సబ్ ఫీచర్

ఐలయ్యగారి అతి ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు 140 సంవత్సరాల కిందట ప్రపంచ మత మహాసభ ముగింపు సందేశంలో స్వామి వివేకానంద ఇట్లా ఉద్బోధించాడు సర్వమానవాళిని. ‘సహాయం కావాలి, విరోధం వద్దు, సౌజన్యంతో మెలగాలి, వినాశం కోరవద్దు, శాంతి సామరస్యం పెరగాలి, వైషమ్యం తొలగాలి’ అని. స్వామి వివేకానంద కావి బట్టలు ధరించేవాడు కాబట్టి ఐలయ్యగారికి ఎర్ర వస్త్రం చూచి ఎద్దు బెదిరినట్లు వివేకానంద రచనలు అంగీకారం కావేమో! బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయ సమాజంలో కోరుకున్న మార్పులు, ఆశించిన సంస్కరణలు, పడిన ఆవేదనలు సుమారు నాలుగు దశాబ్దాల ముందే వివేకానంద వెల్లడించాడు.
మనకిప్పుడు స్వామి వివేకానందతో ప్రసక్తి లేదు. ఐలయ్యగారు రచించిన ‘‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’’ అనే రచన గూర్చే సమీక్షించుకోవాలి. ‘స్మగ్లర్లు’ అంటే నిఘంటువుల ప్రామాణిక అర్థం మోసపూరితంగా దొంగ రవాణాకు పాల్పడేవాళ్లు. పన్నులను ఎగగొట్టే వాళ్లు అని కదా! కోమట్లు అందరూ ‘స్మగ్లర్లు’ ఎట్లా అవుతారు! దాని మంచిచెడ్డలు అట్లా ఉంచి భారతీయ వర్ణాశ్రమ కట్టడిని అనుసరించి వైశ్యవర్గంవారి విద్యుక్త ధర్మం పశుపోషణ, వాణిజ్యం, ఇవి రెండూ లేకుండా ఏ సమాజమైనా మనుగడ సాగించగలదా? సుదీర్ఘమైన చర్చ అక్కరలేదు. ఇప్పుడు సందర్భం కాదు, సమయం కూడా చాలదు. జనుల గుణకర్మలనుబట్టి వేదకాలంలోనూ, పురాణకాలంలోనూ వృత్తులు మారినప్పుడు వారి వర్ణం మారేదనీ, అట్లా మార్చుకొనే వెసులుబాటు ఉండేదనీ పురాణాలలో ఉంది. భాగవతం తొమ్మిదో స్కంధంలో కొందరు బ్రాహ్మణ వంశాలవారు క్షత్రియులుగా, వైశ్యులుగా మారిపోయినట్లు కథనాలున్నాయి. దాఖలాలున్నాయి. పంచమకులం అంటూ లేనేలేదని మనువు చెప్పినట్లు భారతీయ పురా విజ్ఞానులు చెప్పారు. శ్రీ బోయి భీమన్నగారి గ్రంథాలు చదివితే ఈ విషయం మరింత స్పష్టంగా అవగతమవుతుంది. చదవండి. (్భమన్నగారు బొజ్జా తారకంగారి మామగారే)
వాణిజ్యం ద్వారా భారతీయ సంస్కృతిని, విజ్ఞానాన్ని, కళలను, శిల్ప విద్యను, దేవాలయ వ్యవస్థను ప్రపంచ దేశాలలో విస్తరింపజేసిన వారు వైశ్యులే. ముఖ్యంగా ఆసియా ఖండంలో అనేక దేశాలలో భారతీయ ధర్మాన్ని, కళలను, వారసత్వాన్ని నెలకొల్పిన వారు వైశ్యులే. అమానవీయమైన, క్రూరమైన, అసంబద్ధమైన, అహేతుకమైన గాథలు ఆయా పురాణ కథలలో జొప్పించినవారు- ఇవి స్పష్టంగా ప్రక్షిప్తాలు- కోమట్లుకారుకదా! వారిపట్ల ఈ ద్వేషం, ఆక్రోశం, సమర్థనీయం కావు. ఇప్పుడు శాసనకర్తలు, ప్రజాప్రతినిధులు తమ ఆధిక్య అహంకారం కోసం రాజ్యాంగాన్ని వాడుకుంటున్నట్లు అప్పుడు కూడా కొందరు పండితులు, ముఖ్యంగా అగ్రవర్ణ ఛాందసులు మన పురాణాలలో ప్రక్షిప్తాలు చేర్చి ఉండవచ్చు. ఇట్లా భారత, రామాయణాలు ఎంతో ఎంతో పెరిగిపోయినట్లు, పురాణాలు మారిపోయినట్లు పురాచరిత్ర తెలిసినవారు చెబుతున్నారు. ఇది ఇక్కడ చర్చనీయాంశం కాదు.
