సబ్ ఫీచర్

అసమాన పోరాట యోధుడు.. కర్మయోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వతంత్ర పోరాటంలో, స్వతంత్ర భారత్‌లో అలుపెరుగని పోరాటాలు జరిపిన అసమాన యోధుడు డా.రామ్ మనోహర్ లోహియా, వౌలికమైన సామాజిక విధానాలపట్ల అనూహ్యమైన కసరత్తు జరిపిన కర్మయోగి. వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా తాను నమ్మిన విశ్వాసాల కోసం జీవితకాలం నిలబడి, రైతులు, గ్రామీణ ప్రజలు, అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం స్వాతంత్య్రం తొలి రోజులలో పోరాటాలు జరిపిన తొలితరం నాయకులలో ప్రముఖులు.
మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులతో సన్నిహితంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆచార్య నరేంద్ర దేవ్, జయప్రకాష్ నారాయణ్, యూసఫ్ మెహరాలి, అచ్యుత్ పత్వార్థన్ వంటి వారితో కలిసి దేశంలో సోషలిస్ట్ ఉద్యమ నిర్మాణంలో క్రియాశీల పాత్ర వహించారు. సామాజిక, రాజకీయ విలువల కోసం నిర్మొహమాటంగా, నిర్భయంగా పోరాటాలు జరిపారు. ఈ ప్రక్రియలో సన్నిహితులతోనే విభేదించడానికి, వ్యతిరేకించడానికి ఏ మాత్రం వెనుకాడలేదు.
ఉత్తరప్రదేశ్‌లోని అక్బరాపూర్‌లో 1910 మార్చి 23న ఒక సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. చిన్నతనంనుండి బ్రిటిష్ వలస పాలకులపట్ల ప్రతికూలతను పెంచుకున్న లోహియా, అందరూ ఉన్నత విద్య కోసం లండన్ వెడుతున్న రోజులలో బ్రిటన్‌కు వ్యతిరేకంగా ఉన్న జర్మనీలోని నేటి హంబొల్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ (అప్పుడు ఫ్రెడరిక్ విలియం యూనివర్సిటీ)లో చేరాలని నిర్ణయించుకున్నారు. జర్మన్ భాషను నేర్చుకొని తన విద్య ప్రతిభతో ఆర్థిక సహాయం కూడా పొంది జాతీయ అర్థశాస్త్రం ప్రధాన అంశంగా డాక్టోరల్ విద్యార్థిగా చదివారు. గాంధీజీ సామాజిక, ఆర్థిక సిద్ధాంతాల ప్రాతిపదికగా ‘్భరత దేశంలో ఉప్పు పన్ను’ అంశంపై పిహెచ్‌డి పరిశోధన పత్రం సమర్పించారు. తన 22వ ఏటనే డాక్టరేట్ పొందారు.
బెర్లిన్‌లో ఉన్నప్పుడు ఐరోపా భారతీయుల సంఘాన్ని ఏర్పాటు చేసి భారతదేశంలో బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. గాంధీ ప్రచురిస్తున్న ‘హరిజన’ పత్రికలో ‘ఇప్పుడు సత్యాగ్రహం’ అనే వ్యాసం వ్రాసినందుకు ఆయనను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. భారతదేశం తిరిగి వచ్చాక స్వతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ప్రారంభించిన వారిలో ఆయన కూడా ఒకరు. ఈ పార్టీ అధికార పత్రిక ‘కాంగ్రెస్ సోషలిస్ట్’కు సంపాదకులుగా ఉండేవారు. లోహియా రూపొందించిన విదేశాంగ విధానంవల్లన ప్రపంచంలో భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా పేరొందగలిగినట్లు పరిశీలకులు పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఒకవైపు గాంధేయవాదులు, మరోవైపు కమ్యూనిస్టులు చేరి భిన్న వాదనలు వినిపిస్తూ ఉండేవారు. వారిద్దరి వాదనలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ స్వతంత్రమైన భారతీయ ఆలోచనా రీతులను లోహియా ప్రతిపాదిస్తూ ఉండేవారు. సోషలిజంపై మార్క్సిజం ప్రభావాన్ని తృణీకరించి, భారతీయ ఆలోచన పరంపరతో అన్వయించే ప్రయత్నాన్ని అప్పుడే చేపట్టారు.
భారత సైన్యం రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులలో ఆయన కూడా ప్రముఖులు. 1941 చివరిలో గాంధీజీ పిలుపుమేరకు జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహణలో కేంద్ర కార్యవర్గంలో కీలక వ్యక్తిగా వ్యవహరించారు. పోలీసులు ఆయనను 1944లో పట్టుకొని, తీవ్ర చిత్రహింసలకు గురిచేసి, లాహోర్ పోర్ట్ జైల్లో జయప్రకాశ్ నారాయణ్‌తోపాటు నిర్బంధించారు. చివరకు 1946 ఏప్రిల్ 11న విడుదల అయ్యారు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత రైతాంగ సమస్యల పట్ల దృష్టి సారించిన వారిలో దక్షిణాదిన ఆచార్య ఎన్.జి.రంగా, ఉత్తరాదిన లోహియా కనిపిస్తారు. రైతుల కోసం హింద్ కిసాన్ పంచాయత్‌ను ఏర్పాటు చేశారు. గోవాలో స్థానికుల భావ ప్రకటన స్వేచ్ఛను నిర్బంధిస్తూ, వారి కదలికలపై ఆంక్షలు విధించిన పోర్చుగీస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడినవారిలో ఆయన ప్రముఖులు. గోవా విముక్తి కోసం గళం విప్పారు.
నాటి జాతీయ నాయకులలో ఆంగ్ల భాష పట్ల గల వ్యామోహానికి వ్యతిరేకంగా చివరివరకు పోరాడారు. స్వదేశీ భాషలను ప్రోత్సహించాలని, హిందీని జాతీయ స్థాయిలో అధికార భాషగా చేయాలనీ ఉద్యమించారు. ఆంగ్లభాష కొనసాగింపువల్ల విద్యావంతులు, ఇతర ప్రజలమధ్య అంతరం పెంచుతుందని, దేశీయ ప్రయోజనాలకోసం ప్రజలు పాటుబడలేరని నిష్కర్షగా స్పష్టం చేశారు. 1963లో ఆయన లోక్‌సభలో అడుగుపెట్టిన తరువాతనే పార్లమెంట్ సభ్యులు హిందీలో ధారాళంగా మాట్లాడటం ప్రారంభించారు. అప్పటివరకు వచ్చీరాని ఆంగ్లంలోనే మాట్లాడుతూ ఉండేవారు.
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటులో నెహ్రూతో సన్నిహితంగా పనిచేసినా స్వాతంత్య్ర భారతదేశంలో నెహ్రూ పరిపాలన తీరుతెన్నులపట్ల తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేయడమే కాకుండా తీవ్రంగా పోరాటం జరిపిన యోధుడు లోహియా. నెహ్రూ సామ్యవాద రీతి పాలనలోని లొసుగులను బహిర్గంతం చేయడానికి వెనుకాడలేదు. ఈ సందర్భంగా ఒక కరపత్రంలో ‘‘ప్రధాని నెహ్రూపై ప్రభుత్వం రోజుకు రూ.25 వేలు ఖర్చుపెడుతున్నది. ఒక పేద దేశం భరించలేని మొత్తం ఇది’’ అంటూ దాడి చేశారు.
ప్రజాజీవనంలో వ్యక్తి ఆరాధనను తీవ్రంగా వ్యతిరేకించిన తొలితరం నాయకులలో లోహియా ప్రముఖులు. ‘‘రాజకీయ పోరాటానికి ఏ ఒక్క వ్యక్తి ఆలోచన కేంద్ర బిందువు కారాదు. ఆ ఆలోచన అతనికి సాయపడేదిగా ఉండాలి తప్ప పెత్తనం చెలాయించే విధంగా ఉండరాదు. అంగీకరించడం, తృణీకరించడం అనేటివి రెండు కూడా మూఢభక్తికి విభిన్న రూపాలు’’ అని స్పష్టం చేశారు.
వ్యక్తి ఆరాధనను ఎండగట్టే ఆయన చివరకు తన పుట్టిన రోజును మార్చి 23న జరపడాన్ని సహితం అంగీకరించేవారు కాదు. ఎవరైనా వచ్చి తన పుట్టినరోజు గుర్తుచేస్తే ‘‘మార్చి 23 అనగానే మనందరికీ గుర్తురావలసింది స్వాతంత్య్ర పోరాట యోధులైన భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌లు’’ అని స్పష్టం చేసేవారు.
అదేవిధంగా దేశంలో కమ్యూనిస్టుల అవకాశవాద విధానాలను, దేశ విద్రోహకార చర్యలను సహితం ఆయన సహించలేదు. పైగా మానవజాతి కల్యాణానికి పెట్టుబడిదారి విధానం, కమ్యూనిజం రెండూ పనికిరావని స్పష్టం చేశారు. మానవ విలువలతో కూడిన సాంస్కృతికంగా ప్రజాస్వామిక సోషలిజం అవసరమని ప్రబోధించడం ద్వారా భారతీయ సామాజిక విలువలను విడనాడకుండా, ఆధునిక విలువలను అన్వయించే ప్రయత్నం చేశారు.
పాశ్చాత్యుల ప్రతిపాదనలకు గణ, రష్యా సిద్ధాంతాలకు గాని కట్టుబడకుండా, ఆయా ప్రభుత్వాల అధికార పరిధులు లొంగకుండా స్వతంత్ర సిద్ధాంతాలను ప్రవచించిన మొట్టమొదటి భారతీయ సోషలిస్ట్ లోహియా అని చెప్పవచ్చు. ఆయన జీవితకాలంలో ఆయన ప్రేరణ లేని లేదా స్వయంగా పాల్గొనని ప్రజా ఉద్యమం అనేది లేదని చెప్పవచ్చు. తన జీవిత చరమాంకంలో 1963లో లోక్‌సభకు ఎన్నికైన ఆయన ఐదేళ్లపాటు పార్లమెంట్ కార్యకలాపాలపై చెరగని ముద్ర వేశారు.
నేటికీ దేశంలో సాధారణ ప్రజల సమస్యల ప్రస్తావనకు పార్లమెంట్‌లో అమలు చేస్తున్న ‘జనవాణి దివస్’ ఆయన ఆలోచన నుండి వచ్చినదే. మన సామాజిక జీవనం, సంబంధాలలో ఆమూలాగ్రమైన పరివర్తన కోసం అహరహం తపించిపోయారు. సమగ్రమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
స్ర్తి పురుష సమానత్వం కోసం మహాత్మాగాంధీ తర్వాత ఆయనంతగా పట్టుదలతో వ్యవహరించిన మరో నాయకుడు కనిపించరు. అన్ని సామాజిక రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు లభించాలని, వారు పురుషులతోపాటు సమానంగా పాల్గొనగలగాలని చెబుతూ వచ్చారు. ఆయనను విప్లవకారులకే విప్లవకారుడు అంటూ ఆచార్య రంగా కొనియాడారు.

-సి.హెచ్.ప్రవీణ్