సబ్ ఫీచర్

అబద్ధాలు.. అభూత కల్పనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మాజీమంత్రి, ఎఐసిసి నాయకుడు ఎస్.జైపాల్‌రెడ్డి ఇటీవల జరిగిన కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆక్షేపిస్తూ చేసిన వ్యాఖ్యలు అబద్ధాలు, అభూతకల్పనలే. ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదని, ఆంగ్లేయులతో కలిసి పనిచేసిందని, త్రివర్ణ పతాకం కాకుండా కాషాయ జెండా కావాలన్నదని, భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడని, ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎన్నికలు నిర్వహించరని ఇలా ఇంకా ఏవేవో అన్నట్టు ఈమధ్యలో వార్త ప్రచురితం అయింది.
ఇందులో తొలి అవాస్తవం శ్యాంప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసారు అనే మాట. 1946 సెప్టెంబర్ 2న తేదీన భారతదేశానికి మొట్టమొదటగా పరిమిత విముక్తి లభించింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దానిని నడిపే రాజ్యాధికార సభ (కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీ) ప్రభుత్వ కార్యనిర్వాహక మండలి (ఎగ్జిక్యుటివ్ కౌన్సిల్) ఏర్పడ్డాయి. ఆ మండలి అధ్యక్షుడు అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్, ఉఫాధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రు,. అంటే అప్పటి మన ప్రధానమంత్రి పదవి లాటిదన్నమాట. నెహ్రూనే కాకుండా ఆ ప్రభుత్వ మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర సభ్యులు సిహెచ్ భాభక్స్, మస్లింలీగ్‌కు చెందిన ఇబ్రహీమ్ ఇస్మాయిల్ చుంద్రిగర్, లియాఖత్ అలీఖాన్, ఘజన్‌ఫర్ అలీఖాన్, జోగేంద్రనాధ్ మండల్, అబ్దుల్ రాబ్ నిష్తార్‌లు. ఈ జాబితాలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ పేరు ఎక్కడుందో జైపాల్‌రెడ్డిగారే చెప్పాలి. పాపమో పుణ్యమో అదేదో పై జాబితాలో వున్నవారికే అంటుకుంటుంది నిజంగా చెప్పాలంటే.
ఇక ఆర్‌ఎస్‌ఎస్ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదు అనే ఆక్షేపణ సంగతి. 1947లో దేశ విభజన జరిగిన తొలినాళ్లలో పాకిస్తాన్‌నుంచి ఆసంఖ్యాకంగా హిందువులు కట్టుబట్టలతో ఇండియాకు నెట్టివేయబడ్డారు. ఆ దుర్దినాలలో 70-80 లక్షల మంది హిందువులు పశ్చిమ పాకిస్తాన్‌లో అడకత్తెరలో పోక చెక్కలాగ ఇరుక్కుపోయారు. ఆర్తనాదాలు చేసారు. హిందుస్తాన్‌కు వద్దామనుకున్న కాందిశీకులను ఆనాటి పాకిస్తాన్ ప్రభుత్వం కాల్చుకుతిన్నది. భారత్‌కు రావడానికి ఏమాత్రం సహాయ సహకారాలు అందించకపోగా అప్పటి జిన్నా దొరతనం వాళ్లను పోలీసు హింసలపాలు చేసింది. 1947 ఆగస్టు14న అర్ధరాత్రి అఖండ భారత్ ముక్కలై పాకిస్తాన్ హిందువులు ఎక్కడికిపోవాలో తెలియక సంక్షుభితులైపోయి దీనులై మ్లానులై ఆర్తులైపోయారు. ఆ సమయంలో వాళ్లనెవర్నీ ఇక్కడి నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కనీసం ఆ ఛాయలకే పోలేదు. అప్పుడు కేవలం ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు మాత్రమే కొన్ని వేలమంది కార్యకర్తలు కలిసి తమప్రాణాలనుకూడా లెక్కచేయకుండా తెగించి లాహోర్ మొదలైన ఊళ్లకు వెళ్లి, అక్కడి పోలీసుల లాఠీ దెబ్బలు, తుపాకీ గుండ్లు భరిస్తూ ఆ 70-80 లక్షల మంది కాందిశీకులను సురక్షితంగా భారత్‌కు చేర్చారు. చివరికి వల్లభాయ్ పటేల్ అంతటి వాడు కూడ ఆ ఘోర కలి సమయంలో తన ప్రభుత్వ అసక్తతను వ్యక్తపరిచాడు. మన ప్రధాని ఇంత దురంతం పాకిస్తాన్ చేస్తుందనుకోలేదు అన్నాడు. ఒకప్పటి మన రాష్ట్ర గవర్నర్ భీమసేన్ సచార్ లాంటి వాళ్లు అలా ఆర్‌ఎస్‌ఎస్ తాము ఒంటరిగా ముమ్మరంగా సాహసోపేతంగా చేసిన మహాసేవా కార్యక్రమం వల్ల ఇండియాకు రాగలిగి ప్రాణాలు నిలుపుకున్నవాళ్లే.
ఆర్‌ఎస్‌ఎస్ ఆంగ్లేయులతోకలిసి పనిచేసిందని మరో నిరాధార ఆరోపణ, అభూతకల్పన చేసారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏనాడు ఆంగ్లేయులతో చేతులు కలపలేదు. పైగా హిందుత్వ వాదులు అంటూ అదేదో కళంకం లాగ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిందిస్తూ తిట్టిపోస్తూ వుంటారే కాంగ్రెస్ పార్టీ లాంటి కుహనా లౌకికవాదులు! మరి ఆర్‌ఎస్‌ఎస్సే మ్లేచ్చులకు సహాయం చేస్తుందా? పొంతనలేని పిచ్చి మాట అది. ఒకవేళ జైపాల్‌రెడ్డి అన్నదానికి సాక్ష్యాధారాలుంటే చూపించాలి. రుజువు చేయాలి.
ఈ సందర్భంలో ఇంకొక చారిత్రక వాస్తవం చెప్పకోవాలి. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ మొదట్లో విదర్భ ప్రాంత కాంగ్రెస్ కమిటీకి నాయకుడిగా పని చేసాడు. ఆ తరువాత దేశ ప్రజల్లో మానసిక ఏకతాభావం, భారతీయాత్మ స్పృహలు ఏకత్రితం కానిదే వట్టి కేకలు, నినాదాలు, విడతలవారీ సత్యాగ్రహం వల్ల స్వాతంత్య్రం లభించడం కష్టంఅనే తన వైయక్తిక అభిప్రాయంతో జాతి జనులను సంఘటితపరచడమే ప్రధమ తరుణోపాయం అనే ఉద్దేశంతో ఆ రకమైన ఆచరణ మార్గాన్ని ఎన్నుకుని సంఘ్‌ను స్థాపించారు. సత్యాగ్రహాలవల్ల సాధించేదేమీ వుండదు అనే నిశ్చితాభిప్రాయం నేతాజీ అంతటి మహాపురుషుడికి కూడా కలిగింది. అందుకనే ఆయన కాంగ్రెస్‌ను వదిలిపెట్టాడు. స్వతంత్ర హిందు సేన (ఆజాద్ హిందు ఫౌజ్) అనే సాయుధ సైన్యాన్ని సమకూర్చుకుని పోరాట మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆయుధ మార్గం బోస్‌ది. ఐక్యతా భావ పరికల్పన మార్గం డాక్టర్‌జీది. అంతే తేడా. ఈ రెండు మార్గాల్లోను దేశభక్తి భావనే ఊపిరి. అదే ప్రధానం. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన అలీపూర్ కుట్ర కేసులో నేరారోపణ ఎదుర్కొన్న అరవింద ఘోష్ కూడా చివరకు కాంగ్రెస్ పార్టీ యొక్క కేవలావేశపూరిత ఉద్యమ మార్గాన్ని విడిచి, పుదుచ్చేరిలో ఒక యోగిగా మారి ఒక ఆశ్రమాలవాసి అయిపోయాడు.
1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించి, సంఘ శాఖలను నడుపుతు కూడా డాక్టర్ హెడ్గేవార్ 1930లో సంఘ్‌లో తాను నిర్వహిస్తున్న అధినాయక బాధ్యతను ఇంకొకరికి అప్పజెప్పి స్వాతంత్రోద్యమంలో ఓక కార్యకర్తగా కొంతకాలం పనిచేసారు.
అందుకు ముందు సరిగ్గా రెండు దశాబ్దాల కిందటే అంటే 1905లో గోపాల్ కృష్ణగోఖలే భారతసేవిక్ మండలి (సర్పెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ) స్థాపించాడు. అది కేవలం సాంస్కృతిక జన సేవా సంస్థ. రాజకీయాలకు తమ సంస్థ దూరం అని గోఖలే స్పష్టంగా చెప్పాడు. అంత మాత్రం చేత గోఖలే బ్రిటిష్ వాళ్లకు వంత పాడినట్టా?
స్వాతంత్య్రానికి పూర్వం గోఖలేగారి ప్రజా- సాంస్కృతిక సంస్థలాంటివే ఆర్యసమాజ్, హితకారిణీ సమాజం మొదలైన చాలా సాంస్కృతిక సంస్థలుండేవి కొందరు కొందరు మహాశయుల నేతృత్వాలలో. అవన్నీ అవాంఛనీయ ఆరోపణార్ధ సంస్థలే అవుతాయా? అయినాయా చరిత్రలో?
ఆర్‌ఎస్‌ఎస్ ఏనాడూ ఒక రాజకీయ సంస్థ కాదు.
ఇక్కడి యావజ్జనం ఒక చిరంతన మహోదాత్త సంస్కృతికి వారసులే అనే అభిప్రాయంతో అనుదినము ‘నమస్తే సమావత్సలే మాతృభూమే...’ అంటూ ధ్యాన స్మరణలు చేసుకునే ఒకే స్ఫూర్తిమంత సాంస్కృతిక సంస్థ సంఘ్.
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను ఫలానా రాజకీయ పక్షానికి ఓటేయమని సంఘ శాఖాస్థాన్‌లో ఎవ్వరూ ఎప్పుడూ చెప్పరు. ఎవరికిష్టమైన రాజకీయ పక్షానికి వాళ్లు ఎన్నికలలో ఓటు వేసుకోవచ్చు. అది ఎవరికి వాళ్ల వైయక్తిక నిర్ణయమే.
ఆర్‌ఎస్‌ఎస్ త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా ఆమోదించలేదని ఎక్కడ విన్నారో, చదివారో చూసారో జైపాల్‌రెడ్డిగారే చెప్పాలి. ఇక కాషాయ ధ్వజ సంగతి. ప్రతి సంస్థకు, ఆశ్రమానికీ, రాజకీయ పక్షానికీ వాళ్ల వాళ్ల సొంత పతాకాలు ప్రత్యేకించి వేరేవేరే ఉంటాయి. అవి వాళ్ల కార్యస్థానాల్లో, కర్మక్షేత్రాల్లో ఎగరేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ చిహ్నమైన త్రివర్ణపతాకంలో ధర్మచక్రం వుండదు. రాట్నం వుంటుంది. స్వాములవార్ల ఆశ్రమాలు, దేవళాలు, దేవస్థానాలు, మఠాలు మొదలైన వాటికి వేరేవేరే ప్రత్యేక కేతనాలుంటాయి. అది తప్పుకాదు.
ఆర్‌ఎస్‌ఎస్‌లోఎన్నికలుండవు. అనేది మరో ఆక్షేపణ. ఆర్‌ఎస్‌ఎస్‌లో వివిధ బాధ్యతల స్థాయిల వారీగా కొన్ని కొన్ని ప్రత్యేక మకాంల (కాంప్స్)లో అర్హులైన వాళ్లను నిర్ణయించుకుంటారు. అదేదో ఒక ప్రచారం కోసమో, పేరుకోసమో చేసుకునే ఎన్నికలు ఎంపికలు, నిర్ణయాలు కావు. ఒక స్థానం కోసం ఎన్నిక పేరుతో ఏదో రాజకీయం నడుపుకోవడం, మనస్పర్ధలు పెంచుకోవడం అనే అవాంఛనీయ స్థితి రాకూడదనే సదుద్దేశంతోనే ఎన్నికల ప్రహసనాలనే వాటిని ఆర్‌ఎస్‌ఎస్ సంప్రదారుూకరించుకోలేదు. తాను కేవలం ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమే కనుక.
1962వ సంవత్సరపు చైనా యుద్ధ సమయంలో స్వచ్ఛందంగా సరిహద్దుల్లోకి వెళ్లి భారత సైనికులకు టీలు, బిస్కట్లు, దుప్పట్లు వగైరాలు అందించింది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే. అది గుర్తించిన అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ను నిందిస్తూ వచ్చిన ప్రధాని నెహ్రూ 1963 జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను పెరేడ్ చేయమని కోరాడు స్వయంగా. సైనికులకు ఇదే రకమైన యుద్ధ సమయ సేవ ఆర్‌ఎస్‌ఎస్ 1965 పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా చేసింది. 1977లో దివిసీమ జలప్రళయ విపత్తు సమయంలో వర్ణించలేనంత స్థాయిలో సేవా కార్యక్రమాలు చేసిన స్వచ్చంద కార్యకర్తల్లో అధిక శాతం ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే.ఇలా చెప్పుకుంటు పోతే జైపాల్‌రెడ్డి బాపతు భావజాలాల వాళ్లు చెవులకు చేదు నిజాలుగా అనిపించేవి చాలా చెప్పాల్సి వుంటుంది. విద్యావేత్తలుగా, మేధావులుగా పేరుపడ్డ వాళ్లు అబద్ధాలు, అభూత కల్పనలు, గోబెల్స్‌ప్రచార శైలిలో చెప్పుకుంటుపోతే అలాటి వాళ్లకు ప్రయోజనమేమీ వుండదు. జాతికి శ్రేయస్సూ కాదు.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం