చిత్తూరు

నాలుగేళ్ల చిన్నారిని హత్యచేసిన సవతి తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 12: నిత్యం గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్న కలియుగ ప్రత్యక్ష దైవం వెలసివున్న తిరుమల పుణ్య క్షేత్రంలో అభంశుభం తెలియని ఓ చిన్నారి సవతి తల్లి రూపంలో ఉన్న ఓ రాక్షసి చేతిలో అతి దారుణంగా హత్యకు గురైంది. గతేడాది ఆగస్టు 24వ తేదీన పాపవినాశనం తీర్థంకు వెళ్లే నడకమార్గంలో ఉన్న బాటగంగమ్మ గుడి అటవీప్రాంతం ఇందుకు సాక్షీ భూతంగా నిలించింది. సవతి తల్లి రూపంలో ఉన్న రాక్షసి చేతిలో చిత్ర హింసలకు గురై ఆ చిన్నారి చేసిన రోదన అరణ్య రోదనగా మారింది. పాపం పండటంతో సవతి తల్లి రాక్షస ప్రవర్తనను తిరుమల పోలీసులు 10 నెలల తరువాత గుర్తించారు. ఆమెను పట్టుకుని కటకటాల వెనుకకి తోశారు. వివరాల్లోకి వెళితే గతేడాది తిరుమలలో తప్పిపోయిందని భావిస్తున్న నాలుగేళ్ల రాధ సవతి తల్లి జ్యోతి చేతిలో హత్యకు గురైనట్లు తిరుమల పోలీసులు నిర్ధారించారు. దీంతో సోమవారం ఆమెను అరెస్టు చేశారు. తిరుమలలో జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించి స్థానికులు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటకకు చెందిన దేవరాజ్‌కు ఉలిగమ్మ, జ్యోతి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య ఉలిగమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. జ్యోతికి ఒక కుమారుడు. కుటుంబ పోషణార్థం దేవరాజు ఎంతోకాలంగా తన ఇద్దరు భార్యలు, పిల్లలతో కలసి తిరుమలలో కూలీగా జీవిస్తున్నాడు. దేవరాజులు తొలి భార్యకు చెందిన ముగ్గురు ఆడపిల్లలను బాగా చూసుకుంటున్నాడని, తన బిడ్డను సరిగా చూసుకోవడంలేదని జ్యోతి తరచూ ఘర్షణ పడేది. ఈ క్రమంలో గతేడాది ఆగస్టు 24న తొలి భార్య కుమార్తె రాధ (4) కనిపించకుండా పోయింది. దీంతో దేవరాజు, ఆయన ఇద్దరు భార్యలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఎంతకూ కేసు తేలకపోవడంతో దేవరాజు రెండోభార్య జ్యోతిపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెపై నిఘా ఉంచి తమదైన శైలిలో విచారించారు. దీంతో రాధను హత్యచేసింది తానేనని నిందితురాలు అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
హత్యకు ఎలా పాల్పడిందంటే
పోలీసుల విచారణలో నిందితురాలు చెప్పిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దేవరాజు, మొదటి భార్య ఉలిగమ్మలు ఆగస్ట్ 24న కూలిపనికి వెళ్లారు. ఆ సమయంలో బిడ్డలను చూసుకోవడానికి జ్యోతి ఇంటి వద్ద ఉంది. తన కుమారుడితో ఆడుకుంటున్న చిన్నారి రాధను సవతి తల్లి జ్యోతి వెంటపెట్టుకుని పాపవినాశనం రోడ్డులోని బాటగంగమ్మ గుడి వద్దకు తీసుకెళ్లింది. తనను ఎందుకు తీసుకు వెళుతుందో కూడా తెలియని ఆ చిన్నారి తన పినతల్లి చెయ్యి పట్టుకుని నడిచినవే ఆఖరి ఘడియలని తెలుసుకోలేక పోయింది. బాటగంగమ్మ గుడి వద్ద ఆటవీప్రాంతంలోకి తీసుకువెళ్లిన జ్యోతి కర్ర తీసుకుని రాధ తలపై బాదింది. స్పృహ తప్పేలా కొట్టింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ బిడ్డ రోదనలు అరణ్య రోదనలుగా మారింది. కొట్టొద్దు పిన్ని అంటూ ఆ చిన్నారి కేకలు వేయడంతో రాధ నోట్లో గుడ్డలు కుక్కింది. కొన ఊపిరితో ఉన్న ఆ బాలికను లాక్కెళ్లి నిర్మానుష్యంగా ఉన్న అటవీ ప్రాంతంలో చెట్టుకు కట్టింది. అటు తరువాత ఎప్పుడు ప్రాణాలు విడిచిందో తెలియదుకాని ఏడాది పాటు ఆ చెట్టు వద్ద ఉన్న రాధ శరీరం, చిక్కి శల్యమైంది. చివరకు ఎముకలు, వెంట్రుకలు మిగిలాయి. పోలీసు విచారణలో బిడ్డను హత్య చేసిన విషయాన్ని ఒప్పుకున్న కసాయి సవతి తల్లి జ్యోతి పోలీసులకు సంఘటనా స్థలాన్ని చూపించింది.

