నల్గొండ

రెచ్చిపోయిన సూరీడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 23: నల్లగొండ జిల్లాలో నిప్పులు కురిపిస్తున్న సూర్యప్రతాపానికి జనం ఎండ వేడిమి, వడగాలులు, ఉక్కపోతలతో అల్లాడుతున్నారు. శనివారం జిల్లాలో 44.8డిగ్రీల గరిష్ట ఊష్ణోగ్రత నమోదుకాగా ముందెన్నడు లేని రీతిలో 30.6డిగ్రీల రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి ప్రతాపానికి జడిసి జనం మధ్యాహ్నాం వేళల్లో ఇళ్ల నుండి బయటకువచ్చేందుకు సాహసించలేకపోతుండటంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్ధీగా కనిపించే జిల్లా కేంద్రం నల్లగొండ గడియారం సెంటర్‌లో శనివారం ఎండ తీవ్రతకు జన సంఛారం లేక కర్ఫూను తలపిస్తు నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. జనం పగలు, రాత్రులు ఏసిలు, కూలర్లు, ఫ్యాన్ల కింద గడిపేస్తు ఎప్పుడెప్పుడు వాతావరణం చల్లబడుతుందా అనుకుంటు రోజులు వెళ్లదీస్తున్నారు. రాత్రి 9గంటలకు కూడా వేడి గాలులు వీస్తున్న తీరు వేసవి తీవ్రతను చాటుతుంది. రోజువారి కూలీలు, ఉపాధి కూలీలు, చిరు వ్యాపారులు, సంఛార జీవులు ఎండల ధాటికి తల్లడిల్లిపోతున్నారు. ఎండల్లో పనులు చేసే పరిస్థితి లేక జీవనోపాధి గడువక అవస్థలు పడుతుండగా సూర్యాప్రతాపం బడుగుజీవిపై పెను ప్రభావం చూపుతుంది. ఎండల జోరు మేరకు వడదెబ్బ మరణాలు కొనసాగుతుండగా జిల్లాలో శనివారం వేములపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ, నేరడుచర్ల, పిఏపల్లి, చిట్యాల, సూర్యాపేట తదితర కేంద్రాల్లో వడదెబ్బతో 10మంది మరణించారు. ఎండల తీవ్రత నేపధ్యంలో కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌డేను రద్ధు చేసి దాని స్థానంలో కలెక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లాలో వడదెబ్బతో 10 మంది మృతి
నల్లగొండ, ఏప్రిల్ 23: జిల్లాలో గత 24 గంటల్లో ఎండవేడిమికి తాళలేక వడదెబ్బవల్ల కనీసం 10 మంది మరణించారు. చిట్యాల మండలంలో ఇద్దరు, ఆత్మకూర్ (ఎస్), నేరేడుచర్ల, గుండాల, కేతేపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల, పెదవూర మండలాలలో ఒక్కొక్కరు వడదెబ్బ వల్ల మరణించారు.
చిట్యాలకు చెందిన గండమళ్ళ వెంకులు(65) ఎండవేడిమికి అధిక ఉష్ణోగ్రతకు తట్టుకోలేక అస్వస్థతకు గురై వడదెబ్బ తగిలి మృతిచెందాడు. మండలంలోని శివనేనిగూడెంకు చెందిన గొండ్ర బుచ్చమ్మ వ్యవసాయ పనులకు వెళ్ళి ఎండవేడిమి అధికంగా ఉండడంతో వడదెబ్బ తగిలి మృతిచెందింది.
ఆత్మకూర్(ఎస్) మండలం దుబ్బతండాకు చెందిన జాటోతు సైదులు (64) నేరేడుచర్ల మండలం జాన్‌పహాడ్ గ్రామానికి చెందిన పొట్టిపంగ గురవయ్య(67) మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట్ల యాదగిరి(60) , కేతేపల్లి మండలం కాసనగోడులో వ్యవసాయ కూలీ ఉప్పల నర్సయ్య(43) నకిరేకల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
మిర్యాలగూడ మండలంలోని నందిపహాడ్ గ్రామ పంచాయితీ పరిది భాగ్యతండాలో ధనావత్ ఆమలి(37), వేములపల్లి మండలం గుర్రప్పగూడెంలో చోటుచేసుకుంది. గుర్రప్పగూడెంకు చెందిన పందిరి రాములమ్మ(55) , దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో రూపావత్ హరిచంద్రు(63) పెద్దవూర మండల పరిదిలోని నాయకుని తండాలో తుంగతుర్తి జానకమ్మ(62) వడదెబ్బవల్ల మరణించింది.

