నల్గొండ

ఆకస్మికంగా కలెక్టరేట్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 23: సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం పోలీస్ యంత్రాంగం ఊహించని రీతిలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆకస్మికంగా కలెక్టరేట్‌ను ముట్టడించి కలకలం రేపారు. పత్తి, ధాన్యం రైతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతు ఈ నెల 27న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన కోమటిరెడ్డి సోమవారం నల్లగొండలో పార్టీ శ్రేణులు, రైతులతో సన్నాహాక సభ నిర్వహించారు. సన్నాహా సభలో చివరగా మాట్లాడిన కోమటిరెడ్డి తన ప్రసంగం చివరలో రైతాంగం సమస్యల పరిష్కారాన్ని కోరుతు ఇక్కడి నుండి మనమంతా బయలుదేరి కలెక్టరేట్‌ను ముట్టడించాలని కార్యకర్తలకు, రైతులకు పిలుపునిచ్చారు. ముందుగా కోమటిరెడ్డి కలెక్టరేట్‌కు బయలుదేరగా వెనుక కాంగ్రెస్ శ్రేణులు, రైతులు కలెక్టరేట్‌గా ర్యాలీగా తమ వాహనాల్లో సాగారు. దీంతో అప్పటిదాకా ఛలో అసెంబ్లీ సన్నాహాక సభ వద్ద బందోబస్తు నిర్వహించిన స్థానిక పోలీస్ అధికారులు తాము ఊహించని రీతిలో కోమటిరెడ్డి ఆకస్మికంగా కలెక్టరేట్ ముట్టడికి పూనుకోవడంతో వెంటనే తమ బలగాలను అప్రమత్తం చేసి ఉరుకులు, పరుగుల మీద కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ముందుగా కలెక్టరేట్ భవన సమీపంలో బారికేడ్లు, ముళ్ల కంచెలు వేసి కాంగ్రెస్ కార్యకర్తలను నిలువరించారు. కోమటిరెడ్డితో పాటు కార్యకర్తలు ఎవరు లోనికి వెళ్లకుండా అడ్డుకోగా ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట సాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించి దెబ్బతిన్న పత్తి పంటను రోడ్డుపై పోసి దగ్ధం చేసి నిరసన తెలిపారు. చివరకు పోలీసులు కోమటిరెడ్డితో పాటు కొద్దిమందిని కలెక్టరేట్‌లోకి వినతి పత్రం అందించేందుకు అనుమతినివ్వగా కలెక్టరేట్ భవనం ముందు మెట్ల వద్ధ కూర్చుని కొద్ధిసేపు కోమటిరెడ్డి నిరసన తెలిపిన పిదప జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డికి వినతి పత్రం అందించి తిరిగి వెళ్లారు. పత్తి, ధాన్యం రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, పంట నష్ట పరిహారం చెల్లించాలని, ఎకరాకు ఇస్తామన్న 8వేల పెట్టుబడి ఈ పంట నుండే అందించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతులకు 10లక్షలు పరిహారం ఇవ్వాలని కోమటిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఆకస్మికంగా కోమటిరెడ్డి చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఎక్కడ బత్తాయి మార్కెట్ శంకుస్థాపన తరహాలో ఉద్రిక్తంగా మారుతుందోనన్న ఆందోళనతో పోలీసులు వేగంగా స్పందించి తగిన బందోబస్తు చర్యలు చేపట్టడం విశేషం. ఈ కలెక్టరేట్ ముట్టడిలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, పాశం సంపత్‌రెడ్డి, రవిందర్‌రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి, ధనలక్ష్మి, వంగూరి లక్ష్మయ్య, జూకూరి రమేష్, అంజి, ఉట్కూరి వెంకట్‌రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు.