నల్గొండ

కిక్కిరిసిన గొల్లగట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఫిబ్రవరి 15: గొల్లగట్టులో జనం జాతర కొనసాగుతూనే ఉంది. జాతర ప్రారంభమై నాల్గవ రోజైన బుధవారం కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. గత మూడురోజులుగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన భక్తుల రద్దీ అధికంగా కన్పించగా నాల్గవరోజున సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్దగట్టుకు తరలి వచ్చారు. బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు జన ప్రవాహం ఏమాత్రం తగ్గలేదు. దీంతో గొల్లగట్టు మొత్తం కిక్కిరిసిపోయింది. నాల్గవరోజున ఉత్సవ విగ్రహాలకు యాదవ కులపెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెలవారం పూజా కార్యక్రమాలను నిర్వహించి నైవేధ్యం వండి స్వామివారికి సమర్పించి గొర్రె పిల్లను బలిచ్చారు. జాతరలో మహిళల రద్దీ అధికంగా కన్పించింది. ముఖ్యంగా మహిళలు గుట్టపై ఉన్న లింగమంతుల స్వామి, చౌడమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత గుట్టపైనే ఉన్న పుట్ట వద్ద పూజలుచేసి నాగదేవతకు పాలు, గుడ్లను నైవేధ్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పుట్ట వద్ద భక్త్భివంతో ప్రార్ధిస్తే కోరికలు నెరవేరుతాయని ప్రాచూర్యంలో ఉంది. హిందువులతోపాటు ముస్లిం మహిళలు కూడా పుట్టవద్ద పూజలు జరపడం మతసామరస్యాన్ని చాటి చెప్పింది. ముఖ్యంగా మహిళలు కుంకుమ, గాజులను ఇష్టంగా కొనుగోలు చేశారు. జాతరలో ఏర్పాటుచేసిన జాయింట్‌వీల్, రంగుల రాట్నాలు ఎక్కేందుకు భక్తులు అమితాసక్తి కనబర్చారు. వీటి ధరలు అధికంగా ఉన్నప్పటికీ ఉల్లాసంకోసం పోటాపోటీగా వాటిని ఎక్కడం కన్పించింది. గతంలో జరిగిన జాతరలో కేవలం మూడు రోజులే భక్తుల రద్దీ అధికంగా ఉండేంది. అయితే ఈసారి జాతరలో నాల్గవరోజున కూడా లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో దేవాదాయశాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత మూడురోజుల కంటే భక్తుల సంఖ్య కొంతమేర తగ్గడంతో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. అయితే గుట్టకింద పారిశుద్ధ్యం బాగానే ఉన్న గుట్టపైన సిబ్బంది పట్టించుకోకపోవడంతో దుర్వాసన వస్తోంది. అపరిశ్రుభంపై డిపివో రాంమోహన్‌రాజు దేవాదాయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం దేవరపెట్టెను కేసారం గ్రామానికి తరలించారు. బుధవారం ఎమ్మెల్సీ పూల రవీందర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లయ్యయాదవ్‌లు గట్టును సందర్శించి పూజలు చేశారు.

2019లో కాంగ్రెస్‌దే అధికారం
ఎన్నికల హామీల అమలులో కెసిఆర్ విఫలం * సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మిర్యాలగూడ, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో 2019లో జరిగే సాదారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్‌పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో బుధవారం కాంగ్రెస్‌పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2019లో సాధారణ ఎన్నికల్లో 90నుండి 100సీట్లు కాంగ్రెస్‌పార్టీ సునాయాసంగా గెలుచుకోని అధికారాన్ని చేపడుతుందని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలవుతున్నా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించి ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్ధుల బలిదానాలను నివారించేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసి నిరాహారదీక్ష చేశానని ఆయన అన్నారు. ఉద్యోగాల భర్తీలో ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహాన్ని చూస్తే అధికారం కాంగ్రెస్‌పార్టీదేనని అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కాంగ్రెస్‌పార్టీ 90నుండి 100స్థానాలు గెలుచుకోవడమేకాకుండా మిర్యాలగూడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి భారీ మెజారిటితో గెలవడం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం యువత బలిదానాలు చేసుకున్నారని, యువత బలిదానాలతో సాధించుకున్న తెలంగాణాలో నిరుద్యోగ యువతకు ఉపాది కల్పించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రోజుకో మాట చెప్తూ కాలం వెల్లదీస్తున్నారే తప్పా వాటిని అమలు చేయడంలేదని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డం వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, కుక్కడం ఎంపిటిసి పుట్ట పద్మ, మాడుగుల సర్పంచ్ పుల్లెంల సైదులు, నాయకులు వెంకట్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, ఎల్లయ్య, అశోక్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