25న సిపిఐ కలెక్టరేట్ ముట్టడి
రామగిరి, ఏప్రిల్ 23: సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈనెల 25న నిర్వహించే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ శ్రేణులు, రైతులు కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఇంటర్ విద్యార్థి అత్మహత్య
నడిగూడెం, ఏప్రిల్ 23: ఇంటర్ పరీక్షల్లో పెయిల్ అయినందుకు మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం మండలపరిధిలోని త్రిపురవరంలో జరిగింది. త్రిపురవరం గ్రామానికి చెందిన మర్ల వంశీ కోదాడలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. తాజా ఫలితాల్లో పాస్ కాకపోడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని అత్మ హత్య చేసుకున్నాడు.

నేడే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష
రామగిరి, ఏప్రిల్ 23: జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ పరీక్షా కేంద్రాలలో ఆదివారం కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబందించి ప్రిలిమినరీ పరీక్ష జరగ నుంది. ఇందుకుగాను మొత్తం 156పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్లగొండలో 68పరీక్షా కేంద్రాలు సూర్యాపేటలో 42పరీక్షా కేంద్రాలు, మిర్యాలగూడలో 13కేంద్రాలు, కోదాడలో 33కేంద్రాలలో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 520పోస్టులకు గాను 72,300మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీటి నిర్వాహణకు 2100మంది పోలీస్ అధికారులను నియమించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలకు మధ్యాహ్నం 2:30గంటల నుండి సాయంత్రం 5:30గంటల వరకు నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించబడరు. ప్రిలిమినరీ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు హాల్‌టికెట్లపై ఉన్న నియమ నిబందనలను పాటించాలని అధికారులు పేర్కొన్నారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

రెవెన్యూ రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 23: రెవెన్యూ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి విఆర్‌వోలను ఆదేశించారు. శనివారం రెడ్‌క్రాస్ భవన్‌లో భూరికార్డులు, రెవెన్యూ అంశాలపై నల్లగొండ డివిజన్ విఆర్‌వోల శిక్షణా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ రికార్డుల సక్రమ నిర్వహణతో రైతుల సమస్యలు సమర్ధవంతంగా పరిష్కరించవచ్చన్నారు. విఆర్‌వోలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చేపట్టాలని, భూమి ప్రతి ఒక్కరికి జీవనాధారమైనందునా భూ రికార్డులు సక్రమంగా నిర్వహించాల్సివుందని తద్వారా విఆర్‌వోల ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. భూరికార్డుల వెబ్‌సైట్‌లో రికార్డుల అప్‌డేట్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జెసి ఎన్. సత్యనారాయణ, డిఆర్‌వో రవినాయక్, ఆర్డీవో వెంకటాచారిలు పాల్గొన్నారు.

‘ఉచితంగా పశుగ్రాసం పంపిణీ చేయాలి’
డిండి, ఏప్రిల్ 23: కరవు పరిస్ధితులు తీవ్రంగా ఉన్న నేపధ్యంలో పశుసంపదను కాపాడేందుకు ప్రభుత్వం రైతులకు ఉచితంగా పశుగ్రాసాన్ని పంపిణీ చేయాలని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం డిండి మండలం చెర్కుపల్లి గ్రామంలో ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశుగ్రాసం సమస్యతో పశువులను సాకలేక రైతులు పశువులను కబేళాకు అమ్ముకుంటున్నారని చెప్పారు. వేసవి కాలంలో పశువులకు తాగునీరు అందించేందుకు గ్రామాల్లో నీటితొట్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇంత వరకు గ్రామాల్లో తొట్ల నిర్మాణం పూర్తి కాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో ముందు లేకున్నా మద్యం అమ్మకాల్లో మాత్రం ముందుందని అన్నారు. తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్న నేపధ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సర్పంచ్ వెంకట్‌నారాయణ, రాంకిరణ్ తదితరులు పాల్గొన్నారు.

