సబ్ ఫీచర్

ఆత్మస్తుతి, పరనిందలకే పరిమితమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తీరు, ఆయా పార్టీల ధోరణి చూసిన వారికెవరికైనా కలిగే భావనే ఇది. కోట్ల రూపాయల ప్రజాధనంతో నడిచే శాసనసభలు సమస్యల పరిష్కారానికి కాకుండా, అధికార, ప్రతిపక్షాల మధ్య ఆధిపత్యపోరుకు వేదిక కావడం విచారకరం. రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పాలనాపగ్గాలు చేపట్టి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇన్నాళ్లూ తాము చేసిందేమిటో చెప్పకుండా అధికార పార్టీలు గత పాలకులపైనే నిందలు వేయడంతో తామేమీ చేయలేదని చెప్పకనే చెప్పినట్టయింది. అధికార పార్టీలు ప్రతిపక్షాలను అణచివేయడానికి యత్నించడం, దాన్ని తిప్పికొట్టేందుకు విపక్షాలు ప్రతిఘటించడమే తప్ప, ‘సభాపర్వం’లో ప్రజాస్వామ్య పోకడలు కనిపించడం లేదన్న సామాన్యుడి వాదనను కాదనలేం.
తెలంగాణలో శత్రుపక్షాల్లోనూ ‘మిత్రులు’న్న అధికార పార్టీ- టిడిపిలో మిగిలిపోయిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలను చూసి ఎందుకు భయపడుతుందో ఎవరికీ అర్థం కాదు. రేవంత్‌రెడ్డిని అకారణంగా లక్ష్యం చేసుకుని, సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేయడం వల్ల వ్యక్తిగతంగా ఆయనకొచ్చిన నష్టమేమీ లేకపోగా, పాలకపక్షమే రేవంత్‌కు బోలెడంత ప్రచారం, సానుభూతి పోగు చేసిపెట్టినట్టయింది. తెలంగాణలో శాసనసభ సమావేశాలు ఎప్పుడు మొదలైనా, రేవంత్‌ను సస్పెండ్ చేయడం ఖాయమన్న భావన జనంలో ముందే ఏర్పడుతోందంటే ఆ విషయం లో ప్రభుత్వం గెలిచిందా? రేవంత్ గెలిచారా? అన్నది సులభంగానే అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్‌ను ‘రవంత’రెడ్డి అని వ్యం గ్యంగా సంబోధించినప్పటికీ, ఇప్పుడు ఆయన తెలంగాణలో ‘కొండంత’రెడ్డి అయ్యారన్నది విస్మరించకూడదు.
తెలంగాణలో బలహీనమైన ప్రతిపక్షాలు ఏమీ చేయలేకపోవడం వల్ల కెసిఆర్ ప్రభుత్వం బలంగా ఉందన్న భా వన నాటుకుపోయింది. సర్కారును నిలదీయాల్సిన కాంగ్రెస్ పార్టీ ‘కాబోయే సీఎం ఎవరన్న చచ్చు పుచ్చు ఇచ్చకాల’తో నిరంతరం ‘సెల్ఫ్‌గోల్’ చేసుకుని, తనకు వేరే ప్రత్యర్థులెవరూ అవసరం లేదని మళ్లీ రుజువుచేసుకుంది. ప్రతిపక్షాల గొంతు పెగలకుండా చేసి, తాను చెప్పాల్సింది చెప్పడంలో కేసీఆర్ సర్కారు విజయం సాధించింది.
ఏపీలో కూడా దాదాపు అలాంటి పరిస్థితే కనిపించినా విపక్షం గొంతు పెద్దది కావడంతో అణచివేతతోపాటు, ప్ర తిఘటనా దర్శనమిచ్చింది. టీవీలలో ప్రత్యక్ష ప్రసారాలు చూసే వీక్షకులు, తెలంగాణ కంటే ఏపీ అసెంబ్లీ వైపే ఎక్కువ మక్కువ చూపారంటే ఏపి సభ ‘ఎంత బాగా జరిగిందో’ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు , ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మధ్య వ్యక్తిగత విమర్శల నేపథ్యంలోనే సమావేశాలు కొనసాగాయి. తెలంగాణలో సభానాయకుడు, ప్రధాన ప్రతిపక్షనేత ‘మీరు’ ‘గౌరవనీయులైన’ ‘పెద్దలు’ వంటి గౌరవప్రదమైన పదాలు వినిపిస్తే.. ఏపీలో మా త్రం ‘జగన్మోహన్‌రెడ్డి’ ‘నువ్వు’, ‘చంద్రబాబు నాయుడు’ ‘ఉగ్రవాది’ ‘మరణమా? శరణమా ఏదో ఒకటి తేల్చుకోండి’ వంటి మాటలతో, సవాళ్లతో సభ సాగిన తీరు ప్రజాస్వామ్య ప్రియులను ఏవిధంగా మెప్పిస్తుందో ఆ రెండు పార్టీలే చెప్పాలి.
