విశాఖపట్నం

పన్ను బాదుడు లేని బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పన్ను బాదుడు లేని బడ్జెట్
* బల్క్ వాటర్ ఛార్జీల్లో పెరుగుదల
* అసెస్‌మెంట్ రీసర్వేపై దృష్టి
* మొండి బకాయిల వసూలుకు డ్రైవ్
* బడ్జెట్ సమావేశంలో కమిషనర్ ప్రవీణ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 23: ప్రత్యక్ష పన్నుల భారం లేకుండా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జివిఎంసి) 2016-17 బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించినట్టు కమిషనర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ప్రతిపాదిత బడ్జెట్ అంశాలను వివరించేందుకు కమిషనర్ తన ఛాంబర్‌లో శనివారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని పద్దుల కింద జమలు రూ.2,812.37 కోట్లు వస్తాయని అంచనావేశారు. గతేడాది ప్రారంభ నిల్వతో కలిపి ఆదాయం 3,056.23 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని పద్దుల కింద రూ.2,846.79 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ప్రజలపై ఎటువంటి పన్నుల భారం లేకుండా బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్టు ఆయన తెలిపారు. అయితే అండర్ అసెస్‌మెంట్ల కారణంగా ఆదాయం కోల్పోతున్న జివిఎంసి అసెస్‌మెంట్ల రీసర్వేపై దృష్టి సారిస్తుందన్నారు. గతంలో అసెస్‌మెంట్ల రీసర్వే ద్వారా రూ.10 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందామన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాపర్టీ టాక్స్ కింద రూ.375 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం వస్తుందని అంచనావేస్తున్నామన్నారు. అలాగే ఖాళీ స్థలాల పన్ను (విఎల్‌టి) ద్వారా రూ. 150 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్నట్టు తెలిపారు. వీటిలో 90 శాతం మొత్తం పాత బకాయిలుగా పేర్కొన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.156 కోట్లు రావాల్సి ఉందన్నారు. అయితే ప్రస్తుతం అమలవుతున్న ప్రాజెక్టులకు రూ.252 కోట్లు వెచ్చించాల్సి ఉందన్నారు. 13,14 ఆర్థిక సంఘం నిధులు రూ.80 కోట్లు జివిఎంసికి రానున్నాయని తెలిపారు. బల్క్ సెమీబల్క్ నీటి సరఫరా ద్వారా రూ.170 కోట్లు ఆదాయం సమకూరునుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన భవన క్రమబద్దీకరణ పథకం (బిపిఎస్) ద్వారా రూ.80 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనావేస్తున్నామన్నారు. అలాగే టౌన్ ప్లానింగ్ అనుమతుల ద్వారా రూ.150 కోట్లు ఆదాయం లభిస్తుందని అంచనాగా పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద జివిఎంసికి రూ.15 కోట్లు మంజూరు కానున్నాయన్నారు. అలాగే ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టుల కింద రూ.298 కోట్లు, స్మార్ట్‌సిటీగా ఎంపికైతే కేంద్రం నుంచి రూ.200 కోట్లు అమృత్ పథకం కింద రూ.57 కోట్లు ఆదాయం లభించనుందన్నారు. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ గ్రాంటుగా రూ.33 కోట్లు ఆదాయం రానుంది.
మొండి బకాయిలపై దృష్టి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి జివిఎంసికి సుమారు రూ.200 కోట్ల బకాయలు రావాల్సి ఉంది. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ నుంచి విఎల్‌టిగా రూ.150 కోట్లు వసూలు కావాల్సి ఉందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సర్సీస్ టాక్స్ రూపంలో రూ.1.35 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ కేవలం రూ.24 లక్షలు మాత్రమే వసూలైందన్నారు. మొండి బకాయిలు వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టనున్నామన్నారు. అయితే జివిఎంసి మంచినీటి సరఫరా విభాగంలో ఆర్థిక సమతౌల్యత సాధించేందుకు వీలుగా బల్క్ నీటి సరఫరా ఛార్జీలను పెంచే అవకాశం ఉందని కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే అనవసర వ్యయాన్ని నియంత్రించుకుంటూ, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

ఐఎఫ్‌ఆర్‌ను విజయవంతం చేయాలి
ఫ్లీట్ రివ్యూకు ఏర్పాట్లు * ప్రజలకు అసౌకర్యం కలుగరాదు * 27 నుంచి రిహార్సల్స్ * మంత్రులు అయ్యన్న, గంటా
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 23: వచ్చే నెల 4 నుంచి విశాఖ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను విజయవంతం చేయాలని మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు పిలుపునిచ్చారు. ఫ్లీట్ రివ్యూకు సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లో ఫ్లీట్ రివ్యూకు సంబంధించి మంత్రులు, అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఉచిత పాస్‌లు లేని వారు ఈ నెల 27 నుంచి రిహార్సల్స్ చూడవచ్చన్నారు. ఫ్లీట్ రివ్యూ వల్ల నగరం రూపు రేఖలు మారనున్నాయన్నారు. నగరం అందంగా తయారు చేయడంలో వుడా, జివిఎంసి, ఇతర శాఖలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు.
