సబ్ ఫీచర్

చైనా మాటలు ‘మావో’ల చెవికెక్కవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) 19వ మహాసభలు బీజింగ్‌లో ముగిసాయి. ఆ పార్టీ అధ్యక్షుడు జిన్‌పింగ్ మహాసభల ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ చైనాలో నాణ్యమైన అభివృద్ధి కోసం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, విదేశీయుల భాగస్వామ్యం కోసం చైనా ద్వారాలు తెరిచే ఉన్నాయని చెప్పారు. అలాగే ‘‘పోటీకి అడ్డంకిగా నిలిచిన నిబంధనలు, పద్ధతులను మారుస్తాం, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళతాం’’ అని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలకడం, నిబంధనలు మార్చి సంస్కరణలు చేపట్టడం చైనాలో చాలాకాలంగా కొనసాగుతోంది. దీన్ని మరింత విస్తృతపరచి, సంస్కరించనున్నామన్నది అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆలోచన.. అభిప్రాయం.
కమ్యూనిస్టు మూల సూత్రాలకు, మార్కెట్ రహిత విధానాలకు ఈ ఆలోచనలు, అభిప్రాయాలు సరితూగవు. అయినప్పటికీ ప్రజల జీవన ప్రమాణాలు, అభివృద్ధి కీలకం కాబట్టి మావోతో జతకట్టి ‘లాంగ్ మార్చ్’లో పాల్గొన్న తొలితరం నాయకుల్లో ఒకరైన డెంగ్ జియావో పింగ్ దశాబ్దాల క్రితమే చైనాలో భారీ సంస్కరణలు చేపట్టారు. ప్రపంచం పయనిస్తున్న దారిలో తమదైన ‘శైలి’లో పరుగెత్తడానికి నిశ్చయించి అందర్ని ఆశ్చర్యపరిచారు. ఆయన వేసిన సంస్కరణ బాటలోనే అనంతరం వచ్చిన నాయకులు నడుస్తున్నారు. జిన్‌పింగ్ సైతం ఆ విధానాలకే కట్టుబడి విదేశీ పెట్టుబడులను, భాగస్వామ్యాన్ని మరింత ఎక్కువ చొరవతో ఆహ్వానిస్తున్నారు. ఈ వైఖరి అక్కడి పార్టీ నాయకుల, ప్రజల ఆమోదం పొందింది. దాంతో రెట్టింపు ఉత్సాహంతో ఆ విధానాలను ఆచరణలో పెడుతున్నారు. దరిమిల చైనా ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ప్రభావశీల దేశంగా అవతరించింది. దీన్ని సానుకూల అంశంగానే అటు కమ్యూనిస్టులు, ఇటు పెట్టుబడిదారులు పరిగణిస్తున్నారు. వాస్తవానికి ‘సాంస్కృతిక విప్లవం’ సందర్భంగా కాని, అంతకుముందు కాని ఏ ఆలోచనలను, విధానాలను విమర్శకు పెట్టారో, తూర్పారపట్టారో అవన్నీ ఇప్పుడు ఆ పార్టీ ఆమోదం పొందుతున్నాయి. వాటిని ఆలింగనం చేసుకుని ఆచరణలో పెట్టి అభివృద్ధిని సాధిస్తున్నారు. అంతరిక్షంలోకి దూసుకుపోతున్నారు. సిల్క్‌రోడ్డును, సముద్రాలను ఏకం చేసి ఏలాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ విజయగాథను ప్రశంసించాలా? తిరస్కరించాలా? అన్న సంశయంలో భారత దేశంలోని వామపక్ష తీవ్రవాద పార్టీలు, సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా మావోయిస్టుల గొంతులోకి ఈ పరిణామం దిగడం లేదు. ఒకప్పుడు ‘చైనా చైర్మన్ మన చైర్మన్’, చైనా మార్గమే మన మార్గం అని నినదించి దేశంలోని అన్ని ప్రాంతాల యువతను ఆకర్షించి విస్తృతి పొంది ఇప్పుడు ఆ నినాదాన్ని ఇచ్చే దశలో మన దేశంలోని కమ్యూనిస్టులు లేరు. ఇప్పుడు ‘చైనా చైర్మన్’గా జిన్‌పింగ్ పెట్టుబడిదారి విధానాలను, పాశ్చాత్య సంస్కృతిని, పని విధానాన్ని, టెక్నాలజీని ఆహ్వానిస్తున్నారు. ఇది భారత మావోయిస్టులకు మింగుడు పడటం లేదు. మార్స్క్ సూత్రాలకు అంగుళం అటు ఇటు కదలకుండా ఆ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని భారత మావోల అభిమతం. అదెట్లా కుదురుతుందని చైనా అగ్ర నాయకుల అభిప్రాయం. ఈ సిద్ధాంత ఘర్షణ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. చైనా అగ్ర నాయకత్వం ఇలాంటి వాదనలను, పంథాను మార్చుకుని 1980 ప్రాంతంలోనే అంటే ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్‌వార్ నక్సల్స్ పుట్టకముందే ప్రపంచమార్గం పట్టింది. ఆ దారి ఇప్పుడు రహదారిగా మారింది. ఆ ఆధునిక రహదారిలో చైనా పాలకులు దూసుకుపోతున్నారు. కమ్యూనిజానికి కొత్త నిర్వచనం చెబుతున్నారు.
తాము కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్న మార్గాన్ని, పంథాని మరింత మెరుగుపరచి, పేదరికం తొలగించి, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని జిన్‌పింగ్ తన సుదీర్ఘ ప్రసంగంలో పేర్కొన్నారు. భారత దేశ మావోయిస్టులు మాత్రం చైనా, జన చైనా కాకముందు మావో నాయకత్వంలో జరిగిన లాంగ్‌మార్చ్ కాలంలో, యెనాన్ ప్రావిన్స్‌లో స్థావరాలు పటిష్ట పరుచుకున్న నాటి పరిస్థితులలోనే నిలిచిపోయారు. చైనా జన చైనాగా మారి, అంతరిక్షంలోకి దూసుకుపోతున్న వైనాన్ని, సూపర్ కంప్యూటర్లతో వేగంగా పరుగెత్తుతున్న తీరును పట్టించుకోకుండా దండకారణ్యంలో మావో కాలం నాటి పరిస్థితులను పునర్నిర్మించే ప్రయత్నంలో తలమునకలయ్యారు. బస్తర్‌ను మరో యెనాన్‌గా తీర్చిదిద్దడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కాలంతో పనిలేదని కామ్రేడ్లు వెనుకబాటపడుతున్నారు. విచిత్రమేమిటంటే చైనాలో ఒకే దేశం రెండు విధానాలు (సిద్ధాంతాలు) అధికారికంగా అమలు జరుగుతున్నాయి. ఆ విధానాల ఆధారంగానే హాంగ్‌కాంగ్, మకావోలో రెండు వందల శాతం పెట్టుబడిదారి విధానాలు పచ్చిగా అమలు జరుపుతున్నారు. మకావో నిజానికి ఓ పెద్ద ‘‘జూదశాల’’. దానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి ఆదాయాన్ని దండుకుంటున్నారు. ఇంత వెసులుబాటుతో చైనా కమ్యూనిస్టు పార్టీ పరిపాలిస్తుంటే, మనుగడ కొనసాగిస్తుంటే భారత మావోయిస్టులు మాత్రం మడిగట్టుకుని మార్క్సిస్టు మూల సూత్రాలకు ఏ మాత్రం విఘాతం కలగనివ్వమని మందుపాతరలతో ఆదివాసీలనే అంతమొందించడాన్ని ఏమనాలి? ఇది చైతన్యవంతులైన వారందరూ ఆలోచించదగ్గ అంశమేకదా!
పశ్చిమ బెంగాల్‌లో 1967 సంవత్సరంలో నక్సల్‌బరి ప్రాంతంలో రైతుకూలీల తిరుగుబాటును ఆనాటి చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అభినందించింది. అధికార రేడియో ఆ చర్యను ‘వసంత మేఘ గర్జన’గా అభివర్ణించింది. ఆ అభినందన, వర్ణన ఆనాటి ‘నక్సలైట్ల’కు వెయ్యేనుగుల బలాన్ని ఇచ్చింది. ఆ ఒక్క అభినందన, విశేషణాత్మక పొగడ్త లేకపోయినట్లయితే నేడు భారతదేశంలో నక్సలైట్లు గాని, మావోయిస్టులు కాని ఉండేవారు కాదు. అదో అలాంటి చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం భారత మావోయిస్టుల ‘‘చర్యల్ని’’ తప్పుబడుతోంది. మావో మనవడు, చైనా మిలటరీలో కీలక స్థాయిలో ఉన్నవాడు అనేకసార్లు భారత మావోయిస్టుల ‘‘దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా’’ను విమర్శించారు. తప్పుపట్టారు. అది కాలానుగుణమైన వ్యవహారం కాదని మండిపడ్డారు.
ఈ సూక్ష్మ విషయం పట్టించుకోకుండానే, జీర్ణించుకోకుండానే మవోయిస్టులు దశాబ్దాలుగా ధ్వంస రచనకు పూనుకోవడం విషాదం కాక ఏమవుతుంది? అనేకమంది ఆదివాసుల, అమాయకుల ప్రాణాలు బలిగొనడం భావ్యమా? ఇదంతా చూస్తుంటే భారతదేశ మావోయిస్టులు మేఘాల్లో ఎలా విహరిస్తున్నారో స్పష్టంగా అర్థం అవుతున్నది. భూమిమీద ప్రజలుంటే.. మేఘాల్లో, ఊహల్లో మావోయిస్టులుంటే ప్రజలకు ఒరిగేది ఏమిటి? మరింత నష్టం, కష్టం, క్లేశం తప్ప! ఈ తత్వం బోధపడటానికి పచ్చని అరణ్యం ‘ఎర్ర’బడాలా? ఆదివాసీలు ఆహుతికావాలా? అభివృద్ధి కుంటుపడాలా? చైనా మాదిరిగానే మనమూ అభివృద్ధి సాధించాలనుకోవడం తప్పా? మావోయిస్టుల వైఖరి మాత్రం అది తప్పేనన్నట్లు ఉంది. అది వారి వివేకం ఏపాటిదో తేటతెల్లం చేస్తోంది.

-వుప్పల నరసింహం 9985781799