‘కోమట్లు స్మగ్లర్లు’ అని సాముదాయికంగా, సామూహికంగా దూషించటం అభ్యంతరకరమూ, ఆక్షేపణీయము మాత్రమేకాక ఆక్రోశపూరితం కూడాను. పల్లెటూళ్లలో చిన్న దుకాణాలు నిర్వహించుకుంటూ పాతపేపర్లు చించి పొట్లాలు కట్టి అమ్మి జీవించేవారని కోమట్లను నిందించడం, గేలిచేయడం అవివేకానికి, అసభ్యతకు, అహంభావానికి పరాకాష్ఠ అనడంలో సందేహమేమైనా ఉందా? శ్రీ రామకృష్ణ పరమహంస ఒక నీతి కథ చెప్పారు. ఒక బలసిన గోదురుకప్ప తన కలుగులో కొంత ఆహార సామగ్రిని నిలువ చేసుకుని విర్రవీగుతూంటుంది. యాదృచ్ఛికంగా ఒక ఎద్దు ఆ దారిని పోతూ కప్ప కలుగును దాటివేసే అడుగు వేస్తుండగా మహా తామసంతో కప్ప కలుగులోంచి బయటకు వచ్చి తన ముందు కాళ్లతో ఎద్దును తన్నబోయిందట. చూశారా? అల్పుడి అహంకారం అట్లా ఉంటుంది అన్నారు పరమహంస. ఈ విషయాలనట్లా ఉంచి సమకాలికంగాను, కొన్ని వందల ఏళ్ల పూర్వమూ వైశ్యులు భారతీయ సమాజంలో ఎంత పరువు ప్రతిష్ఠలతో, పెద్దరికంతో, ఔదార్యంతో, దానగుణ సంపన్నతతో, సమాజాన్ని ప్రభావితం చేశారో తెలుసుకుంటే ఇటువంటి అవాచ్యపు రాతలెవ్వరూ రాయరు.
కవిసార్వభౌముడైన శ్రీనాథుణ్ణి ఆదరించి ఆయనను గొప్ప సంపన్నుణ్ణి చేసిన అవచిదేవ తిప్పయ్యశెట్టి వైశ్యుడే. బసవ పురాణంలోను, హరవిలాసంలోనూ తన శివభక్తి ద్వారా లోకప్రసిద్ధుడైన సిరియాళ శెట్టి వైశ్యుడే. ఇక ప్రస్తుత కాలానికి వస్తే కందుకూరి వీరేశలింగం, కొల్లాగురు సామిశెట్టికి తన తొలి రచనలు అంకితం చేసిన వైనం కం.వీ. స్వీయచరిత్రలో ఉంది. శ్రీరంగనాథుడి దేవాలయ ధ్వజస్తంభంపై పెరుమాళ్ల చెట్టి పేరు తెలుగులో ఉంది. అత్యద్భుతమైన కాళహస్తి దేవాలయాన్ని పునరుద్ధరించినవారు నాటు కోటు చెట్టియార్లు. మరి దేవాలయ సంస్కృతిని వైశ్యులు తమ దానధర్మతత్పరత చేత ఎంతగానో పోషించారు. ప్రవర్థిల్లచేశారు. అది మీకు ఇంపుగా తోచకపోతే దూరంగా మెలగండి. ఈస్టిండియా కంపెనీ వారికన్నా ముందు మన తెలుగు ప్రాంతాన్ని (తీరాంధ్రాన్ని) ఫ్రెంచి వారు పాలించారు కదా. గుంటూరు ఇలాకా ఫ్రెంచి సైన్యాధ్యక్షుడు కౌంట్ డిలాల్ కార్యాలోచన సభలో గురవచెట్టి సభ్యుడు.
