో రాచరిక పోకడలు పనికిరావు.

-మనె్న సత్యనారాయణ