సబ్ ఫీచర్

పోలవరం ఎంతెంత దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ పరిణామ క్రమం, ఆర్థిక పురోగతి ఎక్కువ భాగం నదుల పరీవాహక ప్రాంతాల్లోనే జరిగినట్టుగా చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది. నదీజలాలను వినియోగించుకోవడంలో మనం విఫలమవుతునే వున్నాము. వృధాగా సముద్రాల పాలవుతున్న నదీ జలాలను వినియోగించుకునేందుకు అనుసంధాన ప్రాజెక్టులను నిర్మించి బంజరు భూములను సాగులోకి తీసుకురావాలని మొదటి ప్రధాని నెహ్రూ సంకల్పించారు. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలాన్ని పూర్తిగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కేటాయించారు. తరువాత ప్రధానుల హయాంనుంచి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో మందకొడిగా సాగుతున్నది.
తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు సాగునీటిని అందిస్తున్నాయి. అనేక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాల్సి వుంది. విభజన చట్టంలో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్‌కు పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వంద శాతం నిధులు కేంద్రమే భరించడానికి అవకాశం ఏర్పడింది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయో ఒకసారి పరిశీలించేందుకు వెళ్లిన మా బృందం కొన్ని విషయాలను గమనించింది.
ఢిల్లీలో సెప్టెంబర్ 21న విజ్ఞాన భవన్‌లో నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సహకార భారతి కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతులమీదుగా రైతుభారతం పుస్తకాన్ని ఆవిష్కరించాలని ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ లిమిటెడ్ సంకల్పించింది. ఈ పుస్తక సమాచార సేకరణలో భాగంగా నాతో కూడిన బృందం పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించింది. సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్లు కర్రి శివారెడ్డి, వై.రాజారాం, పశ్చిమ గోదావరి జిల్లా డైరక్టర్ గౌతంబాబుతోపాటు ఆ ప్రాంతం మీద అవగాహన వున్న స్థానిక రాజకీయ నేత కాసర సురేష్‌రెడ్డి, బాలనాగరాజులను వెంటపెట్టుకుని పశ్చిమ గోదావరి జిల్లానందలి జంగారెడ్డిగూడెంనుంచి పరిశీలన ప్రారంభించాం.
కాటన్ ఆలోచన
అప్పట్లో కాటన్ మహాశయుడు ఉత్తరాది నదులను, దక్షిణాది నదులను అనుసంధానం చేయడం గురించి ఓ ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగమే ధవళేశ్వరానికి ఎగువున పాపికొండల వద్ద పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం గ్రామానికి దగ్గరలో నిర్మితమవుతన్న పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం కూడా ఓ భాగం. అప్పటి ప్రాజెక్టు అంచనా వ్యయం 129 కోట్లు కాగా ఈ చిన్న మొత్తమే భారీ వ్యయం అని అప్పటి ప్రభుత్వం భావించి ఈ నివేదికను పక్కనపెట్టింది. తరువాత స్వాతంత్య్రానంతరం 1953లో వచ్చిన వరదలు, విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క పారిశ్రామిక అవసరాలు, తాగునీటి సమస్య ఈ ప్రాజెక్టు అవసరాన్ని అప్పటి పాలకులకు మరోసారి గుర్తుచేసాయి. అయితే 1976లో కెఎల్‌ఎన్‌రావు ద్వారానే ఈ ప్రాజెక్టుకు పూర్తి కదలిక వచ్చింది. 1978లో విస్తృతస్థాయి నివేదిక సమర్పించిన తరువాత 1980లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సహకారంతో ప్రధాని ఇందిరాగాంధీ చేత శంకుస్థాపన జరిగింది. అయినా ముంపునకు గురవుతున్న ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ (అప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే కొనసాగేది) రాష్ట్రాల అభ్యంతరాలు, కేంద్రంనుంచి అనేక రకాల అనుమతులు లభించక ముఖ్యంగా కేంద్రం వాటా కింద నిధులు లభించక అనేక సంవత్సరాలు నత్తనడక సాగుతూ వచ్చింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రతిష్ఠాత్మకంగా భావించిన జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టు త్వరిత గతిన పూర్తి చేయాలని సంకల్పించారు. 2009-2014 మధ్య తెలంగాణ ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం తదితర కారణాలతో ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగాయి.
పూర్తయినది 18 శాతం పనులే!
