సబ్ ఫీచర్

పాలకులే భక్షకులైతే ప్రజలకు దిక్కెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టుకతోనే బుద్ధిజీవి, విచక్షణాజ్ఞాని అయిన మనిషి స్వార్థపూరిత మనస్తత్వంతో మంచిని, మానవత్వాన్ని మరిచి ఎలా ప్రవర్తిస్తాడో అర్థం కాదు. కలసిమెలసి ఉండే తత్త్వం, ఆపదలో వున్న సాటిజీవిని ఆదుకొనే కరుణ మనం పశువుల్లోనూ, పక్షుల్లోనూ చూ స్తుంటాం. అలాంటిది మహోన్నతమైన మానవజన్మ ఎత్తినవాడిలో మోసం, కుట్ర, అవినీతి, అమానవీయత, అమానుషత్వం ఆశ్చర్యాన్ని కలిగించే అవలక్షణాలు అనేకం చూస్తున్నాం. ఏవో కొన్ని అనుకోని కారణాల వల్ల వందలు, వేలమందిలో ఒక చెడ్డమనిషి, ఒక మోసగాడు వున్నాడంటే ‘ఏదోలే..’ అనుకోవచ్చు. అతడిని సరైన దారిలోకి తెచ్చే ప్రయత్నాలను సానుభూతితోనో, అది సాధ్యం కాకపోతే చట్టంతోనో చేయవచ్చు. కానీ- చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వాలే తప్పు చేస్తే..? ప్రజలను కన్నబిడ్డల్లా ప్రేమగా చూసుకుంటూ, వారి కనీస అవసరాలు తీరటానికి అండగా నిలుస్తూ.. వారికి కష్టమో, నష్టమో వచ్చినపుడు ‘నీ నేనున్నానని’ ఆదుకుంటూ, ఆశ్రయం కల్పిస్తూ, రక్షణ అందిస్తూ ఉండాల్సిన పాలకులే ప్రజల నెత్తిన చేతులు పెడుతుంటే..? ఇక ప్రజలకు దిక్కెవరు? ధనం, అధికార దాహంతో ‘పదవులు ఉన్నది ఆస్తులు కూడబెట్టుకోవడానికే’ అన్నట్టు పేదల, సామాన్యుల భూముల మీద, పొలాలమీద కనే్నసి వాటిని అంగబలంతో కాజేయాలని చూస్తే- పాలకులే భక్షకులు అయినట్లు కాదా?
మనకు ప్రాచీన శాస్తవ్రేత్తలు రచించిన రాజనీతి గ్రంథాలు అనేకం వున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక మన దేశానికంటూ ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉంది. ఇవిగాక, పాలకుడు ఎలా వుండాలో, ఎలా పాలన చేయాలో ఇతివృత్తపరంగా చెప్పే రామాయణ, మహాభారతాలున్నాయి. ఇవన్నీ కూడా అక్షరం అక్షరం గుదిగుచ్చి రాజధర్మాన్ని, రాజు కర్తవ్యాన్ని ప్రబోధించాయి. ప్రజలను కన్నబిడ్డల్లా రాజు పరిపాలించాలనీ, నెత్తురు కూడు తింటూ ప్రజాపాలన చేయరాదనీ నొక్కి వక్కాణించాయి. ఆ గ్రంథాలను అందరూ క్షుణ్ణంగా చదవకపోయినా ఆ సంస్కారం మనకు తెలియకుండానే మన నెత్తురులో కలసిపోయి వుండాలి. అలాంటి ధర్మప్రభువులు జన్మించిన గడ్డమీద పుట్టినందుకు, ఆ గాలిని శ్వాసిస్తున్నందుకు- ఆ పరిపాలనలో లవలేశమైనా మన పరిపాలకులకు సహజసిద్ధంగా అబ్బి వుండాలి. అంతేకాదు, రాజుల కాలంలోనే అంతగా ధర్మపాలన కొనసాగినప్పుడు ఇప్పటి ఈ ప్రజా ప్రభుత్వాలలో మరెంతో ధర్మబద్ధ పాలన కొనసాగుతూ వుండి వుండాలి.
కానీ, ఈ ప్రజాప్రభుత్వ కాలంలో మంత్రులు సామాన్యులను అమాయకుల్ని చేసి ఆడిస్తున్నారు. వారసత్వపు పాలనలు, ఓటుకు కోట్లు పోసి సంపాదించే పదవులు, అధికార మదంతో చేసే అక్రమాలు, అంగబలంతో చేసే అవినీతి పనులు, చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకుని చేసే దోపిడీలు, దందాలు, భూకబ్జాలు ఇవన్నీ ఎప్పుడైతే మంత్రుల పరిపాలనలో వచ్చి చేరాయో అప్పుడే ప్రభుత్వాలు భ్రష్టు పట్టిపోయాయి. ప్రజలను దగా చేశాయి. గడ్డి స్కామ్‌లు, ఇసుక స్కామ్‌లు, భూకబ్జాలు, బొగ్గు కుంభకోణాలు.. ఇలా ఒకటా? రెండా? ప్రస్తుత ప్రభుత్వాలలో అన్నీ స్కామ్‌లు, దందాలు, కుంభకోణాలే..! అవినీతి పైస్థాయిలోని ‘తిమింగలాల’ నుంచి కిందిస్థాయిలోని ‘చేపల’ వరకు యథేచ్ఛగా.. సిగ్గూ లజ్జా లేకుండా సాగిపోతోంది. ఒకడు గనులకు గనులనే తవ్వేసి ఇంటిని, ఇంట్లోని ఫర్నిచర్ నుంచి లెట్రిన్ కమోడ్ వరకు బంగారం పూత పూయిస్తాడు. అన్నం తినే కంచం, పడుకునే మంచం అన్నీ బంగారు మయమే. మరొకడు లంచాలు బాగా మెక్కి ఇంటిని నగల దుకాణంగా మార్చేయటమేకాక తన ముద్దుల పట్టి పెళ్లికి మోయలేనన్ని నగలు చేయిస్తాడు. కొన్ని ప్రభుత్వాలలో ప్రభుత్వ అధికారులే కట్టగట్టుకుని ఒక్కటై.. పాలకుల ఆదేశంతోనే పేదల భూములను, స్థలాలను, పొలాలను భారీఎత్తున కబ్జా చేసి ‘దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న’ట్టు అవినీతి సొమ్మును ‘నీకింత, నాకింత’ అని పంచుకుంటారు. వీళ్లకు ప్రజల వ్యక్తిగత సొమ్మేకాక పబ్లిక్ స్థలాలైన చెరువులు, కుంటలు, శ్మశానాలు, అడవులు, గనులు ఇలా ఏది కంటబడ్డా బకాసురుల్లా బొజ్జలో వేసుకోక మానరు. ఇది ప్రస్తుత భారతం.. నడుస్తున్న మన దేశ చరిత్ర..
ప్రజానాయకుడైన వాడికి పరిపాలనా పద్ధతులు, రాజ్యాంగ నియమాలు, ప్రభుత్వ చట్టాలు మాత్రం తెలిస్తే సరిపోదు. ఒక మనిషిగా సహృదయం, మంచితనం, మానవత్వం, సేవాగుణం కూడా వుండాలి. మంచి మనసున్నవాడు ఏ పని చేసినా అది ప్రజలకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. నిజానికి ధర్మచింతన, పాపభీతి, జీవితం పట్ల అవగాహన వున్నవాడు ఎప్పుడూ తప్పు చేయడు. ‘ఎంత సంపాదించినా పోయేటప్పుడు పట్టుకుపోయేది ఏమీ వుండద’ని అలెగ్జాండర్ తను చనిపోయినప్పుడు ‘శవపేటికలో నుంచి తన ఖాళీ చేతులు బయటపెట్టి తనను ఖననం చేయమ’ని కోరడం ఇందుకు ఒక ఉదాహరణ. రాజ్యకాంక్ష అధికంగా కలిగిన అశోకుడు కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతాన్ని చూసి ‘ఇంక జీవితంలో యుద్ధం చేయన’ని ఒట్టు పెట్టుకున్నాడు. ఇలా జీవితంలో తప్పులు చేసినవాళ్లు ఏదో ఒక దశలో తప్పు తెలుసుకుని మారిన సందర్భాలు చరిత్రలో ఎన్నో వున్నాయి. కానీ, మన నాయకులు మాత్రం తప్పుమీద తప్పులు చేసుకుంటూ పోవడమే తప్ప వారికి జ్ఞానోదయం అనేది వుండదని వర్తమానం సవాలక్ష సాక్ష్యాలతో చెబుతోంది. ఎన్ని ఆస్తులు కూడబెట్టినా, ఎన్ని భారీ భవంతులు కట్టినా, కట్టలు కట్టలు నల్లధనాన్ని విదేశీ బ్యాంకుల్లో దాచినా, ఎన్ని వేల ఎకరాల భూమిని కబ్జా చేసినా- ఆ ఘరానా దోపిడీదారులు బతికేది ఎక్కువలో ఎక్కువ వందేళ్లే! చివరకు కావల్సింది ఆరు గజాల నేలే! వెంట పట్టుకెళ్లేది ఒక్క రూపాయి కూడా వుండదు. ఈ జీవిత సత్యం, ఈ జీవిత తత్త్వం తెలిసినవాళ్లెవరూ అస్సలు తప్పు చేయరు. బంగారు కంచంలో భోంచేసినా అందరిలా అన్నమే తినాలి తప్ప.. బంగారాన్ని ఎవరూ తినలేరనీ, బిపి, షుగర్, గుండెజబ్బులు లాంటి రోగాలు వుంటే ఆ అన్నం కూడా పథ్యం మెతుకులే తప్ప మృష్టాన్న భోజనం కాదన్న జీవన వేదాంతం, వైరాగ్యం వంటబట్టిన వాళ్లు ఎవ్వరూ ఉన్నదాంతో తృప్తిపడతారే తప్ప అక్రమాలు చేయరు. అయినా మొండిగా ‘నేను కూడబెడుతున్న ఆస్తిపాస్తులు నా వెంట రాకపోతేనేం.. నా మనవళ్లకు ఉంటాయిగా’ అని ఎవరైనా మొండిగా వాదిస్తే వాళ్లు ముమ్మాటికీ మూర్ఖులే. చేసిన పాపాలు తననూ, తన కుటుంబాన్ని కూడా వెంటాడి వేధిస్తాయన్న పాపభీతి లేనివాళ్లు!
రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య ఎన్నో అవినీతి కేసులు బయటికి వచ్చాయి. ఎంతో అక్రమ సంపాదన బయటపడింది. కట్టలు కట్టలు డబ్బులు, గుట్టలు గుట్టలు బంగారు నగలు పట్టుబడ్డాయి. గద్దల్లాంటి పెద్దలు తన భూమిని తన్నుకుపోవటంతో దగాపడ్డ రైతు గుండె చెరువై కన్నీరు పెడుతున్నాడు. సంవత్సరమంతా కష్టపడి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేక నిరాశతో కూడిన ఆగ్రహంతో నడి వీధిలో పంటను తగలబెట్టుకుంటున్నాడు. గద్దెనెక్కి తనమీద పెత్తనం చేస్తున్న నాయకుల అధికార మదానికి గురై ఎంతోమంది అమాయకులు జైలు పాలవుతున్నారు. ఈ పరిస్థితులు పరిపాలకులకూ మంచిది కాదు.. ఇప్పుడు బంతి వాళ్ల కోర్టులో వుందిగదా అని విర్రవీగితే.. సామాన్యుడు ఎన్నికల సమయంలో బంతి తన చేతిలోకి వచ్చినప్పుడు రెచ్చిపోయి పాలకుల సింహాసనాలకు గురిపెట్టి సూటిగా తగిలేలా వేసి, వారిని కిందపడేస్తాడు. ఇది ప్రజాస్వామ్యం.. ఇక్కడ ప్రతి మనిషీ పైకి కనిపించని ఒక నాయకుడు.. అంతే కాదు... ధర్మప్రభువు కూడా..!

- డా. కొఠారి వాణీచలపతిరావు