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
తిరుపతి, జూన్ 12: దళితులకు న్యాయం చేస్తానని చెప్పిన సిఎం చంద్రబాబునాయుడు నేడు అన్యాయం చేస్తున్నారని, అక్రమంగా అరెస్టులు చేస్తూ మాదిగల ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్‌ను కలిసి టిటిడిలో మాదిగ ఉద్యోగుల బదిలీలు, నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దీనిపై ఇఓ సింఘాల్ సానుకూలంగా స్పందించారు. అనంతరం టిటిడి పరిపాలనాభవనం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలై 7వ తేదీన కురుక్షేత్రంలో బహిరంగ సభ జరిపి తీరుతామన్నారు. ఎన్ని నిర్బంధాలు, ఆంక్షలు విధించినా సభ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్రబాబు, గోపిమాదిగ, మిద్దింటి వెంకటస్వామి, మునిరాజు, హరిపురం గోపి, వాసు, కె.ప్రసాద్, ఆనంద్, జ్ఞానశేఖర్, వెంకటేష్, రవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం
తిరుపతి, జూన్ 12: రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తున్నా, సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని స్వాతంత్య్ర సమర యోధురాలు, మహిళా సంఘం జాతీయ నాయకురాలు మల్లు స్వరాజ్యలక్ష్మి విమర్శించారు. రాష్ట్రాన్ని మద్య రహితంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో ఈనెల 7న ప్రారంభమైన జీపు జాతా సోమవారం తిరుపతికి చేరుకుంది. ఈసందర్భంగా స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ మద్యం సేవించి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడుతున్నాయన్నారు. మద్యం సేవించి అనారోగ్యంతో ఉన్నదికాస్త పోగొట్టుకుని లక్షలాది మంది మృత్యువాతన పడుతుండటంతో మహిళలు, వారి పిల్లలు అనాధలుగా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. రాష్ట్రంలోని ప్రజల ఈ దుస్థితకి ప్రభుత్వ విధానాలే కారణమని, మద్యాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం చూడరాదన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కె.కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో తాగడానికి, సాగుకు నీరులేకపోయినా మద్యం మాత్రం విచ్చలవిడిగా దొరికేలా ప్రభుత్వం చేస్తోందన్నారు. ప్రజల సంక్షేమాన్ని మరచిపోయిన ప్రభుత్వం ప్రతిదీ లాభాపేక్షతోనే చూస్తోందని ఆరోపించారు. అనంతరం స్థానిక కొర్లగుంట వద్ద జరిగిన సభలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వెంటనే మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బెల్ట్‌షాపుల ద్వారా మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారని, ఇది దారుణమన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని, ఇందులో అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి మాట్లాడుతూ తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ బాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలిస్తోందని మండపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు ఏకమై ఉద్యమించాల్సిన అవసరం ఉందని, రానున్న ఎన్నికల్లో టిడిపికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు నరేంద్ర, చిన్నబాబు, స్టాలిన్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు నాగభూషణమ్మ, మహిళా సమాఖ్య నేత విజయలక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

టిటిడి తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచుతోంది
తిరుపతి, జూన్ 12: టిటిడి తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంపొందించేలా కృషి చేస్తోందంటూ శాసన మండలి డిప్యూటి స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ ప్రశంసించారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలసి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా టిటిడి అధికారులు ఆయనకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి వారి కృపవల్ల వర్షాలు బాగా కురిసి ప్రాజెక్టులు నిండి రైతుల కళ్లల్లో ఆనందం నిండాలని ప్రార్థించానన్నారు. పోలవరంను, అమరావతిని నిర్మించుకునే శక్తి సామర్థ్యాను సిఎం చంద్రబాబు నాయుడుకి ప్రసాదించాలని కోరానన్నారు. నేటి సమాజంలో మనిషి మనిషిగా జీవించే అవకాశాన్ని, ధర్మాన్ని ఆచరించేలా అనేక గ్రంథాలను ముద్రిస్తున్న టిటిడి వాటికి విస్తృత ప్రచారం కల్పించడం అభినందనీయమని అన్నారు. అంతర్జాలంలో లక్షలాది పుటల నుంచి ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారంతా వాటిని చదువుకునేలా టిటిడి చేస్తున్న ప్రయత్నం తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.

లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం
రేణిగుంట, జూన్ 12: మండల పరిధిలోని కడప జాతీయ రహదారిలో కరకంబాడి వద్ద ముందు వెళుతున్న లారీని వెనుకవైపు నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఏడేళ్ల బాలిక మృతి చెందగా, ఆమె తల్లిదండ్రులు తీవ్రగాయాల పాలయ్యారు. సోమవారం రాత్రి 8గంటలకు కరకంబాడి వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. మండలంలోని ఇప్పమాను పట్టెడకు చెందిన అర్జునయ్య మేస్ర్తి పని చేసుకుని జీవిస్తున్నాడు. కరకంబాడిలోని అత్తగారింటికి తన భార్య వల్లమ్మ, కుమార్తె మధులతతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలోని కట్టపుట్టాలమ్మ గుడి వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో ముందు వెళుతున్న కంటైనర్ లారీని ఢీకొట్టాడు. ఈఘటనలో మాధవీలత (7) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. అర్జునయ్య, వల్లమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న సిఐ బాలయ్య బాధితులను 108లో రుయాలకు తరలించారు.

సినారె మృతికి పలువురి సంతాపం
తిరుపతి, జూన్ 12: ప్రముఖ రచయిత, కవి సి.నారాయణ రెడ్డి మృతి ఆంధ్రరాష్ట్రానికి తీరనిలోటని అన్నమయ్య కళాక్షేత్ర ప్రిన్సిపాల్ జగన్‌మోహన్ రావు, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు అనంతశయనం, కార్యదర్శి శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా సాహితి స్రవంతి కన్వీనర్ వెంకటరమణలు సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి, ప్రధానకార్యదర్శి పేరూరు బాలసుబ్రహ్మణ్యం, సాకం నాగరాజుల, పలమనేరు బాలాజీలు తమ సంతాపాన్ని తెలిపారు. నారాయణ రెడ్డి కవిత్వానికి చెరగని చిరునామా అని, విశ్వ మానవేతిహాసాన్ని అవధిలేని మనిషి మానసవోకశాన్ని వినిపించి విశ్వంభర కావ్యానికి భారతీయ జ్ఞానపీఠ్ అవార్డు పొందిన సినారె ఆధునిక కవితకు చిరునామా అంటూ నివాళులు అర్పించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.