చిత్తూరు

ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో తగ్గిన మాతాశిశు మరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్లే మాతాశిశు మరణాలు బాగా తగ్గాయని వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం శ్రీ కాళహస్తి ఏరియా ఆసుపత్రిలో జరిగిన డయాలసిస్ కేంద్రం ప్రారంభోత్సవంలో అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితోపాటు మంత్రి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతాశిశు మరణాలలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఉండేదని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్ల మాతాశిశు మరణాలు బాగా తగ్గాయని తెలిపారు. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ఉత్తమ బహుమతి ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందని తెలిపారు. తల్లీబిడ్డల సంరక్షణ కోసం ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని ప్రవేశపెట్టామని, ప్రసవం తరువాత పిల్లలకు సంరక్షణ ఉండేవిధంగా ఎన్టీఆర్ బేబి కిట్స్‌ను అందజేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ 41 లక్షల మంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. డయాలసిస్ కేంద్రం ప్రారంభోత్సవంలో తిరుపతి ఎంపి వరప్రసాద్, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, ఎమ్మెల్సీ గౌనిగారి శ్రీనివాసులు, టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ రాధారెడ్డి, టిడిపి నాయకులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మునిరాజానాయుడు, చెంచయ్యనాయుడు, వైద్య విధాన పరిషత్ జాయింట్‌కమిషనర్ జయచంద్రారెడ్డి, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
దోమలపై దండయాత్రకు ప్రభుత్వం సిద్ధం
రేణిగుంట : దోమల వల్ల వ్యాపించే విషజ్వరాలను అరికట్టేందుకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దోమలపై దండయాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను విష జ్వరాల నుంచి సంరక్షించేందుకు దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న వాతావరణానికి డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఇప్పటికే విష జ్వరాలు సోకిన వారికి తగిన వైద్యం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విషజ్వరాలు సోకిన వారికి తక్షణం చికిత్సలు చేసేవిధంగా అవసరాలకు కావాల్సిన మందులను ముందుగా తెచ్చిపెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. జ్వరం సోకిన రోగికి ప్రభుత్వాసుపత్రులు చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అనంతరం ఎంబిబిఎస్ బి కేటగిరి విద్యార్థులు మంత్రికి వినతిపత్రం అందించి తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన రోడ్డుమార్గాన ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు రోడ్డుమార్గాన బయలుదేరి వెళ్లారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో బిజెపి జాతీయ మహిళా నాయకులు శాంతారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, టిటిడి బోర్డు మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి, బిజెపి కార్యదర్శులు ఉన్నారు.

కర్నాటకలో రోడ్డుప్రమాదం
* రామసముద్రం వాసులు ముగ్గురు దుర్మరణం
మదనపల్లె, సెప్టెంబర్ 23: కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఈ ప్రాంత వాసులను కలిచివేసింది. రామసముద్రం మండలం నారిగానిపల్లెకు చెందిన నరసింహులు(40), భార్య గౌరమ్మ(38), వెంకటరమణ(41), భార్య లక్ష్మీదేవి(35), భాగ్యమ్మ(34), రెడ్డెమ్మ(38) కొత్తిమీర పెరికే కూలిపనులు చేసుకుని జీవనం సాగించేవారు. ఎక్కువగా బయటప్రాంతాలలో లభించే కొత్తిమీర కోసం కూలీలుగా ఈ పంచాయతీకి చెందిన కూలీలు వెళుతుంటారు. గురువారం యధావిధిగా కర్నాటక రాష్ట్రం చింతామణి ప్రాంతంలో కొత్తిమీర కోసం కెఎ 07 బి9090 నెంబరుగల టెంపోలో బయలుదేరి వెళ్ళి తిరిగి రామసముద్రంకు వస్తుండగా అర్ధరాత్రి సమయంలో మార్గమధ్యలోని చింతామణి మండలం మర్రినాయునిపల్లె క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో టెంపోలో ఉన్న నరసింహులు, భార్య గౌరమ్మ, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతిచెందారు. లక్ష్మీదేవి భర్త వెంకటరమణకు తీవ్ర గాయాలైయ్యాయి. రెడ్డెమ్మకు రెండుకాళ్ళు విరిగిపోగా, భాగ్యమ్మకు గాయలైయ్యాయి. గాయపడిన వారిని చింతామణి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చింతామణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరసింహులు, గౌరమ్మలకు ఒకే కుమారుడు రమణ మదనపల్లె ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుకుంటున్నారు. వెంకటరమణ, లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. తల్లి మృతిచెందగా, తండ్రి తీవ్రగాయాలతో బాధపడుతున్నారు. కూలికెళితే గాని గూడు గడవని ఈ కుటుంబాలను ఆదుకోవాలని నారిగానిపల్లె గ్రామస్థులు కోరుతున్నారు. ఒకే గ్రామంలో ముగ్గురు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో నారిగానిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విశేష అధికారాలతో బిసి కమిషన్‌ను
తక్షణం ఏర్పాటు చేయాలి
* బిజెపి, ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జల్లి మధుసూదన్ విజ్ఞప్తి