మరీ ఇటీవల కాలానికి వస్తే మామిడి వెంకయ్య తొలి తెలుగు నిఘంటు నిర్మాత. ఎఫ్‌డబ్ల్యుఎల్లిస్, విలియం బ్రౌన్, ఎ.డి.కేంప్‌బెల్ వంటి యూరోపియన్‌లకు వెంకయ్య గురుత్వం వహించినట్లు ఇంటర్నెట్ గూగుల్ (వికీపీడియా)ను సంప్రదిస్తే తెలుసుకోవచ్చు. ఆంధ్రదీపిక అనే తొలి తెలుగు నిఘంటువు సి.పి.బ్రౌన్‌ను ప్రభావితం చేసింది. శివాజీని హిందూ ధర్మపథీనుణ్ణి చేసిన సమర్థ రామదాసు వైశ్యుడే. వీరేశలింగం సమకాలికుడైన ఆత్మూరి లక్ష్మీనరసింహం, యజ్ఞం చేసి సోమయాజి అయినాడు. ఆయన యజ్ఞం చేసిన ప్రదేశం ఆ తరువాత రాజమండ్రిలో ఆర్యాపురం అయింది. బ్రాహ్మణులతో స్పర్థలు, పంతాలు కలిగి కిందటి శతాబ్దంలో చాలామంది వైశ్యులు వేద విద్యలు, శ్రుతిస్మృతులు పరిశోధించారు. ఆచార్య బి.రామరాజుగారు గ్రంథించిన ‘ఆంధ్రయోగు’లనే ఏడు సంపుటాలలో ఆధ్యాత్మిక విదులు, యోగులు, పరివ్రాజకులు అయిన వైశ్య కులం వారు కొందరు కనపడతారు. వైశ్య కులం నుంచి ఆత్మూరి లక్ష్మీనరసింహం ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మన్ భాషలు బాగా తెలిసిన వాడని ఆర్యవైశ్య సంస్థలలో ఆయన బృహత్ప్రమాణ వర్ణ చిత్రపటంకింద నమోదై ఉన్నది. ధాత కరువుతోనో, బహుధాన్య క్షామంతోనో ఆంధ్ర దేశంలో (డొక్కల కరువు-అంటే పొట్టలు లోతుగా వీపునకు అంటుకొనిపోవడం) రాజమహేంద్రవరం గోదావరి ఒడ్డున మైళ్ల పర్యంతం పందిళ్లు వేసి అన్నదానం చేసినందువల్లనే ‘పందిరి’ అనే ఇంటిపేరు తమ కుటుంబానికి అన్వర్థమైందని పందిరి మల్లికార్జునరావుగారు (వీరు సుభాషి, కినె్నర పత్రికలు కొన్ని ఏళ్లపాటు నిర్వహించారు. కె.రామలక్ష్మి వీరి జీవిత చరిత్ర రాసింది.) వీరి కుమారుడు కృష్ణమోహన రావు కాలిఫోర్నియా (అమెరికా అని చెప్పాలా?) విశ్వవిద్యాలయంలో తత్త్వ శాస్త్రాచార్యులుగా భారతీయ వేదాంతాన్ని, తత్త్వ చింతనను బోధించారు. మఠం బాలసుబ్రహ్మణ్యగుప్త అజ్ఞాతవాసంలో ఉండి విప్లవ కార్యక్రమాలను నడిపారని అయ్యదేవర కాళేశ్వరరావుగారి స్వీయచరిత్రలో ఉన్నది కదా!
ఆంధ్ర దేశంలో, తెలంగాణలో ఎన్నో విద్యాసంస్థలను, గ్రంథాలయాలను నెలకొల్పిన వారు వైశ్యులే. భారతదేశంలోనే అటువంటి గొప్ప నిర్వహణ సామర్థ్యంతో అలరారే గ్రంథాలయం లేదని ఘంటాపథంగా చెప్పడానికి అర్హమైన వేటపాలెం సారస్వత నికేతనం స్థాపించి, ఇప్పటివరకు గొప్పగా నడుపుతున్న వదాన్యుడు, ఉత్తమ సంస్కృతీపరుడు ఊటుకూరి సుబ్బరాయశ్రేష్ఠి ఎవరనుకున్నారు? ఆయన వైశ్యుడే. ఈ గ్రంథాలయం సారస్వత నికేతనమేకాదు, స్వాతంత్య్రోద్యమ జయకేతనం అని ఒక యువ రచయిత ఆంధ్రప్రభలో వర్ణించాడు. వైశ్యులలో బారిస్టరులున్నారు. గొప్ప విద్యావేత్తలున్నారు.
కాళహస్తిలో శుకబ్రహ్మాశ్రమాన్ని నిర్మించి, గీతామకరందమనే భగవద్గీత వ్యాఖ్యను రచించి తెలుగునాడును అపూర్వంగా ప్రభావితం చేసిన శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామిని గూర్చి ఐలయ్యగారు అసలు విని ఉండరు. ఆయన భగవద్గీత సర్వంకష వ్యాఖ్యాన ప్రతులు రమారమి ఒక కోటిదాకా అమ్మకం అయి ఉంటాయి. ఈ మహానుభావులు మహిళా కళాశాల, వృత్తివిద్యా శిక్షణశాల, ఉచిత భోజనశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలు నెలకొల్పి సమాజసేవ చేసినవారు. వీరి తండ్రి తూగుగుంట్ల భగవంతం గుప్తగారు గొప్ప ఆధ్యాత్మిక సంపన్నుడు. బారిష్టరు కూడాను అని ఎక్కడో చదివిన జ్ఞాపకం.
ఇక అత్యంతాద్భుతమైన విషయం దరిశి చెంచయ్యగారి పేరు ఐలయ్యగారు ఎప్పుడైనా విన్నారా? ప్రకాశం జిల్లా మారుమూల కుగ్రామమైన దరిశి నుంచి అమెరికా బర్కిలీ విశ్వవిద్యాలయానికి వెళ్లి వ్యవసాయ శాస్త్రంలో అధ్యయన పరిశోధనలు ఆశించిన గొప్ప సామాజిక విప్లవవాది, సంఘ సంస్కర్త దరిశి చెంచయ్యగారు. ఆయన రచించిన ‘నేను-నాదేశం’ అనే ఆత్మకథ చదివితే ఆయన ‘గదర్’ పార్టీలో చేరి చైనాకూ వెళ్లి గున్‌యెట్ సేనునుకూడా కలుసుకున్న సంగతి తెలుస్తుంది. లాలాహరదయాళ్, జితేంద్రనాథ లాహిరీ, భాయి హరినామ్‌చంద్, మొదలైన గదర్ విప్లవ వీరుల దళ సభ్యుడు చెంచయ్యగారు. ఆసియా దేశాలన్నీ భారతదేశ సాయుధ పోరాటం విజయం సాధించాలని పర్యటించిన వాడు చెంచయ్యగారు.
ఇవన్నీ అట్లా ఉంచినా భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో లాలాలజపతిరాయ్ వారసత్వ స్థానం నిరుపమానం. సర్దార్ భగత్‌సింగ్, చంద్రశేఖర అజాద్, రాజ్‌గురులు, లజపతిరాయ్ వల్ల ప్రభావితులైనవారే. 1928 సైమన్ కమిషన్ భారతదేశ పర్యటనలో లాలాజీ లాహోర్‌లో నిరసన ప్రకటించినందువల్ల బ్రిటిషు పోలీసు రాక్షసులు ఆయన ఎముకలు శిథిలమయ్యేట్లు బాదగా ఆ తరువాత 15 రోజులలో నిర్యాణం చెందారు లజపతిరాయ్. లాల్-బాల్-పాల్ త్రయంలో ఈయన పేరే మొదటిది. పంజాబ్ సింహం లజపతిరాయ్. బర్మా మాండలే జైలులో ప్రవాస శిక్ష అనుభవించినవాడు లజపతిరాయ్. వీరి గూర్చి చిలకమర్తి స్వీయచరిత్రలో అద్భుతమైన పద్యాలున్నాయి. లాలాలజపతిరాయ్ వైశ్యకులం వాడే.
ఇక మహాత్మాగాంధీ గారి గూర్చి కూడా ఐలయ్య గారు తమ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రచనలో దళితుల దుస్సహ అణచివేతను గూర్చి వాపోయారు. దళితులు వాణిజ్య వ్యాపార సంస్థలను నిర్వహిస్తూ ఎందరికో ఉపాధి కలిగిస్తున్న విషయం వీరు చదవలేదేమో! చదివినా బుకాయింపేమో! వైశ్యులు స్వాతంత్య్రోద్యమ కాలంలో, స్వాతంత్య్రానంతర దేశపు పునర్నిర్మాణంలో నిర్వహించిన పాత్ర ఒక గ్రంథమే రాస్తే తప్ప పూర్తికాదు.
మరీ ఇటీవల శ్రీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తిగారనే వదాన్యుడు గుంటూరులో శ్రీ బొమ్మిడాల ట్రస్టును నెలకొల్పి గ్రామ నిర్మాణ వికాసం, జర్నలిజం, విద్యావ్యాప్తి, గ్రంథాలయ పోషణ, సారస్వత పునరుత్తేజం నిమిత్తంగా, స్వాతంత్య్ర యోధుల సమాదరణ రూపంగా సాలుకు ఒక కోటి రూపాయలు వెచ్చిస్తున్న సంగతి ఐలయ్య మహాశయులకు తెలిసి ఉండకపోవచ్చు. శ్రీ బొమ్మిడాల వారు తమ సాహిత్య ప్రతిభాసమర్చన గణపతి పూజను ఒక దళితుణ్ణి సమ్మానించడంతోనే శ్రీకారం చుట్టారు. సాలుసాలునా రెండు లక్షలతో ఈ సత్కారద్రవ్యం ఇవ్వడం ప్రారంభించి ఇప్పుడు మూడు లక్షలో, నాలుగు లక్షలో ఇస్తున్నారు. విద్యాభివృద్ధి, చారిత్రక పరిశోధన, సాహిత్యార్చన వీరి ప్రధానాశయాలు. ఇప్పటికి పదులకొద్దీ పుస్తకాలు, విశేష సమ్మాన సంచికలు ప్రచురించారు. వైశ్యులు ముఖ్యమంత్రులుగా, గవర్నరులుగా, గొప్ప రాజనీతిజ్ఞులుగా రాణించిన విషయం ఐలయ్య మహాశయుడు ఎరుగడా? వారు ఎన్నో విద్యాసంస్థలను పోషిస్తున్న విషయం ఐలయ్య మహాభాగులకు తెలియకపోవచ్చును. పెను నిద్ర నటించేవారిని జాగ్రదావస్థకు ఎవరు తేగలరు? ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఐలయ్యగారు తనను గుడ్‌షెప్పర్డ్‌గా అభివర్ణించుకున్నారు. క్రైస్తవ మతం దురాగతాలను గూర్చి చెప్పడం సముద్రాన్ని ఈదడం వంటిది. క్రూసేడ్స్ పేరుతో మూడు శతాబ్దాల పాటు క్రైస్తవులు ఒకరిని ఒకరు చంపుకున్నారు. ఊయలలో పసిపాపలను కూడా విడిచిపెట్టలేదు. ‘మాచీడిక్’ అనే ప్రపంచ సారస్వత విశిష్ట గ్రంథం (నవల)లో నరమాంస భక్షకులకన్నా దుష్టులు తాగుబోతులైన క్రైస్తవులు అని ఉంది. ప్రపంచంలో క్రైస్తవులంత (అందరూ కాదు) క్రూర స్వభావులు ఎక్కడా ఉండరని మాంటేగన్ ఫ్రెంచ్ తత్వదార్శనికుడు (ఈయన షేక్స్పియర్‌కన్నా పూర్వుడు) నిర్ధారించాడు. వారు పట్టిన పగతో పోల్చదగిన శత్రుత్వం మరెక్కడా కనపడదు అన్నారు మాంటేగన్. క్రైస్తవులలో కూడా బ్రాహ్మలున్నారని ఉన్నవవారి మాలపల్లి చెబుతున్నది. (పొగడ్తో తెగడ్తో చెప్పలేము)

-డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు