సబ్ ఫీచర్

వ్యర్థాలతోనే అనర్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదు, అందుకే ఏమున్నా లేకున్నా ఆరోగ్యంగా ఉంటే చాలు, జీవితం సాఫీగా సుఖంగా ఎలాంటి సమస్యలూ లేకుండా సాగుతుందనేది నానుడి. అయితే ఈ ఆరోగ్యమే మహాభాగ్యమనే సూత్రాన్ని పాలకులు ఎంత మేరకు పట్టించుకుంటున్నారు? ఒక పక్క ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరిస్తున్నామంటూ కేంద్ర స్థాయిలోనూ రాష్ట్రాల్లోనూ చెప్పుకుంటున్న పాలకులు ఆ సూత్రాన్ని ఎంత మేరకు పాటిస్తున్నారనేది అనుమానంగానే కనిపిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తోంది. ఇప్పటికీ దేశ జనాభాలో మెజార్టీ శాతానికి ఆరోగ్యం అనేది ఎండమావిగానే ఉండటం భరించలేని వాస్తవమే. ఒక పక్క అన్ని రంగాల్లోనూ భారత్ ప్రపంచ దేశాలకు పోటీగా ఎదుగుతోంది. రాజకీయంగానూ ఆర్థికంగానూ భిన్నకోణాల్లో తన సత్తాను చాటుకుంటోంది. కానీ వైద్యపరంగా ఈ స్థాయి అభివృద్ధి సంతరించుకోలేకపోవడానికి కారణం ఏమిటి? ప్రపంచంలోని ఏ దేశానికీ లేనంత యువశక్తి భారత్ దేశానికి ఉన్నపుడు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఈ శక్తిని యుక్తిగా వాడుకునేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఎందుకు ప్రయత్నించడంలేదన్న ప్రశ్న సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరింత ప్రస్ఫుటమవుతోంది. డెంగ్యూ, చికెన్ గున్య వంటి వ్యాధులకు అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు. ఈ వ్యాధి తీవ్రతల గురించి తెలిసిన వాటిని సకాలంలో నివారించకపోతే, నిరోధక చర్యల విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తే అది ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో సుప్రీంకోర్టు వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థ సక్రమంగా లేకపోవడం అనేక కోణాలలో ఇది లోపభూయిష్టంగానే మారడం వల్ల నివారణ యోగ్యమైన ఈ వ్యాధులు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయనేది వాస్తవం. ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ రకమైన వ్యాధుల బారిన పడి జనం మరణిస్తున్నారు. అనంతర చర్యలతో మొక్కుబడి ఉపన్యాసాలతో పాలకులు కాలక్షేపం చేస్తున్నారే తప్ప వ్యవస్థాగతంగా పటుతరమైన విధానాన్ని పాదుగొల్పలేకపోతున్నారు. కేంద్రంలో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పారిశుద్ధ్యం, స్వచ్ఛత వంటి ప్రాధమిక అంశాలకు విశేషమైన ప్రాధాన్యత ఇస్తునే ఉంది. ఇందుకోసం ఎప్పటికపుడు కోటానుకోట్ల రూపాయిలు కేటాయిస్తోంది కూడా. చికెన్‌గున్య, డెంగ్యు వంటి వ్యాధులు తలెత్తుతున్నాయంటే అందుకు ప్రధానకారణం వ్యర్థ నిర్మూలన విషయంలో విధానపరమైన స్పష్టత లేకపోవడమే. ఎక్కడి చెత్త అక్కడే అన్నట్టు పాలకులు నిర్లిప్తంగా వ్యవహరించడం వల్ల అమాయకులు బలైపోతున్నారు. శారీరకంగానూ ఆరోగ్యపరంగానూ చితికిపోయి నిరుపయోగంగా మారుతున్నారు. వ్యర్థ నిర్వహణకు సంబంధించి అవి ప్రాణాంతకంగా పరిణమించకుండా, అంటువ్యాధులకు దారితీయకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అయితే వాటి అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే , ఈ వ్యర్థాలు అనర్థాలుగా అంతిమంగా స్వచ్ఛ్భారత్ లక్ష్యానికి తూట్లు పొడిచేవిగా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో డెంగ్యు , చికెన్‌గున్యలు సృష్టించిన హాహాకారాలు అంతా ఇంతా కాదు. సమస్య అదుపు తప్పిన తర్వాత ఆందోళన చెందడం అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వంటిదే, ఈ రకమైన పరిస్థితికి ఆస్కారం లేకుండా చేయగలిగితేనే నివారణ, నిరోధన వంటి ప్రాథమిక బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నెరవేర్చగలిగినపుడే