నల్గొండ

టిబి విభాగంలో భారీ అవినీతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జనవరి 22: జిల్లా కలెక్టర్ చైర్మెన్‌గా వ్యవహరించే టిబి విభాగంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. చింతపల్లి టిబి యూనిట్ కింద ఉన్న పది మండలాల్లో టిబి రోగులను గుర్తించిన ఆశ వర్కర్లకు పారితోషికం డబ్బులు ఇవ్వకుండా అక్కడ పని చేసే కాంట్రాక్ట్ సిబ్బంది బినామీ పేర్లను ఆశవర్కర్లుగా చూపించి పెద్ద మొత్తంలో డబ్బు స్వాహా చేశారు. ఈ అవినీతి దందాపై విచారణ జరపాలని ఆశవర్కర్ పి.అమరావతి, ఆశవర్కర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు నీలావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిబి పేషంట్లను గుర్తించి వారికి క్రమం తప్పకుండా వైద్యం చేయించి వ్యాధిని నయం చేయించినందుకు ఆశ వర్కర్లకు ప్రభుత్వం నుండి పారితోషికం అందుతుంది. అయితే ఈ పారితోషికాన్ని ఆశ వర్కర్లకు చెల్లించకుండా టిబి విభాగంలో పని చేసే సిబ్బంది తమ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులను ఆశ వర్కర్లు, సోషల్ వర్కర్లు, అంగన్‌వాడి వర్కర్లుగా రికార్డుల్లో చూపిస్తూ అక్రమంగా వేల రూపాయలను స్వాహా చేసినట్లు తెలిసింది.
చివరికి ఈ అవినీతి ఎంతటి తారాస్ధాయికి చేరిందంటే దేవరకొండ మండలంలో విఆర్వోగా పని చేస్తున్న మహిళను ఆశ వర్కర్‌గా చూపించి పారితోషికాన్ని స్వాహా చేశారు. ఇంతటి అవినీతికి దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి టిబి యూనిట్ కేంద్రంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం ఈ విభాగంలో రెగ్యులర్ ఉద్యోగులు లేకపోవడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులే రాజ్యమేలుతున్నారు. చింతపల్లి టిబి యూనిట్‌లో హెల్త్ విజిటర్‌గా పని చేస్తున్న సైదులు, ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్న విజయ్‌లు ఆశ వర్కర్లకు రావాల్సిన డబ్బులను వారికి ఇవ్వకుండా తమ కుటుంబసభ్యులు, స్నేహితుల పేర్లపై స్వాహా చేశారు. 2013 సంవత్సరం వరకు టిబి రోగులను టిబి యూనిట్‌కు తీసుకొచ్చి వైద్యం చేయించి వారికి వ్యాధి నయం చేయించినందుకు ప్రభుత్వం ఆశ వర్కర్‌కు 250 రూపాయల చొప్పున పారితోషికం ఇచ్చేది. 2014 సంవత్సరం నుండి ప్రభుత్వం ఈ పారితోషికాన్ని 1000 రూపాయలకు పెంచింది.
కాంట్రాక్ట్ సిబ్బంది తమకు ఇష్టం ఉన్న వారి పేర్లపై పారితోషికాన్ని మింగేశారు. ఒక ఏరియాలో పని చేసే ఆశవర్కర్‌ను మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా వైద్యం చేయించినట్లు రికార్డుల్లో చూపించి పారితోషికం డబ్బులను స్వాహా చేశారు.
చింతపల్లి టిబి యూనిట్‌లో ల్యాబ్‌టెక్నిషియన్‌గా పని చేస్తున్న విజయ్ అనే వ్యక్తి దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామ విఆర్వోగా పని చేస్తున్న తన భార్య జి.సునితను ఆశ వర్కర్‌గా చూపిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులను డ్రా చేశాడు. 6.3.2014 న ఈమెకు వి ఆర్వోగా ఉద్యోగం రాగా అప్పటి వరకు ఈమె గృహిణిగానే ఉంది. అయితే 2013 నుండి ఇప్పటి వరకు ఈమెను ఆశ వర్కర్‌గా చూపిస్తూ ఆశ వర్కర్ల పేరుపై వచ్చిన పారితోషికాన్ని డ్రా చేశారు. దేవరకొండ ఎస్బీహెచ్‌లో ఉన్న సునిత అకౌంట్ నెంబర్ 62289362776 ద్వార పెద్ద మొత్తంలో డబ్బులను అక్రమంగా తీసుకున్నారు. విఆర్వోగా పని చేస్తున్న మహిళ ఆశ వర్కర్‌గా ఎలా విధులు నిర్వహిస్తుంది అన్న విషయం ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. హెల్త్ విజిటర్‌గా పని చేస్తున్న సైదులు అనే ఉద్యోగి తన భార్య వాణి పేరుపై దేవరకొండ ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నెంబర్ 011310100056592 ద్వార ఆశవర్కర్లకు రావాల్సిన పారితోషికాన్ని డ్రా చేసుకున్నాడు. కాగా గృహిణిగా ఉన్న వాణిని రికార్డుల్లో ఆశవర్కర్‌గా చూపించారు. అలాగేదేవరకొండ పట్టణానికి చెందిన ఎన్ భాగ్యమ్మ, ఎన్ సంగీత, ఎన్ సంతోషిలు ఒకే కుటుంబానికి చెందిన వారు. భాగ్యమ్మ తల్లి కాగా ఆమె ఇద్దరు కూతుళ్ళ పేర్లు సంగీత, సంతోషి. వీరికి వైద్య ఆరోగ్యశాఖతో ఎలాంటి సబంధం లేదు. అయినా వీరు దేవరకొండ, చందంపేట, చింతపల్లి, గుడిపల్లి పి హెచ్‌సి ల పరిధిలోని టిబి వ్యాధిగ్రస్తులను గుర్తించి వైద్యం చేయించారని ఇందుకు ప్రతిగా ప్రభుత్వం నుండి వచ్చిన పారితోషికాన్ని పెద్ద మొత్తంలో డ్రా చేశారు.
అక్రమాలపై విచారణ జరుపుతాం
* డిటిసివో అరుంధతి
చింతపల్లి టిబి యూనిట్‌లో పని చేసే కాంట్రాక్ట్ సిబ్బంది ఆశ వర్కర్లకు అందాల్సిన పారితోషికం డబ్బులను నిబంధనలకు విరుద్దంగా తమ కుటుంబసభ్యులు, స్నేహితుల పేర్లపై స్వాహా చేశారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతామని జిల్లా టిబి నియంత్రణ అధికారి డాక్టర్ అరుంధతి చెప్పారు. విచారణలో ఆరోపణలు రుజువైతే అక్రమాలకు పాల్పడ్డ సిబ్బందిని విధుల నుండి తొలగిస్తామని ఆమె చెప్పారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.