సబ్ ఫీచర్

ప్రపంచానికి భూటాన్ పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పొరుగునవున్న చిన్న హిమాలయ దేశం భూటాన్ ఇప్పుడు కొన్ని విషయాల్లో ప్రపంచానికి పాఠాలు చెబుతోంది. మానవాళికి ఉపయుక్తమైన అంశం ఎవరు చెప్పినా చెవి యొగ్గి వినాల్సిందే! భూటాన్ రాచరిక పాలనలో వున్న దేశం. అయినా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తోంది. రాజదర్పం గాక ప్రజాదర్పం మాత్రమే అక్కడ దర్శనమిస్తోంది. ఆ దేశ రాజ్యాంగాన్ని గౌరవించడమేకాక కఠినంగా అమలు జరపాలని ఆజ్ఞాపించే అభ్యుదయవాది అక్కడి రాజు.
కొంతకాలంగా ఆ దేశం గూర్చి అంతర్జాతీయ వేదికలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రపంచ పర్యావరణ మార్పుల (గ్లోబల్ వార్మింగ్) గూర్చిన ప్రస్తావన వచ్చినపుడు భూటాన్ అనుసరిస్తున్న విధానం గుర్తు చేస్తున్నారు. ఆ దేశంలో 60 శాతానికి పైగా పచ్చదనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడవలసిందేనని ఆ దేశ రాజు రాజ్యాంగంలో పొందుపరిచారు. దాంతో ఆ దేశంలో బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) జాడ కనిపించదు. చైనా, భారతదేశాల్లోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం పెరిగి పట్టపగలే ధూళి మేఘాలు కమ్ముకుంటున్న సంగతి, గాలిలో ఆక్సిజన్ శాతం బాగా తగ్గిన వైనం గూర్చి మీడియాలో తరచూ కథనాలు వస్తూనే వున్నాయి. ఈ రెండు దేశాల మధ్యగల చిన్న దేశం భూటాన్ పచ్చదనంతో ప్రకృతి రమణీయతతో అలరారుతోంది. కాలుష్యం అంటే ఏమిటో తెలియకుండా అక్కడి ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు.
21వ శతాబ్దంలో ఇది సాధ్యమా?... అంటే సాధ్యమేనని వారు అంటున్నారు. అంతేగాక స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)కన్నా ‘‘స్థూల జాతీయ ఆనందం’’ (జిఎన్‌హెచ్)పై వారు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఆర్థికంగా ఎంత ఎదిగామన్నది కాదు హార్థికంగా ఎంత సుసంపన్నంగా వున్నామన్నది కీలకమని ఆ దేశపు రాజు నుంచి పేద వరకు తలపోస్తున్నారు. దాంతో ప్రపంచంలోనే ఎక్కువ ఆనందంగా ప్రజలున్న దేశంగా భూటాన్ గుర్తింపు పొందింది. దాన్ని అక్కడి ప్రజలు కాపాడుకుంటున్నారు.
ప్రజల ఆనందం... సంతోషం కేవలం భౌతిక సంపదపైనే ఆధారపడి లేదు. ‘లక్షాధికారి అయినా లవణమన్నమేగాని మెరుగు బంగారం మింగబోడు’ అని బలంగా నమ్మారు. భౌతిక సదుపాయాల ద్వారానే సంతోషం లభించదు. ఈ ఆలోచనా విధానం భారతదేశంలోనూ బలంగా కనిపించేది. క్రమంగా ఆ అవగాహన పలచనవుతోంది. భూటాన్‌లో మాత్రం అంతే సాంద్రతతో కనిపిస్తోంది. ఇప్పటికీ ఆ భావనను వారు విశ్వసిస్తున్నారు.
పారిశ్రామిక విప్లవానంతరం జరిగిన, జరుగుతున్న మార్పుల కారణంగా భౌతిక సంపద కోసం వెంపర్లాట బాగా పెరిగింది. ఇందుకు మార్క్స్ అభిమానులు అగ్గిమీద గుగ్గిలం వేసారు. దానికి మార్క్స్ ప్రవచించిన గతి తార్కిక భౌతిక శాస్త్రాన్ని ఆసరా చేసుకుంటున్నారు. సంతోషం.. ఆనందం సాపేక్షమైన అంశమైనప్పటికీ ఏంగిల్స్, కారల్‌మార్క్స్ తమ ఆర్థిక సూత్రాలకు అవగాహనకు బలం చేకూర్చేందుకు వీలుగా చర్య-ప్రతిచర్య, సరికొత్త ఆవిష్కరణ (్థసిస్- ఆంటి థీసిస్- సింథసీస్) విధానాన్ని ప్రచారంలో పెట్టారు. 19వ శతాబ్దంలో బూర్జువాలు (పెట్టుబడిదారులు) కర్మాగారాల్లో వచ్చిన లాభాలతో బలిసిపోతున్నారు. శ్రామికులు తక్కువ వేతనాలతో చిక్కిపోతున్నారు. కాబట్టి చర్య-ప్రతిచర్య విధానం అమలు చేసేలా సూత్రీకరణలు చేసారు. దాంతో భౌతిక సంపదలో ఆనందాన్ని, సంతోషాన్ని పొందమని అన్యాపదేశంగా సూచించారు. అది కాస్త అగ్నిపర్వతంలా బద్దలైంది. దాంతో సంతోషం.. ఆనందం కాదుకదా అల్లకల్లోలం పెరిగి అశాంతి ప్రబలింది. అరాచకం హెచ్చింది. కారల్‌మార్క్స్, ఏంగిల్స్ నాటి కాలానికి ఆసియాలోని భారత్ లాంటి దేశాల్లో ప్రజలు ఆనందం- సంతోషాన్ని సాపేక్షికాంశంగా గుర్తించి భౌతిక సంపదకు సంతోషానికి సంబంధం లేదని తరతరాలుగా వస్తున్న అవగాహనతో కోట్లాదిమంది ప్రజలు జీవనం సాగించారు. ఈవిధానం ప్రజల ఆత్మగా శతాబ్దాలుగా కొనసాగింది. దాని ఉన్నతీకరణ ఇప్పుడు భూటాన్‌లో తిలకించవచ్చు. భూటాన్‌లో ప్రకృతి సిద్ధమైన సహజ సూత్రాలే తప్ప కారల్‌మార్క్స్ ఆర్థిక సూత్రాలుగాని, గతితార్కిక భౌతిక సూత్రాలను గాని ప్రజలు పాటించడం లేదు. అయినప్పటికీ వారు ప్రపంచంలోనే ఎక్కువ ఆనందంగా, సంతోషంగా తలెత్తుకుని అక్కడి ప్రజలు జీవిస్తున్నారు. తమ సంప్రదాయాల్ని చాటుతున్నారు. అంటే మార్క్స్ సిద్ధాంతం, సూత్రీకరణలు, అవగాహన సార్వజనీనం కాదని వెల్లడవుతోంది. భూటాన్ దేశమేగాక ఇంకా అనేక ఇతర దేశాల్లోనూ ప్రజలు భౌతిక సంపద అంతగా లేకుండానే సుఖంగా, సంతోషంగా జీవిస్తున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ సంస్థలే పేర్కొంటున్నాయి.
యూరప్‌లోని ఒక ప్రత్యేక పరిస్థితిలో, ప్రత్యేక సమయంలో వెలువరించిన సిద్ధాంతం, సూత్రీకరణ, ఆర్థిక చలనగతులు సార్వజనీనం అని భావించి ‘కమ్యూనిస్టు ఇంటర్నేషనల్’ పేర భూగోళాన్ని అగ్నిగోళంగా మార్చిన వైనం అత్యంత దారుణం.
ఆ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌లో భాగంగా భారతదేశంలోకి వచ్చిన ఆ అభిప్రాయాలు ప్రజల ఆలోచనలను ఒకరకంగా కలుషితం చేసాయి. శతాబ్దాల సంతోషాలు, ఆనందాల వెనుక ఆర్థిక సంబంధాలున్నాయన్న భావన చొప్పించి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్న మార్క్స్ మాటను మరింత జఠిలం చేసారు. సార్వజనీనం కాని అంశాన్ని సార్వజనీనమని చెవిలో జోరీగలా ప్రచారం చేయడంతో నిజమేఅనుకొని కొందరు భంగపడ్డారు. చాలామంది ఆర్థిక సంబంధాలైనా, స్నేహసంబంధాలైనా, హృదయ సంబంధమైనా, ఆదాన ప్రదానమైనా అంతిమంగా సంతోషం- ఆనందం ముఖ్యమని అవి కలుషితం కాకుండా చూసుకున్నారు. ఆ సంప్రదాయం, సంస్కృతి, జీవనవిధానం ఇప్పటికీ భూటాన్‌లో కొనసాగడం, అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గొప్ప విషయమేగా!
మార్క్సిస్టు మూలసూత్రాల ఆధారంగా ఏర్పడిన సోషలిజం భువిపైకి స్వర్గం దింపుతుందని చేసిన ప్రచారం ఇప్పుడు బెడిసికొట్టింది. స్వర్గం మాట దేవుడెరుగు కడుపునిండా అన్నంలేక అలమటిస్తున్నామని వెనిజులా ప్రజలు ఘోషిస్తున్నారు. ఇదే సమయంలో భూటాన్ ప్రజలు రాచరికంతో కూడిన ప్రజాస్వామ్యంలో సంతృప్తిగా, ఆనందంతో జీవిస్తున్నారు. దీనివల్ల ఏమర్థమవుతోంది? మార్క్సిజం, సోషలిజం సార్వజనీనం కాదు. అదొక ప్రత్యేక పరిస్థితిలో కొనసాగిన ఒక ప్రత్యేక స్థితిమాత్రమేనని!
ఈ సోషలిస్టు స్వర్గ భావనను మార్క్స్ వీరాభిమానులైన మావోయిస్టులు భారతదేశంలోని దండకారణ్యంలో నెలకొల్పేందుకు అన్ని మర్యాదలను తుంగలో తొక్కుతున్నారు. సార్వజనీనం కాని ఆర్థిక సూత్రాల ఆధారంగా మార్కెట్ రహిత వ్యవస్థను మధ్య భారతదేశంలో ఏర్పాటు చేస్తామని కనీ వినీ ఎరుగనంతటి హింసకు, విధ్వంసానికి పాల్పడుతున్నారు. ప్రజల సుఖం, సంతోషం, ఆనందం మాట కలికానికైనా కనిపించకుండా, వినిపించకుండా నెత్తుటి ఏరులు పారిస్తున్నారు. అందులోనే ఆనందం, సంతోషం, సౌఖ్యం, సంపద వెతుక్కోమంటున్నారు.
భూటాన్ భావనకు, దృక్పథానికి భారతదేశ మావోయిస్టుల భావాలకు, దృక్పథానికి ఎంతటి వ్యత్యాసముందో ఇట్టే తెలిసిపోతోంది. వాస్తవానికి దండకారణ్యంలో ఒకప్పుడు గోండ్వానా రాజ్యం కొనసాగింది. ఆ రాజుల అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఆ అవశేషాలను మావోయిస్టులు తమ సిద్ధాంత విస్తృతికి నెగళ్ల మాదిరి వాడుకున్నారు, ఇంకా వాడుకుంటున్నారు- తప్ప భూటాన్ రాజుగారి మాదిరి గొప్ప మనసును, విశాల హృదయాన్ని, ప్రజల సంతోషాన్ని ఆనందాన్ని, అభివృద్ధిని ఆకాంక్షించడం లేదని దశాబ్దాల తరబడి వారి కార్యాచరణనే రుజువు చేస్తోంది.
మావోయిస్టులకు ప్రకృతి-ప్రజలు కాదు కావలసింది కేవలం రాజ్యాధికారం. ఏం మాయ చేసైనా ఎవరి తలలపై పాదం మోపైనా రాజ్యాధికారం దక్కాలి.. దక్కించుకోవాలన్నదే పరమావధిగా పనిచేస్తున్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలను చూపుతూ రక్తపుటేరులు పారిస్తున్నారు. ఈ వైఖరి చూస్తుంటే మావోయిస్టులకన్నా భూటాన్ రాజు వెయ్యి రెట్లు మెరుగనిపిస్తోంది. ప్రజలపట్ల పూర్తి అంకితభావంతో వారి ఆనందమే పరమావధిగా ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. ఏ దేశ ప్రజలైనా పాలకుల నుంచి కోరుకునేది ఇదేకదా?

-వుప్పల నరసింహం 9985781799