సబ్ ఫీచర్

ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుల కాలం పోయి ప్రజల కాలం వచ్చినా, రథాల రాచరికపు పోకడలు పోయి బుగ్గకార్ల విఐపీ సంస్కృతి వచ్చినా- ఈ మధ్యనే అదీపోయి పాలకుడంటే ‘ప్రజాసేవకుడు’, ‘పబ్లిక్ సర్వెంట్’ అన్న అత్యద్భుత ఆదర్శ భావం ప్రచారంలోకి వచ్చినా ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు మారడం లేదు. ఆ వెనకటి రాజుల దర్జాలు, అధికార అహంకారాలు తొలగిపోవడం లేదు. ఆ రోజుల్లో రాజభవనం వదిలి రథ గజ తురగ వాహనాలు ఎక్కిన మందీ మార్బలంతో ‘రాజువెడలె..’ అనే రాచఠీవీతో రాజు ఎలా బయటకు వచ్చేవాడో- ఇప్పుడు ముఖ్యమంత్రులూ అలాగే అధికార, మంత్రిగణ, రక్షకభట వర్గంతో పది పదిహేను కార్ల కాన్వాయ్‌తోనో, హెలికాప్టర్‌లోనో, స్పెషల్ చార్టర్ ఫ్లయిట్లలోనో దేశ, విదేశీ పర్యటనలను దర్జాగా కొనసాగిస్తున్నారు. రాజముద్రిక లాంటి అధికార ముద్రను వేసి ఇష్టమొచ్చినట్టు జీవోలు పాస్ చేయడం, తమకు ఇష్టమైన వాళ్లకు పదవులు కట్టబెట్టడం, నచ్చని వాళ్ల పదవులను ఊడబెరికించడం చేస్తున్నారు. ‘రాజు తలచుకుంటే ఏమైనా చేయొచ్చు.. రాజ్యాంగం, నీతి, న్యాయం, చట్టం జాన్తానై’ అన్నట్టు కొన్ని రాష్ట్రాల్లో ఇష్టారాజ్యం రాజ్యమేలుతోంది.
మూడు సంవత్సరాల క్రితం వరకూ కేంద్రంలోనూ అదే పరిస్థితి. మంత్రులు విచ్చలవిడిగా, అడ్డుఅదుపు లేకుండా అవినీతి కుంభకోణాలు చేసి కోట్లకు కోట్లు దోచుకున్నారు. ప్రజాధనాన్ని తమ అవసరాల కోసం, జల్సాల కోసం నిస్సిగ్గుగా ఖర్చు చేసి, అమలు కాని పథకాలతో ప్రజలకు అన్యాయం చేసారు. ‘ప్రజాసేవ’ పేరుతో ప్రజలను నిలువుదోపిడీ చేయడం మొదలుపెట్టారు. అయితే, ఇది గతించిన రాజకీయ చరిత్ర. ఇప్పడు రోజులు మారాయి. తాను ‘సేవకుడి’నంటూ నరేంద్ర మోదీ రంగప్రవేశం చేయడంతో సామాన్య ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది. ‘నేనూ సామాన్యుడినే.. మీలో ఒకడినే.. ఛాయ్‌వాలాను..’ అంటూ జనానికి ఆయన భరోసా ఇవ్వడంతో సామాన్యునిలోనూ తన బతుకు పట్ల ధైర్యం వచ్చింది. తమ జీవితాలకు, తమ మనసులకు దగ్గరివాడైన తమ ప్రజానాయకుని అండతో వాళ్లూ ఇప్పుడు ప్రశ్నించడం నేర్చుకున్నారు. ‘పనిచేయని నాయకుడిని నిలదీయండి’ అని తమ పరిపాలకుడే చెబుతుంటే ఇంక వాళ్లకెందుకు భయం? ‘రాజునే ఘెరావ్ చేసి నిలదీసి కడిగేసే ఉన్నత స్థితికి సగటు మనిషి మనసు ఎదిగిందంటే అదంతా కొత్తగా లభించిన రాజకీయ చలవనే. ‘యథారాజా తథా ప్రజా..’ అన్న పాత సామెతను ఇక్కడ ‘పరిపాలకుని బట్టే ప్రజ..!’ అని చెప్పుకోవాలి.
రైతు అయినా, కూలీ అయినా, కార్మికుడైనా, శ్రామికుడైనా పై స్థాయికి ఎదగాలంటే- పరిపాలకుడు క్షేత్రస్థాయికి దిగివచ్చి సుపరిపాలన ప్రారంభించాలి. కాన్వాయ్ నుంచి దిగివచ్చి కాలినడకన గల్లీ గల్లీలో తిరిగి జనం కష్టనష్టాలను తెలుసుకోవాలి. వాళ్ల జీవితాల్లో మమేకమై వాళ్ల అవసరాలు తనే గుర్తించాలి. ఎందుకంటే వాళ్లకేం కావాలో వాళ్లకే తెలియని అమాయకులూ, అందుకోసం ఏం చేయాలో తెలియని నిరక్షరాస్యులూ ప్రజల్లో చాలామంది ఉండి వుండొచ్చు. కోర్కెలు అడిగిన వాళ్లకు, ధర్నాలు, సమ్మెలు చేసేవాళ్లకు, ఓటు బ్యాంకుకు పనికొచ్చే వాళ్లకే కాదు.. ఏమీ అడగని వాడు, ఆకలితో ఉన్నవాడయితే, నిలువ నీడలేని వాడు అయితే పిలిచి అన్నం పెట్టడం, తలదాచుకునే చోటుచూపించడం ప్రజా నాయకుని ప్రధమ కర్తవ్యం.