కరవుపై కామ్రేడ్ల కలెక్టరేట్ ముట్టడి
మండుటెండల్లో ఆందోళన..అరెస్టులు
నల్లగొండ, ఏప్రిల్ 23: కరువుతో అల్లాడుతున్న జిల్లా రైతాంగాన్ని, కూలీలను, పశుసంతతిని ఆదుకోవాలంటు సిపిఐ(ఎం) పార్టీ శనివారం కలెక్టరేట్ ముట్టడిని నిర్వహించి కరవు ఘోషను ఎలుగెత్తి చాటింది. కరవు సమస్యలపై క్షేత్ర స్థాయి ఆధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించి సహాయక చర్యల అమలు లక్ష్యంతో సిపిఎం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కరవు యాత్రల ముగింపు సందర్భంగా ఆరవ రోజు కలెక్టరేట్ ముట్టడి, పికెటింగ్ నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాల నుండి తరలివచ్చిన రైతులు, ఉపాధి హామీ కూలీలు, సిపిఎం కార్యకర్తలు ఉదయం 10గంటల నుండి మండుటెండల్లో మూడు గంటల పాటు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు బైఠాయించి పికెటింగ్ నిర్వహించారు. ఎండిన బత్తాయి చెట్లు, వరి పంటల ప్రదర్శనతో రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. కలెక్టర్‌కు కరవు సమస్యల నివేదిస్తామంటు సిపిఎం కార్యకర్తలు, రైతులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే మోహరించి ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రయత్నంలో ఇరువర్గాల మధ్య తోపులాట సాగగా పోలీసులు అతికష్టం మీద సిపిఎం నాయకులను, ఆందోళనకారులను ఆరెస్టు చేసి వాహనాల్లో స్టేషన్‌కు తరలించడంతో ఆందోళన ముగిసింది.
నిర్లక్ష్యం వీడాలి : చెరుపల్లి, జూలకంటి
కరవుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహారిస్తుందని కష్టాల్లో ఉన్న రైతులు, కూలీలను ఆదుకునేందుకు వెంటనే మండలానికి 10కోట్లతో సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డిలు డిమాండ్ చేశారు. కరువుపై చర్చించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక శాసన సభ సమావేశాలు నిర్వహించాలన్నారు. కేంద్రం కరువు బృందాలు రాష్ట్రంలో కరవు తీవ్రంగా ఉందని నిర్ధారించినప్పటికి రాష్ట్రం మాత్రం ప్రతిష్టకుపోయి కేంద్రం నుండి కరవు సహాయక నిధుల సాధనకు ప్రయత్నించడం లేదంటు విమర్శించారు. సిపిఎం కరువు యాత్రలలో గ్రామాల్లో కరవు విలయతాండవం చేస్తున్నట్లుగా తేలిందన్నారు. రైతులు, కూలీలు ఉపాధి లేక వలస బాట పడుతున్నారన్నారు. పశువులు, గొర్రెలు, మేకలకు సైతం పశుగ్రాసం దొరకక నిత్యం వేల సంఖ్యలో కబేళాలకు తరలిపోతున్నాయన్నారు. వర్షభావం, భూగర్భ జలాలు అడుగంటడంతో పంట పొలాలు, పండ్ల తోటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, పల్లెల్లో తాగునీటి ఎద్ధడి నెలకొందన్నారు. ఉపాధి కూలీలకు మూడు నెలలుగా వేతనాలు లేక కుటుంబాలు ఆర్ధాకలితో అలమటిస్తున్నాయన్నారు. జిల్లా అంతా కరవు బారిన పడితే 22మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించడం అన్యాయంగా ఉందన్నారు. కేంద్రం రాష్ట్రం కోరినా 3వేల కోట్ల కరవు సహాయక నిధులు మంజూరు చేసి కరవు పీడిత రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను కరవు రాష్ట్రంగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తిరందాసుగోపి, ముల్కపల్లి రాములు, నారి ఐలయ్య, బర్రె జహంగీర్, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, మల్లునాగార్జునరెడ్డి, మల్లులక్ష్మి, దండంపల్లి సత్తయ్య, కొండమడుగు నర్సింహ్మ, కె.చంద్రారెడ్డి, సలీమ్, ఎం. బాలరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రేవూరులో విషాదఛాయలు
* శోకసంద్రంలో కూలీల కుటుంబాలు
మేళ్లచెర్వు, ఏప్రిల్ 23: మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం తెల్లవారుజామున లారీ బోల్తాపడిన సంఘటనలో మృతిచెందిన ముగ్గురు కూలీలు మండలపరిధిలోని రేవూరు గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నారు. మృతులంతా తమ నైపుణ్యం ఉన్న వృత్తిలో వలస కార్మికులుగా ఉంటూ జీవనం గడిపే నిరుపేద కుటుంబాలు. ఒకేసారి మూడు కుటుంబాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో గ్రామంలోని ప్రజలంతా మృతదేహాల వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుల్లోని కొండల్‌రాజు(31) వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నార్లకొండ స్వామి(32) వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవ్యక్తి సైదాసాయబ్(33) పిట్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. షెడ్‌డౌన్ అనే పరిశ్రమలో పనిచేసేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇదే క్రమంలో గ్రామానికి చెందిన 8మంది సిద్దిపేట ప్రాంతానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో ముగ్గురు వ్యక్తులు లారీపై రేవూరుకి వస్తుండగా ఉహించని రీతిలో ఆకుపాముల వద్ద మృతిచెందడంతో వీరి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం రేవూరుకి తరలించారు. తమ కుటుంబానికి పెద్దదిక్కు అయిన తండ్రి విగత జీవిగా మారడంతో కుటుంబంలోని పిల్లలు తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు.