కడప

గణతంత్ర వేడుకలకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 22: 67వ గణతంత్ర వేడుకల సందర్భంగా జిల్లాలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ తెలిపారు. ఢిల్లీలో అనుమానిత ఉగ్రవాదులను ఇంటెలిజన్స్ అధికారులు అరెస్టు చేయడంతో దేశమంతా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా కడప జిల్లాలోకూడా పోలీసు యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లాలోని ప్రధానమైన రైల్వేస్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద పోలీసు పికెటింగ్‌లు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దీంతోపాటు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద గణతంత్ర వేడుకల ప్రారంభానికి ముందే అర్థరాత్రి నుంచి ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జనసంచారం ఉన్న ప్రదేశాలలో మఫ్టీలో పోలీసులను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. శుక్రవారం నుంచే పోలీసులు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. కడప నగరంలోని ఇర్కాన్ సర్కిల్, ఐటిఐ, రాజంపేట బైపాస్, నగరంలో ఉన్న ప్రార్థనా ప్రాంతాల వద్ద కూడా ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కెవి రమణ కూడా ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో ముష్కరుల నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఉన్న ప్రధానమైన వెలిగల్లు, అన్నమయ్య ప్రాజెక్టు, పెన్నావంతెనలు, ఝరికోన ప్రాజెక్టు, తెలుగుగంగ, పాపాగ్ని వంతెన తదితర నదుల వంతెన వద్ద కూడా పోలీసు పెట్రోలింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. కాగా గణతంత్ర వేడుకల సందర్భంగా పోలీసు మైదానంలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోర్టులో పాపను వదిలిన తల్లిదండ్రుల అరెస్టు
కడప (క్రైం), జనవరి 22: జిల్లాకోర్టులో నిర్థాక్షిణ్యంగా గురువారం పాపను వదిలివెళ్లిన తల్లిదండ్రులు విజయభారతి, ఈశ్వర్‌లను శుక్రవారం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కడప ఫ్యామిలీ కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సి.లక్ష్మిరంగ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు.

అనాథ పిల్లల పట్ల వివక్ష చూపొద్దు
ఆంధ్రభూమి బ్యూరో
కడప,జనవరి 22: తల్లిదండ్రులు లేని అనాధ పిల్లల పట్ల వివక్ష చూపకుండా ఆదరించాలని జిల్లా కలెక్టర్ కెవి రమణ అన్నారు. శుక్రవారం చిన్నచౌకు సమీపంలోని కొండాయపల్లె బాలసదన్ ఐసిడిఎస్ శిశుగృహంలోని పిల్లల వసతి భవనాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాధపిల్లల పట్ల ప్రేమ, కరుణ, జాలి చూపి వారిని ఉన్నతస్థితికి ఎదిగేలా చూడాలన్నారు. సమాజంలో బాలబాలికలే రేపటి పౌరులన్నారు. అనాధపిల్లలకు ప్రభుత్వం బాలసదన్, శిశుగృహాల్లో అన్నివిధాల వసతి కల్పించి విద్యను అందించడం జరుగుతోందన్నారు. అనంతరం కలెక్టర్ బాలసదన్‌లోని పిల్లలు నిద్రించే రూమ్‌లు, వసతి భవనంలోని వంటగది, డైనింగ్ హాల్‌తోపాటు గదులను పరిశీలించారు. గురువారం జిల్లాకోర్టులో భార్యభర్తలు విడాకులు పొంది చిన్నపాపను వదిలివెళ్లిన సాయికీర్తిని ఆప్యాయంగా పలకరించారు. విద్యార్థులకు టిఫిన్, భోజనం, కోడిగుడ్డు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పిల్లలు తమకు ట్రంకుపెట్టెలు, దుప్పట్లు, బ్యాగ్‌లు, డ్రస్‌లు కావాలని కలెక్టర్ దృష్టికి తేగా, ప్రతిపాదనలు తనకు అందజేయాలని ఐసిడిఎస్ పిడి రాఘవరావును ఆదేశించారు. ఈకార్యక్రమంలో బాలసదన్ పర్యవేక్షకులు రహమతియా, శిశుగృహ మేనేజర్ కుమారి పాల్గొన్నారు.