తిరుపతి, సెప్టెంబర్ 23: రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌లో విశేష అధికారాలతో కూడుకున్న బిసి కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని బిజెపి, ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జల్లి మధుసూదన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన బిసి కమిషన్ అధికారాలు లేకుండా చేసి నామమాత్రంగా తయారు చేశారన్న విమర్శలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో కమిషన్ ఒక రబ్బర్ స్టాంప్‌గా అపవాదులు మోయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 1993వ సంవత్సరంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జాతీయ, రాష్టస్థ్రాయిలో బిసి కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అలా అని అధికారాలు లేని కమిషన్ ఏర్పాటు చేస్తే వాటి వల్ల బిసిలకు కలిగే ప్రయోజనాలు శూన్యమన్నారు. ప్రస్తుతం బిసి కమిషన్‌లో విశ్రాంత న్యాయమూర్తులతో ఏర్పాటు చేస్తున్నారని, వీరు కులాలను కలపడం, తీసివేయడం, ప్రభుత్వాలకు నివేదికలు అందించడం తప్ప బిసిల సంక్షేమానికి తగిన రీతిలో పనిచేయలేని స్థితిలో కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి పరిస్థితి కలగకుండా ఉండాలంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కమిషన్‌లో ఏడుగురు సభ్యులుండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఉత్తరప్రదేశ్, సిక్కిం, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ తరహా కమిషన్ ఏర్పాటు చేసి ఉన్నారన్నారు. దీంతో ఆ రాష్ట్రాల్లో బిసిల సంక్షేమానికి మేలు జరుగుతుందన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్‌లో సవరణ చేసిన బిసి కమిషన్‌కు క్యాబినేట్ మంత్రి హోదా కల్పించారన్నారు. వైస్ చైర్మన్‌కు సహాయమంత్రి హోదా కల్పించారన్నారు. విశేష అధికారాలతో బిసి కమిషన్‌ను ఏర్పాటు చేస్తే బిసిల సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులను పూర్తిగా పరిగణనలోకి తీసుకొని నవ్యాంధ్రప్రదేశ్‌లో బిసి కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బిసిల సంక్షేమం పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపుతున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఉన్న కమిషన్‌ను రద్దుచేసి అధికారాలతో కూడుకున్న కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నానన్నారు. అలాగే దగ్గర, దగ్గర 10 కులాలకు ఫెడరేషన్‌లను స్థాపించి చైర్మన్‌లను, డైరెక్టర్‌లను భర్తీచేసి ఆ కులాల సంక్షేమానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఆంధ్రరాష్ట్రంలో దగ్గర, దగ్గర 55 లక్షల వాల్మీకి కులస్తులకు ఇంతవరకు ఫెడరేషన్‌లను గాని, చైర్మన్‌లను గాని, డైరెక్టర్‌లను గాని ఎక్కడ కూడా నియమించలేదని, ఇది వాల్మీకులపై వివక్షతా లేక ఏమనాలో కూడా తెలియని పరిస్థితి అన్నారు. ఇప్పటికైనా వెంటనే వాల్మీకి ఫెడరేషన్‌లను ఏర్పాటు చేసి చైర్మన్‌లను, డైరెక్టర్‌లను నియమించాలని ఎపి, బిజెపి, ఓబిసి, మోర్చ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు చంద్రారెడ్డి, కార్యదర్శి కొనగంటి భాస్కర్, దక్షణ రాష్ట్ర జిల్లా ఓబిసి నాయకులు పి రవి కుమార్, టి సూరిబాబు, నాగేంద్రకుమార్, జె రామమోహన్‌రావు, బి వెంకటశివనారాయణ, బి శ్యామ్‌బాబు, వి సుబ్రహ్మణ్యం యాదవ్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఓబిసి అధ్యక్షుడు కొండముది బంగారుబాబు, కడప జిల్లా ఓబిసి అధ్యక్షుడు దస్తగిరి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా బిజెపి ఓబిసి రాష్ట్ర అధ్యక్షుడు జల్లి మధుసూదన్‌ను జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.

కళాకారుల మనస్సు ఉప్పొంగింది
* సానుకూలంగా స్పందించిన ఇఓ సాంబశివరావు * దీక్ష విరమించిన కళాకారులు

తిరుపతి, సెప్టెంబర్ 23 : గ్రామీణ భజన కళాకారులు తమ సమస్యల పరిష్కారం కోసం గత మూడు రోజులుగా టిటిడి పరిపాలనా భవనం ముందు వందలాది మంది కళాకారులతో నిరవధిక దీక్ష చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు, జెఇఓ పోలా భాస్కర్, ఇతర అధికారులు, జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి, గౌరవాధ్యక్షుడు కందారపు మురళి, సంఘం నాయకులు నారాయణ, రామచంద్రన్, ఎల్లారెడ్డి, గంగులప్ప, వెంకటరమణ, సాంబమూర్తిలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు కళాకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వారి ముందు ఉంచారు. ఇందులో ప్రధానంగా ప్రదర్శనకు వెళ్లే వారికి బస్సు ఛార్జీలు, ప్రతి గ్రామానికి వాయిద్య పరికరాలు, ఏడాదికోమారు తిరుమలలో ప్రదర్శించే అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు ఇఓ సానుకూలం వ్యక్తం చేశారు. అలాగే భజన కళాకారులకు శ్రీవారి లడ్డూలు ఉచితంగా ఇవ్వాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే అది సాధ్యం కాదని అధికారులు తేల్చిచెప్పారు. సొంత ఖర్చులతో ఉచిత సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులకు కూడా ఉచితంగా లడ్డు ఇవ్వడం లేదన్న విషయాన్ని నాయకులు స్పష్టం చేశారు. ఇక భజన కళాకారులు పౌరాణిక కథలను నాటకాలుగా వేయడానికి మహతి ఆడిటోరియంను ఉచితంగా ఇస్తామని కూడా స్పష్టం చేశారు. కళాకారుల్లో నైపుణ్యాన్ని పెంచుకుంటే ఎస్వీ భక్త్ఛినెల్‌లో అరగంట పాటు వారు ప్రదర్శించే అవకాశం కల్పిస్తామని కూడా స్పష్టం చేశారు. నాదనీరాజనం వేదికపై కూడా ప్రదర్శన ఇవ్వడానికి అనుమతిస్తామని, అందుకు కళాకారులు తగు శిక్షణ పొందాలన్నారు. తొలివిడతలో 15 రోజులకు ఒకసారి ఇస్తామని, అటు తరువాత అవసరమైతే ఏడాది పొడవునా ఇస్తామన్నారు. మైక్‌సెట్‌లు, వాయిద్య పరికరాలు కూడా అందిస్తామని, అయితే ఒక్కో ఊరిలో ఎక్కువ భజన మండళ్లు ఉంటాయని, అందరికీ మైక్‌సెట్ ఇవ్వడం కూడా వృధా అని ఇఓ స్పష్టం చేశారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని ఒక మైక్ సెట్ అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే కళాకారులు ఎక్కడ భజనలు చేస్తారో అక్కడ వారికి అవసరమైన వాయిద్య పరికరాలు టిటిడి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కందారపు మురళి భజన కళాకారులతో మాట్లాడుతూ టిటిడి అధికారులు ఇంత సానుకూలంగా వ్యక్తం చేస్తారని తాము కూడా ఊహించలేదన్నారు. అయితే ఇఓ ఎంతో గొప్ప మనసుతో జానపద నృత్య కళాకారులకు న్యాయం చేయడం అభినందనీయమన్నారు. కళాకారులను ప్రోత్సహించడానికి ఆయన అన్ని చర్యలు చేపడుతున్నారని తెలిపారు. కాగా ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న కళాకారుల సమస్యల పరిష్కారానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో వ్యవహరించిన సంఘం అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి అభినందనీయుడన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. కళాకారులు కూడా ఆనందంతో ఉప్పొంగారు. గోవింద నామస్మరణతో పులకించారు. శ్రీవారి లడ్డూ ఉచితంగా లభించకపోయినా తమ సమస్యలు పరిష్కరించిన ఇఓ సాంబశివరావు లడ్డూలాంటి తీపి కబురు ఇచ్చారని విలేఖర్లతో అన్నారు. కాగా ఈ సందర్భంగా రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు శ్రీదేవి, కందారపు మురళి దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.

స్కౌట్స్ అండ్ గైడ్ ద్వారా నిధులు మంజూరు
*చీఫ్ కమిషనర్ ఆర్‌కె శశిధర్
బి.కొత్తకోట, సెప్టెంబర్ 23: పర్యాటక కేంద్రంలో స్కాట్ ఆండ్ గైడ్స్ భవనం శిథిలావస్థలో ఉన్న విషయాన్ని సంబంధిత అధికారులు పరిశీలించారు. శుక్రవారం హార్సీలిహిల్స్‌లో స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ ఆర్‌కె శశిధర్ రూ.9లక్షలు నిధులు ఈ భవనం మరమ్మతులకు కేటాయించినట్లు ప్రకటించారు. విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటుచేసి మదనపల్లె రోటరీక్లబ్ ద్వారా రూ.2.50లక్షలు విరాళంగా అందించినట్లు తెలిపారు. తమ భవనస్థలంలో ఎనిమిది సెంట్లు స్థలం ఆక్రమణకు గురైందని రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కార్యక్రమంలో స్కాట్ అండ్ గైడ్స్ రాష్ట్ర కమిషనర్లు రామ్మోహన్‌రావు, శ్రీ్ధర్‌రావు, సహాయ కమిషనర్లు రామకోటి ప్రసాద్‌రావు, శకుంతలమ్మ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సిటీని సందర్శించిన ఆగ్రా ట్రేడ్ సభ్యుల బృందం
సత్యవేడు, సెప్టెంబర్ 23 : చెన్నైలోని అగర్వాల్ సామాజిక వర్గ సమాఖ్య ఆగ్రా ట్రేడ్ నుంచి 38 మంది సభ్యుల బృందం శుక్రవారం శ్రీసిటీలో పర్యటించింది. ఆ సంస్థ అధ్యక్షులు రాజేష్ ఆధ్వర్యంలో విచ్చేసిన బృందానికి శ్రీసిటీ కార్పొరేట్ ఉపాధ్యక్షుడు రమేష్ ఆత్మీయ స్వాగతం పలికి శ్రీసిటీ అభివృద్ధి, వ్యాపార అనుకూలాల అంశాలను విశదీకరించారు. అనంతరం శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీలో గృహ సదుపాయాల్, షాపింగ్‌మాల్స్, మల్టీఫ్లెక్స్ సినిమా హాళ్లు, ఆటవిడుపు కేంద్రాలు వంటి వివిధ సామాజిక వసతుల ఏర్పాటుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు. వ్యాపార రంగాల్లో ప్రముఖులైన ఆగ్రా ట్రేడ్ సభ్యులు ఇక్కడి అభివృద్ధిని చూసి తమ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం ఆగ్రా ట్రేడ్ అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ శ్రీసిటీలోగల వ్యాపార అవకాశాలను ప్రత్యక్షంగా పరిశీలించడానికి గాను తమ సభ్యులు ఈ పర్యటనకు వచ్చినట్లు చెప్పారు. వ్యాపారాభివృద్ధికి అవసరమైన అన్ని హంగులను కలిగి ఉండి నేడు దేశంలో ప్రముఖ వ్యాపార నగరంగా శ్రీసిటీ ఎదిగిందన్నారు. శ్రీసిటీ పారిశ్రామిక రంగంలో సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రెక్చర్‌కు సంబంధించిన వివిధ అనుబంధ వసతులు ఏర్పాటు చేయడానికి తమ సభ్యులు ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. పర్యటనలో భాగంగా శ్రీసిటీలోని వివిధ ప్రదేశాలను, కొబెల్కో, జెడ్‌టిటి, వెంచర్, హంటర్‌తగ్లస్ పరిశ్రమలను వారు సందర్శించారు.

జనవరి 3న తిరుపతికి ప్రధానమంత్రి రాక
శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 23: 2017 జనవరి 3న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరుపతికి వస్తారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం శ్రీ కాళహస్తికి వచ్చిన మంత్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ తిరుపతిలో జరిగే సైన్స్ కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారని తెలిపారు.

జనవరి నుంచి భజన మండళ్ల సభ్యుల ఖాతాల్లోకి చెల్లింపులు
* టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు
తిరుపతి, సెప్టెంబర్ 23: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌లో నమోదైన రిజిస్టర్ గ్రామీణ భజన మండళ్ల సభ్యులు ఏవైనా టిటిడి కార్యక్రమాల్లో పాల్గొన్నపుడు అందాల్సిన మొత్తాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి వారి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తామని, అప్పటి వరకు వారి గురువుల ద్వారా చెల్లిస్తామని కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు తెలిపారు. జానపద కళాకారులు తమ సమస్యల పరిష్కారం కోసం దీక్షలు చేస్తున్న నేపథ్యంలో ఇఓ కళాకారుల నాయకులతో చర్చించారు. ఈ చర్చకు తీసుకున్న నిర్ణయాలను టిటిడి పిఆర్‌వో డాక్టర్ రవి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇఓ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ కళాకారుల సమస్యలను సానుకూలంగానే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రదర్శనలకు వెళ్లే కళాకారులు ఆర్టీసీలో సెమీ లగ్జరీ ప్రయాణం సందర్భంగా రాకపోకలకు అయ్యే ఛార్జీలను వారి ఖాతాకు జమ చేస్తామన్నారు. ఈ విధంగా మొత్తం 75వేల మంది భజన మండళ్ల సభ్యులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ధర్మ ప్రచారాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు భజన మండళ్లు, శ్రీవారి సేవకుల సేవలను వినియోగిస్తామన్నారు. శ్రీవారి సేవకులను స్థానిక ఆలయాలకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే మనగుడి కార్యక్రమంలో భజన మండళ్లు పాల్గొని విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామీణ ఆలయాలకు టిటిడి అందించే వాయిద్య పరికరాలను స్థానిక భజన మండళ్లు పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. అన్ని భజన సంఘాలకు సమాన అవకాశాలు కల్పిస్తామని, కార్యక్రమం, తేదీ తదితర వివరాలను ఎస్‌ఎంఎస్ ద్వారా ముందస్తుగా తెలియజేస్తామని అన్నారు. భజన మండళ్ల సభ్యులకు, గురువులకు నైపుణ్యం పెంచే దిశగా శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. భజన మండళ్లు మంచి కార్యక్రమాలను రూపొందిస్తే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రంలో అవకాశం కల్పించనున్నట్లు తెలియజేశారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌లో జానపద కళారూపాల ప్రదర్శనకు కొంత సమయం కల్పించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఇఓ పోలా భాస్కర్, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఎన్ ముక్తేశ్వరరావు, ఎఫ్‌ఎ, సిఎఓ బాలాజి, సిఐటియు నేత శ్రీ కందారపు మురళి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అక్టోబర్ 1న తిరుపతిలో బిజెపి సభ
* కార్పొరేషన్‌కు సమాయత్తం కోసమేనా?
* ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి కామినేని

తిరుపతి, సెప్టెంబర్ 23: తిరుపతి పిఎల్‌ఆర్ గ్రాండ్‌లో అక్టోబర్ 1న జిల్లా బిజెపి నేతలు సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు. నగరంలో ఆయనతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూడా నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి కామినేని శ్రీనివాస్ తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, పార్టీ జాతీయ నాయకురాలు శాంతారెడ్డి, బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జల్లి మధుసూదన్ తదితరులతో ఆయన సభ ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రజల్లో అపోహలు తొలగించేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విజయవాడలో సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో తిరుపతిలో కూడా సభ ఏర్పాటుచేసి ప్రజల్లో ఉన్న అపోహ తొలగించేందుకు వస్తున్నట్లు సమాచారం. గమనించదగ్గ విషయం ఏమిటంటే అక్టోబర్ 1న వెంకయ్యనాయుడు తిరుపతికి వచ్చి అదేరోజు తిరిగి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 3 నుంచి తిరుమల శ్రీవారికి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు గరుడ వాహనానికి ప్రభుత్వం తరపున వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. నగర పాలక సంస్థకు డిసెంబర్, జనవరి మాసాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బిజెపి, టిడిపి మధ్య పొత్తులు కుదురుతాయి. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు కనీసం 40 కార్పొరేట్ స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు కూడా వేగవంతం చేస్తున్నారని పరిశీలకులు విశే్లషిస్తున్నారు. ఏదేమైనా కార్పొరేట్ ఎలక్షన్ల వేడి తిరుపతిలో అప్పుడే ప్రారంభమైంది.