కడప

కెసి కాలువ నిండా చెత్తా చెదారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: బ్రిటీషు హయాంలో కర్నూలు-కడప జిల్లాల కాలువలు నిర్మించి రైతాంగంలో కొన్ని ప్రాంతాల్లో, కడప నగరంలో తాగునీటి సమస్య తీర్చేందుకు నిర్మించిన కెసి కాలువ కడప పరివాహక ప్రాంతంలో కూరుకుపోయి, చెత్తాచెదారం, మురుగునీరు, గుర్రపుడెక్కలతో దుర్గంధం వెదజల్లుతోంది. చెన్నూరు శివారు ప్రాంతంనుంచి నగరంలోని రామరాజుపల్లె, బిల్టప్, రామకృష్ణ జూనియర్ కాలేజి, అగాడి, అల్మాస్‌పేట, పెద్దబురుజు, రవీంద్రనగర్ వరకు కెసి కెనాల్‌లో చెత్తాచెదారం ఏరులై పారుతోంది. ఈ కెనాల్ పక్కనే బుగ్గవంక ప్రాజెక్టు నుంచి వచ్చేనీరు పెద్దకాలువ ఉండటంతో బుగ్గవంక కాలువ, కెసి కెనాల్ కలిసిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. 1866లో ఈ కాలువను బ్రిటీషువారు నిర్మించి నాటి నుంచి కొంతకాలం పాటు నౌకాయానం సాగించారు. తరచూ ఈకాలువను మరమ్మతు, లైనింగ్ పనులు చేయడం తప్ప ఇంతవరకు శుభ్రం చేసిన దాఖలాలు లేవు. వాస్తవంగా ఈ కాలువ కింద 52746 హెక్టార్లలో సాగుకు నోచుకోవాల్సివుంది. 304 కి.మీ.పొడవునా కర్నూలు నుంచి కడప వరకు ఈకాలువను నిర్మించారు. 1996 నుంచి 2004 వరకు రూ.2వేలు కోట్లు ఖర్చుచేసి ఆధునీకరించి ప్రధానకాలువ, ఉపకాలువను మరమ్మతుచేసి మరమ్మతులో ఉన్న షెట్టర్లను మార్చి కొత్త షెట్టర్లు ఏర్పాటు చేశారు. కెసి కెనాల్ పరిధిలో ఒకప్పుడు పచ్చనిపైరుతో సస్యశ్యామలం అవుతుండటంతో ఆ నీరు నగరంలో చేరేందుకు ఆగస్టునెల వరకు ప్రతి ఏటా గడువు ఇచ్చేవారు. ఇంతవరకు గుర్రపుడెక్కలు, కాలువలు పూడిపోవడం, దుర్గంధంతో కంపుకొడుతున్నాయి. కడప నగరంలో ఉన్న జనాభాకు ఏప్రాంతం ఉన్న కంపు, దుర్గం ద్వారా దోమల బెడద, విషపురుగుల సంచారం ఆ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. నగరంలో పలు ప్రైవేట్ వైద్యశాలలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు పరిశ్రమల వ్యర్థపదార్థాలు కాలువలోనే డంపింగ్ చేయడం వల్ల కంపు అంతా ఇంతాకాదు. అనేక పర్యాయాలు సంబంధిత ప్రాంతవాసులు ఆందోళన చేపట్టినా ఇంతవరకు కడప నగర సమీపంలోని కాలువల్లో ఉన్న చెత్తాచెదారాన్ని గుర్రపుడెక్కలను తొలగించలేదు. ప్రతి వర్షాకాలంలో ఈకాలువ నిండా దోమలు సంసారం చేస్తూ విషపురుగులన్నీ నగరంలోకి రాకపోకలు సాగిస్తుంటాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది కెసి కెనాల్‌లో ఉన్న మురుగునీరు పట్టణంలో సగభాగం వరకు కంపుకొడుతూ దోమల వ్యాప్తితో మెదడువాపు, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు, డెంగ్యు, కామెర్లు తదితర వ్యాధులు ప్రబలి నగరవాసులు గజగజ వణుకుతున్నారు. ఈ పొరుగునే ఉన్న బుగ్గవంక కాలువ కూడా అదే తరహాలో తయారుకావడం, దశాబ్దకాలంగా నగర పాలక సంస్థ పాలకవర్గం కడపను సుందరీకరణగా తీర్చిదిద్దుతామని కొంతమంది సింగపూర్, మలేషియా నగరాల మాదిరిగా తీర్చిదిద్దుతామని ప్రకటనలు చేస్తున్నారు తప్ప బుగ్గవంక, కెసి కాలవ కంపునుతొలగించని కారణంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీసుకుని బుగ్గవంక, కెసి కెనాల్ కంపు తొలగించి ప్రజారోగ్యాన్ని కాడాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఒంటిమిట్ట కోదండ రామయ్య పవిత్రోత్సవాలు ప్రారంభం

ఒంటిమిట్ట: ఏకశిల నగర దశరథ రాముని పవిత్రోత్సవాలు సోమవారం సాయంత్రం అంకుర్పారణతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారామలక్ష్ముణ ఉత్సవమూర్తులకు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు జరిపి ఆలయ మధ్యరంగంలో విష్వస్సేన పూజకు ఒకే పీఠంపై ఆసీనులు చేయించారు. అనంతరం స్వస్తిపుణ్యావాచనం, అంకుర్పారణ, గణపతి పూజ, రుత్వికరణం, హోమాది పూజలను వేద పండితులు వైష్ణవ ఆగమశాస్త్ర ప్రకారం శాస్త్రోక్తంగా జరిపారు. సోమవారం సాయంత్రం పుట్టవద్ద పూజలు జరిపి అంకుర్పారణకు నాంది పలికారు. ఈ కార్యక్రమాలు మంగళ, బుధవారాలు కొనసాగించి చివరి రోజు గురువారం గ్రామోత్సవం నిర్వహించనున్నారు. మొత్తం మీద కోదండ పాణి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కోదండ రామాలయంలో ఏడాది పొడవున జరిగిన పూజా కార్యక్రమాలలో తలెత్తిన దోషాలను నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం టిటిడి ఆనవాయితీ. అందులో భాగంగానే గ్రామ ప్రజల సుఖ సంతోషాల కోసం, సకాలంలో వర్షాలు కురిసేందుకు పవిత్రోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని టిటిడి అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయన్నారు.
అమావాస్య రోజు ప్రారంభించడంపై విమర్శలు
ఆదివారం అర్ధరాత్రి నుండి పూర్తి అమావాస్య ఉండగా ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభించడంపై ఇక్కడ ప్రజలు, భక్తులు టిటిడి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. సాధారణంగా అమావాస్య అంటే ఎలాంటి శుభకార్యాలు చేయకపోవడం ఆనవాయితీ. ఎంతో ప్రసిద్ధికెక్కిన ఆలయంలో అమావాస్యనాడు పవిత్రోత్సవాలు ప్రారంభించడం ఏమిటని భక్తులు విమర్శిస్తున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణపై ఎలాంటి ప్రచారాలు లేకపోవడం ఆలయంలో భక్తుల కోలాహలం కనిపించకపోవడం బాధాకరం. కేవలం ఆలయంచుట్టూ చలువ పందిళ్లు వేశారేతప్ప ఎలాంటి ప్రచారం నిర్వహించక పోవడంతో విమర్శలు అధికంగా వ్యక్తమవుతున్నాయి. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సోమవారం సాయంత్రం ప్రారంభమైన పవిత్రోత్సవాలలో టిటిడి డిప్యూటీ ఇఓ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. విష్వస్సేన పూజలో పాల్గొన్న ఆయనచే అర్చకులు మహాసంకల్పం చేయించారు. అనంతరం శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పుట్టమన్ను తీసే కార్యక్రమంలో అర్చకులు, అధికారులు పాల్గొని ఘనంగా అంకుర్పారణ జరిపారు. మొదటిరోజు పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఊసేలేని దత్తత గ్రామాల అభివృద్ధి!
ఆంధ్రభూమి బ్యూరో
కడప: గ్రామసీమల అభివృద్ధికోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గ్రామాలను దత్తత తీసుకుని గ్రామ సీమల అభివృద్ధికోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. దత్తగ్రామాల అభివృద్ధికి కేంద్రం రూ.100కోట్లు, ఉపాధిహామీ పథకం గ్రాంట్ రూ.100కోట్లు, వెరసి రూ.200కోట్లు కేటాయించారు. 2015 నుంచి ఐఏఎస్, ఐపిఎస్ రాష్టస్థ్రాయి అధికారులు ఎంతో అట్టహాసంగా గ్రామాలను దత్తత తీసుకున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ కెవి రమణ బి.మఠం మండలం మల్లెల గ్రామాన్ని , బదిలీ అయిన కెవి సత్యనారాయణ కలసపాడు, ఒక ఐపిఎస్ ఆఫీసర్ అన్బురాజన్ లింగాల మండలంలోని ఫ్యాక్షన్ గ్రామాన్ని, పంచాయతీరాజ్ గ్రామీణ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి ముద్దనూరు, చిట్వేలిని ఐఏఎస్ ఆఫీసర్ రామారావు, రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఐపిఎస్ అధికారి రాజశేఖర్‌బాబు, ఆ తరహాలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కోగ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కేంద్రప్రభుత్వంలోని సడక్ యోజన అభివృద్ధికింద దత్తత గ్రామాలను తీసుకున్న ప్రాంతాలకు ప్రభుత్వం నిధులు మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి లింగాల మండలం మురారి చింతల, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు ఎర్రగుంట్ల మాలేపాడు తదితర నేతలు దత్తత తీసుకున్నవారిలో ఉన్నారు. దత్తత గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించేందుకు ప్రజలందరూ ఏకగ్రీవంగా తీర్మానంచేసి రోడ్లు, డ్రైనేజిలు, వీధిలైట్లు ఇంటింటా మరుగుదొడ్డి, శ్మశానాలు, దేవాలయాలు, ఆరోగ్యవసతులు కల్పించాల్సివుంది. అట్టహాసంగా ప్రారంభమైన దత్తత గ్రామాల ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ఆఘమేఘాలమీద రూ.200కోట్లు మంజూరుచేసింది. గ్రామసీమల అభివృద్ధికి ప్రత్యేకించి వివిధ పథకాల కింద నిధులు మంజూరు కావడం, వాటిని ఖర్చుచేయడమే గాకుండా గ్రామసీమల అభివృద్ధికోసం సడక్ యోజన పథకం కింద నాయకులు, అధికారులు ప్రభుత్వమెప్పులు పొందేందుకు దత్తత తీసుకున్నారే కానీ 2015-16 లో అధికారులు, నేతలు దత్తత తీసుకున్న గ్రామాల్లో అట్టహాసంగా పర్యటనలు చేసి ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ప్రకటనలు గుప్పించి సభలు, సమావేశాలు నిర్వహించి ఫొటోలకే పరిమితం అయ్యారే తప్ప గత ఏడాది కాలం నుంచి ఆప్రాంతాలను నేతలు, అధికారులు చూసిన దాఖలాలులేవు. ఏగ్రామం చూసినా ఏముందు గర్వకారణమంటూ తాగునీటి బోర్లు, రక్షిత నీటి పథకాల వద్ద కుప్పలు తెప్పలుగా చెత్త చెదారం, డ్రైనేజి కాలువలు లేక మురుగునీరు, వర్షపునీరు ఏకమై వీధుల్లో ఎక్కడపడితే అక్కడ కుంటలు, చెరువులుగా నిలిచిపోయి దుర్గంధం కొడుతోంది. అయితే దత్తత తీసుకున్న గ్రామాల్లో సంబంధితశాఖ అధికారులు తమకేమీ పట్టని విధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రూ.200కోట్లు ఖర్చుచేస్తే పలు గ్రామాలు అభివృద్ధికి నోచుకునేవి. అయితే దత్తతగ్రామాల అభివృద్ధికి ఇంతవరకు సంబంధిత శాఖలు ఖర్చుచేసిన నిధులపై నోరుమెదపడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఏదీ.!

కొండాపురం: ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పర్యవేక్షించి, పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంపై అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడింది. ప్రతి సోమవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ అధ్యక్షతన ప్రజావాని నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రజావాణిపై మండల తహశీల్దార్‌తో పాటు, మిగిలిన శాఖల అధికారులకు పట్టనట్లు స్పష్టమవుతోంది. దీంతో దాదాపు ఏడాది కాలంగా ప్రజావాణి కార్యక్రమం ఎలా ఉంటుందో మండల ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొని ఉంది. నియోజకవర్గంలోని కొండాపురం మండలంలో 51రెవెన్యూ గ్రామాల్లో, సుమారు 40వేల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. మండలంలో చాలా సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తే ప్రతి సోమవారం మండలంలోని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రజావాణి కార్యక్రమం నెలల తరబడి నిర్వహించకపోవడంతో అధికారులు ఎవరికి వారే అన్న తీరుగా ఎవరు ఎక్కడ ఉంటారో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కంట పడిన రోజే తమ సమస్య చెప్పుకోవడానికి మహాభాగ్యమైన రోజుగా ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడింది. ఏ చిన్న సమస్య చెప్పుకోవాలన్నా ఆర్డీవో కార్యాలయంగానీ, కలెక్టర్ వద్దకు గానీ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి మండలంలో నెలకొంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మండలంలో ప్రజావాణి దుస్థితిపై దృష్టి సారించి పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఉప్పలూరులో తాగునీటికి తిప్పలు!

ముద్దనూరు: దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యడన్న చందంగా మారింది ముద్దనూరు ఆర్‌డబ్ల్యుయస్ అధికార గణం తీరు. తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా యంత్రాంగం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు కనికరం చూపడం లేదు. ఫలితంగా కిలోమీటర్ల మేర ప్రజలు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి మండలంలోని ఉప్పలూరు గ్రామ ప్రజలకు ఏర్పడింది.
మండల పరిధిలోని ఉప్పలూరు గ్రామంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని దాదాపుగా 600 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గత వారం రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నిమార్లు సంబంధిత అధికారులకు సమస్యను తెలిపినా పట్టించుకున్న సందర్భాలు లేవు. నీటి ఎద్దడికి తాళలేక విసిగి ఆగ్రహించిన ప్రజలు సోమవారం మండల కేంద్రమైన ముద్దనూరులోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు వచ్చిన ప్రజలు అధికార గణం కనిపించకపోవడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. దీంతో మరింత ఆగ్రహించిన ప్రజలు తహశీల్దార్ రమకు తమ గోడును వెల్లబోసుకున్నారు. తాగునీరు లేక 2కి.మీ.వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని, ముసలి వారి పరిస్థితి నీటికోసం దయనీయంగా మారిందని కన్నీటి పర్యంతం అయ్యారు. తహశీల్దార్ వెంటనే ఆర్‌డబ్ల్యుయస్ అధికారికి ఫోన్ చేసి విచారించగా గత నాలుగు రోజుల నుండి పంపిణీ చేయడం లేన్నారు. తహశీల్దార్ త్రిసభ్య కమిటీకి తెలుపకుండా ఎలా నితెలిపారన్నారు. కనీసం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడమేంటని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. నీటి పంపిణీ జరిగేటప్పుడు బిల్లుల మంజూరు చేస్తారు కానీ, నిలిపి వేసినప్పుడు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ తహశీల్దార్ రమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థులు లక్షుమయ్య, గంగరాజు, నారాయణమ్మ, అంకాలమ్మ, సుబ్బలక్ష్మి, గ్రామస్థులు ఉన్నారు.

దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకుంటుంది
కడప(కల్చరల్): టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దివ్యాంగుల శ్రేయస్సుకోరి వారికి చేయూతనిస్తున్నారని అదేవిధంగా దివ్యాంగుల నైపుణ్యాన్ని మెరుగుపరచుకుని అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసాలురెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ కోటేశ్వరరావులు అన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన రాష్టస్థ్రాయి సదస్సుకు ఏపివిహెచ్‌పిఎస్ రాష్ట్ర అద్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి అధ్యక్షత వహించిన సదస్సుకు వారు ముఖ్యఅతిధులుగా పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులను అన్నిరంగాల్లో ముందుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు వారికి ప్రత్యేకంగా ప్రవేశపెట్టారని, సంక్షేమపథకాలు సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. దివ్యాంగులకు 80శాతం వికలత్వం ఉండి, 10వ తరగతి పాస్ అయిన వారికి 2500 స్కూటర్లు పంపిణీ త్వరలో జరుగుతుందన్నారు. అదే విధంగా 70శాతం ఉన్న వారికి కూడా మరో 2500 స్కూటర్లు పంపిణీ చేయాలని సీఎంకు విన్నవిస్తామన్నారు. టిడిపి హయాంలోనే పెన్షన్‌సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన వారికి ఆయా విభాగాల్లో రుణాలు అందించి వారిని ఆదకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పోలియో ద్వారా వికలత్వం సంభవిస్తుందని గుర్తించి వారికి పోలియో చుక్కలు వేసి రాకుండా అరికట్టిన ఘనత టిడిపిదే అన్నారు. అనంతరం అర్హత ఉన్నవారికి అక్కడ ఉచిత బస్‌పాస్ సౌకర్యం ఏర్పాటుచేసి బస్‌పాసులను, ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపి విహెచ్‌పిఎస్ గౌరవాధ్యక్షుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, సంఘసేవకులు సలావుద్దీన్, టిడిపి నగర అధ్యక్షుడు జిలానీబాషా, విహెచ్‌పిఎస్ జిల్లా అధ్యక్షుడు చిన్నసుబ్బయ్య యాదవ్, పుష్పగిరి విద్యాసంస్థల చైర్మన్ వివేకానందరెడ్డి, జరుగువెంకటసుబ్బారెడ్డి, మన్మోహన్‌రెడ్డి, శివారెడ్డి, విహెచ్‌పిఎస్ నాయకులు రామయ్య, మహిళా విభాగం ధ్యక్షురాలు ఈశ్వరమ్మ, పాల్గొన్నారు.

మట్కా నిర్మూలనకు విద్యార్థుల ర్యాలీ

కమలాపురం: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కమలాపురం మండలంలో మట్కా నిర్మూలనకై సోమవారం సాయంత్రం ఎస్సై మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో స్థానిక సిఎస్‌ఎస్సార్ డిగ్రీ, పీజి, ఇంటర్ కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చేతిలో ఫ్లకార్డులను పట్టుకుని మట్కాను నిర్మూలిద్దాం, కుటుంబాలను బాగుపరుద్దాం అనే నినాదాలతో సంబటూరు బస్టాండ్ నుంచి రైల్వేగేటు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరివర్తన పేరుతో మట్కా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో మట్కా నిర్వహిస్తున్న బీటర్లు తమ వృత్తికి స్వస్తిపలికి జీవించేందుకు మరోమార్గాన్ని ఎంచు కోవాలన్నారు. వారి ఉపాధి కోసం తమ వంతు సహకారం కూడా అందిస్తామని భరోసా ఇచ్చారు. మట్కా, జూదం వల్ల వందలాది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిని ఆస్తులను తాకట్టు పెట్టుకుని విడిపించుకోలేక అప్పులపాలవుతున్నారని అన్నారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ పరివర్తన పేరుతో మట్కా నిర్మూలించేందుకు కంకణం కట్టుకున్నా రన్నారు. ఇందుకోసం పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. విద్యార్థులు తమ తమ గ్రామాల్లో మట్కా నిర్మూలనకై ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ సుబ్బరాయడు, అంకిరెడ్డి, రమణారెడ్డి, ఎన్‌సిసి కో ఆర్డినేటర్ అనంత రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

పెన్నాకు వర్షంనీరు..

చెన్నూరు: పెన్నా,కుందూ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో కుందూనది నుంచి వస్తున్ననీరు పెన్నానదికి చేరడంతో ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద నీటిని కొంత దిగువకు విడుదల చేస్తూ మరికొంతనీటిని రైతుల శ్రేయస్సుకోసం పాతకడప చెరువుకు, చెన్నూరు మండల పరిధిలోని రాచినాయపల్లి, పాలంపల్లె చెరువులకు సోమవారం నీటిని మళ్లించారు. కెసి కెనాల్ అధికారి సంథాని, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటసుబ్బయ్య, లస్కర్లు ఆదినిమ్మాయపల్లె ఆనకట్టవద్ద కెసి కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. 190 క్యూసెక్కులనీటిని కెనాల్‌కు విడుదల చేయడం జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇటీవల పెన్నాకు వచ్చే వర్షం నీరు కెనాల్‌కు వదలాలని కడప పరిసర ప్రాంతాల రైతుల విజ్ఞప్తిమేరకు కెనాల్‌కు నీటిని వదలడం జరిగిందన్నారు. పెన్నా నుంచి వస్తున్ననీరు 350 క్యూసెక్కులు పైబడి తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం కెసి కాలువకు 190క్యూసెక్కులు విడుదలచేయగా మిగిలిననీటిని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట నుంచి దిగువకు వస్తున్నాయన్నారు. మండలంలో రాచినాయపల్లి , పాలంపల్లి చెరువులకు నీటిని మళ్లింపుతోపాటు పాతకడప చెరువుకు కూడా నీటిని మళ్లించడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం వదులుతున్న కెనాల్ నీరు కెనాల్ ఆయకట్టుకింద ఎటువంటి పంటలకు ఉపయోగపడదని రైతులు గమనించాలని వారు సూచించారు. ఈ నీటిని విడుదల చేయడం వల్ల చెరువుల ప్రాంతాల్లో, పాతకడప చెరువు ప్రాం తాల్లో భూగర్భజలాలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని ఇందులో తాగునీటి కొరత లేకుండా చూసేందుకు నీటిని మళ్లించామన్నారు.
సిద్దవటంలో..
సిద్దవటం: ఇటీవల కురిసిన భారీ వర్షాలకారణంగా పెన్నానదిలోకి కొద్దికొద్దిగా నీరు వచ్చి చేరుతోంది. ఈమేరకు పెన్నాలో నీరు వస్తుండటంతో జాలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దికాలంలో పెన్నాలో నీరు లేకపోవడంతో ఢీలాపడ్డ మత్స్యకారులు నీరు వస్తుండటంతో తమ సంతోషానికి హద్దులు లేవు. పెన్నానదిలో వరదనీరు వచ్చి చేరితే తమకు చేతినిండా పనిదొరుకుతుందని వారు భావిస్తున్నారు. వర్షాలు బాగా పడాలని వారు దేవుడిని ప్రతిరోజు వేడుకుంటున్నారు.