ఆరోగ్య భారతం ఆవిష్కృతమవుతుంది. ఇప్పటికీ కూడా వైద్య పరమైన సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆస్పత్రులు ఉన్నా తగిన పరికరాలు ఉండవు, ఆ పరికరాలు ఉన్నా వ్యాధులను సకాలంలో నిర్ధారించి గుణాత్మక రీతిలో చికిత్స చేసే నిపుణులైన వైద్య సిబ్బంది ఉండరు. ఇవన్నీ దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని పేరుగొప్ప వంటి ఆస్పత్రుల్లో నిత్యకృత్యాలే అవుతున్నాయి. ముందుగా వైద్య పరమైన లోపాలను తొలగించి చికిత్సను నెలచెరగులా అందుబాటులోకి తెచ్చినపుడే ఎలాంటి వ్యాధినైనా సకాలంలో అదుపు చేసి అది ప్రాణాంతకంగా పరిణమించకుండా నిరోధించేందుకు ఆస్కారం ఉంటుంది. లేని పక్షంలో సుప్రీంకోర్టు కదిలిస్తే తప్ప ప్రభుత్వాలు నిద్రమత్తును వదలని పరిస్థితే ఉంటుంది. ఒక పక్క భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలనే బృహత్తర లక్ష్యంతో పనిచేస్తున్న మోదీ సర్కార్ ఆ దిశగా మరింత కట్టుదిట్టంగా వ్యవహరించి వైద్య భారతానికి కంకణం కట్టుకోవాలి. వ్యాధి ముదిరి ప్రాణాంతకం కాకుండా సకాలంలో సరైన చికిత్సలను అందుబాటులోకి తేవడం ద్వారా అందుకు సర్వత్రా తగిన కేంద్రాలను నిపుణులైన సిబ్బందితో ఏర్పాటు చేయడం ద్వారా లక్ష్య సాధనకు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే జాతీయస్థాయిలో ఆరోగ్య విధానాన్ని తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ఈ దిశగా సరైన ప్రయత్నమే చేసింది , అయితే విధానపరమైన లోపాలను అమలు విషయంలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికపుడు బేరీజు వేసుకుని వాటిని తొలగించినపుడే ఈ జాతీయ ఆరోగ్యవిధానం సార్ధకమవుతుంది. ముఖ్యంగా వ్యర్థాల నిర్వహణ విషయంలో ఇప్పటికే జారీ అయిన మార్గదర్శకాలను త్రికరణ శుద్ధిగా అమలుచేయడమే డెంగ్యు, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రాణాంతకం కాకుండా నివారించడం సాధ్యమవుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలోనే డెంగ్యు, చికెన్‌గున్య కేసులు నమోదయ్యాయి. ఒక్క దేశ రాజధానిలోనే ఈ కేసులు నాలుగువేలకు పైచిలుకు ఉన్నాయి. ఈ వ్యాధులకు ప్రధానకారణంగా చెబుతున్న ఆండిస్ అనే దోమ ఈ వ్యర్థాల నుండే ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో ఈ వ్యర్థాలకు కొదవ లేదు, ఎక్కడ చెత్త అక్కడే అన్న సంస్కృతికి అలవాటు పడ్డ మనం స్వచ్ఛత నిబంధనలను అలవరుచుకోవాలంటే అందుకు ఎవరో ఒకరు బెత్తం పట్టుకుని నడిపించే వారు కావాలి, ఒక రకంగా చెప్పాలంటే ఒక పక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగా తాపత్రయ పడతామో, అది నాశనం అయ్యేందుకు లేని పోని వ్యాధులు పుట్టుకొచ్చి ప్రాణాల వరకూ వచ్చేందుకు మనమే కారణం అవుతున్నాం. స్వచ్ఛత అనేది స్వచ్ఛందంగా రావాలి, వ్యర్థాల నిర్వహణ, నిర్మూలన అనేది ప్రభుత్వాల బాధ్యతే అయినా అటువంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా పరిసరాలను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మన ఆరోగ్యానికి మనమే ధీమా అందించగలుగతాం. మీ ఆరోగ్యం మా ఆరోగ్యం కలిస్తేనే సమాజ ఆరోగ్యం అవుతుంది, అదే దేశ భాగ్యం అవుతుంది, అలాంటి భాగ్యాన్ని మనం కాలదన్నుకోకూడదు. పరిసరాలతో మొదలుపెట్టి సర్వత్రా వ్యర్థాలకు ఆస్కారం లేని స్వచ్ఛతను పాదుగొల్పుకోగలిగితేనే అంతిమంగా మన ఆరోగ్యానికి, దేశ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. డెంగ్యు, చికెన్‌గున్యాలే కాదు, ఏ రకమైన వ్యాధులకైనా అనేక రకాల కీటకాలే కారణమవుతాయి. వాటిని పెంచి పోషించేది శుభ్రత, పరిశుభ్రత పట్ల మన నిర్లక్ష్యమేననే వాస్తవాన్ని విస్మరించకూడదు.

-బి.రాజేంద్ర ప్రసాద్