సబ్ ఫీచర్

‘మత్తు నిద్ర’లో ప్రభుత్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తాటిచెట్టు ఎందుకు ఎక్కావు?’’ అంటే ‘‘దూడ మేత కోసం’’ అన్నాడట ఒక ప్రబుద్ధుడు.
‘‘తాటిచెట్టుమీద దూడ మేత ఉంటుందా?’’ అంటే ‘‘లేదని తెలిసింది గనుకే కిందకి దిగుతున్నాను’’ అన్నాడట.
‘‘్ఫలిం ఇండస్ట్రీలో ఎందుకు చేరావు?’’ అంటే, ‘‘కళాపోషణ కోసం’’ అన్నాడట ఇంకొకడు.
‘‘ఇండస్ట్రీ ద్వారా కళాసేవ జరుగుతుందా?’’ అంటే-
‘‘జరగదు అని తెలిశాక డ్రగ్స్ వ్యాపారం మొదలుపెట్టాను’’ అన్నాడొక ఇంకో ప్రముఖుడు.
ఔను! ఇవాళ సత్యజిత్ రాయ్, బిమల్‌రాయ్, శాంతారాం, కె.వి.రెడ్డి వంటి మహామహుల యుగం ముగిసింది. గారడీవాడు మామిడి టెంకను నాటి ఇన్‌స్టంట్‌గా మామిడి పండ్లను కాయించినట్లు తక్కువ శ్రమతో ఎక్కువ ధనం సంపాదించాలంటే రాజకీయాల్లోకి లేదా ఫిలిం ఇండస్ట్రీలోకి చేరాలనేది కొత్త సూత్రం. పూర్వం త్యాగధనులు ప్రజాసేవ కోసం రాజకీయాలల్లోకి వచ్చారు. కళాసేవ కోసం కొందరు ఆదర్శవాదులు సినిమాల్లో, నాటకాల్లో ప్రవేశించారు. కానీ- ఇవాల్టి పరిస్థితి ఏమిటి? అంగుష్టమాత్రులు, మాఫియా గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్‌తో మమేకం అయ్యేవారు ఇటు సినిమాలను, అటు రాజకీయాలను ఆశ్రయించారు. ఇటీవల రెండు ప్రముఖ సంఘటనలు జరిగాయి. ఆ రెండూ ఒకేరోజు జరిగాయి. అధికార పార్టీకి చెందిన ఒక ఎంఎల్‌ఏ ఒక మహిళా కలెక్టర్‌పై అనుచితంగా ప్రవర్తించాడు. ఇది రాజకీయ సంఘటన. అదే రోజు హైదరాబాద్‌లో డజన్ల కొద్దీ సినీ ప్రముఖులు డ్రగ్స్ వ్యాపారం, వినియోగం కేసులో అడ్డంగా బుక్కైపోయారు. వీరిలో సీనియర్ ఆర్టిస్టులు, జూనియర్లు, నిర్మాతలు ఇత్యాదులున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్ నేతృత్వంలో ‘సిట్’, టాస్క్ఫోర్స్ జరిపిన దాడులలో వీరంతా పట్టుబడ్డారు.
డ్రగ్స్ విక్రయంలో నిందితుడు కెల్విన్‌ను పట్టుకోగా అతడు ఇంకా చాలా పేర్లను వెలుగులోకి తెచ్చాడు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇప్పుడు కొంతమంది సినీ ప్రముఖులపై దర్యాప్తు జరుగుతున్నది. తర్వాత ఏమవుతుంది? ఆధారాలు రుజువైతే శిక్షలు పడవచ్చు. రాజకీయ ప్రమేయంతో కేసులు మరుగున పడవచ్చు. భారతీయ ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే.
హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఇలా మత్తుమందు ముఠాలు పట్టుబడటం ఇది మొదటిసారి కాదు. లోగడ ఎందరో యువకులు పట్టుబడ్డారు. వారంతా బడా పారిశ్రామికవేత్తలు, చిత్రరంగ ప్రముఖుల సంతానం. అలాగని సామాన్యుల సంతానం డ్రగ్స్ వాడటం లేదని అనుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ ఆదాయంపైనే నడుస్తున్నాయి. దేశంలో మంచినీళ్లు దొరకవు కానీ- మద్యం షాపులకు లోటు ఉండదు. జనావాసాలు, విద్యాసంస్థలు, ఆలయాల మధ్య మద్యం షాపులు పెట్టవద్దని ఆమధ్య కొందరు మహిళలు ఆందోళన చేసిన దృశ్యాలు టీవీల్లో చూశాము. ఐతే వారి ఆందోళన అరణ్యరోదనే అయింది.
సినిమాల్లో హీరోలు సిగరెట్లు తాగడం, విస్కీ చప్పరించటం స్టేటస్ సింబల్‌గా చూపిస్తున్నప్పుడు సామాన్యుడు వారిని అనుసరించకుండా ఉంటాడా?
ఇటీవల కొత్త చాకెట్లు వచ్చాయి. వాటిని గంజాయితో చేస్తారు. అవి వివిధ విద్యాసంస్థలలో పిల్లలకు అందుబాటులోకి వచ్చాయి. ఖరీదైన విద్యాసంస్థల్లో సంపన్నవర్గాల పిల్లలు ఈ చాక్లెట్లు చప్పరించి మత్తులో జోగుతున్నారు. ఎల్.ఎస్.డి, కొకైన్ వంటి రకరకాల మాదక ద్రవ్యాలు పాకిస్తాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, చైనాల నుండి ఇండియాలోకి నేరుగా ప్రవేశిస్తున్నాయి. ఇందులో రెండు కోణాలున్నాయి. ఒకటి వ్యాపార దృక్పథం. రెండవది భారత యువతను నిర్వీర్యం చేయాలనే రాజకీయ దృక్పథం. అంటే- యుద్ధం సరిహద్దులోనే సాగాలని లేదు. దేశంలోకి డ్రగ్స్, దొంగనోట్లు ప్రవేశపెట్టడం ద్వారా జాతిని భ్రష్టుపట్టించాలనే వ్యూహాన్ని శత్రుదేశాల వారు ఎన్నుకున్నారు. దీనిని ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవటం లేదు?