ఇప్పటివరకు 25 శాతం పనులు పూర్తి అయ్యాయని పోలవరం ప్రాజెక్టు సిబ్బంది మా బృందానికి చెప్పారు. వాస్తవంగా 18 శాతం మాత్రమే పూర్తయినట్టుగా గుర్తించాము. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎంత తొందరగా పూర్తిచేస్తే తనకు అంత క్రెడిట్ దక్కుతుందని ఆతృత పడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అనేక కారణాలతో పనులు వేగవంతంగా సాగడంలేదు. వారానికి ఒకసారి ప్రాజెక్టు నిర్మాణ సైట్‌ను సందర్శిస్తానని, వారంలో ఒకరోజు రాత్రి ఇక్కడే నిద్రపోతానని చెప్పారు. ఇందుకు అక్కడ శాశ్వత హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడం, కాలువలకు సంబంధించి భూసేకరణ, రైతులకు, ముంపు బాధితులకు వారు ఆశిస్తున్న స్థాయిలో పరిహారం ఇవ్వడం, ఆ స్థాయిలో వారిని ఒప్పించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరంలో నదిఒడ్డున వున్న దేవీపట్నం మండల పరిసర గ్రామాలు ముంపునకు గురి కానున్నాయి. ఇంతవరకు నోటీసులు కూడా రాలేదని వారు మాతో చెప్పారు. ఇలాగే తెలంగాణ నుంచి ఏపీలో కలసిన కుకునూరు తదితర ఏడు మండలాల్లో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురికానున్నాయి. ఆ ప్రాంతంలో చాలావరకు రైతులకు, ముంపు ప్రజలకు పరిహారం చెల్లిస్తున్నారని తెలిసింది. ఇంకా పర్యావరణ అనుమతులు రాలేదని, అయినా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఒక వ్యక్తి ఢిల్లీనందలి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేసారు. ఈ పిటిషన్ మీద ఇంకా విచారణ కొనసాగుతునే వుంది.
పూర్తి స్వరూపం ఇలావుంది
రాక్‌ఫిల్ డ్యాం, ఈసీఆర్ డ్యాం, స్పిల్‌వే, స్పిల్ ఛానల్ రూపాలలో నాలుగు విభాగాలుగా మొత్తం 48 గేట్లతో 1128 మీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది. తాజాగా 58,319.06 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. ఈ సవరణ నివేదికను 22-08-2017న ఢిల్లీలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కేంద్ర జలసంఘానికి, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు నివేదిక రూపంలో సమర్పించారు. ప్రధాన పనికి 42,905.78 కోట్లు, ఎడమ కాలువకు 6362. 29కోట్లు, కుడి కాలువకు 4835.33కోట్లు, విద్యుత్ కేంద్రానికి 4205.66 కోట్లు, ఎడమ కాలువ భూసేకరణకు 1401.46 కోట్లు కావాలని కోరారు. గతంలో 2010-11లో సవరించిన అంచనాల ప్రకారం 1610.45 కోట్లుగా అంచనా వేసారు. ఇప్పుడు అది తాజా అంచనాలతో 58 వేలకోట్లకు చేరింది. ఇప్పటివరకు ఇంచుమించు మట్టిని తవ్వే పని చాలావరకు పూర్తి కావచ్చింది. తరువాత కాంక్రీట్ నిర్మాణం చేపట్టాలి. పునాది నుంచి 57.90 మీల ఎత్తుకు నిర్మించాలి. అక్కడ 16మీ.లు+20మీ.లు గేట్లు ఏర్పాటు చేస్తారు. డ్యాంనుంచి వచ్చే నీటిని కుడి ఎడమ కాలువల్లోకి తీసుకెళ్లేందుకు కొండలు అడ్డంగా వున్నందున సొరంగాల ద్వారా కాలువలు తవ్వుతున్నారు. ఎడమవైపు 918 మీటర్ల పొడవున ఒకటి, 890 మీల పొడవున మరొకటి రెండు సొరంగాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో దాదాపు పది లక్షల ఎకరాలకు పైగా సాగునీటి సౌకర్యం లభిస్తుంది. విశాఖ నగరానికి మరియు చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం కూడా లభిస్తుంది. మరియు 80 టిఎంసిల గోదావరి జలాలను కృష్ణా నదిలోకి కలపడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా తరచు కరువుకు గురవుతున్న రాయలసీమకు, అక్కడ నిర్మాణంలో వున్న హంద్రీ నీవా, గాలేరు నగరి ఎత్తిపోతల పథకాలకు సాగునీటి సమస్య కూడా తీరుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అమల్లోకి రానుండడంతో యావత్ ఆంధ్రప్రదేశ్ రైతులకు, పారిశ్రామిక వేత్తలకు విద్యుత్ కొరత తీరడమే కాక పక్కరాష్ట్రాలకు అమ్ముకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాగా దేవీపట్నం, రంపచోడవరం ఏజెన్సీలనందు గిరిజనులకు, గిరిజనేతరులకు భూవివాదాల సమస్య వున్నందున పరిహారం చెల్లింపునందు క్లిష్టతరమైన సమస్యలు ఎదుర్కొనాల్సి వుంది. గిరిజనులకు నక్సల్స్ (మావోయిస్టులు) మద్దతు వున్నందున ఈ సమస్య మున్ముందు శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం వుంది. ఇటువంటి మరికొన్ని సమస్యలను ప్రభుత్వం తగిన చతురతతో, జాగ్రత్తతో మొగ్గలోనే తుంచివేసి, ఇప్పుడు ఏ విధమైన వేగంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెడుతున్నారో ఇదే తరహాలో మున్ముందు కూడా వెడితే 2019 ఎన్నికల నాటికి 50 శాతం పనులు పూర్తయి తరువాత 2025 నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులు వంద శాతం పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ ‘అన్నపూర్ణప్రదేశ్’గా మారుతుంది.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు