చిత్తూరు

సదావత్ సత్రం భూముల ఆక్రమాల నిగ్గు తేల్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 2: సదావత్ సత్రంకు సంబంధించిన భూముల విక్రయాలలో అవకతవకలు జరిగాయని సత్రం పేరుతో ఉన్న వందలాది ఎకరాల భూములను అమ్ముకున్నారని భూము అక్రమాలను ప్రభుత్వం నిగ్గు తేల్చాలని విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఉదయం నైవేద్య విరామదర్శన సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయంలో తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటి ఇ ఒ కోదండరామారావు దర్శనం ఏర్పాటు చేసి తీర్థం ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ గంగాతీరాన చాతుర్మాస దీక్ష చేయడం ఆనవాయితీ అన్నారు. ఈదీక్షకు వెళ్లేముందు తిరుమల శ్రీవారి పాదాలను దర్శించుకోవడం ఆనవాయితీ అన్నారు. అందుకోసమే తిరుమలకు వచ్చి స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నట్లు వివరించారు. చెన్నయ్‌లోని సదావత్ సత్రానికి సంబంధించిన 471 ఎకరాల భూములను విక్రయించం ద్వారా య కోట్లాది రూపాయల కుంబకోణం జరిగిందన్నారు. సదావత్ సత్రం దేవాదాయ, ధర్మాదాయశాఖకు సంబంధించిన సత్రమని అది ప్రభుత్వ ఆధీనంలో ఉందని అయినా పెద్దలు భూములను పూర్తిగా దోచేసి కేవలం 83 ఎకరాలను మాత్రమే మిగిల్చారన్నారు. ఈ భూములను విక్రయాలలో వేలకోట్లు కుంభకోణం జరిగిందని వీటన్నింటిని వెలికితీసేందుకు సిట్టింగ్ జడ్జితోకాని, సిబిఐతో కానీ పూర్తిగా విచారించి భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడిపై పూర్తినమ్మకం ఉందని ఆయన వెంటనే స్పందించి ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలన్నారు. సత్రాలు, మఠాలు, పీఠాలకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హిందూ సంస్థలకు సంబంధించిన ఆస్తులను కొల్లగొడుతున్నారని ప్రభుత్వ చిత్తశుద్ధితో విచారించి అన్యాక్రాంతమైన ఆస్తులన్నింటిని కాపాడాలన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తులను స్వాధీనం చేసుకోకపోతే తాము దీనిని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. దేశంలోని అన్ని హిందూ మఠాలు, పీఠాధిపతులు, హిందువులు ఏకమై ఉద్యమించడమే కాకుండా కోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి కుంభకోణాన్ని వెలికి తీయాలన్నారు. కేవలం పాపాలు చేసిన వారే దేవాలయాలకు వస్తున్నారని, హుండీలో కానుకలను సమర్పిస్తున్నారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. అయితే ఆయన అలాంటి మాటలు తెలియక మాట్లాడి ఉంటారేమో అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడి మనవడి పుట్టిన రోజు సందర్భంగా రూ.20లక్షలు స్వామివారికి కానుకగా సమర్పించారని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. నాటి రాష్టప్రతుల నుంచి నేటి రాష్టప్రతుల వరకు ప్రతి ఒక్కరూ తిరుమల పర్యటన చేస్తున్నారని, తాను కూడా స్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించామని అంతమాత్రాన తామందరం పాపాలు చేసినవారం అవుతామా ఆని ప్రశ్నించారు.
కుమారుడిని కళాశాలలో చేర్పించి తిరిగి వస్తూ అనంతలోకాలకు..!
* కారును ఢీకొన్న గుర్తుతెలియని వాహనం - ఒకరి మృతి
కల్లూరు, జూలై 2: కుమారుడికి ఉన్నత చదువులు అందించి గొప్ప స్థాయిలో చూడాలన్న లక్ష్యంతో తల్లిదండ్రులు తన కుటుంబ సభ్యులతో కలిసి సొంత కారులో కుమారుడిని ఇంటర్ కళాశాలలో చేర్పించి స్వగ్రామానికి తిరుగుప్రయాణంలో మార్గమధ్యంలో గుర్తు తెలియని వాహనం మృత్యువు రూపంలో వచ్చి కారును ఢీకొనడంతో ఆ తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా తల్లి, సోదరి, సోదరులకు తీవ్రగాయాలైన సంఘటన పులిచెర్ల మండలం కల్లూరు ఇందిరానగర్ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం వేకువజామున చోటుచేసుకుంది. కల్లూరు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల మేరకు పుంగనూరు పట్టణానికి చెందిన కరీముల్లా (45) తన కుమారుడు అబ్దుల్‌ను నెల్లూరు నారాయణలో ఇంటర్మీడియట్ కళాశాలలో చేర్పించేందుకు భార్య, కుమార్తె, మరో ఇద్దరు కుమారులతో కలిసి సొంత కారులో బుధవారం ఉదయం బయలుదేరి వెళ్లాడు. కళాశాలలో కుమారుడిని చేర్పించిన కరీముల్లా నెల్లూరు నుండి బుధవారం సాయంత్రం తిరుగుప్రయాణం అయ్యారు. కల్లూరు సమీపంలోని ఇందిరానగర్ వద్ద ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం వేగంగా కారును ఢీకొని వెళ్లి పోవడంతో కరీముల్లా అక్కడికక్కడే మృతి చెందగా భార్య కౌసరి, కుమార్తె సానియా, కుమారులు వాఫిక్, అస్మాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108వాహనంలో ఆసుపత్రికి తరలించిన అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

దేవీశ్రీప్రసాద్ లక్ష్యం నెరవేరాలి
* ఎమ్మెల్యే సుగుణమ్మ ఆకాంక్ష
* లక్ష రూపాయాలు విరాళం అందించిన
శ్రీ సిటీ ఇసుజు కంపెనీ
తిరుపతి, జూన్ 2: లింబో స్కేటింగ్‌లో గిన్సిస్ వరల్డ్ రికార్డు సాధించాలని తీవ్రంగా కృషి చేస్తున్న చిన్నారి దేవీశ్రీప్రసాద్ లక్ష్యం నెరవేరాలని ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. గురువారం వేదిక్ యూనివర్శిటీ బైపాస్ రోడ్డులో దేవీశ్రీప్రసాద్ చేపట్టిన విన్యాస కార్యక్రమాలను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కాగా సబ్‌కలెక్టర్ హిమాంశుశుక్లా దేవిప్రసాద్‌కు ఆర్థికంగా సహకరించాలని దాతలకు ఇచ్చిన పిలుపు సత్ఫలితాలను ఇచ్చింది. శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ఇసుజు కంపినీ ప్రతినిధి సునీల్ శేఖర్ లక్ష రూపాయలను చెక్కు రూపంలో విరాళంగా అందించారు. ఎమ్మెల్యే సుగుణమ్మ రూ.15వేలు విరాళంగా అందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగిస్తూ ఇప్పటికే దేవీశ్రీప్రసాద్ అనేక రికార్డులు బద్దలు కొట్టాడన్నారు. సబ్‌కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ కాళ్ళకు చక్రాలు కట్టుకుని 60సుమోలు కింద 120 మీటర్లు దూరాన్ని 20 సెకండలలో స్కేటింగ్ చేయడమే లక్ష్యంగా దేవీశ్రీప్రసాద్ ఆశయం నెరవేరాలని ఆకాంక్షించారు. తిరుపతి పేరుప్రతిష్టలను విదేశాల్లో మరింత గొప్పగా వినిపిస్తున్న చిన్నారిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, ఆటలు ప్రధమ స్థానంలో ఉన్నాయని విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపట్ట ఆసక్తిని పెంచుకోవాలని తెలిపారు.

చీటింగ్ కేసులో వ్యక్తి అరెస్టు
రేణిగుంట, జూన్ 2: మండల పరిధిలోని ఎర్రమరెడ్డి పాళ్యెంలో రూ.40లక్షలు విలువచేసే భూమిని దొంగపత్రాలు సృష్టించి ఇద్దరు మహిళలకు విక్రయించిన తిరుపతి బేరివీధికి చెందిన గురునాథ బాబును గాజుల మండ్యం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తాము కొన్న భూమి ఇతరులది తెలిసి బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించారు. కాగా ఇటువంటి మోసాలకు సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

డెయిరీ ఎదుట రైతు నేత దీక్షలు
చిత్తూరు, జూన్ 2: జిల్లాలో మూతపడిన సహకార సంస్థలను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూచిత్తూరులో మూతపడిన సహకార డెయిరి ఎదుట గురువారం శాంతియుత రైతు ఉద్యమ నేత ఈదల వెంకటాచలం నాయుడు దీక్షలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి నవనిర్మాణ దీక్షలు చేపట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లాలో అనేక మంది పాడిరైతులకు అండగా నిలిచిన సహకార డెయిరీతో పాటు చెరుకు రైతుల కోసం గతంలో నిర్మించిన సహకార చక్కర ఫ్యాక్టరీలు మూతపడంతో రైతులు అనేక రకాలుగా నష్టపోతున్నా వాటి గురించి పట్టించుకొని ముఖ్యమంత్రి నయవంచనకు పాల్పడ్డారని అందుకే నయవంచన దీక్షలు చేపట్టినట్లువివరించారు. చిత్తూరులోని సహకార డెయిరీ దేశంలోనే అగ్రగామిగా నిలిచి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించిందని అయితే కొందరు స్వార్థం వల్ల మూత పడిందన్నారు. దీంతో అనేక మందికి ఉపాధి అవకాశాలు లేకపోగా పాడి రైతులు ప్రైవేట్ డెయిరీల దోపిడికి గురుకావాల్సి వస్తోందన్నారు. కేవలం నష్టాలు వస్తున్నాయన్న నెపంతో చిత్తూరు, గాజులమండ్యం సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడటంతో చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనే రైతులు పలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం నేడు నవనిర్మాణ దీక్షలు చేయడం న్యాయమా అని ప్రశ్నించారు.
వెంటనే మూతపడిన సహకార ఫ్యాక్టరీలను తెరిపించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.

శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం
తిరుమల, జూన్ 2: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 14గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 8గంటల సమయం పడుతోంది. గురువారం తెల్లవారుజామున 3 నుంచి సాయంత్రం 6గంటల వరకు 48.913మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ.2.42కోట్లు ఆదాయం లభించింది.

సినీఫక్కీలో 19.50 లక్షల అపహరణ
* అప్రమత్తమైన పోలీసులు...కొద్దిసేపటికే రికవరీ, అదుపులో ముగ్గురు
పూతలపట్టు, జూన్ 2: బస్సులో రూ 19.50 లక్షలను తీసుకెళుతున్న వ్యక్తి నుంచి నగదును అపహరించిన వారిని కొద్దిసేపటికే పోలీసులు పట్టుకొన్న ఘటన గురువారం రాత్రి పూతలపట్టు సమీపంలో చోటు చేసుకొంది. వివరాల మేరకు చిత్తూరు జిల్లా నెరబైలుకు చెందిన అన్వర్ అనేవ్యక్తి బెంగళూరులో ఉన్న ఇంటిని ఇటీవల విక్రయించాడు. అందుకు సంబంధించిన 19.50 లక్షల రూపాయలతో తన స్వగ్రామానికి బస్సులో బయలు దేరాడు. ఈక్రమంలో ఈవిషయాన్ని పసికట్టిన ఇద్దరు వ్యక్తులు అన్వర్‌ను బస్సులోనే వెంబడించారు. పూతలపట్టు సమీపంలో బస్సు వెళ్తుండగా అన్వర్‌వద్ద ఉన్న బ్యాగ్‌ను లాక్కొని బస్సులోనుంచి కింద పడేసారు. బస్సును అనుసరిస్తూ రెండు స్కూటర్లలో వస్తున్న మరో ఇద్దరు ఈబ్యాగ్‌ను తీసుకున్నారు. వెంటనే బస్సులో ఉన్న ఇద్దరూ బస్సుదిగి అనుసరిస్తూ వస్తున్న స్కూటర్లపై క్షణాల్లో పరారయ్యారు. వెంటనే అన్వర్ పూతలపట్టు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హైవే మెబైల్ వారిని అప్రమత్తం చేశారు. రంగంపేట వద్ద రెండు స్కూటర్లలో వేగంగా వెళ్తున్న వారిని వెంబడించి పట్టుకున్నారు. ఇందులో ఒక్కరు పారిపోగా మరోముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద ఉన్న 19.50 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. ఈకేసును పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

17 నుండి తిరుమలలో జ్యేష్ఠ్భాషేకం
తిరుమల, జూన్ 2: ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జేష్ఠానక్షత్రానికి ముగిసేట్లుగా మూడు రోజులపాటు తిరుమల శ్రీవారికి జరిగే జ్యేష్ఠ్భాషేకం, సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు జరుగుతుందని టిటిడి పి ఆర్వో రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభిద్యేక అభిషేకం నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో 17 తేదీన నిర్వహించే ఆర్జిత సేవలైన నిజపాద దర్శనం, వసంతోత్సవ సేవలను టిటిడి రద్దు చేసింది. అదే విధంగా 18వ తేదీన వసంతోత్సవ సేవను, 19న నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది. తోమల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారన్నారు. తరతరాలు అభిషేకాదులతో అత్యంత ప్రాచీనమైన శ్రీస్వామివారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా పరిరక్షించే నిమిత్తం ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తొలిరోజున శ్రీ మలయప్ప స్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు, పంచామృత, స్నపన తిరుమంజనాదులు నిర్వహించిన తరువాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరిగిస్తారని తెలిపారు. రెండో రోజులన ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగిస్తారని, మూడువరోజున తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు చేస్తారు. ఈ బంగారు కవచ సమర్పణ మళ్లీ జ్యేష్ఠ్భాషేకంలోనే తీస్తారు. అంత వరకు సంవత్సరం పొడవునా స్వామివారు బంగారు కవచంతోనే ఉంటారని వివరించారు.
నేడు డయల్ యువర్ ఇ ఒ
తిరుమల, జూన్ 2: ప్రతి నెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించే డయల్ యువర్ ఇ ఒ కార్యక్రమం జూన్ 3వ తేదీ ఉదయం 8.30నుంచి 9.30 గంటల వరకు జరుగనుంది. ఈకార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ సాంబశివరావుకు 0877-2263261 నెంబర్‌కుఫోన్ ద్వారా నేరుగా తెలియజేయవచ్చు.

టిటిడి పరిపాలనా భవనం ఎదుట
పురాణ పండితుల యాగం
తిరుపతి, జూన్ 2: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పురాణాలు వల్లిస్తూ ఆందోళన చేస్తున్న పురాణ పండితులు గురువారం టిటిడి పరిపాలనా భవనం వద్ద హోమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హోహం నిర్వహించి తమ పట్ల టిటిడి యాజమాన్య తీరు మారాలంటూ ప్రార్థించారు. వీరి ఆందోళనకు మద్దతు పలికిన ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ టిటిడి పాలక మండలి, యాజమాన్యం తమ తీరు మార్చకోవాలని కోరారు. లేకుంటే తాను అన్ని రకాల చర్యలకు సిద్ధం అవుతానని తెలిపారు. రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షులు భూమన ప్రసంగిస్తూ పండితుల ఆందోళనకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈకార్యక్రమంలో శ్రీబాలాజీ పురాణ పండితుల యూనియన్ గౌరవాధ్యక్షులు కందారపు మురళి, జనవిజ్ఞాన వేదిక నాయకులు బిర్లా నాయుడు, యుటిఎఫ్ నాయకులు బి.వి.రమణ, యూనియన్ నేతలు భాగ్యలక్ష్మి, వి.కరుణాకర్‌రెడ్డి, పి.రామక్రిష్ణ, గంగాధరం, వేణుగోపాల్, లక్ష్మీనారాయణ, రామహెగ్గర్ పాల్గొన్నారు. కాగా శుక్రవారం తిరుమలేశుని చిత్రపటానికి పండితులు నివేదన కార్యక్రమంతో స్వామివారికి తమ సమస్యలను విన్నవించుకోనున్నారు.