సబ్ ఫీచర్

సరిహధ్దులు లేని జ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం జీవిస్తున్నది ఆవిష్కరణల యుగం. ఆవిష్కరణల ప్రభావం ఉన్నత విద్యపై తప్పక ఉంటుంది. ఉన్నతవిద్యలో రాణించేవారికే జీవితంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాఠశాల విద్యలో చాలామంది మంచి అలవాట్లతో గొప్ప సంస్కారంతో బైటకు వస్తారు. కారణం ఆ స్థాయిలో విద్యార్థిపై పర్యవేక్షణ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు, బయట గురువులు, వీటన్నింటికి మించి విద్యార్థిది లేతవయసు కాబట్టి ఏదో సాధించాలనే తపన తీవ్రంగానే ఉంటుంది. ఈ పట్టుదల, క్రమశిక్షణ విద్యార్థికి చిన్న వయసులోనే తోడవుతాయి. వారు 18 ఏళ్లు దాటిన తర్వాత కాలేజీలకు వస్తారు. కాలేజీ చదువు ఒకరు ఆదేశించే పనికాదు. విద్యార్థికి స్వతహాగా ఉన్నటువంటి ప్రేరణే చదువుకు కారణమవుతుంది. హైస్కూల్‌లో ఒకరు చెప్పిన పని చేయాలి, కాలేజీలో విద్యార్థికి తోచిన పనే చేస్తాడు. అక్కడ సెల్ఫ్ స్టడీయే ప్రధానం. విద్యార్థి తనకుతాను మధించుకుంటేనే ఉన్నత విద్యలో రాణించగలుగుతాడు. విద్యార్థి 25 సంవత్సరాల లోపు చేసిన పరిశోధనే సహజమైన రీసెర్చ్‌గా ఉంటుంది. యవ్వన దశే విద్యార్థి భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. ఉపాధ్యాయుడు చెప్పిన దానికన్నా విద్యార్థిలో స్వతహాగా ఉండే అధ్యయనం కావల్సినటువంటి దాన్ని సప్లిమెంట్ చేసే శ్రమతోడై భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది.
యవ్వనదశ లోపల విద్యార్థులు ఎవరికివారు గైడ్ చేసుకోవాలి. ‘లెక్చర్ హాల్‌లో కన్నా గ్రంథాలయంలో నువ్వెంతకాలం గడుపుతావు? ప్రాజెక్టువర్క్ ఎంత చేయగలుగుతావు? కొత్త నైపుణ్యాలు ఎన్ని సంపాదించుకోగలుగుతావు?’ అన్నది ప్రధానం. ఈనాడు ఏ పరికరం కూడా రెండు సంవత్సరాలకన్నా ఎక్కువగా మార్కెట్‌లో ఉండటం లేదు. ప్రతి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యం రెండు సంవత్సరాలల్లోనే అదృశ్యం అవుతుంది. ఆవిష్కరణల ప్రభావం ఎక్కువగా పరిశ్రమలపైన పడుతుంది. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను సంపాదించుకోవాల్సి వస్తుంది. ఇతర దేశాల్లో కొత్త నైపుణ్యాలకు ఈవెనింగ్ కోర్సులు వస్తున్నాయి. ఆ సాంప్రదాయం ఇంకా మనకు రాలేదు.
పరిశోధన ద్వారానే విద్యార్థి నైపుణ్యాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో పుస్తకాల్లోని జ్ఞానాన్ని అడగటం లేదు. ‘ఉద్యోగం ఇస్తే సంబంధిత కంపెనీ విజయానికి ఏ విధంగా ఉపయోగపడతావ’ని అడుగుతున్నారు. ఉద్యోగి నుంచి ఆశించే లక్ష్యాలు గత శతాబ్దం కన్నా ఇపుడు చాలా భిన్నంగా ఉన్నాయి. గతంలో పుస్తకాల నుంచి ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు వినియోగదారుల అవసరాల గురించి అడుగుతున్నారు. ఇంటర్వ్యూలో నిన్నటి జ్ఞానం కన్నా, రేపటి అవసరాలు ఎలా తీర్చగలుగుతున్నారో అడుగుతున్నారు. 21వ శతాబ్దం ఆవిష్కరణల యుగంలో యువతీ యువకులు ఎన్నో సవాళ్లకు గురవుతున్నారు. గతంలో విద్యార్థి మార్కులే అతని భవిష్యత్తును నిర్ణయించేవి. ఇప్పుడు విద్యార్థి ఆలోచనలే భవిష్యత్తుకు సోపానాలు అవుతున్నాయి. ఈ కాలంలో నేర్చుకునే జ్ఞానానికి ఎలాంటి సరిహద్దులూ లేవు. జ్ఞానం అనేది నిరంతర ప్రవాహం.

- చుక్కా రామయ్య