సబ్ ఫీచర్

బాలకార్మిక వ్యవస్థ తీరింతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు ఉన్నా, ప్రత్యేకంగా అధికారులను నియమించినా ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. ఏటా పెద్ద సంఖ్యలో బాల కార్మికుల్ని పాఠశాలల్లో చేర్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఇంకా అనేక చోట్ల బాలలు కాయకష్టం చేస్తూనే ఉన్నారు. ఆటపాటలతో, చదువులతో సరదాగా గడపాల్సిన ఎంతోమంది పిల్లలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలో అనేక అందమైన వస్తువులన్నీ బాలకార్మికుల హస్తాలే తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా బాల కార్మికులు ఇరవై కోట్ల పైచిలుకు వున్నారని ఓ అంచనా. కొలంబియాలో ఇటుకల పరిశ్రమ, మొరాకోలో చలువరాళ్లు, సూడాన్‌లో పత్తిపంట వెనుక బాల కార్మికుల శ్రమ ఉంది. అగ్గిపెట్టెల తయారీలో ఎక్కువ శాతం బాల కార్మికులే ఉన్నారు. శివకాశిలో బాణసంచా, జైపూర్‌లో వజ్రాల పరిశ్రమ, అలీగఢ్‌లో తాళాల పరిశ్రమ, జమ్ము- కశ్మీర్‌లో తివాచీ పరిశ్రమ.. ఇలా ఎనె్నన్నో పరిశ్రమలు బాలకార్మికుల ముఖ్య కేంద్రాలని చెప్పవచ్చు. బాల కార్మికులుంటే తక్కువ కూలితో పని వేగంగా, చక్కగా అయిపోతుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి. బాల కార్మికుల వల్ల కార్మిక సంఘాల బెడద ఉండదు. నేడు గనులలో పనిచేసే ఎంతోమంది యువకులు ఒకప్పటి బాలకార్మికులే. వారి బాల్యం, కౌమారం పలకరాతి గనుల్లో గడచిపోయాయి.
బాలకార్మికులు బయట పనిచేసి వచ్చాక ఇళ్లలో చాకిరీ చేయాల్సి ఉంటుంది. పనిలోకి వెళ్లడానికి ఎంతో దూరం పోవాలి గనుక వీరికి చదువుకునే సమయం ఉండదు. పలకల ఫ్యాక్టరీలలో పిల్లల్ని ఎక్కువగా నియమించడానికి కారణం మేకులు పట్టుకోవడానికి వాళ్ల వేళ్లు సౌకర్యంగా వుంటాయి. పసివారు మేకులు పట్టుకుంటే పెద్దవాళ్లు సుత్తితో కొడుతుంటారు. దాంతో పిల్లల చేతులకు దెబ్బలు తగిలే అవకాశం లేకపోలేదు. బాణసంచా తయారీలో పిల్లల భాగస్వామ్యమే ఎక్కువగా వుంటుంది. వాళ్లు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో. పగిలిన పెదాల, గాయపడ్డ చేతులు, చింపిరి జుట్టు, శుష్కించిన శరీరాలు, ఇంచుమించు క్రీనీడల్లా కనిపిస్తుంటారు బాల కార్మికులు.
14 ఏళ్ల వయసులోపు పిల్లలు తమ ఇంట్లో పనికి సహాయపడవచ్చు. కానీ ఇతరులు వారిని ఎలాంటి పని చేయడానికి వినియోగించినా అది నేరమవుతుందని, కఠిన శిక్షలు తప్పవని ఆమధ్య పార్లమెంటులో ఆమోదించిన కొత్తబిల్లులో పొందుపరిచారు. పిల్లల చేత పని చేయించే తల్లిదండ్రులు సైతం జరిమానా కట్టవలసి వుంటుందని బిల్లులో స్పష్టం చేసారు. పలుచోట్ల పనిచేస్తున్న బాల కార్మికుల్ని చూసినా ప్రలోభాలకు లోనైన అధికారులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. ప్రజల్లో ఈ మధ్య కొంత చైతన్యం రావడంతో కొందరు తమ పిల్లల్ని పనుల్లోకి పంపకుండా స్కూళ్లలో చేర్పిస్తున్నారు. అయితే వీరి సంఖ్య బహుతక్కువే అని చెప్పుకోవాలి. పేదలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటే తప్ప బాలకార్మిక వ్యవస్థ పూర్తిగా తొలగిపోయే అవకాశాలు లేవు. పసివాళ్లచేత పనులు చేయించకూడదన్న పాపభీతి ఉండాలి. తాత్కాలిక అవసరాల కోసం పిల్లల్ని చదువులకు దూరం చేసి వారి బంగారు భవిష్యత్తుని నాశనం చేయకూడదన్న భావన తల్లిదండ్రులందరిలో కలగాలి.

- దూరి వెంకటరావు