విశాఖపట్నం

కార్గో ఉంది.. విమానాలు లేవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పక్క రాష్ట్రాల ఖాతాల్లో కోట్ల ఆదాయం
విశాఖపట్నం: అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా ఉంది విశాఖ పరిస్థితి. విశాఖ నగరానికి అన్ని హంగులు ఉన్నా, వాటిని సక్రమంగా ఉపయోగించుకోలేని పరిస్థితి. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో ఇట్టే చూపించే సత్తా ఉన్న నాయకులు, పారిశ్రామికవేత్తలు ఉన్నప్పటికీ, వారికి తీరిక దొరికినప్పుడు, వారికి అవసరమైనప్పుడు మాత్రమే ఆయా అంశాలను పట్టించుకుంటున్నారు. మిగిలిన వేళల్లో విశాఖ అభివృద్ధి వారికి పట్టనే పట్టడు. ఇందుకు విశాఖ విమానాశ్రయంలోని కార్గో టెర్మినలే ఒక ఉదాహరణ. విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా రావడానికి ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు నానా తంటాలు పడ్డారు. ఆ హోదా వచ్చినా, విమానాశ్రయం మాత్రం ఇంకా బాలారిష్టాల నుంచి బయటపడలేదు. పక్కనే ఉన్న కార్గో విమానాశ్రయాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్ది, గత ఏడాది డిసెంబర్‌లోనే కార్గో విమాన సర్వీసులను నడపాలని ప్రయత్నించారు. కానీ ఇప్పటి వరకూ అది సాధ్యం కాలేదు. కస్టమ్స్ సిబ్బంది సరిపడినంత మంది లేకపోవడం, శీతల గిడ్డంగి లేకపోవడం వలన కార్గో విమానాలు నడపలేకపోతున్నట్టు అధికారులు చెపుతున్నారు. కేవలం ఒకటి, రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ పనులు పూర్తవుతాయి. దీనివలన మనం ఎంత నష్టపోతున్నామో తెలుసా?
విదేశాల నుంచి విశాఖతోపాటు, మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నెలకు రెండు వేల కోట్ల రూపాయల బంగారం దిగుమతి అవుతోంది. అయితే ఈ బంగారాన్ని విశాఖకు కాకుండా హైదరాబాద్ విమానాశ్రయంలో దిగుమతి చేస్తున్నారు. దీనిపై 200 కోట్ల రూపాయలను టాక్స్ రూపంలో వసూలు చేస్తున్నారు. ఈటాక్స్‌లో 45 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తోంది. అంటే సుమారు నెలకు సుమారు 90 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమవుతోంది. అంటే ఏడాదికి 1000 కోట్ల రూపాయల ఆదాయాన్ని మన ప్రభుత్వం కోల్పోవలసి వస్తోందన్నమాట.
విశాఖలో ఫార్మా ఉత్పత్తులు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. వీటిని దుబాయ్, థాయిలాంట్, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. విశాఖలో కార్గో టెర్మినల్ లేకపోవడం వలన హైదరాబాద్ నుంచి ఎగుమతి చేస్తున్నారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంగా కార్గోను హైదరాబాద్‌కు తరలించి అక్కడి నుంచి విమానాల్లో విదేశాలకు తరలిస్తున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణం చేసేలోగా, ఇక్కడే కార్గో విమానాలు ఉంటే, అంతకు ముందే ఆయా దేశాల్లో కార్గోను దించేయచ్చు. హాస్పిరా కంపెనీ త్వరలో 6500 కోట్ల రూపాయల ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేయబోతోంది. కేవలం ఈ కంపెనీ చేసే ఎగుమతులకే, వారానికి రెండు, మూడు విమాన సర్వీసులు అవసరం ఉంటుందంటే ఫార్మా రంగానికి ఏమేరకు కార్గో విమానాల అవసరం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక విశాఖ, చుట్టుపక్కల జిల్లాల నుంచి నెలకు 1200 కోట్ల రూపాయల రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. వీటిని జపాన్, దుబాయ్‌కు ఎగుమతి చేస్తున్నారు. అలాగే పువ్వులు, ఫలాలను మలేషియా, సింగపూర్‌లకు ఎగుమతి చేస్తున్నారు. అంతేకాకుండా బ్రాండిక్స్ తయారు చేసే బట్టలను శ్రీలంకకు ఎగుమతి చేస్తున్నారు. ఇవన్నీ ప్రస్తుతం చెన్నై విమానాశ్రయం నుంచి బయటకు వెళుతున్నాయి. వీటి వలన ఆయా కంపెనీలు ఎనలేని ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. రాష్ట్రానికి రావల్సిన ఆదాయం రాకుండా పోతోంది. ఈ విషయంలో స్థానిక నాయకులు జోక్యం చేసుకుంటే, రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూర్చినవారవుతారు.

విద్యాభివృద్ధిలో టీమ్ లీడర్ ప్రధానోపాధ్యాయుడే
* జిల్లా కలెక్టర్
విశాఖపట్నం, నవంబర్ 20: విద్యార్థుల తెలివితేటలను వెలికితీయడంలో ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలని పోషించాలని జిల్లా కలెక్టర్ యువరాజ్ పిలుపునిచ్చారు. విద్యాభివృద్ధిలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు నేతృత్వం వహించేది ప్రధానోపాధ్యాయుడేనని అన్నారు. శుక్రవారం ఎయు అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రధానోపాధ్యాయులకు హౌస్ టెక్నాలజీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను ఎలా అందించాలనే విషయమై ఇటీవల మెదక్‌లో యునిసెఫ్ ప్రయోగాత్మకంగా చేపట్టిందన్నారు. ఆ విధానాన్ని అన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టారన్నారు. ఆ ఈ విధానంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు సంబంధించిన పూర్తి డేటా ఎప్పటికపుడు పొందుపరచాలన్నారు. పూర్తి వివరాలతో కూడిన డేటాను హౌస్ టెక్నాలజీలో పొందుపరచాలన్నారు. విద్యార్థుల వివరాలు, ఉపాధ్యాయుల అటెండెన్స్, విద్యార్థులు సాధించిన మార్కులు పొందుపరచడం ద్వారా వారి సామర్థ్యం ఎప్పటికపుడు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో గ్రహించి వారికి ప్రత్యేక క్లాసులు నిర్వహించడం ద్వారా దానిని అర్థం చేసుకొని మెరుగుపరచుకునే అవకాశం ఉందన్నారు. అంతేగాకుండా సక్రమంగా తరగతులకు హాజరవుతున్నదీ, లేదినీ తెలుసుకోవడం, వారి తల్లిదండ్రులకు తెలియజేసే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులకు బోధనపట్ల ఆసక్తి, చిత్తశుద్ధి ఉండాలన్నారు. వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు.
పదో తరగతి విద్యార్థులకు సంబంధించి వంద రోజుల ప్రణాళికను తయారు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి ఎంవి కృష్ణారెడ్డి చెప్పారు. విద్యార్థులకు కష్టమైన సబ్జెక్టులలో సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించామన్నారు. హౌస్ టెక్నాలజీ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు పొందుపరిచామన్నారు. ఈ కార్యక్రమంలో హౌస్ టెక్నాలజీ కోఆర్డినేటర్ శ్రీదర్, డిప్యూటీ డిఇఒలు నాగమణి, రేణుక, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

22 నుంచి స్థిరమైన వ్యవసాయాభివృద్ధిపై సదస్సు
* ఎయు వైస్ ఛాన్సలర్
విశాఖపట్నం, నవంబర్ 20: వ్యవసాయ రంగంలో వృద్ధి ఎలా సాధించాలనే విషయమై ఈ నెల 22 నుంచి రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు ఎయు వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు చెప్పారు. శుక్రవారం ఎయు సెనేట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ వృద్ధి, వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లపై నిపుణులు చర్చిస్తారన్నారు. ప్రొఫెసర్ బి.సర్వేశ్వరరావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఈ సదస్సు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఆదివారం రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సదస్సును ప్రారంభిస్తారని చెప్పారు. ఆయనతోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎ.పద్మరాజు, పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు, ప్రొఫెసర్ కెసి రెడ్డి, సిఇఎస్‌ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గాలబ్, వ్యవసాయ శాస్తవ్రేత్త సుబాష్ పాలేకర్ తదితరులు ప్రసంగిస్తారని వివరించారు.
ఎయు రెక్టార్ ప్రొఫెసర్ ఇఎ నారాయణ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగం తీరుతెన్నులు, వ్యవసాయ రంగం, ఆహార భద్రత, పేదరికం, వర్షాధారిత వ్యవసాయం, సమస్యలు, పర్యావరణ మార్పులు, నూతన వ్యవసాయ విధానాలు, ఆర్గానిక్ ఫార్మింగ్ సమస్యలు, పరిష్కారాలు, ఉద్యానశాఖ, మత్స్యశాఖల పాత్ర తదితర అంశాలపై చర్చిస్తారని చెప్పారు. ప్రొఫెసర్ ఎం.ప్రసాదరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో చైనాను మించిన ప్రగతిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తిని పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సదస్సులో నిపుణుల ప్రసంగాల అనంతరం ప్రత్యేక సంచిక విడుదల చేస్తారన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సంభవించిన తుపానులో సేంద్రీయ విధానంలో పండించిన వరి తట్టుకొని నిలబడిందన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎం.సుందరరావు మాట్లాడుతూ వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నప్పటికీ వృద్ధిరేటు తక్కువగా ఉంటుందన్నారు.

భట్నాగర్ అవార్డు గ్రహీత బిఆర్ రావు సేవలు ఎనలేనివి
* ఆలోచించండి.. ముందుకు పయనించండి
* ఎయు విసి జిఎస్‌ఎన్ రాజు
విశాఖపట్నం, నవంబర్ 20: భౌతిక శాస్త్ర విభాగంలో అత్యున్నతమైన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు పొందిన ప్రొఫెసర్ బి.ఆర్.రావు సేవలు ఎనలేనివని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు అన్నారు. శుక్రవారం ఎయు సెనేట్ హాల్లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా అదే సామాజిక వర్గానికి చెందిన బిఆర్ రావు చేసిన సేవలను ఆయన కొనియాడారు. స్పేస్ ఫిజిక్స్, ఐనో ఫిజిక్స్‌లో అనేక పరిశోధనలు చేపట్టారన్నారు. ఆయన 1968లోనే దక్షిణ భారత్‌లో ఛాన్సలర్ పదవి పొందారన్నారు. యూజిసి వైస్ చైర్మన్‌గా ఆరేళ్లపాటు కొనసాగారని వివరించారు. ప్రధాని దివంగత ఇందిరాగాంధీ హయాంలో రాజ్యసభ ఎంపిగా సేవలు అందించారన్నారు. సైన్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా పనిచేశారని చెప్పారు. ఆయన విగ్రహం ఏర్పాటు విషయమై పాలకవర్గంలో తీర్మానం చేసి నెలకోల్పడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అతిథిగా విచ్ఛేసిన సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ విద్యార్థులు నిరంతరం ఆలోచిస్తూ ముందుకు పయనించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల గురించి విద్యార్థులకు తెలియజేయాలన్నారు. జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి, అవకాశాలు లేనపుడు ఎలా నిలద్రక్కుకోవాలనే విషయాలను విద్యార్థులకు వివరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ ఆర్కే బీచ్‌లో బిఆర్ రావు విగ్రహం ఏర్పాటు చేసేందుకు తాను కృషి చేస్తానన్నారు. అలాగే ఎయులో కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన విసిని కోరారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఇఎ నారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విధంగా ప్రముఖుల జీవితగాథలను తెలియజేయాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ రత్నకుమారి మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి ఆనాడే ఐటిని పరిచయం చేసిన ఘనత బిఆర్ రావుకు దక్కుతుందన్నారు. రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బిఆర్ రావు జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. ఆయన భౌతికశాస్త్ర విభాగాన్ని పటిష్టం చేశారని, నేడు దానిని మరింత బలోపేతం చేసే దిశగా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బిసి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేటి రాంబాబు మాట్లాడుతూ ప్రొఫెసర్ బిఆర్ రావు పేరు మీద ప్రతీ ఏటా జాతీయ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్‌కు వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీ, మత్స్యకార సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆవల రమేష్, టి.