విశాఖపట్నం

నిధుల మళ్లింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 10: పదవ తరగతి ఉత్తీర్ణులైన పేద విద్యార్థులు తమ చదువును కొనసాగించేందుకు వీలుగా మహా విశాఖ నగర పాలక సంస్థ (జివిఎంసి) చేపట్టిన విద్యాశ్రీ పథకం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వివిధ సంస్థలు విరాళంగా ఇచ్చేందుకు ప్రతిపాదించినా, వాటిని ఇతర అవసరాలకు జిల్లా యంత్రాంగం మళ్లించడంతో విద్యాశ్రీ పథకాన్ని నిధుల సమస్య వెన్నాడుతోంది. మున్సిపల్ పాఠశాలల్లో 10వ తరగతి పాసైన పేద విద్యార్థులు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐఐఐటి తదితర కోర్సుల్లో చేరేందుకు వీలుగా సాయం చేసేందుకు ఈ పథకాన్ని జివిఎంసి 2008-09 సంవత్సరంలో ప్రారంభించింది. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు ఇచ్చే విరాళాలతో వీరిని కళాశాలల్లో చేర్చి ఫీజులను ఈ పథకం కింద చెల్లిస్తున్నారు. చాలా సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కేటాయించిన నిధుల్లో కొంత మొత్తాన్ని ఈ పథకానికి ఇస్తున్నాయి. ప్రస్తుతం 316 మంది విద్యార్థులు వివిధ కోర్సులను ఈ పథకం కింద చదువుకుంటున్నారు. వీరికి ఫీజల కింద 41 లక్షల రూపాయలను ప్రస్తుతం చెల్లించాల్సి ఉంది. దీనికి తోడు ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల అనంతరం కొంత మంది విద్యార్థులను ఈ పథకం కింద చదివించాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వివిధ సంస్థల నుంచి విరాళాలను జివిఎంసి అధికారులు సేకరిస్తున్నారు. చాలా సంస్థలు నిధులను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ దశలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి జాతీయ స్థాయిలో అవార్డుకు పోటీ పడేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దీంతో విద్యాశ్రీ పథకానికి కేటాయించేందుకు ప్రతిపాదించిన నిధులను మరుగుదొడ్ల నిర్మాణానికి మళ్లించారు. దీంతో దాదాపు 20 లక్షల రూపాయలు ఈ పథకం కింద జమ కావాల్సి ఉన్నప్పటికీ వాటిని మళ్లించడంతో నిధుల సమస్య నెలకొంది. భారతీయ స్టేట్ బ్యాంక్ ఈ పథకం అమలు జరుగుతున్న తీరును చూసి సిఎస్‌ఆర్ కింద కొంత మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. కానీ తమ బ్యాంక్‌లో జివిఎంసి డిపాజిట్లు లేవన్న సాకుతో ప్రస్తుతం దానిని పెండింగ్‌లో పెట్టారు. డిపాజిట్ల విషయమై జివిఎంసి అధికారులు త్వరలో నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. విరాళాన్ని నేరుగా జివిఎంసీ ఖాతాలోకి, విద్యార్థి ఖాతాకు జమ చేసేందుకు లేదా నేరుగా సంబంధిత కళాశాలకే ఫీజు చెల్లించేలా పథకాన్ని రూపొందించారు. పారదర్శకత ఉండేలా జివిఎంసి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ సమస్యను అధిగమించగలమని అధికారులు భావిస్తున్నారు.

నిర్లక్ష్యం
విశాఖపట్నం, మార్చి 10: వంద సంవత్సరాలకు పైబడిన వివిధ రికార్డులను భద్రపరిచే ఇక్కడి రాష్ట్ర ప్రాంతీయ రాజ్యాధిలేఖా నిలయం (ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ స్టేట్ ఆర్కైవ్స్) నిర్లక్ష్యానికి గురి అవుతున్నది. శిథిలమైన భవనం, సిబ్బంది కొరత, వసతి సమస్య, భద్రతాలేమి వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఉన్న ఒక ఉద్యోగి సెలవు పెడితే ఆ కార్యలయం మూతపడే పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పురాతన రికార్డులను ఈ కార్యాలయంలో భద్రపరుస్తారు. అరుదైన రాతప్రతులు, సర్వే నెంబర్లతో ఉన్న పురాతన రికార్డులు, దేశంలోని వివిధ పట్టణాల జనాభా లెక్కల వివరాలు, అప్పటి చట్టాలు, గెజిట్ ప్రతులు, సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టులు, సంస్కృత, ఉర్దూ పుస్తకాలు జీవిత చరిత్రల ప్రతులు ఇక్కడ భద్రపరుస్తారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో చోటు చేసుకున్న వివిధ ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన ఫైళ్లు ఇక్కడ ఉన్నాయి. అయితే హుదుద్ తుపాను కారణంగా ఆర్కైవ్స్ కార్యాలయ భవనం శిథిలమైంది. దీంతో కీలక రికార్డులను హైదరాబాద్‌కు తరలించారు. మిగిలిన రికార్డులను కీటకనాశనులు, నేఫ్తలీన్ బాల్స్‌ను వాడుతూ పరిరక్షిస్తున్నారు.