ప్రైవేట్‌కు ధీటుగా ఆదర్శ పాఠశాలలు
ఖాజీపేట, జనవరి 22: ప్రస్తుత పరిస్థితుల్లో కార్పోరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ఎదుర్కొని, ఉన్నత స్థానాలను ఆదర్శ పాఠశాలలు దక్కించుకుంటున్నాయని ఆదర్శపాఠశాలల అదనపు డైరెక్టర్ సుబ్రహ్మణ్యం కితాబిచ్చారు. మండలంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ సురేష్‌బాబు పిల్లలకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ చేశారు. కార్యక్రమానికి తెదేపా రాష్ట్ర నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, అదనపు డైరెక్టర్ సుబ్రహ్మణ్యంలు హాజరై పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్పోరేట్ విద్యా సంస్థలను ఆదర్శ పాఠశాలలు ఇంగ్లీష్‌లో విద్యాబోధన చేస్తూ ధీటుగా జవాబిస్తున్నాయన్నారు. అందుకు ఉదాహరణగా ఖాజీపేట ఆదర్శ పాఠశాలలు రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించాయన్నారు. ఉపాధ్యాయులు సంఘటితంగా ఆదర్శ పాఠశాలల్లోని విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థుల్లో నైతికతను వెలికితీసి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఎంపిడి ఓ ఉషారాణి, కెసికాలువ ప్రాజెక్టుల వైస్ ఛైర్మెన్ రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
రిమ్స్ పూర్వ డైరెక్టర్‌తోపాటు 10మందిపై పరువునష్టం దావా
ఆంధ్రభూమి బ్యూరో
కడప,జనవరి 22: రిమ్స్ మాజీ డైరెక్టర్, కలెక్టర్‌తోపాటు మరో 10మందిపై రిమ్స్‌లో వైద్యవిధాన పరిషత్ అధీనంలో పనిచేసిన ఆర్థోపెడిక్ సర్జన్ రామచంద్రయ్య కడప న్యాయస్థానంలో దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్‌ను జిల్లా మొదటి అడిషనల్ జడ్జి శుక్రవారం విచారణకు స్వీకరించారు. ఏడేళ్లక్రితం డాక్టర్ రామచంద్రయ్య రిమ్స్‌లో వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేసేవారు. రిమ్స్‌లో పనిచేస్తునపుడు అప్పటి డైరెక్టర్ సిద్దప్పగౌరవ్ , మరికొంతమంది అధ్యాపకులు, జిల్లాకలెక్టర్‌తో రామచంద్రయ్యకు వివాదాలు తలెత్తాయి. దీంతో రామచంద్రయ్య ఉద్యోగం వదిలి బయటకు వచ్చారు. అనంతరం ఆ వ్యవహారంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనను అవమానించడమేగాక తీవ్రంగా నష్టపరిచిన రిమ్స్ డైరెక్టర్ సిద్దప్పగౌరవ్, మరో నలుగురు రిమ్స్ వైద్యాధికారులు , ఆరోగ్యశాఖ అధికారులు, కలెక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని, రూ.25లక్షలు నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలుచేశారు.
