నల్గొండ

దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామశర్మ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూన్ 15: సిపిఐ సీనియర్ నాయకుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బి రామశర్మ (88) అనారోగ్యంతో గురువారం హైద్రాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు. రామశర్మ మృతితో సిపిఐ పార్టీ మంచి ప్రజాదరణ కలిగిన నేతను కోల్పోయినటైంది. జీవించినంత కాలం పేద ప్రజల కోసమై కష్డపడ్డ రామశర్మ స్వగ్రామం దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం పరిధిలోని కందుకూరు. రామశర్మ చిన్ననాటి నుండి కమ్యునిస్టు భావాలతో పనిచేశారు. అగ్ర కులంలో పుట్టినా ఆయన అనుక్షణం ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు. 1972 నుండి 1979 వరకు ఆయన దేవరకొండ నుండి సిపిఐ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అంతకు ముందు ఆయన దేవరకొండ సమితి అధ్యక్షునిగా పని చేశారు. 1983 నుండి 1989 వరకు ఆరు సంవత్సరాలు సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పని చేశారు. 1989లో ఆయన సిపిఐ నుండి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొద్ది రోజుల కిందట రామశర్మ హైద్రాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్‌లో పార్టీ నాయకుల మధ్య 88వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రామశర్మ మృతి పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డిలతో పాటు పలువురు నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామశర్మకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ప్రజల సందర్శనార్ధం రామశర్మ మృతదేహాన్ని శుక్రవారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో ఉంచనున్నట్లు సిపిఐ నాయకులు తెలిపారు. శనివారం స్వగ్రామం కందుకూర్‌లో రామశర్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సిపిఐ నాయకులు తెలిపారు.

పెళ్లి ఇంట పట్టపగలు చోరీ
3లక్షల నగదు, 3లక్షల విలువైన ఆభరణాలు అపహరణ

నేరేడుచర్ల, జూన్ 15: మండల కేంద్రమైన నేరేడుచర్లలోని ఆటోనగర్‌లో గురువారం పట్టపగలు పెళ్లి వారింట గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడి సుమారు రూ.3లక్షల నగదు, రూ.3లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. స్థానిక ఉపాధ్యాయుడు కుక్కడపు సైదులు కుమారుడి వివాహం ఎస్‌కెఎస్ ఫంక్షన్‌హాల్‌లో జరుగుతుండగా గృహ యజమాని కుటుంబంతోపాటు వారింట్లో అద్దెకు ఉంటున్న వారందరు వివాహ వేడుకల్లో ఉండగా ఇదే అదనుగా భావించి గృహంలో ఎవరూలేరని గమనించి గుర్తు తెలియని దొంగలు ఇంటి గడియ పగులగొట్టి గృహంలోకి చొరబడి సైదులు ఇంట్లో ఉన్న బీరువాలను పగులగొట్టి వివాహ ఖర్చుల కోసం ఉన్న సుమారు రూ.3లక్షల నగదు, నల్లపూసల గొలుసు, చెవుల దిద్దులు, బిస్కెట్ బంగారం, మరో 8తులాల బంగారం, ఒక కిలో వెండి వస్తువులను అపహరించుకుపోయారు. అంతేకాకుండా సైదులు ఇంట్లో అద్దెకు ఉంటున్న సిరికొండ రవి గృహం సైతం తాళం పగులగొట్టి గృహంలోకి ప్రవేశించి బీరువాలో ఉన్న రూ.8వేల నగదును అపహరించారు. ఈసమయంలో రవి కుటుంబ సభ్యులు గృహానికి వస్తున్న అలజడిని గమనించి బీరువాలో ఉన్న బంగారం వస్తువులను వదిలివేసి పారిపోయినట్లు భాదితులు తెలిపారు. ఎస్‌ఐ గోపి సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూజ్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించి ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆనందంగా వివాహ వేడుకలు జరుగుతుండగా గృహంలో దొంగతనం జరగడం పట్ల కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.