స్థలం సమస్య
ఆర్కైవ్స్ కార్యాలయ భవనం పైకప్పు చాలా వరకూ శిథిలమైంది. రెండు సార్లు కార్యాలయాన్ని మార్చి ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సిరిపురం జంక్షన్ వద్ద ఒక భవనంలో నిర్వహిస్తున్నారు. ఎయుకు దాదాపు 9000 రూపాయల అద్దె చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయమని అధికారుల నుంచి ఒత్తిడి వస్తున్నది. భవన నిర్మాణానికి తగిన స్థలం కేటాయించాలని జిల్లా అధికారులను కోరినా, అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో శిథిల భవనంలో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. తలుపులు పాడవటంతో చెక్కలు కొట్టారు. చుట్టూతా పిచ్చి మొక్కలు పెరిగాయి. రికార్డులకు చెద, తదితర పురుగుల బెడద పొంచి ఉంది. ఒక ఉద్యోగి, మరో కాంట్రాక్టు ఉద్యోగి అక్కడ పని చేస్తున్నారు. ఉద్యోగి వివిధ కారణాల వల్ల కార్యాలయానికి రాకపోతే ఆ రోజు తెరిచే అవకాశం ఉండదు. విలువైన రికార్డులు ఉన్నప్పటికీ కనీస భద్రతా ఏర్పాట్లు లేవు. ఈ విషయమై ఆర్కైవ్స్ డిప్యూటీ డైరెక్టర్ రంగరాజు మాట్లాడుతూ కీలకమైన రికార్డులను హైదరాబాద్ తరలించామని తెలిపారు. భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని జిల్లా అధికారులను కోరినట్లు తెలిపారు.

షిప్‌యార్డును ఆదుకోవాలి
విశాఖపట్నం, మార్చి 10: అనేక రకాలుగా నష్టాలను ఎదుర్కొంటున్న హిందుస్థాన్ షిప్‌యార్డును అన్ని విధాలా ఆదుకోవాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యసభ సమావేశాల్లో షిప్‌యార్డు గురించిన సమస్యలను టిఎస్సార్ లేవనెత్తారు. 176 నౌకలను షిప్‌యార్డు తయారు చేసిందని, 1920 నౌకలకు మరమ్మతులు చేపట్టిగలిగిందన్నారు. ఈ విధంగా సంస్థ తన ప్రతిభను చూపించిందన్నారు. అలాగే అయిదేళ్ళ కిందట రక్షణమంత్రిత్వశాఖ నియంత్రణలోకి దీనిని తీసుకువచ్చారన్నారు. అయితే 2014 అక్టోబర్ 12వ తేదీన విశాఖలో సంభవించిన హుదుద్ తుపానుతో షిప్‌యార్డుకు చెందిన యార్డు పూర్తిగా ధ్వంసమైందన్నారు. ఇది కోలుకునేందుకు కేంద్ర రక్షణశాఖమంత్రి మనోహర్ పారికర్ జోక్యం చేసుకుని తక్షణమే ఆదేశాలు జారీ చేయాలన్నారు. యార్డు, కాలనీలో వౌలిక వసతులు కల్పించడానికి, దీని పునరుద్ధరణకు హుదుద్ రిలీఫ్ ఫండ్‌ను విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. నామినేషన్ ఆధారంగా ఫ్లీట్ సపోర్ట్ ఫ్లీట్ ఆర్డర్లు, ఆరు సబ్‌మెరైన్ల నిర్మాణానికి ఆర్డర్లు, నేవల్ వెసల్స్ రీఫిట్ ఆర్డర్లు షిప్‌యార్డుకు దక్కేలా చొరవ చూపాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు
విశాఖపట్నం, మార్చి 10 : రాష్ట్రప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరానికి గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లాకు చెందిన ప్రతిపక్ష పార్టీలు పెదవి విరిచాయి. వ్యవసాయం, విద్య, ఉపాధిరంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసాయని ఆరోపించాయి. అంకెల గారడీగా, ప్రజలను మభ్యపెట్టే విధంగా బడ్జెట్ ఉందని విమర్శించాయి. అధికార టిడిపి మాత్రం పేదల బడ్జెట్‌గా చెబుతుంటే, మిత్రపక్షమైన బిజెపి అందుబాటులో ఉన్న నిధులతో ఉపయోగకరమైన బడ్జెట్ ప్రతిపాదించారని, కేంద్ర నిధులతో ప్రాధాన్యతా రంగాలకు మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుంటుందని సూచించింది. బడ్జెట్‌పై వివిధ పార్టీల నాయకుల అభిప్రాయాలు..
ఆంగ్ల బడ్జెట్
- గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సాఆర్‌సిపి జిల్లా అధ్యక్షుడు
రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా ఆంగ్ల బడ్జెట్. ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ వివరాలను ఆంగ్లంలోనే వివరించారు. అంటే ప్రజలను పూర్తిగా మోసగించినట్టే. డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలమాఫీ ఊసేలేదు. కాల్‌మనీ పేరుతో జరిగే సంఘటనలపై మహిళలకు కల్పించే భద్రత, రైతులకు సంబంధించి ఎటువంటి హామీల్లేవు.
అంకెల గారడీ బడ్జెట్
- జెవి సత్యనారాయణమూర్తి, సిపిఐ నాయకులు
రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ. ఇందులో ఏమాత్రం స్పష్టత లేదు. పోలవరం ప్రాజెక్టుకు మూడువేల కోట్లు, చేనేత కార్మికులకు రూ.606 కోట్లు. రాయలసీమకు జాతీయ రహదారి అనుసంధానం, పోలవరం, రోడ్ల అనుసంధానం అనేవి పూర్తిగా కేంద్రానికి సంబంధించనవి. వీటికి చెందిన నిధుల కేటాయింపుల ప్రకటన అయోమయంలో పడేసింది.
ఉత్తరాంధ్రకు
మొండి చేయి
- ఎంవిఎస్ శర్మ, ఎమ్మెల్సీ
ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజలకు అన్యాయంగా ఉంది. ముందు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఉత్తరాంధ్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిరాశనే మిగిల్చింది. ఇరిగేషన్ పథకాలను త్వరితగతిన పూర్తిచేయడానికి రూ.15వేల కోట్లు ఉత్తరాంధ్రకు అవసరమని, ఇందులో ఏడాదికి అయిదు వేల కోట్లయినా కేటాయించాలని సంబంధిత నిపుణులు కోరారు. కాని ప్రభుత్వం బడ్జెట్‌లో 10వ వంతు కూడా కేటాయించలేదు. విశాఖ నగరానికి, స్టీల్‌ప్లాంట్‌కు నీటి ఎద్దడి రానుంది. కాబట్టి పుష్కర కాలువ నుంచి అనుసంధానం చేయాలని చేసిన సూచన కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. ఉత్తరాంధ్రలో మూతబడ్డ పరిశ్రమలు తెరిపించడానికి ప్రభుత్వం ఎటువంటి సహాయాన్నీ బడ్జెట్‌లో ప్రకటించలేదు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం గురించి బడ్జెట్ ప్రసంగంలో ఎటువంటి ప్రస్తావన చేయలేదు. డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగభృతి వంటి అంశాలను విస్మరించారు.
నిరాశపరిచిన
రాష్ట్ర బడ్జెట్
- సిహెచ్.నరసింగరావు, సిపిఎం రాష్ట్ర
కార్యదర్శివర్గ సభ్యులు
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర బడ్జెట్‌ను రూ.1,35,688 కోట్లతో ప్రవేశపెట్టారు. కాని ఆర్థికలోటు రూ.20,491 కోట్లు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ లోటు పూడ్చుకోవడం కోసం ప్రజలపై భారం వేయడం తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేటికీ నేరవేర్చలేదు. రైతు, డ్వాక్రా రుణమాఫీల కోసం మూడవ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా వీరి వాగ్దానాలు అమలు చేయడానికి సరిపోదు. కీలకమైన వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల రంగాల్లో కోత విధంచారు. నీటి ప్రాజెక్టుల విషయంలో ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరిగింది. అమరావతి నిర్మాణంతోపాటు విజయవాడ, గుంటూరు డ్రైనేజీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇవ్వలేదు. ఉత్తరాంధ్రకు ప్రధానమైన డాక్టర్ అంబేద్కర్ సుజల స్రవంతికి అసలు నిధులే కేటాయించలేదు. పోలవరం ఎడమ కాలువ మొదటి దశ 2018 జూన్ ఒకటవ తేదీ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. ఒకటవ దశ అంటే ఏమిటి? బేస్ కాంక్రీట్ అయినా పూర్తి అవుతుందా? ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మభ్యపెట్టి మోసం చేయడం సరికాదు. చంద్రబాబు పరిపాలనలో 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించానికి 359 కరువు మండాలాల్లో చెల్లించాల్సిన సబ్సిడీలు, నష్టపరిహారాల గురించి బడ్జెట్ పట్టించుకోలేదు. విద్యుత్ సబ్సిడీ గత ఏడాది కంటే ఇపుడు రూ.550 కోట్లు తగ్గించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్ట ప్రకారం జనాభా ప్రాతిపదిక మీద నిధులు కేటాయించాలి. కానీ ఆ విధంగా కేటాయింలేదు.
కేంద్రం నిధులపై
దృషి టపెట్టాలి
- ద్రోణంరాజు శ్రీనివాస్,
పిసిసి ప్రధాన కార్యదర్శి
కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులపై దృష్టిపెట్టాలి. ఏడు మిషన్లు అమలు జరిగేదికాదు. ఇది అమలు జరగాలంటే నిధులు అవసరం. ఇప్పటికే 20వేల కోట్ల లోటు బడ్జెట్ దాటింది. రాష్ట్రానికి ఆర్థిక స్థోమత లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భారీగా ఉంది. లోటు బడ్జెట్ ఉన్నపుడు ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనుమానాలకు దారి తీస్తోంది. 1.35 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఇది అమలయ్యేదేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సామాన్యుల బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా సామాన్యులకు ప్రయోజనం కల్పించేదిగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులు ఉపయోగించుకుంటామని చెప్పారు. ఇది మంచి పరిణామం. పోలవరానికి 3600 కోట్లు కేటాయించారు. అయితే పోలవరం ఎడమ కాలువ పూర్తి చేసి విశాఖకు తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటిని తీసుకువస్తే మంచి ఫలితాలొస్తాయి.
ఎం.నాగేంద్ర,
బిజెపి నగర అధ్యక్షుడు
మార్చిలోగా పర్యాటక పనులు పూర్తి
విశాఖపట్నం, మార్చి 10: పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి వివిధ పనులను మార్చి మాసాంతానికి పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. భీమిలి మండలం మంగమారిపేట, తొట్లకొండ ప్రాంతాల్లో ఆయన గురువారం పర్యటించారు. కాపులుప్పాడ పంచాయతీ మంగమారిపేట వద్ద దాదాపు 1.5 కోట్లతో చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. విశాఖలో 8 బీచ్‌లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు నిధులు కేటాయించారని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ఆర్కే బీచ్, ఎండాడ, సాగర్‌నగర్, యారాడ, రేవుపోలవరం, భీమిలి తదితర బీచ్‌కలు అటవీశాఖ అనుతులు కోరామని తెలిపారు. మంగమారిపేట వాటర్ స్పోర్ట్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తొట్లకొండ బౌద్ధరామంలో చేపడుతున్న వివిధ పనులను కలెక్టర్ పరిశీలించారు. సకాలంలో పనులను పూర్తి చేయాలని తెలిపారు. లోకల్ టూరిజం ఫండ్స్ కింద మంజూరైన రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తొట్లకొండ అభివృద్ధికి మరో కోటిన్నర రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. తొట్లకొండ మీద నుంచి సముద్ర, నగర అందాలను వీక్షించేందుకు వీలుగా వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గార్డెన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో పర్యాటక శాఖ ఇడి అనంత శ్రీనివాస్, టూరిజం ఇన్ఫర్మేషన్ అధికారి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.