ఈసారి మునె్నన్నడూ లేని కొత్త సంప్రదాయాలు ఏపి అసెంబ్లీలో దర్శనమివ్వడం మరో ఆశ్చర్యం. ఉమ్మడి రా ష్ట్రంలో సమావేశాలు జరిగినపుడు, ఎప్పుడూ బయట జరిగిన విషయాలను సభలో వీడియోల ద్వారా ప్రదర్శించిన దాఖలాలు ఎరుగం. సరే.. అది స్పీకర్ విచక్షణాధికారం కా బట్టి ఎవరూ దానిని ప్రశ్నించజాలరు. జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాల సందర్భంగా స్పీకర్ కోడెలతో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో, మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. ఆ తర్వాత ఆయన తనను కలిసిన మహిళా సంఘాల ప్రతినిధుల వద్ద విచారం వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే, దానిని మళ్లీ సభలో వీడియో ప్రదర్శన చేయడం వల్ల స్పీకర్ తాను అనని మాటలు అన్నట్లు జగన్ మీడియా సృష్టించిందనేది నిర్ధారణ అయినప్పటికీ, మర్చిపోయిన అంశాన్ని, చాలామందికి తెలియని అం శాన్ని ప్రజలకు మరోసారి గుర్తుచేసినట్టయింది.
ఇక్కడ ఇంకో విషయం కూడా సాంకేతికంగా విమర్శలకు గురవుతుంది. మీట్ ది ప్రెస్ జరిగింది విజయవాడలో. దానికి సభతో సంబంధం లేదు. సభ బయట జరిగిన అంశాన్ని వీడియో ద్వారా ప్రదర్శించినప్పుడు, అదే బయట జరిగిన అనేక అంశాలను ఎందుకు ప్రదర్శించరన్న ప్రతిపక్ష డిమాండును తోసిపుచ్చేందుకు కారణాలు కనిపించవు. వేటిని అనుమతించాలి? వేటిని తిరస్కరించాలి? అన్నది స్పీకర్ విచక్షణ కాబట్టి ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించలేం. కాకపోతే నైతిక విలువలు, సంప్రదాయాల ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రశ్నలు తెరపైకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు.
సోషల్ మీడియాలో వచ్చిన సందేశాలను సభలో చదవడం, వాటిని అనుమతించిన కొత్త పోకడ కూడా ఈ సభలోనే దర్శనమిచ్చింది. టెన్త్ పేపర్ లీకేజీపై చర్చ సందర్భంగా- జగన్ చదువుకు సంబంధించిన అం శం ప్రస్తావనకు వచ్చినప్పుడు మంత్రి గంటా శ్రీనివాస్ తనకు బయట నుంచి వచ్చిన సందేశాన్ని సభలో చదవి వినిపించడం, దాన్ని స్పీకర్ కూడా అనుమతించడం కొత్తగా చూస్తున్నదే. సోషల్ మీడియాలో రోజూ అనేకానేక చర్చలు, విమర్శలు, ఆరోపణలు, గాసిప్స్ సర్క్యులేట్ అవుతుంటాయి. అసలు సోషల్ మీడియా అంటేనే తల్లీతండ్రీ ఎవరో తెలియని అనాథ లాంటిదన్న వ్యాఖ్యలున్నాయి. అలాంటి వాటిని ప్రాతిపదికగా చేసుకుని, సభలో ఏవిధంగా చదువుతారన్నది ప్రశ్న. ఇక్కడో విషయం ప్రస్తావించుకోక తప్పదు. తెలుగుదేశం, వైసీపీ సోషల్ మీడియాలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేసుకున్నాయి. ఈ విషయంలో తెదేపాతో పోలిస్తే వైకాపా యంత్రాంగమే బలంగా ఉంది. దానికి విదేశాల నుంచి కూడా బలమైన అనుచరుల మద్దతు ఉంది. మరి వైకాపా కూడా తమకు వచ్చిన సందేశాలను సభలో వినిపిస్తే, దానినీ స్పీకర్ అనుమతించాల్సి ఉంటుంది. ఎందుకంటే సభలో జరిగే ప్రతి ఒక్కటీ రికార్డవుతుంటాయి. రేపు ఇదే సంప్రదాయం పక్కనే ఉన్న తెలంగాణ సభలోనూ మొదలుకావచ్చు! సహజంగా సభ జరుగుతున్న సమయంలో సీఎం, స్పీకర్, ప్రధాన ప్రతిపక్ష నేత వంటి అతికొద్ది మంది ప్రముఖుల సెక్యూరిటీని మాత్రమే లోపలకు అనుమతిస్తుంటారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గన్‌మెన్లను లోపలికి అనుమతించరు. కానీ ఈసారి ఇంకా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కాని వారి గన్‌మెన్లను కూడా అనుమతించిన కొత్త సంప్రదాయానికి నవ్యాంధ్ర అసెంబ్లీ వేదికైంది. అప్పటికింకా ఎమ్మెల్సీ కాని లోకేష్‌తో వచ్చిన గన్‌మెన్లను అనుమతించిన దృశ్యాలు సభా సంప్రదాయాలు ఎటు వెళ్తున్నాయి? ఎవరి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి? ఏ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి? అన్న సందేహాలకు తావిచ్చింది. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సభా సంప్రదాయాలు, నిబంధనలు అమలుచేయాల్సిన బాధ్యత మాత్రం విస్మరించలేరు కదా?!
* * *
నవ్యాంధ్రలో ప్రజాప్రతినిధుల పట్టపగ్గాల్లేని బరితెగింపు ధోరణి పాలకుల పుట్టిముంచేదే. రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంపై టిడిపికి చెందిన ప్రజాప్రతినిధులు కాలుదువ్వి, ఆయన అంగరక్షకుడిపై చేయి చేసుకున్న దౌర్జన్యకర దృశ్యాలను తెలుగు రాష్ట్రాలు చూసి తరించాయి. దానివల్ల ప్రతిపక్షానికి మైలేజీ పెరిగిందా? లేదా? అన్నది పక్కకుపెడితే.. జనంలో కష్టపడి పెంచుకుంటున్న బాబు ఇమేజీకి మాత్రం కచ్చితంగా డామేజీనే. ఏపీలో మనుషులను, కులాన్నీ వారి దైనందిక జీవితాల నుంచి దూరం చేయలేం. అధికారులపై గానీ, మరొకరిపై గానీ దాడి చేసిన వ్యక్తుల కులాలు, దాడికి గురైన వారి కులమేమిటన్న చర్చ ముందుగా తెరపైకొస్తుంటుంది. ఆ తర్వాత రాజకీయాలన్నీ దాని చుట్టూనే తిరుగుతుంటాయి. ఇది ఇప్పుడు కొత్తగా మొదలైనదేమీ కాదు. ఇక్కడ దాడిలో అవమానానికి గురైన వ్యక్తి కంటే, ఆయనపై దాష్టీకం చేసిన ప్రజాప్రతినిధుల కులమే అందరి లక్ష్యానికి, విమర్శలకు గురవుతోంది. ఫలితంగా నవ్యాంధ్రలో ఆ కులం హవా వల్ల, దానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న అధికార పార్టీ అకారణంగా, తనకు తెలియకుండానే జనక్షేత్రంలో బలయ్యే ప్రమాదం లేకపోలేదు. అది మిగిలిన సామాజికవర్గాలను అధికారపార్టీని దూరం చేస్తుందన్న వాదన అక్షరసత్యం.
ఇప్పటికే సర్కారు చుట్టూ అది ప్రోత్సహిస్తున్న వ్యక్తులు, సంస్థలు, సంఘాలను చూసి ఒక అంచనాకు వస్తున్న పరిస్థితికి తెరదించాల్సిన అవసరం ఉంది. మాంసం తింటున్నామని ఎముకలను మెళ్లో వేసుకోవడం తెలివైనపని కాదు కదా?
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144