కడప

రైతాంగానికి ‘నగదు’ కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రగుంట్ల,డిసెంబర్ 9: కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు గ్రామీణ రైతాంగాన్ని కరెన్సీ కష్టాల్లో ముంచింది. పట్టణ ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలతో ఎంతోకొంత నగదు దొరుకుతోంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో రైతు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఆరుగాలం బావుల కింద ఎంతోకొంత పండించుకున్న పంటకు గిట్టుబాటుధరతోపాటు అసలు కొనే నాధుడే లేకపోవడంతో నగదు లావాదేవీలు జరగక నిత్యావసర వస్తువులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఓ పెద్ద రైతు వద్ద ఎంతోకొంత చేతిబదులు తీసుకునే చిన్న, సన్నకారు రైతు పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. పెద్దకారు రైతు వద్ద కూడా నగదు లేకపోవడంతో సన్నకారు రైతుకు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులుపడుతున్నారు. ఇక రైతు కూలీల పరిస్థితి మరింత దారుణంగా మారింది. కూలికి పిలిస్తే కూలి డబ్బులు ఇవ్వాల్సివస్తుంది..పిలవకుంటే పంట చేతికిరాదు.. పంట చేతికి రాకపోతే నగదు లేదు. ఈ పరిస్థితుల్లో గ్రామీణులు అస్వవ్యస్థంగా జీవనం గడుపుతున్నారు. నగదు లావాదేవీలు అంటూ లెక్చరర్లు ఇచ్చే అధికారులు అదే ఏమిటో తెలియని గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడం లేదని బహిరంగంగా ప్రజలు ఆరోపిస్తున్నారు. పనులు పోగొట్టుకుని పట్టణాలకు వెళ్లి బ్యాంకుల వద్ద కూడు లేకుండా కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టు తిరుగుతూ కాలం గడుపుతున్నారు తప్ప చేతికి పట్టుమని వందరూపాయలు ఇచ్చే నాథుడు లేడు. ఇక అష్టకష్టాలు పడి చేతికొచ్చిన పంటను అమ్మి పదిరూపాయలు కళ్ల చూస్తామనుకుంటే కూనే నాథుడే లేడు. వ్యాపారుల వద్ద కూడా తగినంత నగదు లావాదేవీలు లేకపోవడంతో కొనుగోలు దారుడు రైతుకుమొఖం చాటేస్తున్నాడు. ప్రస్తుతం బావుల కింద, చెరువుల కింద వరి, పప్పు్ధన్యాలతోపాటు సన్న నిమ్మకాయలు తదితర పంటలు పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, మైదుకూరు, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో పంట చేతికొచ్చింది. ఈ పంటను అమ్ముకునేందుకు రైతు అష్టకష్టాలుపడుతున్నారు. కరెన్సీ రద్దుతో వ్యాపారస్తులు కొనుగోలుచేయలేక పొలం ప్రాంతాలకు కూడా రావడం లేదు. దీంతో సన్న, చిన్నకారు రైతు పరిస్థితి దారుణంగా తయారైంది. రైతు చేతిలో పైసలు వుంటేనే బయటకు వస్తే చిన్న చిన్న వ్యాపారాలు కళకళలాడుతాయి. అతని వద్ద డబ్బే లేకపోతే పట్టణాల్లో ఉండే వ్యాపారాలుకూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈపరిస్థితి గతనెల రోజులుగా కొనసాగుతున్నా బ్రతుకు జీవనంలో ఎలాంటి మార్పు కన్పించడం లేదు. దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతూ అటుకేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను దుమ్మెత్తిపోస్తున్నారు. పాలకులు, అధికారులు మాత్రం ఎలాంటి ఆందోళనలు లేకుండా బ్యాంకుల నుంచి దొంగచాటుగా డబ్బులు డ్రాచేసుకుని తమ విలాసాలకు కొదవలేకుండా జీవిస్తున్నారని తాము మాత్రం తినేందుకు తిండి కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నోట్ల రద్దుకు ప్రత్యామ్నాయంగా తగు ఏర్పాట్లు త్వరితగతిన చేపట్టి గ్రామీణ రైతాంగానికి ఊరట కలిగించి, భవిష్యత్ ఆశలను నెరవేర్చాలని కోరుతున్నారు.

అవినీతిలేని సమాజంకోసం
యువత ముందుకురావాలి

కడప,డిసెంబర్ 9: అవినీతి లేని సమాజ నిర్మాణం కోసం నేటి యువత ముందుకు రావాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని మీకోసం సభాభవన్‌లో ప్రపంచ అవినీతి నిరోధక వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. అవినీతి నిరోధకశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నేటి బాలబాలికలు మంచి ఆలోచనలతో సమాజంలో జరుగుతున్న పరిణామాలను గమనించి అవినీతిని ప్రారదోలేందుకు కంకణం కట్టుకోవాలన్నారు. భవిష్యత్‌తరాల వారు సుఖశాంతులతో జీవించేందుకు సమాజం మనకేం చేసింది అనే ఆలోచించకుండా సమాజానికి మనం చేశామని ఆలోచించాలని కోరారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారంతా విద్యను అభ్యసించి నూటికి నూరుమార్కులు సంపాదించిన వారు కాదని సమాజంలో మనచుట్టుపక్కల జరుగుతున్న విషయాలను అవగతం చేసుకుని ఉన్నతస్థానాలకు ఎదిగారన్నారు. దేశంలో సగటు తలసరి ఆదాయం కేవలం రూ.70వేలు మాత్రమేనని అతి తక్కువకాలంలో అభివృద్ధిచెందిన ఉత్తర కొరియావంటి దేశాల్లో సగటు తలసరి ఆదాయం 35వేల డాలర్లు అని అందుకు ప్రతి ఒక్కరు నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేసి దేశాభివృద్ధికి కృషిచేయాలన్నారు. దేశ ప్రధాని అవినీతిని ప్రారదోలేందుకు నల్లధనాన్ని వెలికితీసి నగదు రహిత లావాదేవీలను జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. అవినీతి నిరోధకశాఖ డిఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం తక్కువగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు పరివర్తన చెంది సమాజసేవకు కృషి చేయాలని కోరారు. అనంతరం అవినీతి నివారణపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలు కలెక్టర్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఇఓ ప్రతాప్‌రెడ్డి, కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి, పుష్పగిరి స్కూల్ కరస్పాండెంట్ వివేకానందరెడ్డి విద్యాశాఖ ఏడి జిలానీబాషా, ఎంఇఓ నారాయణ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.