శాంతారాం, ఎ.రాంప్రసాద్, టి.సాయిబలరామ్, పితాని ప్రసాద్, శ్యాంసుందర్, వర్శిటీ ఉద్యోగులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి గుర్తింపు తేవాలి
* రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు
విశాఖపట్నం, నవంబర్ 20: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని విఎస్ కృష్ణా లైబ్రరీకి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలని రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు కోరారు. ఎయులోని విఎస్ కృష్ణా లైబ్రరీలో ఏర్పాటు చేసిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్ఛేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన గ్రంథాలు కూడా ఈ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయన్నారు. నేడు సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల ఎక్కువ మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నప్పటికీ, పుస్తక పఠనం కూడా అవసరమన్నారు. గ్రంథాలయ ఉద్యమానికి, గ్రంథాలయాలను నెలకోల్పడానికి అయ్యంకి వెంకటరమణ చేసిన కృషిని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో ఎయు వెబ్‌సైట్‌లో ఎయు లైబ్రరీలో పుస్తకాల వివరాలను పొందుపరుస్తామన్నారు. అలాగే లైబ్రరీలో వచ్చే పాఠకులకు చక్కటి వాతావరణం కల్పించే విధంగా చూడాలన్నారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ ప్రొఫెసర్ శశికళ మాట్లాడుతూ లైబ్రరీలో ఐదు లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అంతేగాకుండా భారత ముసాయిదా రాజ్యాంగాన్ని రచించిన అసలు కాపీ ఇక్కడ అందుబాటులో ఉందని వివరించారు. ఇదిలా ఉండగా లైబ్రరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు లైబ్రరీ అసిస్టెంట్లుగానే పరిగణిస్తున్నారని, దానిని అసిస్టెంట్ లైబ్రేరియన్ హోదా, డిప్యూటీ లైబ్రేరియన్ హోదాలు కల్పిస్తే బాగుంటుందని ఆమె సూచించారు. దీనివల్ల పనిభారం పంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగుల్లో కూడా అసంతృప్తిని తొలగించడానికి వీలవుతుందన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు రిజిస్ట్రార్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.

గీతం వర్శిటీకి భారీ పరిశోధనా ప్రాజెక్టు
విశాఖపట్నం, నవంబర్ 20: కేన్సర్ వ్యాధి నివారణలో ప్రొటియేజ్ ఎంజైమ్‌లను నియంత్రించేందుకు అవసరమైన పరిశోధనలు జరిపేందుకు గీతం విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు భారీ పరిశోధనా ప్రాజెక్టు మంజూరైంది. మూడేళ్ల పాటు దీనిపై పరిశోధనలు కొనసాగిస్తారు. బయోకెమిస్ట్రీ శాఖకు చెందిన డాక్టర్ కె.విజయ్‌రేచల్, డాక్టర్ ఎం.రామారావు ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నారు. నేడు సమాజంలో కేన్సర్ వ్యాధితో ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు. కేన్సర్ నిర్మూలనకు మందుల వాడకం వల్ల శరీరంలో నిరోధక శక్తి తగ్గిపోతుంది. నిరోధక శక్తి తగ్గిపోకుండా ఉండేందుకు ఎలాంటి మందులు అవసరమనే విషయమై ఈ ప్రాజెక్టు ద్వారా పరిశోధనలు చేపట్టనున్నారని గీతం వర్శిటీకి చెందిన కె.విజయ్‌రేచల్ తెలిపారు.

ఖనిజాల తవ్వకాలు రాష్ట్రాల సొంత నిర్ణయం
* బాక్సైట్ తవ్వకాలకు కేంద్రం అనుమతీయదు
* పర్యావరణ అనుమతులు మాత్రమే ఇస్తుంది
* విశాఖకు 9,118 ఇళ్లు
* పరిశీలనలో మరో 27 ప్రాజెక్టులు
* కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
విశాఖపట్నం, నవంబర్ 20: ఖనిజాల తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వదని, కేవలం పర్యావరణ అనుమతులు మాత్రమే ఇస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ఆయన్ను విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు కేంద్రం అనుమతులు ఇచ్చిందన్న అంశాన్ని విలేఖరులు ప్రస్తావించగా ఆయన స్పందించారు. బాక్సైట్ తవ్వకాలకు కేంద్రం అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు పొందిన మీదట రాష్ట్రం బాక్సైట్ తవ్వకాలపై నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక పరిస్థితుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. బాక్సైట్‌పై విలేఖరులు పదేపదే ప్రశ్నించేందుకు యత్నించగా మంత్రి వెంకయ్య అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. అందరికీ ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం విశాఖ జిల్లాకు విశేష ప్రాధాన్యతనిచ్చిందని ఆయన పేర్కొన్నారు. తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 26 ప్రాజెక్టుల్లో 9,118 ఇళ్లను మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. మరో 27 ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టుల్లో 20,030 నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం, పలాస, ఆముదాల వలస పట్టణాల్లో 2,176 ఇళ్లు, విజయనగరం జిల్లాలోని సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, నెల్లిమర్ల పట్టణాల్లో 4,712 ఇళ్లను ఈ పథకం కింద నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకునే గృహ సముదాయాలకు వ్యక్తిగతంగా రూ.లక్ష, సొంత స్థలాల్లో నిర్మించుకునే సముదాయాలకు వ్యక్తిగతంగా రూ.1.5 లక్షలు కేంద్రం మంజూరు చేస్తుందన్నారు. బ్యాంకుల్లో తీసుకునే రుణాన్ని కేంద్రమే నేరుగా లబ్దిదారు ఖాతాలో బ్యాంకు జమ చేస్తుందన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, నగర బిజెపి అధ్యక్షుడు పివి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

లింగాపుట్టులో రూ.రెండు కోట్ల గంజాయి మొక్కలు ధ్వంసం
పాడేరు, నవంబర్ 20: పాడేరు మండలం గొండెలి పంచాయతీ లింగాపుట్టు గ్రామంలోని కొండలపై సాగు చేస్తున్న గంజాయి తోటలపై ఎక్సైజ్ సిబ్బంది శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి మొక్కలను ధ్వంసం చేసారు. లింగాపుట్టు గ్రామంలోని గిరిజనుల సాగు భూముల్లో భారీ ఎత్తున గంజాయి సాగు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు సి.ఆర్.పి.ఎఫ్., సివిల్ పోలీసు బలగాల సహకారంతో దాడులకు రూపకల్పన చేసారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ బాబ్జిరావు నేతృత్వంలోని దాదాపు 150 మంది ఎక్సైజ్ సిబ్బంది, సి.ఆర్.పి.ఎఫ్., పోలీసు బలగాలు లింగాపుట్టు గ్రామ కొండలను శుక్రవారం సాయంత్రం చుట్టుముట్టారు. ఈ గ్రామ కొండలలో ఎక్కడ చూసినా గంజాయి తోటలే దర్శనమిస్తుండడంతో 30 ఎకరాల భూమిలో సుమారు 90 వేల గంజాయి మొక్కలను ఎక్సైజ్, పోలీసు సిబ్బంది ధ్వంసం చేసారు. దీనివిలువ దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి పాడేరులో విలేఖరులతో మాట్లాడుతూ పట్టా భూముల్లోనే గిరిజనులు గంజాయి సాగు చేస్తున్నారని చెప్పారు. దీంతో గంజాయి సాగుదారులను త్వరలోనే గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గంజాయి సాగు చేస్తున్న గిరిజనులపై అవసరమైతే పి.డి. చట్టాన్ని ప్రయోగించే అంశాన్ని కూడా పరిశీలించనున్నట్టు ఆయన చెప్పారు.

రూ. 120కోట్లతో అభివృద్ధి పనులు
* సిసిఎఫ్ ప్రతీప్‌కుమార్
కెడిపేట, నవంబర్ 20: జిల్లాలో ఫారెస్ట్ శాఖకు చెందిన పలు ప్రాంతాల్లో హుదూద్ తుపానుకు దెబ్బతిన్న వాటిని 120 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎడిషనల్ ఛీప్ కన్వర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం ప్రతీప్‌కుమార్ తెలిపారు. నర్సీపట్నం ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఉన్న లంబసింగి, కాకరపాడు, నల్లగొండ తదితర ప్రాంతాల్లో ఉన్న మొక్కలు, టేకు ఫ్లాంటేషన్లను శుక్రవారం ఆయన పర్యటించి సందర్శించారు. అనంతరం కృష్ణాదేవిపేటలోని ఫారెస్ట్ కార్యాలయం వద్ద కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. గత ఏడాది జిల్లాలో సంభవించిన హుదూద్ తుపాను వలన ఫారెస్ట్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో 120 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖ జూ వాటిల్లిన నష్టంలో 36కోట్లు, కంబాల కొండపై 12 కోట్లతో మొక్కలు పెంచే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఆదాయాన్నిచ్చే మామిడి తోటల పెంపకం చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో దెబ్బతిన్న వనాలు పునరుద్ధరణకు ఊడా, జివిఎంసి, పంచాయతీరాజ్, అర్‌అండ్‌బి, ఫారెస్ట్ శాఖ ద్వారా మరో 36 కోట్లతో మొక్కల పెంపకం, విద్యుత్, రోడ్లు ఇతర అబివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఫారెస్ట్ శాఖ ద్వారా ఎపిడిఆర్‌ఓప్రాజెక్టు ద్వారా 2,220 కోట్లతో అభివృద్ధికి తగిన ప్రణాళిక రూపొందించామన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం 200 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ఇవి కాక మరో వెయ్యి హెక్టార్లలో ప్రాంతాల వారీగా భూమి సారవంతాన్ని బట్టి విలువైన మొక్కలు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నాలుగు జిల్లాల్లో అటవీ శాఖకు రావాల్సిన 13 కోట్ల ఆదాయంలో ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలు వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడవుల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. విశాఖ జోనల్ పరిధిలో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ డిఎఫ్‌ఓ గెడ్డం శేఖర్, స్థానిక రేంజర్ మహ్మద్ షఫీ, విఆర్‌ఓ రామారావు పాల్గొన్నారు.

వౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం
* మంత్రి అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, నవంబర్ 20: గ్రామీణ ప్రాంతాల్లో వౌళిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మంత్రి అయ్యన్న సతీమణి పద్మావతి దత్తత తీసుకున్న ధర్మసాగరం గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు. గ్రామానికి వచ్చిన మంత్రి అయ్యన్న దంపతులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. వీధివీధినా మహిళలకు హారతులిచ్చారు. ఎడ్లబండిపై అయ్యన్నదంపతులు గ్రామంలో ఊరేగారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు గ్రామాలను తమ కుటుంబ సభ్యులు దత్తత తీసుకున్నామన్నారు. పద్మావతి దత్తత తీసుకున్న ధర్మసాగరం గ్రామంలో కోటి 40 లక్షల రూపాయలతో ఇప్పటికే అన్ని వీధుల్లోనూ సి.సి. రోడ్లు వేసామన్నారు. గ్రామంలో ఏ ఒక్కరికీ ఏపథకం అందలేదని అనుకోకుండా ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. గ్రామంలో మరో 16 సి.సి. రోడ్లకు కోటి రూపాయలకు పైగా మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. గ్రామంలోప్రతీవీధి రోడ్డు పక్కల చెట్లు నాటడడంపై గ్రామస్తులను అభినందించారు. గ్రామంలో మంచినీటి పథకాలు, బోర్లు వేసామన్నారు. గ్రామంలోని 177 విద్యుత్ స్థంబాలకు ఎల్. ఇ.డి.బల్బులను వేయనున్నట్లు ప్రకటించారు. త్వరలో గ్రామంలో రామాలయం నిర్మాణం చేపడతామన్నారు. ఏప్రిల్ నాటికి దత్తత గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసి వచ్చే ఏడాది మరో నాలుగు గ్రామాలను తమ కుటుంబ సభ్యులు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డు తప్పని సరిగా ఉండాలన్నారు. బహిరంగ మలవిసర్జన చేసేవారిని గుర్తించి వారి పెన్షన్ , రేషన్ కార్డులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నాలుగు లక్షల రేషన్ కార్డులు కొత్తగా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. రైతులకు, మహిళలకు రుణాలు మాఫీ చేసామని, 200 రూపాయల పెన్షన్‌ను వెయ్యిరూపాయలకు పెంచామన్నారు. ఈసమావేశంలో ఎం.పి.పి. సుకల రమణమ్మ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషి చేసిన మంత్రి అయ్యన్న దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మెన్ సన్యాసిపాత్రుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మంత్రి నిరంతరం పాటుపడుతున్నారన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో కె. సూర్యారావు, మున్సిపల్ కమీషనర్ రాజగోపాల్‌రావు, పలు శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇద్దరు విఆర్‌ఒల సస్పెన్షన్
నర్సీపట్నం, నవంబర్ 20: నర్సీపట్నం డివిజన్ పరిధిలోని ఇద్దరు విఆర్‌ఓలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రోలుగుంట మండలం వడ్డిప గ్రామానికి చెందిన జె సింహాచలం, కోటవురట్ల మండలం ఆక్సాయిపేట విఆర్‌ఓ ఎస్ కుమారిలను సస్పెండ్ చేశారు. వీరిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వడ్డిప, ఆక్సాయిపేట పరిధిలోని పి కొత్తపల్లి గ్రామాల్లోని భూములకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయడంలో అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై ఆర్డీవో కె.సూర్యారావు, రోలుగుంట, కోటవురట్ల మండలాల తహశీల్దార్లు విచారణ జరిపారు. ఈ విచారణలో ఇద్దరు విఆర్‌ఓలకు పాత్ర ఉందని వెల్లడి కావడంతో నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈమేరకు వడ్డిప, ఆక్సాయిపేట విఆర్‌ఓలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆర్డీవో కె సూర్యారావు తెలిపారు.

త్వరలో అర్హులైన లబ్ధిదారులకు పక్కా గృహాలు
మంత్రి అయ్యన్నపాత్రుడు
గొలుగొండ, నవంబర్ 20: వచ్చే సంక్రాంతి నుండి రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులకు ఏడు లక్షల పక్కా గృహాలు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శుక్రవారం మండలంలోని పాకలపాడు పంచాయతీలో ఉన్న దిబ్బలపాలెం,పాకలపాడులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.. 45 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు, తారు రోడ్డు, పంచాయతీ భవనం, సి.సి. రోడ్లకు ఎన్టీ ఆర్ సుజల స్రవంతి పథకానికి ఆయన ప్రారంభోత్సవం చేసారు. ముందుగా దిబ్బలపాలెం గ్రామంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. పాకలపాడులోసుజల స్రవంతి ద్వారా తాగునీటిని మహిళలకు అందించారు.అనంతరం పాకలపాడులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు లక్షల పక్కా గృహాలను వచ్చే సంక్రాంతి నుండి గ్రామాల్లో పూరిగుడిసెల్లో ఉంటూ జీవనం సాగిస్తున్న వారిని గుర్తిస్తే వారికి పక్కా గృహాలను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ఈపథకం ద్వారా 2.75 లక్షల రూపాయలను అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల అనంతరం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రైతు రుణ మాఫీ, డ్వాక్రా తదితర వాటిపై రైతులకు లబ్దిచేకూర్చారన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత జీతాలు ఇవ్వలేని స్థితిలో ఎన్నో సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. నియోజకవర్గ పరిధిలో 85 గ్రామ పంచాయతీలున్నాయని, వీటన్నింటికీ కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి ఎన్నో అభివృద్ధి పనులను నిర్వహించామన్నారు. ఏడాదిన్నర కాలంలో ఒక్క పాకలపాడుకే రెండు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. తన రాజకీయ జీవితంలో అవినీతి పరుడినని ఎక్కడైనా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సభాముఖంగా అయ్యన్న పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబుకే దక్కిందన్నారు. 200 రూపాయల ఫించన్‌ను వెయ్యి రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడాలే తప్పా ఎన్నికల ముందే రాజకీయాలు, ఎన్నికల అనంతరం రాజకీయాలను విడనాడి అభివృద్ధికి దోహపడాలన్నారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గొలుగొండ మండలంలో పాకలపాడు, మాకవరపాలెం మండలంలో వజ్రగడ వివాదస్పద గ్రామాలుగా మిగిలాయన్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈకార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో కె. సూర్యారావు, గొలుగొండ, నర్సీపట్నం ఎం.పి.పి.లు సుర్ల లక్ష్మీనారాయణ, సుకల రమణమ్మ, జెడ్పిటిసి సి.హెచ్.వేణుగోపాల్, మండల దేశం పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడుతో పాటు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామంలో ఎటువంటి సంఘటనలు జరుగకుండా స్థానిక ఎస్సై జోగారావు ఆధ్వర్యంలో బారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.