ఫోకస్

సెన్సార్ బోర్డు కఠినంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో, టివీ ఛానళ్ళలో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల్లో, సీరియళ్ళలో అశ్లీలత పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలి. మహిళలను అశ్లీలంగా చూపించడం, ద్వంద్వ అర్థాలు వచ్చేలా డైలాగులు వేయడాన్ని ఖండించాలి. అటువంటి సినిమాలపై, టివీ సీరియళ్ళపె ప్రభుత్వం చర్య తీసుకోవాలి. సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు కఠినంగా వ్యవహారించాలి. అటువంటి సన్నివేశాలను తొలగిస్తారా లేక ఆ సినిమా విడుదలకే సర్ట్ఫికేట్ ఇవ్వకుండా నిలిపి వేస్తామని హెచ్చరిస్తే వారే దారికి వస్తారు. మహిళలను తక్కువ చేసి చూపించే కార్యక్రమాల్లోనూ మహిళలే ఉండడం బాధ కలిగిస్తున్నది. టివీల్లో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాల్లో వేస్తున్న డ్రెస్సింగ్స్ చూడలేకపోతున్నాం. పవిత్రమైన మన దేశ సంస్కృతిని మంటగలిపేలా చేయడం భావ్యం కాదు. ఇటీవల సినీనటుడు చలపతి రావు చాలా అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. దానిపై మహిళా సంఘాలు ఉవ్వెత్తున లేవడంతో, సదరు నటుడు దిగివచ్చారు. యాక్షన్‌కు రియాక్షన్ ఉండాలి, అప్పుడే ఇటువంటివి పునరావృతం కావు. మహిళలను ఎంతో గౌరవించే మన దేశంలో ఇటువంటి అశ్లీల దృశ్యాలు, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. ఏదైనా సినిమాకు కుటుంబంతో కలిసి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంట్లో అందరూ సరదాగా ఒక టివీ కార్యక్రమాన్ని వీక్షించే పరిస్థితి లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో వాట్సాప్ సంస్కృతి ఎక్కువైంది. సోషల్ మీడియా పేరుతో మన సంస్కృతి, సంప్రదాయాలకు కొంతమంది విఘాతం కలిగిస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాద్వారా సమాచారం తెలుసుకోవడం మంచిదే కానీ కొంతమంది పంపిస్తున్న అశ్లీల దృశ్యాలు, అసభ్యపదజాలంతో కూడిన జోక్స్‌తో మహిళలు బాధ పడుతున్నారు. అడ్డుఅదుపు లేకుండా మహిళల అశ్లీల ఫొటోలు, జోక్స్ పెడుతున్నారు. దీనిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. చట్ట సభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ నాయకులు మైకుల్లో ప్రసంగాలు ఊదరగొట్టడం కాదు, మహిళలకు సముచితమైన స్థానం కల్పించడం, వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు కృషిచేయాలి. ప్రతి ఒక్కరికీ తల్లి, చెల్లి, భార్య ఉంటారన్న విషయాన్ని మరిచిపోరాదు. భవిష్యత్తులో మహిళలను కించపరిచేలా ఏ సినిమా వచ్చినా, టివీల్లో ఏ కార్యక్రమం ప్రసారమైనా మహిళలు కనె్నర్ర చేయాలి. వారికి తగురీతిలో బుద్ధిచెప్పాలి. వీటిని న్యాయపరంగా కూడా ఎదుర్కొవడానికి సిద్ధం కావాలి. వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం. సెన్సార్ బోర్డు, కోర్టులూ మహిళల గౌరవ మర్యాదలకు విఘాతం కలగకుండా రక్షణ కల్పిస్తుందని ఆశిస్తున్నాను.
- సుజాత గుప్త కాల్వ, అధికార ప్రతినిధి, టి.పిసిసి