Others

ప్రకటనల మత్తులో పడకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడైనా ఏదైనా ఉచితంగా ఇస్తున్నారంటే మనవాళ్ళు ఊరేగింపుగా వెళ్లిపోతారు. ‘రెండు కొంటే ఒకటి ఉచితం’ కొండకచోట ‘ఒకటికొంటే ఒకటి ఉచితం’- ఇలాంటి ప్రకటనలు అన్నిటా ఎక్కువయ్యాయి. మన షాపుల్లోనే కాదు ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా ఇది మరీ ఎక్కువైంది. మగవారికన్నా ఆడవారిలోనే ఈ ప్రకటనల ఆకర్షణ ఎక్కువైంది. ఇది మనకి ఇప్పుడు అవసరమా? అని ఆలోచించుకోరు. చవగ్గా వస్తోందనుకుంటారు. ఆంధ్రాలో ఆషాఢమాసం సేల్స్ చెన్నైలో ఆడీమాసం సేల్స్ అన్నీ ఒకటే! అక్షయతృతీయకి బంగారం సేల్స్ ఒకటా? రెండా? అన్నిటికీ ప్రకటనలే!
దేవుడికి కూడా ప్రకటనలతోనే ఆదాయం పెరుగుతోంది. అమ్మాయిలకి అబ్బాయిలకి పేపర్‌లోనో టీవీలోనో ప్రకటనలిస్తేగానీ పెళ్లిళ్లవడంలేదు. ఎటొచ్చీ ‘ఒకమ్మాయిని (అబ్బాయిని) చేసుకుంటే మరొకరు ఉచితం’ అని ప్రకటనివ్వడంలేదు. అంతవరకూ సంతోషం.
ఇదివరలో ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలనేవారు. ఇపుడు ఫేస్‌బుక్‌లో మ్యూచువల్ ఫ్రెండ్స్ నెట్లో రేటింగ్ వగైరాలు చూస్తే చాలు. ఇదివరలో బంధువులందరూ దగ్గరిదగ్గరిగా ఉండేవారు. అందుకే వారిలోనే వారు సంబంధాలు కుదుర్చుకునేవారు. ఇప్పటికీ దూర ప్రాంతాల్లోనే ఉన్నా చాలామంది బంధువుల్లోనే చేసుకుంటున్నారు. బంధువుల్లో కుదరనపుడే ప్రకటనలకి వెళ్ళవలసి వస్తుంది. ఈ బాధలు పడలేని తల్లిదండ్రులు పిల్లలు ఎవరినైనా ప్రేమించామంటే సంతోషంగా అంగీకరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే వివాహ విషయంలో ప్రకటనల జోలికి వెళ్లాల్సి వస్తుంది. అది పక్కనపెడితే-ఒకటికి ఒకటి రెండుకి ఒకటి సగం రేటు తగ్గింపు లాంటి ప్రకటనలు చూసి మనవారు ఎగబడి మోసపోతున్నారు. కొందరైతే ఆంధ్రానుంచి చెన్నై వచ్చి కట్టలు కట్టలు సేల్స్‌లో కొనుక్కెళ్ళేవాళ్ళని చూస్తూంటాం. అంత చవగ్గా అమ్మడానికి వాళ్ళేం పిచ్చాళ్ళా? అందులో డేమేజియో, నాసిరకమో ఏదో లొసుగు ఉంటుంది. చెల్లనివన్నీ ఓచోట చేర్చి ఇలా ప్రకటనలిచ్చి ఏడాదికోసారి అమ్మేస్తారు.
ఆ విషయం మాకు తెలిసిన ఓ షాప్ ఓనరే ఓసారి స్పష్టంగా చెప్పాడు.
ఓ సారి నేను మైలాపూర్‌లో ఓ బట్టలకొట్టుకి వెళ్లాను. అది ఆడవాళ్లకి ప్రత్యేకం. షాప్ ముందు 30 శాతం, 50 శాతం అని బోర్డు వుంది. అప్పుడేమీ ఆషాఢమాసం కాదు. ఏమిటో చూద్దామని లోపలికెళ్లాను. షాప్ మధ్యగా పెద్ద పెద్ద బల్లలమీద బోలెడు చీరలు ఆడవాళ్లకి కళ్లు కొట్టేలా రకరకాల రంగులు, డిజైన్లు ఎంతో బాగున్నాయి. అపుడు నాకు చిన్నతనం అంటే ముప్ఫై ఏళ్ళలోపు వయసు. ఆకర్షణకి లోబడిపోయాను. అందులోంచి నేను చీరలు ఎన్నుకోబోతుంటే ’‘అవి మీకు కాదు’ అన్నాడు.
‘అదేమిటి?’ అని నేను అపుడు వచ్చీరాని అరవంలోనూ అతడు వచ్చీరాని తెలుగులోనూ కాసేపు వాగ్వాదాలయ్యాక తెలిసిందేమంటే ఆ చీరలు సినిమా హీరోయిన్లు సినిమాలకోసం కట్టేసినవి ఇక్కడ చవగ్గా అమ్మేస్తారుట. అందుకని అవి నాలాంటి మహిళలకి అమ్మనన్నాడు. తెలిశాక నాకే అసహ్యమేసింది. అప్పటినుంచి సేల్స్ జోలికి వెళ్తే ఒట్టు. ఇలాంటి ఎన్నో రకాల లొసుగులుంటాయి. కొన్ని బట్టలు తడిపితే ఎందుకూ పనికిరావు. కొందరు అటువంటివి కొని పెళ్లిళ్ళల్లో బంధువులకి ఇస్తూంటారు. అటువంటివి ఇచ్చేకన్నా ఓ వందో ఏభయ్యో స్థోమతని బట్టి కవర్లలోనో చిన్న పర్సుల్లోనో పెట్టి ఇవ్వడం మంచిది. చెప్పొచ్చేదేమంటే మహిళలూ ఉచితాలకి ఉర్రూతలూగకండి. మామూలు సమయంలోనే మీకు అవసరమైనప్పుడే నాణ్యమైవి చూసి కొనుక్కోండి. ఆకర్షణలకి అతుక్కుపోకండి. సమయాన్నీ డబ్బునీ ఆదా చేసుకోండి. ప్రకటనల మత్తులో పడకండి.

-ఆర్.ఎస్.హైమావతి