నల్గొండ

నిర్బంధంపై బిజెపి శ్రేణుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 25: మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బిజెపి, బిజెవైఎంలు నిర్వహించిన చలో అసెంబ్లీని ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంతో భగ్నం చేయించి నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్టు చేయించడాన్ని నిరసిస్తు బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో పార్టీ శ్రేణులు సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మల దగ్ధాలతో నిరసనలు నిర్వహించారు. నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నేరడుచర్ల, దామరచర్ల, కనగల్, నకిరేకల్, చౌటుప్పల్, నార్కట్‌పల్లి, చిట్యాల, హుజూర్‌నగర్, కోదాడ, మోత్కూర్, సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, బీబీనగర్, వలిగొండ, రామన్నపేట తదితర ప్రాంతాల్లో బిజెపి, బిజెవైఎం నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహించి సిఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహరెడ్డి మాట్లాడుతూ రాజ్యంగ విరుద్ధంగా, కోర్టుల తీర్పులకు వ్యతిరేకంగా సిఎం కెసిఆర్ ముస్లిం మైనార్టీలకు మతపరమైన రిజర్వేషన్ల కల్పనకు ప్రయత్నిస్తు వారిని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మతపరమైన రిజర్వేషన్ల కల్పన చర్యలతో బిసిల రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతుందని సమాజంలో చీలికలు ఏర్పడుతాయన్నారు. ప్రభుత్వ చర్యలపై ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన బిజెపి, బిజెవైఎం నాయకులను వేలాది మందిని అరెస్టు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై తన దమనకాండను చాటుకుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం నియంతృత్వ, ఓటు బ్యాంకు రాజకీయాలను మానుకోని పక్షంలో తగిన సమయంలో ప్రజల చేతిలో గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, పొతెపాక సాంబయ్య, బొజ్జ నాగరాజు, పొతెపాక లింగస్వామి, మునికుమార్ తదితరులు పాల్గొన్నారు.

వెలిదండలో దారుణహత్య
భార్యా భర్తలపై గొడ్డలితో దాడి
* భర్త మృతి.. భార్యకు గాయాలు
* సంఘటన స్థలాన్ని పరిశీలించిన డిఎస్పీ

గరిడేపల్లి, మార్చి 25 : మండలంలోని వెలిదండ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణహత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వెలిదండ గ్రామానికి చెందిన మండవ కృష్ణ అతని భార్య స్వాతి తన ఇంటిలో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన మంగళగిరి వెంకటేశ్వర్లు అలియాస్ గణేష్ అనే వ్యక్తి గొడ్డలితో కృష్ణపై దాడిచేయగా చనిపోయాడు. అలికిడికి ఒక్కసారిగా ఉలికిపడి లేచిన భార్య అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెకు కూడా గాయాలయ్యాయి. నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో దాడి చేయటంతో కృష్ణ (27) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన స్వాతిని హుజూర్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన వెలిదండ గ్రామానికి చేరుకున్నారు. కోదాడ డిఎస్పీ రమణారెడ్డి, సిఐ మధుసూదన్, గరిడేపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. హత్యచేసిన మంగళగిరి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఆయన వివరించారు. హత్య గురైన కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూర్‌నగర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడు కృష్ణకు ముగ్గురు పిల్లలున్నారు.
అక్రమ సంబంధమే కారణమా..?
మండవ కృష్ణ మృతికి కారణం అక్రమ సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మంగళగిరి వెంకటేశ్వర్లు భార్యతో కృష్ణకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో పగను పెంచుకుని ఈహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.

8న జాతీయ లోక్ అదాలత్
* జిల్లా జడ్జి తిరుమల్‌రావు

నల్లగొండ లీగల్, మార్చి 25: వచ్చే నెల 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయాలని జిల్లా జడ్జి పి.తిరుమల్‌రావు పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలోని న్యాయసేవా సంస్థలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కక్షిదారుల సమ్మతి మేరకు అన్ని రకాల సివిల్ కేసులు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులను, మోటార్ వాహనాలనుల ప్రమాదాల కేసులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. పోలీస్ శాఖ, న్యాయవాదులు, రెవెన్యూ శాఖ వారు, బ్యాంకర్లు ఈ లోక్ అదాలత్‌లో విజయవంతం చేయాలని కోరారు. అదాలత్‌లో రాజీపడిన కేసులకు అప్పీలు ఉండదని, అదాలత్ తీర్పు అంతిమ తీర్పుగా భావిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ పరిమళ, న్యాయమూర్తులు ఎంఆర్. సునీత, వింద్యేశ్వరి, ప్రేమరాజేశ్వరి, ఐ.శైలాజాదేవి, డిఎస్పీ సుధాకర్, సునీత, రవికుమార్, రమణారెడ్డి, న్యాయావాదులు కొండ శ్రీనివాస్, ఎన్. బీమార్జున్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నాంపల్లి నరసింహ్మ, రామబ్రహ్మచారి, భానుప్రకాశ్, లింగయ్యలు పాల్గొన్నారు.

జూన్ నాటికి ముంపు గ్రామాలు ఖాళీ
* ఐడిసి ప్రిన్సిపల్ సెక్రటరి వికాస్ రాజ్
మఠంపల్లి, మార్చి 25: వచ్చే జూన్‌నాటికి పులిచింతల ముంపు గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కృషి చేస్తామని నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వికాస్‌రాజ్ తెలిపారు. శనివారం మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో ముంపునకు గురైన పాత గ్రామాన్ని, పునరావాస కేంద్రాలను ఆయన సూర్యాపేట జెసి సంజీవరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ పులిచింతల ప్రాజెక్టుతో 13 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, ఇప్పటివరకు 8 గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. మరో మూడు గ్రామాలు పాక్షికంగా తరలించామని, మండలంలోని మట్టపల్లి, మేళ్లచెర్వు మండలంలోని అమ్మవరం గ్రామాలలో ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు ఎవరూ వెళ్లలేదని అన్నారు. గుండ్లపల్లి గ్రామం ఆదర్శవంతంగా ఉందని, పాత గ్రామంలో ఉన్న ఆంజనేయ, వినాయక, ఆలయాల పునర్‌నిర్మాణం కోసం పునరావాస కేంద్రంలో త్వరలో నిర్మిస్తామని పేర్కొన్నారు. వచ్చే జూన్ నెలలో ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే గ్రామాలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆలోపే అన్ని శాఖల సమన్వయంతో తరలింపు ఏర్పాటు పూర్తిచేస్తామని స్పష్టం చైశారు. కార్యక్రమంలో ఐబి ఎస్‌ఇ ధర్మానాయక్, ఇఇ సంజీవరెడ్డి, ఎన్‌ఎస్‌పి సిఇ సునీల్, కోదాడ ఆర్డీఓ భిక్షునాయక్, సర్పంచ్ గుండా వెంకటరమణ బ్రహ్మారెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ రమణా నాయక్, దేవాదాయశాఖ ఎసి సులోచన, తహశీల్దార్ యాదగిరి, ఈఓ లక్ష్మణ్‌రావు, కార్యదర్శి గిరిజాకుమారి, రాంబాబు పాల్గొన్నారు.

మతకల్లోలాలు సృష్టించేందుకు యత్నిస్తున్న కెసిఆర్
* బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి

దేవరకొండ, మార్చి 25: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్‌లను అమలులోకి తీసుకొచ్చి రాష్ట్రంలో మతకల్లోలాలను సృష్టించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ యత్నిస్తున్నాడని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి ఆరోపించారు. శనివారం స్థానిక ఐబిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మతపరమైన రిజర్వేషన్‌లకు తాను పూర్తిగా వ్యతిరేకమని ఇలాంటి రిజర్వేషన్‌లను ఎట్టి పరిస్ధితుల్లోనూ అమలు చేయవద్దని భారత రాజ్యాంగనిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపర్చినా అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి విరుద్దంగా ముఖ్యమంత్రి స్వార్థంతో మతపరమైన రిజర్వేషన్‌లను అమలు చేస్తానని చెప్పడం దారుణమన్నారు. కెసిఆర్ తన వైఖరి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మతపరమైన రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా బిజెపి తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్ళకుండా బిజెపి నాయకులకు, కార్యకర్తలను పోలీస్‌లు ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్‌లు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
హిందుత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన
కలెక్టర్ మురళిపై చర్యలు తీసుకోవాలి
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, హిందుత్వాన్ని కించపరేచేలా మాట్లాడిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ పాలన చేయాల్సిన కలెక్టర్ హిందువులు పంది, గొడ్డుమాంసం తినాలని అనవసరపు మాటలు మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విలేఖరుల సమావేశంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ నక్క వెంకటేశ్‌యాదవ్, చెన్నమోని రాములు, వనం జగదీశ్వర్, నేతాళ్ళ వెంకటేశ్‌యాదవ్, ఎటి కృష్ణ, పున్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.