పర్యాటకం

భవరోగ హరుడు వైద్యనాథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవరోగహరుడైన శివుడు దైహిక, దైవిక, భౌతిక తాపాలను దరిచేరనీయడు. పరమ శాంతిదాయకమైన శివలోకప్రాప్తిని కలిగించేవాడు. రోగశోక బాధలను నశింపచేసేవాడు. అటువంటి వైద్యనాథేశ్వరుని దర్శన భాగ్యంతో సమస్త పాపాలూ నశించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
వైద్యనాథుడు పర్లీ వైద్యనాథుడిగా పూజలందుకుంటూ జ్యోతిర్లింగంగా వెలుగొందుతున్నాడు. మహారాష్టల్రోని పర్లీ వైద్యనాథున్ని కొందరు జ్యోతిర్లింగంగా భావిస్తారు కానీ వైద్యనాథ ఆలయము చితాభూమి యందు వున్నదని చెప్పడంవల్ల బీహార్‌లోని సంతాల్‌పరగణాలో జెస్సీఢ్ అనే నగరానికి దగ్గరలో వున్న వైద్యనాథమే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటని పండితులు పేర్కొంటున్నారు.
ఈ జ్యోతిర్లింగం రావణుని మూలంగా వెలసింది. పరమ శివ భక్తుడైన రావణుడు శివుని ఉద్దేశించి హిమాలయాలపై ఘోరమైన తపస్సు చేసాడు. ఒక్కొక్క తలనూ త్రుంచి శివునికి భక్తితో సమర్పించాడు. ఆ క్రమంలో పదవ తలను కూడా ఖండించుకోబోగా శివుడు ప్రత్యక్షమై రావణున్ని వారించి సంతుష్టాంతరంగుడై తొమ్మిది శిరస్సులను తిరిగి ప్రసాదించాడు.
ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు. రావణుడు అక్కడే వెలసిన శివలింగాన్ని తనకు ప్రసాదించమని కోరుకున్నాడు. శివుడు- ‘‘రావణా, ఈ శివలింగం నీ లంకా రాజ్యంలో వున్నంతకాలం నీకు ఎటువంటి కీడూ జరగదు. అద్భుతమైన విజయలక్ష్మి విశేష పరంపరలతో తులతూగుతావు. కానీ నీవు లంకా నగరానికి చేరేంతవరకు ఇది చేతులలో మాత్రమే వుండాలి. ఒకవేళ స్థానం తప్పితే ఎక్కడ వున్నదో అక్కడే వుండిపోతుంది’’ అని ఒక షరతును విధించాడు. రావణుడు ఎంతగానో సంతోషించాడు. శివలింగాన్ని చేతుల్లోకి తీసుకుని వెళ్లసాగాడు. కొంతసేపటికి అతనికి లఘుశంక బాధ కలిగింది. ఈలోపు శివలింగం లంకానగరానికి చేరడం తగినది కాదని భావించిన దేవతలు ఆవిధంగా జరగకుండా చేయమని గణపతిని ప్రార్థించారు. గణపతి బాలుని రూపంలోకి మారాడు. రావణుని కంటపడ్డాడు. రావణుడు ఈ బాలుణ్ణి పిలిచి విషయమంతా వివరించి తాను వచ్చేవరకు శివలింగాన్ని భద్రంగా చేతుల్లో వుంచుకోమని అప్పగించి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత శుచియై తిరిగి వచ్చేలోగా ‘‘ఈ శివలింగం బరువును నేను మోయలేక పోతున్నానని’’ చేతుల్లోనుండి దించేసాడు మాయా బాలుడైన గణపతి. రావణుడు హతాశుడైనాడు. శివలింగాన్ని తన చేతులతో పెకిలించడానికి శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గాయాలతో రావణుని దేహం రక్తసిక్తమైంది.
బోళాశంకరుడు ‘‘రావణా! నీవు వృధా ప్రయత్నం చేయకు. నీకు ముందు చెప్పినట్లుగానే ఇది వున్నచోటునుండి కదల్చడం అసాధ్యం. నీవే ఇక్కడికి వచ్చి శివలింగాన్ని అర్చించుకోమన్న మాటలను వినిపించాడు. చేసేది లేక రావణుడు తన ఉంగరాన్ని ఆ శివలింగంపై వుంచి నమస్కరించి వెళ్లిపోయాడు. మళ్లీ వచ్చి ఈ శివలింగాన్ని పూజించడంవల్ల రావణుడు పూర్తిగా స్వస్థుడైనాడు. అందువల్లనే ఈ శివలింగానికి వైద్యనాథుడనే పేరు వచ్చిందంటారు. నేటికీ ఈ శివలింగంపై ఉంగరం గుర్తు వున్నట్లు భక్తులు విశ్వసిస్తారు. బ్రహ్మ, విష్ణు, దేవేంద్రుడు మొదలైన దేవతలంతా వైద్యనాథుణ్ణి పూజించారు. అంతటి మహాత్మ్యాన్ని కలిగిన శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. ముఖ్యంగా శ్రావణ భాద్రపద మాసాల్లో విశేషంగా పూజిస్తారు. కావిళ్లతో వివిధ తీర్థ జలాలు తెచ్చి అభిషేకం చేయడం ఇక్కడ పద్ధతి. వైద్యనాథుడు తన భక్తుల బాధలను నివారించి ముక్తిని ప్రసాదిస్తాడు.

- కె. లక్ష్మీఅన్నపూర్ణ