సేవాలాల్ స్ఫూర్తితో గిరిజనుల ప్రగతికి కృషి
* జడ్పీ చైర్మన్ బాలునాయక్
* ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

నల్లగొండ, ఫిబ్రవరి 15: గిరిజనుల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ 278వ జయంతి వేడుకలను ప్రభుత్వ యంత్రాంగం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో అధికారికంగా ఘనంగా నిర్వహించింది. ప్రతి నియోజకవర్గం, మండల కేంద్రాల్లో, కార్యాలయాల్లో సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించి సభలు, సమావేశాలు నిర్వహించిన నివాళులర్పించారు. నల్లగొండ జిల్లా కేంద్రం గడియారం సెంటర్‌లో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో జడ్పీ చైర్మన్ ఎన్. బాలునలాయక్, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌లు హాజరై సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలన చేసి, సాంప్రదాయ గిరిజన పూజాధికాలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జయంతి సభలో జడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ గిరిజన జాతి అభివృద్ధికి సంత్‌సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సేవాలాల్ స్ఫూర్తితో ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. సంత్‌సేవాలాల్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అనుసరించి గురుకుల పాఠశాలల ఏర్పాటు, తండాలను పంచాయతీలుగా మార్చడం వంటి అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో బంజారా భవన్‌లు ఉన్నాయని, జిల్లా కేంద్రంలో ఎకరం స్థలం కేటాయించి బంజార్ భవన్‌ను నిర్మించాలని కోరుతామన్నారు. ఇందుకు జిల్లా మంత్రి కోటా నిధులతో పాటు ఇతర నిధులను కోరుతామన్నారు. గిరిజన తండాల్లో పిల్లలు, మహిళల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం చేపడుతుండటం అభినందనీయమన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ సంత్‌సేవాలాల్ గిరిజనుల అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రభుత్వ యంత్రాంగం గిరిజనుల ప్రగతికి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారిగా ఎస్టీ కార్యక్రమాల అమలు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ధర్మానాయక్ రూపొందించిన సేవాలాల్ పాటల సిడిలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిఆర్‌వో ఖిమ్యానాయక్, ఎఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో వెంకటాచారి, ఉత్సవ కమిటీ సభ్యులు లచ్చునాయక్, ధర్మానాయక్, పాండునాయక్, హఫీజ్‌ఖాన్, డిటిడబ్ల్యువో నరోత్తంరెడ్డి, కౌన్సిలర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

పిఎస్‌ఎల్‌వి-సి 37
ప్రయోగంలో ‘పేట’ శాస్తవ్రేత్త
సూర్యాపేట, ఫిబ్రవరి 15: అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రపంచ చరిత్రను తిరగరాస్తూ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్ధ బుధవారం ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి 37 ప్రయోగంలో సూర్యాపేటకు చెందిన శాస్తవ్రేత్త చెర్కుపల్లి వెంకటరమణ భాగస్వామ్యమయ్యారు. జిల్లాకేంద్రానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కుమారుడైన వెంకటరమణ పట్టుదలతో చదివి ఉన్నతస్థాయికి ఎదిగారు. పదో తరగతి వరకు పట్టణంలోని జిల్లా పరిషత్ నెంబర్-2 పాఠశాలలో చదివిన ఆయన పాలిటెక్నిక్ విద్యను హైదరాబాద్‌లో పూర్తిచేశారు. అనంతరం ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసి ఇస్రోలో చేరి గత 18ఏళ్లుగా ఇస్రోలో పనిచేస్తున్నారు. గతంలో ఇస్రో ప్రయోగించిన అనేక ఉపగ్రహ ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరించారు. తాజాగా ప్రపంచానికి మకుటంలా నిలిచిన 104 ఉపగ్రహాల ప్రయోగంలోనూ తన పాత్ర పోషించి సూర్యాపేటకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ పిఎస్‌ఎల్‌వి-సి37 ప్రయోగంలో పాల్గొనడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ ప్రయోగం కోసం ఇస్రో బృందం ఇస్ట్రాక్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా రాకెట్ గమనాన్ని పర్యవేక్షించి రాకెట్ వివిధ దశల పనితీరును ఎంతో క్లిష్టమైన 104 ఉపగ్రహాలు విడిపోయే కీలక ప్రక్రియను విజయవంతంగా అందించామని, ఇందుకోసం గత నెలరోజులుగా శాస్తవ్రేత్తలు బృందాలుగా ఏర్పడి రేయింబవళ్లు సమష్టిగా శ్రమించడం వల్లే విజయం సాధ్యమైందన్నారు.

అశాస్ర్తియంగా జిల్లాల ఏర్పాటు
* డిసిసి అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్
గుండాల, ఫిబ్రవరి 15: రాష్ట్ర ప్రభుత్వం అశాస్ర్తియంగా ఏర్పాటు చేసిన నూతన జిల్లాలు గుండాల మండలానికి శాపంగా మారిందని నల్లగొండ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అశాస్ర్తియంగా ఏర్పడిన జిల్లాలను సరిచేస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి, అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇల్లు, రైతులకు పూర్తిగా రుణమాఫీ, విద్యార్థులకు ఉపకార వేతనాలు తక్షణమే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కందిపంట సాగుచేసిన రైతులు, కంది కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించి రైతులు పూర్తిగా మోసపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రతి మండలంలో కంది కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా విలేఖరుల సమావేశానికి ముందుగా ఆయన మండలంలోని బ్రాహ్మణపల్లిలో బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈకార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ దుంపల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పబ్బూరి సుధాకర్, ఎంపిటిసి బూడిద రాముల, సర్పంచ్ పిట్టల సోమయ్య, రాజరత్నం, సోమనర్సయ్య, లింగాల భిక్షం, నాగిరెడ్డి పాల్గొన్నారు.

ఇసుక లారీలు, ట్రాక్టర్ పట్టివేత
చింతపల్లి, ఫిబ్రవరి 15: మండలంలోని వివిధ గ్రామాల వాగుల నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 లారీలను మండలంలోని కుర్మేడ్ సమీపంలో పట్టివేసినట్లు, గౌరారం సమీపంలో ఒక ట్రాక్టర్‌ను పట్టివేసినట్లు ఎస్‌ఐ నాగభూషణం రావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

గొర్రెల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం
* సిఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గొర్రెల కొనుగోలుకు ప్రణాళికలు సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కలెక్టర్‌లను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2 వేల 500 కోట్ల అంచనాలతో 2 లక్షల యూనిట్లను లబ్దిదారులకు అందేజేయాల్సి ఉందన్నారు. గొర్రెల యూనిట్ మంజూరుకు 75 శాతం సబ్సిడీ, 25 శాతం లబ్ది దారుని వాటా ఉంటుందన్నారు. యాదవ కుటుంబాల లెక్కలు సేకరించి అవసరమైన గొర్రెల యూనిట్లపై ప్రతిపాదనలు అందించాలన్నారు. పథకం అమలు పూర్తి భాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందన్నారు. ఈకార్యక్రమంలో స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సురేష్, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా జెడి నర్సింహులు ఉన్నారు.

స్ర్తి నిధి రుణ పంపిణీ లక్ష్యాల్లో వేగం పెంచాలి
* కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

నల్లగొండ, ఫిబ్రవరి 15: స్ర్తి నిధి 2016-17ఆర్ధిక రుణ పంపిణీ లక్ష్యాలను మార్చి 10వ తేదిలోపు వంద శాతం పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. బుధవారం డిఆర్‌డిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన స్ర్తి నిధి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతు 2016-17సంవత్సరానికి స్ర్తి నిధికి 74కోట్ల రుణ పంపిణీ లక్ష్యంకాగా ఇప్పటిదాకా 30కోట్ల రూపాయలు మాత్రమే పంపిణీ చేశారన్నారు. మిగిలిన రుణ పంపిణీ లక్ష్యాలను మార్చి 10లోగా పూర్తి చేయాలన్నారు. పేద మహిళల అభ్యున్నతికై స్ర్తి నిధి బ్యాంకులింకేజి రుణాల భూమిక కీలకంగా ఉందన్నారు. రుణ పంపిణీతో పాటు రికవరిపై కూడా దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 60పల్లె సేవా కేంద్రాలతో సేవలందిస్తున్నామని, మీ సేవా కేంద్రాలు లేని ప్రాంతాల్లో కామన్ సర్వీస్ సెంటర్లను ప్రారంభించాలన్నారు. జిల్లాలో నగదు రహిత లావాదేవిలను విస్తరించడంల స్వయం సహాయక మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలన్నారు. మండలాల వారిగా కలెక్టర్ స్ర్తి నిధి రుణ పంపిణీని సమీక్షించారు. ఈ సమావేశంలో స్ర్తినిధి మేనేజింగ్ డైరక్టర్ జి.విద్యాసాగర్‌రెడ్డి, డిఎం బి.విద్యాసాగర్, డిఆర్‌డివో ఆర్. అంజయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ డి.సూర్యం, సహాయ మేనేజర్లు డి.గిరి, మధుసూధన్, వి.అలీ, స్ర్తి నిధి జిల్లా అధ్యక్షురాలు లిలత, ఏపిఎంలు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