క్షేత్ర స్థాయిలో పంటలను పర్యవేక్షించాలి
రాజంపేట, జనవరి 22:వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ క్షేత్ర స్థాయిలో పంటలను పర్యవేక్షిస్తూ ఉండాలని జిల్లా సంయుక్త సంచాలకులు ఠాగూర్ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ సభా భవనంలో రాజంపేట వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని 8 మండలాల వ్యవసాయధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడి మాట్లాడుతూ వ్యవసాయాధికారులు ప్రభుత్వం చేపేట్టే ప్రభుత్వ పథకాలు, చంద్రన్న రైతు క్షేత్రం, సూక్ష్మథాత లోపాలు, సబ్సిడీ వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు తదితర ప్రభుత్వ కార్యక్రమాల గురించి రైతులకు తెలియజేసి వారు వినియోగించుకునే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన లేక వారు సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారన్నారు. వ్యవసాయధికారులు ప్రతి రైతు పొలం వద్దకు వెళ్ళి ఈ రబీ సీజన్‌లో రైతులు వేసే పంటలు, వారికి కావాల్సిన ఎరువులు, మందులు, విత్తనాలు, ప్రభుత్వం కల్పించే పథకాలను రైతు ముంగిటకు చేరే విధంగా చూడాలన్నారు. రాజంపేట డివిజన్‌లోని మండలాల వారీగా ప్రతి గ్రామంలో పంట పొలాలను పరిశీలించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ట్యాబ్‌ల ద్వారా అప్‌లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.
అప్‌లోడ్ చేసిన సమాచారాన్ని ఈ నెల 31వ తేదీలోపు సిఎం డ్యాస్ బోర్డుకు పంపాలన్నారు. రాజంపేట డివిజన్‌లో ఈ మారు వర్షాలు బాగా కురవడంతో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు.
రైతులంతా ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలు అందిస్తున్నట్టు వివరించారు. కావున ప్రతి అధికారి రైతుకు అందుబాటులో ఉండి ప్రభుత్వం అమలు చేసే పథకాలను రైతులు సద్వినియోగపరచుకునేలా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట, కడప, రైల్వేకోడూరు ఎడిలు సుబ్బారావు, వేణుగోపాల్, సుబ్రమణ్యం, 8 మండలాల వ్యవసాయాధికారులు, గ్రామీణ విస్తరణాధికారులు, మల్టీ పర్పస్ ఎక్సెటెన్స్‌న్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సైకిల్ తొక్కుదాం...పర్యావరణాన్ని కాపాడదాం
పులివెందుల, జనవరి 22: సైకిల్ తొక్కుదాం - పర్యావరణాన్ని కాపాడి కాలుష్యాన్ని నివారిద్దామని ఎస్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక రూరల్ పోలీసు స్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలుష్యాన్ని ప్రతి ఒక్కరూ నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకుందామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణదళం ముఖ్య అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రత్యేక రక్షణదళం ఉన్న ప్రదేశాలలో సైకిల్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే పులివెందులలోని యుసిఐఎల్‌కు చెందిన ఎస్‌పిఎఫ్, పులివెందుల పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ పోటీని నిర్వహిస్తున్నామన్నారు. పోటీని 24వ తేదీన శిల్పారామం వద్ద ఉదయం 6:30 నిముషాలకు పోటీ ప్రారంభమవుతుందని, మూడు కేటగిరిలలో పోటీ జరుగుతుందన్నారు. మూడుకిలోమీటర్ల పందేమును 4 నుంచి 7వ తరగతులకు చెందిన విద్యార్థినిలకు, పది కిలోమీటర్లను 16 సంవత్సరాలు పైబడిన వారందరూ పాల్గొనవచ్చునని, 25 కిలోమీటర్లు మాత్రం ఎస్‌పిఎఫ్, పోలీసులకు మాత్రమేనన్నారు. పర్యావరణాన్ని రక్షించుట, కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ర్యాలీని ఏర్పాటు చేశామన్నారు. తమ దళం నిత్యం విధినిర్వహణలో భాగంగా ఎక్కువశాతం సైకిళ్లనే వాడుతున్నామని, హైదరాబాద్‌లో వంద కిలోమీటర్ల పోటీ జరుగుతోందని, ఈ పందేనికి పులివెందులకు కానిస్టేబుళ్లు హరీష్, కిరణ్‌లు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.
రక్షణ రంగంలో రాణించేందుకు ఉత్సాహవంతులైన యువకులు తమ వద్దకు వస్తే ఎంపికల్లో ఏ విధంగా వ్యవహరించాలో శిక్షణనిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రూరల్ సి ఐ మహేశ్వర్‌రెడ్డి, అర్బన్ ఎస్ ఐ వెంకటనాయుడు తదితరులు వున్నారు.