సబ్ ఫీచర్

‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ బాటలో మావోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టు సిద్ధాంతానికి కాలం చెల్లిందని శాంతిని కాంక్షించే శ్రీశ్రీ రవిశంకర్ కొట్టి పారేశారు. ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, బిహార్ మావోయిస్టు ప్రాంతాల్లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని, యోగా శిబిరాల్ని ఆయన నిర్వహిస్తున్నారు. ప్రేమ, కరుణ, ఆధ్యాత్మికత ద్వారా మనసుల్ని గెలుచుకోవాలని సూచిస్తున్నారు. ఆ దిశగా కృషి చేస్తున్నారు. మావోయిస్టులతో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పలుసార్లు ఆయన ప్రకటించారు.
శ్రీశ్రీ రవిశంకర్ ప్రవచనాలతో, ధ్యాన శిబిరాలతో, స్వచ్ఛంద కార్యక్రమాలతో ప్రభావితమైన ఎందరో యువతీ యువకులు, మాజీ మావోలు హింసా మార్గాన్ని విడనాడి జనజీవన స్రవంతిలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల్లోని జైళ్లలో మగ్గుతున్న మావోయిస్టులతో ధ్యాన శిబిరాలు నిర్వహించి వారిలో పరివర్తన తీసుకు వస్తున్నారు. ఈ శిబిరాలు మంచి ఫలితాలనిస్తున్నాయని తెలుస్తోంది. ఝార్ఖండ్‌కు చెందిన మావోయిస్టు కమాండర్ సతీష్‌కుమార్ బుల్లెట్ మార్గం వీడి తాను బ్యాలెట్ మార్గం పట్టానని ప్రకటించారు.
మావోయిజానికి ఆకర్షితులై, హింసామార్గం అనుసరించి అనంతరం జరిగిన పొరపాట్లను గ్రహించి బయటకొచ్చిన వారు ఇలా అనేక మంది ఇప్పుడు శాంతియుత జీవనం గడుపుతున్నారు. కొందరు ‘ఝార్ఖండ్ వికాస్ పార్టీ’ని ప్రారంభించారు. వీరంతా శ్రీశ్రీ రవిశంకర్ మార్గ నిర్దేశనంలో ముందుకు కదులుతున్నారు. కులం, మతం, లింగ వివక్ష లేకుండా ప్రేమ, కరుణ, క్షమించే గుణం అలవరచుకుని వారు ముందుకు కదులుతున్నారు. ఇప్పుడు మావోయిస్టు ప్రభావిత జిల్లాల ప్రజలు ఎక్కువ మంది హింసనుగాక అభివృద్ధిని కోరుకుంటున్నారు. పేదరికం తొలగిపోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. విద్య-వికాసానికి పెద్దపీట వేస్తున్నారు.
ఈ రకమైన కార్యక్రమానికి, కొత్త దృష్టి కోణానికి ఆకర్షితులైన అనేకమంది మావోయిస్టులు ఆయుధాలు విసర్జించి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’తో కలసి కదం తొక్కుతున్నారు. అలాంటి వలంటీర్లు ఆయా జిల్లాల్లో పెద్దఎత్తున పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు విద్యాగంధం అందిస్తున్నారు. వివిధ నైపుణ్యాలను (స్కిల్స్ తెలుసుకుంటున్నారు. ఉపాధిని పొందుతున్నారు. విచిత్రమేమిటంటే శ్రీశ్రీ రవిశంకర్ ప్రభావం చివరకు రైతులపై కూడా అధికంగా కనిపిస్తోంది. చాలామంది రైతులు రసాయన ఎరువులు గాక సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తామని కృతనిశ్ఛయాన్ని వ్యక్తం చేశారు. గోవులను సాకుతామని ప్రకటించారు. వాస్తవానికి ఇదొక గొప్పవిప్లవం. ఈ మార్పును లక్షలాది మంది ఆదివాసులు ఆహ్వానిస్తున్నారు. విద్యుచ్ఛక్తి లేని మారుమూల ప్రాంతాల్లో సోలార్ లాంతర్ల ఈ సంస్థ ద్వారా పంపిణీ జరిగింది. ఇంకా జరుగుతోంది. పరిశుభ్రమైన తాగునీరు అందిస్తున్నారు. మద్యం, మత్తుపదార్థాల జోలికి వెళ్లకుండ వ్యక్తిగత ప్రవర్తనను గ్రామీణులు మార్చుకుంటున్నారు. పరిశుభ్రతపై అవగాహన పెంచుకుంటున్నారు.
‘‘ఎక్కడ సంఘర్షణ.. ఉద్రిక్త పరిస్థితులుంటే నేను అక్కడికి చేరుకుంటాను’’ అని శ్రీశ్రీ రవిశంకర్ పలుసార్లు ప్రకటించారు. అదే ఆయన సిద్ధాంతంగా రూపాంతరం చెందింది. ఆ మాట ప్రకారం ఆయన కొలంబియా, ఫిలిప్పీన్స్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. చివరికి ఈశాన్య భారతంలోనూ ఎన్నో శిబిరాలు నిర్వహించారు. అక్కడి తీవ్రవాదులతో నిరంతరం చర్చలు జరుపుతూ ఉన్నారు. శాంతిని బోధిస్తున్నారు. ప్రపంచ పరిస్థితులను వివరించడమే గాక, మానవజీవన పరమార్థం బోధించి శాంతిని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఉల్ఫా తీవ్రవాదులు, మణిపూర్ తీవ్రవాదులతో ఆయన లు దఫాలు చర్చలు జరిపారు.