గ్రామస్థులు బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది. రైతు చెమట బిందువులు చిందాల్సిన నేలమీద అతని కన్నీళ్లు రాలితే అది దేశానికే అరిష్టం. కాయలు కాయాల్సిన చెట్టు కొమ్మలు రైతుల తలకాయలు వేళ్లాడే ఉరి కొయ్యలైనా, క్రిమిసంహారక మందులు రైతులు ప్రాణాలు తీసుకోవడానికి పనికొచ్చే కాలకూట విషాలుగా మారినా- అన్నదాత ఉసురు ఆ రాష్ట్ర పరిపాలకులకే కాదు దేశం మొత్తాన్ని పట్టి కుదుపుతుంది. రాళ్లు కొట్టి కట్టడాలకు మోసే కూలీ అయినా, ప్రమాదపు లోతులకు దిగి పనిచేసే గని కార్మికులైనా, రకరాల వృత్తి పనులను చేసుకునే వారైనా.. అందరికీ ప్రభుత్వం అండదండలు కావాలి. హాయిగా మనుగడ సాగించి చీకు చింతాలేకుండా బతకాలంటే పరిపాలకుల చేయూతకావాలి. శ్రామికులు అనే ఇరుసు మీదనే దేశాభివృద్ధి అనే బండి నడుస్తుంది. ముందుకు పరుగులు తీస్తుంది. కనుక వాళ్ల అవసరమూ దేశానికి ఉందని ప్రజాప్రతినిధులు గుర్తించాలి. అప్పుడే వాళ్లకు ప్రభుత్వాలు చేసే దాని కన్నా వాళ్లు ప్రభుత్వ రాబడికి దేశ అభివృద్ధికి చేస్తున్నది ఎక్కువ అన్న విషయం తెలుసుకోగలుగుతారు. దాంతో నాయకులకు అధికారం తెచ్చిన అహంకారం తగ్గి ప్రజల పట్ల కృతజ్ఞతా భావం కలుగుతుంది.
పుడుతూనే ‘గోల్డెన్ స్పూన్’ నోట్లో పెట్టుకుని పుట్టి.. అది చాలక ఇంకా ప్రజల సొమ్మను దోచుకుని కోట్లు కూడగట్టుకుని రాజకీయాల్లోకి వచ్చే నాయకులకు ప్రజల కష్టనష్టాలు, వాళ్ల అవసరాల పట్ల అవగాహన ఉండదు. అదే శ్రామిక కుటుంబం నుంచో, రైతు కుటుంబం నుంచో వచ్చిన వ్యక్తి నాయకుడైతే సామాన్య ప్రజల జీవన విధానం, వాళ్ల కల్మషం లేని నిస్వార్ధ మనస్తత్వం పట్ల అవగాహన ఉంటుంది. అటు కేంద్రంలో ప్రధానమంత్రి మోదీకి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కి ఆ నేపథ్యం ఉంది. దిగువ మధ్యతరగతి శ్రామిక కుటుంబంలో నుంచి వచ్చిన వాడు మోదీ అయితే వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చినవాడు కేసిఆర్. అందుకే ఇద్దరికీ పేదల, రైతుల, వృత్తి పనివాళ్ల అవసరాలు తెలుసు. వాళ్లేం కోరుకుంటారో వాళ్లు అడక్కుండానే వీళ్లు చెప్పగలరు. ప్రజారోగ్యాన్ని కాపాడడం పాలకుల కర్తవ్యం అనుకున్న మోదీ స్వచ్ఛ భారత్ మొదలుపెట్టి గల్లీ గల్లీ, గ్రామం, పేదల బస్తీలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో పాఠాలు చెప్పాడు. బహిరంగ మల మూత్ర విసర్జన, బహిరంగ ధూమపానం తగదని తరగతి గదిలో పిల్లలకు ఆరోగ్య పాఠాలు చెప్పినట్టు బోధించాడు. పేదలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో జన్‌ధన్ పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించడం, నల్లధనం వెలికితీసి తద్వారా పేదలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడంవంటి పనులు చేస్తున్నారు.
ఇక్కడ తెలంగాణాలో కెసిఆర్ పేదలకు ఇళ్ల పథకాలు, రైతులకు రుణ మాఫీలు, వృత్తి పనులవారికి ఈ మధ్యనే గొర్రెల పంపకం వంటి పథకాలు మొదలుపెట్టి, ‘బంగారు తెలంగాణాను, హరిత తెలంగాణాను నేను చూడాలని’ ఆ దిశగా అహరహం కృషి చేస్తున్నారు. చెరువుల్లో చేపల పెంపకాన్ని గురించి మత్స్యకారులకు అభివృద్ధి పాఠాలు చెబుతున్నారు. గొర్రెల పెంపకం వల్ల పశుసంతతి వృద్ధి అవడమే కాక వాటి ఎరువులతో భూమి సారవంతమవుతుంది. చేపల పెంపకం వల్ల మత్స్యకారుల జీవితాలు ఆర్థికంగా మెరుగుపడతాయి. రైతులకు మంచి విత్తనాలను, ఎరువులను సరఫరా చేయడం, పంటను మార్కెటింగ్ చేసే కీలక సమయంలో సహకరించడం వల్ల కేసిఆర్ ఆశయాలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూడా మంత్రివర్గ అంతఃకలహాలకు, భూ కుంభకోణాలకు, కుల రాజకీయాలకు, స్వార్ధపూరిత పదవీ పందేరాలకు, ఓటుబ్యాంకు రాజకీయాలకు చెక్ పెట్టాలి. ప్రజలను పట్టించుకోని నాయకులు రాజకీయాల్లో ఎక్కువ కాలం నిలవలేరని పాలకులు ఇకనైనా గుర్తించాలి.

- డా. కొఠారి వాణీచలపతిరావు