‘కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్’
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో జనరంజకంగా కెసిఆర్ పాలన సాగుతుండా జెఎసి చైర్మన్ కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్‌గా వ్యవహరిస్తు టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలను, యువతను రెచ్చగొడుతున్నారని టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు కట్టా శ్రీను, కంచర్ల శ్రవణ్‌గౌడ్‌లు విమర్శించారు. బుధవారం టిఆర్‌ఎస్ కార్యాలయంలో వారు విలేఖరులతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ, ప్రాజెక్టులతో పాటు వివిధ ప్రజాసంక్షేమ, అభివృద్ధి పథకాలపై కోదండరాం ప్రజలను తప్పుదోవ పటిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేసే మంచిపనులను చూడకుండా గుడ్డి వ్యతిరేకతను కోదండరాం వ్యక్తం చేస్తుండటం సరికాదన్నారు.

సత్వర న్యాయంతోనే అవినీతి అంతం
* లోక్‌సత్తా రాష్ట్ర కన్వీనర్ రాంమోహన్‌రావు
సూర్యాపేట, ఫిబ్రవరి 15: రాజకీయ అవినీతికి పాల్పడిన కేసులను సత్వరమే విచారించి నిందితులకు శిక్షలు విధిస్తే దేశంలో అవినీతి సులభంగా అంతమవుతుందని లోక్‌సత్తా పార్టీ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ బండారు రాంమోహన్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమాస్తుల కేసులో శశికళ ఎలా జైలుకు వెళ్లిందో అదే రీతిన దేశంలో రాజకీయ అవినీతికి పాల్పడే వారిని కోర్టుల్లో జాప్యం లేకుండా శిక్షలు విధిస్తే అవినీతి రాజకీయాలు అంతమై జనరాజకీయాలు ఆరంభమవుతాయన్నారు. జయలలిత అక్రమ ఆస్తుల కేసును 20 ఏళ్ల పాటు విచారణ కొనసాగడంతో అవినీతి పరులకు భయం లేకుండాపోయిందన్నారు. ఈ తరహా కేసుల విచారణకు నిర్ధిష్ట కాలాన్ని నిర్ణయించి త్వరితగతిన విచారణ పూర్తిచేసి శిక్షలు విధిస్తే న్యాయ వ్యవస్థపై గౌరవంతో పాటు అవినీతికి పాల్పడే వారిలో భయం నెలకొంటుందన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలని తాము పోరాడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో లోక్‌సత్తా రాష్ట్ర కార్యదర్శులు గోవిందరావు, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

బీబీనగర్ రంగాపురంలోనే ఎయమ్స్
* ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

భువనగిరి, ఫిబ్రవరి 15: యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో మల్టి సూపర్ స్పెషాలిటి హస్పిటల్ ఎయమ్స్ ఏర్పాటుతో దేశంలోనె అతిపెద్ద హెల్త్‌హబ్‌గా ఎదిగేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న నిమ్స్ హాస్పిటల్ ఆవరణలోనె ఎయిమ్స్‌ను ఖరారు చేస్తు ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలియజేసారు. బుధవారం టిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమెరకు బీబీనగర్ రంగాపురంలో ఎయమ్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించడం ప్రజలకు రాజకీయ పక్షాలకు ఎయమ్స్ ఏర్పాటుపై నున్న అపోహలు పంటాపంచలయ్యాయని అన్నారు. నిమ్స్‌లో నిర్ణిత గడువులోపు ఇన్‌పేషేంట్ విభాగాలను ప్రారంబించనున్నట్లుగా తెలిపారు. నిమ్స్ అభివృద్ధి పనులను కొనసాగిస్తునే కేంద్రం కోరిన మెరకు ఎయిమ్స్ ఏర్పాటుకు కావల్సిన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేసారు. నిమ్స్, ఎయమ్స్ ఏర్పాటుతో యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ జిల్లా వాసులకు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. బీబీనగర్ మండలంలోని రంగాపురం గ్రామంలో ఎయమ్స్ ఏర్పాటుచేసేందుకు నిర్ణయంతీసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రజలతరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈసమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ జడల అమరేందర్, కొల్పుల అమరేందర్, పంతులు నాయక్, నోముల పరమేశ్వర్‌రెడ్డి, అతికం లక్ష్మినారాయణగౌడ్, పోలిశెట్టి అనీల్‌కుమార్, రావుల శ్రీనివాస్, ఆదినారాయణ, కంచనపల్లి నర్సింగ్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.