ఇదే మిషన్‌పై మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఆయన పర్యటించారు. జైళ్లను సందర్శించారు. అక్కడ ధ్యాన శిబిరాలు నిర్వహించారు. భజనలు చేశారు. ప్రశాంత చిత్తం వల్ల ఒనగూడే ప్రయోజనాలు తెలియజేశారు. ఈ చర్యలన్నీ సత్ఫలితాలను ఇచ్చాయి. చాలామంది మావోయిస్టులు హింసామార్గాన్ని విడనాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారు. వారిలో పరివర్తన వస్తోందని తెలిపారు. బిహార్‌లో మావోయిస్టుల కోసం ఎన్నో ఆధ్యాత్మిక శిబిరాలను ఏర్పాటు చేశామని, గయ తదితర ప్రాంతాల్లో దారితప్పిన యువత తిరిగి ప్రధాన జనజీవన స్రవంతిలోకి వచ్చిందని వారు ఆదర్శవంతమైన జీవితాలను గడిపేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సహాయ సహకారాలు అందిస్తోందని రవిశంకర్ అంటున్నారు.
వేలాదిమంది ఆయుధాలు విసర్జించి సమాజం కోసం పనిచేసేందుకు మధ్య భారతంలో సిద్ధంగా ఉన్నారని, అలాంటి వారికి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని, ఇదంతా నిశ్శబ్దంగా కొనసాగుతోందని ఆయన చెబుతున్నారు. బస్తర్, బీజాపూర్‌లాంటి మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లోనూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంఘీభావంతో ఈ కార్యక్రమాలు వేగంగా విస్తరిస్తున్నాయి. శాంతి, సంస్కరణల కోసం వేలాదిమంది కార్యకర్తలు ఆదివాసీల మధ్య పనిచేస్తున్నారు. దేశ అభివృద్ధికి హింస ఉపయుక్తం కాదని, తాను మావోయిస్టు ఏరియా కమాండర్లతో చర్చలు జరిపానని బుల్లెట్ వదిలి బ్యాలెట్ వైపు వచ్చేందుకు సిద్ధమయ్యారని, పాలకులు అలాంటి వారితో చర్చలు జరపాలని ఆయన అంటున్నారు.
మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో హింసాత్మక వాతావరణం కారణంగా ఎవరు ఎలాంటి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని, కనీసం విద్యారంగంలోనూ పెట్టుబడి పెట్టడానికి ఎవరూ రావడం లేదని, అందుకే అక్కడి పరిస్థితుల్లో మార్పు తేవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆయన చెబుతున్నారు. తాము ఆయా ప్రాంతాల్లో వంద పాఠశాలలను పిల్లల కోసం నిర్వహిస్తున్నామని, మరిన్ని పాఠశాలలు, కళాశాలలు రావలసిన అవసరం ఉందని, ప్రశాంత పరిస్థితులు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని రవిశంకర్ అంటున్నారు.
ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై తమకు నమ్మకం లేదని మావోయిస్టులు చెబుతున్నారని, అయితే దానికి హింస పరిష్కారమార్గం అవదని దీన్ని చాలామంది మావోయిస్టులు గుర్తించారని, మావోయిస్టు నాయకుల్లో ఈ భావన క్రమంగా బలపడుతోందని ఆయన చెబుతున్నారు. మనుషులు మారుతారు. వాళ్లు బండరాళ్లు కాదు కదా? వాళ్లలో తప్పక పరివర్తన వస్తుంది, ఆధ్యాత్మికత, ధ్యానం, సత్‌సంగం లాంటి కార్యక్రమాలు వారిలో మానసిక పరివర్తన తీసుకు రావచ్చని, ఆ పనిలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ విశేషంగా కృషి చేస్తోందని ఆయన చెబుతున్నారు. అనేక ఆదివాసీ గ్రామాలను తమ సంస్థ దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతోందని, అలాంటి గ్రామాల్లో మద్యం, మత్తు పదార్థాలు, సిగరెట్ల సేవనం లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. మహారాష్టల్రోని కాట్వడి గ్రామంలో దుకాణదారు లేకున్నా దుకాణంలోని వస్తువులను తీసుకుని దాని ధరను అక్కడున్న పెట్టెలో ప్రజలు వేసి వెళతారు. ఆ గ్రామంలోని ఇళ్లకు తాళాలు వేయకుండానే ప్రజలు తమతమ పనులపై వెళతారు. ఆ గ్రామంలో ఎవరూ మద్యం ముట్టరు. సిగరెట్ కాల్చరు, ఎలాంటి తప్పుడు పనులు చేయరు. ఇదంతా ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ రూపొందించిన యూత్ లీడర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం (వైఎల్‌టిపి) కింద గ్రామ యువతీయువకులు శిక్షణ పొంది తమ గ్రామాన్ని ఈ విధంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు. ఈ రకమైన వాతావరణాన్ని, నిజాయితీని, ఆదర్శాన్ని ఊహించని చోట ఆ కార్యకర్తలు నిజం చేసి చూపించారు. ఇలాటి వైఎల్‌టిపి కార్యక్రమాలు పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఈ రకమైన ఆదర్శ గ్రామాలు ఆవిర్భవిస్తున్నాయి.
వాస్తవానికి ఈ రకమైన మేలైన (దోపిడీలేని) గ్రామాలు వెలయాలనే కదా మావోయిస్టుల ప్రాథమిక భావన. దాన్ని శాంతియుత పద్ధతిలో, ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక పద్ధతిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ రూపొందిస్తోంది. అందుకు వారిని అభినందించాలి కదా?..

-వుప్పల నరసింహం 9985781799