నిజానికి చెడు అలవాట్లకు బానిసలై సినిమా రంగంలో మేటి నటీనటులు ఆస్తులు కోల్పోయారు, అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోయారు. అగ్రనటులు ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ వంటి నటులు ఎంతో క్రమశిక్షణతో జీవించారు. కొంతమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలు తాము మద్యం వంటి వ్యసనాలకు లోనై ఇబ్బందుల పాలయ్యామని చెప్పుకున్న ఉదంతాలు అనేకం. ‘‘రెండు శ్రీలు ధరించి రెండు పెగ్సు బిగించె తాను శబ్ద విరించి’’- ఇది మహాకవి శ్రీశ్రీపై ఆరుద్ర రాసిన కూనలమ్మ పదం. సినీ ప్రపంచానికి సంబంధించి ఇలాంటి చమత్కారాలు, జ్ఞాపకాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారాల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే చాలామంది సినీ ప్రముఖులకు మద్యం అలవాటు ఉందన్నది సుస్పష్టం. ఇది పూర్తిగా వ్యక్తిగతమే అయినప్పటికీ, వ్యసనం ‘మోతాదు’ మించిపోగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నవారూ ఉన్నారు. మద్రాసులోని ‘చోళ’ హోటల్‌లో ఓ సినీ రచయితను కూర్చోబెట్టి పాటకు ‘పల్లవి’ రాయాలంటూ ఓ నిర్మాత కోరాడట. ఆ రచయిత మత్తులో జోగుతూ రెండు మూడు రోజులు గడపడంతో- పాట రాలేదు, పల్లవి రాలేదు. నిర్మాత నెత్తీనోరూ కొట్టుకుని అడిగితే- ‘నన్ను చోళ హోటల్‌లో ఉంచారు కదా- చోళులకు, పల్లవులకు శత్రుత్వం ఉంది’ అని ఆ రచయిత చమత్కరించాడట!
మనిషి వ్యసనానికి ఎందుకు బానిస అవుతున్నాడు? వర్తమానాన్ని మరిచిపోవటం కోసమా? లేక తాత్కాలికంగా దుఃఖోపశమనం పొందటం కోసమా?? డ్రగ్స్ తీసుకుంటే సమస్యలు పరిష్కారమవుతున్నాయా?
ఉష్టప్రక్షి శత్రువులు తరుముకొనివచ్చినపుడు తన తలను ఇసుకలోకి దూరుస్తుందని ప్రతీతి. ఇలాంటిదే ఈ డ్రగ్స్ వ్యవహారం. మరికొందరైతే ఇందులో ఏదో మజా ఉందని మత్తును గమ్మత్తుగా వరిస్తారు. గంజాయి, నల్లమందు వంటివి అలవాటు చేసుకుంటారు. నల్లమందు అలవాటు చేకున్నవాడు సమయానికి మాత్ర పడకపోతే జుట్టు పీక్కుంటాడు. ఇది సర్వసాధారణం. తాగుడుకు బానిసలై ఎందరో తమ కుటుంబాలను సర్వనాశనం చేసుకున్నారు. తాగిన మత్తులో భార్యల గొంతులు కోశారు. హత్యలు, మానభంగాలు జరిపారు. ఈ మత్తు పదార్థాలపై నిషేధం విధించే ధైర్యం ప్రభుత్వాలకు ఎందుకు లేదు?
దీనికి కనిపించే కారణాలు రెండు. ఒకటి- మద్యం విక్రయాలపై వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రెండు- మన నాయకులలో ఎక్కువమంది మద్యం వ్యాపారంతో సంబంధాలున్నవారే.
‘మద్యదాచరతి శ్రేష్టః’ అని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. పెద్దలు ఎలా చేస్తే మొత్తం సమాజం అలా చేస్తుందని సారాంశం.
ఈ మధ్య ఒక నటునితో మీడియా ఇంటర్వ్యూ జరిపినప్పుడు ఇలా అన్నాడు.
‘‘మా వ్యక్తిగత జీవితాలతో మీకు ఎంటి సంబంధం? మీరు డబ్బిచ్చి సినిమా చూస్తున్నారు. మేము డబ్బు తీసుకొని మీకు వినోదం అందిస్తున్నాం. అంతే’’- ఈ సమాధానం బాగానే వుంది.
అయితే, సినీ రంగంలో డ్రగ్స్ మాఫియాలు, అసాంఘిక ముఠాలు భారీ పెట్టుబడులు పెట్టి ఆ పరిశ్రమను షెల్ కంపెనీగా వాడుకుంటున్నాయి. ఇది ముంబయి నుంచి హైదరాబాద్, చెన్నైలకు ఎగబాకింది. మరి దీనిని వినోదం అంటారా? దేశద్రోహం అంటారా?
‘నన్ను చూడకు.. నా పాట విను’ అంటున్నాడు సినీ కవి. అలాగే!
అంటే మన ప్రవచనాలన్నీ ‘మంది’ కోసం, ‘మందు’ కోసమేనా? మరి.. మీ పాటలనిండా సమసమాజ నినాదాలు, నీతులూ పుష్కలంగా ఉన్నాయి కదా! నిత్య జీవితంలో నీతులు వదిలి ఈ బూతులు ఏమిటి?

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్