ఫోకస్

హాస్యం.. అపహాస్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతిలో మంచిమాటకు, మహిళకు విలువ ఎక్కువ. అతివను ఆదరించడం, పలకరింపులో సంస్కారం తొంగిచూసేలా మాట్లాడటం మన సంస్కృతిలో భాగం. పాశ్చాత్య పోకడలు జొరబడి, ఆధునిక జీవనశైలికి అలవాటుపడిన మనవారి పలకరింపులో సొంపు తగ్గిపోయింది. మాటలోను, పాటలోను, వ్యవహారశైలిలోను, శరీరభాషలోనూ సిగ్గూఎగ్గూలేని వైఖరి కంపుకొడుతోంది. ముఖ్యంగా సిని, టివి కార్యక్రమాలలో భాషా సౌందర్యం వనె్నలుడిగింది. అసభ్య, ద్వంద్వార్థ ప్రసంగాలకు, మాటలకు, అతివలను కించపరిచే సన్నివేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నిరక్షరాస్యులైన సగటు ప్రేక్షకుడు తాత్కాలిక ఆనందానే్న ఆదరణగా భావించి, ప్రేక్షకులు చూస్తున్నారు కనుక తీస్తున్నాం అన్న వాదనను తెరమీదకు తెచ్చి తమ చర్యలను సమర్థించుకుంటున్న సినీజనం వల్లించే నీతులు నేతిబీరకాయ చందమే. స్టార్ ఇమేజ్ భ్రమలో మునిగితేలే నటులు ఏం మాట్లాడినా చెల్లుతుందన్న భావనలో అసభ్య పదజాలాన్ని తన్మయత్వంతో మాట్లాడటం, ఆ తరువాత నాలుక కరుచుకోవడం మామూలైపోయింది. ఇటీవలి కాలంలో ఓ ప్రముఖ నటిని జిలేబీగా వర్ణిస్తూ, తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని ఓ కమెడియన్ చేసిన వ్యాఖ్యల్లో అసభ్యత మన సంస్కృతిని అపహాస్యం చేసింది. అతడి మాటలు వెగటుపుట్టించాయి. సభ్యసమాజం నుంచి కాస్తంత నిరసన వ్యక్తం కావడంతో మన్నించమని కోరినా అదీ తప్పనిసరి తంతుగానే చెప్పారు. వందల సినిమాల్లో నటించిన ఓ పెద్దమనిషి మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు అతడి చిన్నమనసుకు అద్దంపట్టింది. ఓ వర్ధమాన తార శరీరసౌష్టవాన్ని సామాజిక మాధ్యమంలో వర్ణిస్తూ సూటిగా ఆమెనే ప్రశ్నించిన మరో వర్ధమాన హీరోఅసలు రూపం చూసి సమాజం నివ్వెరపోయింది. ఒక్క సినీరంగమే కాదు.. మహిళలపట్ల రాజకీయ నాయకుల తీరుతెన్నులు, మాటలు జుగుప్స కలిగిస్తున్నాయి. విభిన్నవర్గాల ఆచారవ్యవహారాలను వక్రీకరించి, అపహాస్యం చేసే సన్నివేశాలు ఎందరి మనోభావాలనో దెబ్బతీస్తున్నాయి. అర్చకత్వాన్ని, పురోహితులను, పోలీసులను కించపరిచే సన్నివేశాలు, మతాలు, ప్రాంతాలను కించపరిచే టైటిల్స్, పాటలు, మాటలు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి. ఇది ఒక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమకో, తెలుగు టీవీ కార్యక్రమాలకో పరిమితం కాలేదు. ప్రజలపై నేరుగా ప్రభావం చూపే సినీ, టీవీ కార్యక్రమాల్లో ఇటీవలి కాలంలో విజృంభించిన పెడధోరణులపై నిరసన వ్యక్తం అవుతున్నా ‘టీఆర్‌పీ’ రేటింగుల గోలలో అవి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమంలో మహిళలను, ముఖ్యంగా దంపతుల్లో భార్య పాత్రను కించపరుస్తూ జబర్దస్త్‌గా చేస్తున్న వ్యాఖ్యలు, న్యాయనిర్ణేతల స్పందనలు మన వ్యవస్థను నవ్వులపాలు చేసేవే. కమెడియ్‌న్ నుంచి హీరోవరకూ.. నిర్మాత నుంచి ఎంపీల వరకూ చాలామంది మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. నోటికి వచ్చినది మాట్లాడి ఆ తరువాత మన్నించమనడం నయవంచనే. సంస్కారాన్ని పెంచిపోషించే సంసారపక్ష కార్యక్రమాలు ఉధృతి పెరిగితే.. అసభ్యకర మాటలు, చేతలతో వ్యవహరించేవారిపై గట్టిగా గళం విప్పితేనే మంచిరోజులు వస్తాయి. ఈ అంశంపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.