ఇదిలా ఉండగా వచ్చే నెల 4 నుంచి 8వ తేదీ వరకు ఫ్లీట్ రివ్యూ ఉన్నప్పటికీ, 7న జరిగే ఫ్లీట్ రివ్యూకు మీ సేవ కేంద్రాల ద్వారా ఉచితంగా పాస్‌లు జారీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు 1.40 లక్షల మందికి వీలవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు వారందరికీ ఆధార్ కార్డు ఆధారంగా మీ సేవ కేంద్రాల్లో ఉచితంగా పాస్‌లు జారీ చేస్తున్నారని వివరించారు. ఈ ఫ్లీట్ రివ్యూకు సంబంధించి వచ్చే నెల 3, 4 తేదీల్లో రిహార్సల్స్ ఉంటాయన్నారు. ఫ్లీట్ రివ్యూ సందర్శనకు వచ్చే ప్రజానీకానికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వారికి అవసరమైన రవాణా, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులను కల్పిస్తున్నామన్నారు. నగరానికి 51 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరు కానున్నందున అందుకు తగిన విధంగా భద్రత ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ ఫ్లీట్ రివ్యూను తిలకించేందుకు రాష్టప్రతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాలుగు రాష్ట్రాల లెఫ్టినెంట్ గవర్నర్లు తదితర ప్రముఖులు హాజరు కానున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఇదిలా ఉండగా నగరంలో సుందరీకరణ పనుల కోసం జివిఎంసి రూ.85 కోట్లు, ఉడా రూ.23 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వీటికి అదనంగా విశాఖ పోర్టు, హెచ్‌పిసిఎల్ వంటి సంస్థలు పనులు చేపట్టాయన్నారు.
గుర్తింపు కార్డులు తప్పనిసరి
వచ్చే నెల 7న జరగనున్న ఫ్లీట్ రివ్యూకు సంబంధించి పాస్‌లు ఉన్నవారిని అనుమతిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఉచిత పాస్‌తోపాటు వ్యక్తిగత గుర్తింపు కార్డు ఉండాలన్నారు. ఉచితపాస్ పొందగోరేవారు ఆధార్ నంబరును మీసేవలో చూపించి ఉచిత పాస్ పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యువరాజ్ ఫ్లీట్ రివ్యూ ఏర్పాట్లను మంత్రులకు వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లను పోలీసు కమిషనర్ అమిత్‌గార్గ్, నగర సుందరీకరణ పనులపై జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ వివరించారు. ఈ సమావేశంలో ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పల్ల శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, గణబాబు, అనిత, పీలా గోవింద సత్యనారాయణ, వాసుపల్లి గణేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎయు ప్రగతికి
నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 23: ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రగతికి నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ చలమేశ్వర్ అన్నారు. శనివారం ఎయులోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఎయు పూర్వ విద్యార్థుల సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాలలో సమాన ప్రగతి చూపడం అన్ని వేళలా సాధ్యం కాదన్నారు. కాగా, పూర్వ విద్యార్థుల సంఘం నిర్ధిష్ట ప్రణాళికతో వర్శిటీ అభివృద్ధిలో భాగస్వామి కావడం హర్షదాయకమన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్శిటీకి రూ.35 కోట్లతో కార్పస్ ఫండ్‌ను తొలి ప్రయత్నంలోనే సమీకరించామన్నారు. ఎయు పాలకమండలి సభ్యుల ఎంపిక కొలిక్కి వచ్చిందన్నారు. వీటిలో పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎయు వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ ఇప్పటికే రెండు పర్యాయాలు ఎయు నాక్ గుర్తింపులో ఏ ర్యాంక్‌ను సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివీస్ సంస్థ ఎండి మురళీకృష్ణ మాట్లిడుతూ తమ సంస్థలో ఎయులో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు రెండు వేల మంది ఉద్యోగులు సేవలు అందిస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించే దిశగా పని చేయాలన్నారు. జిఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ బివిఎన్ రావు పూర్వ విద్యార్థుల సంఘం పనితీరు గురించి వివరించారు. వర్శిటీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వర్శిటీ కార్పస్ ఫండ్‌ను రూ.1000 కోట్లు చేసే విధంగా కృషి జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజు, రెక్టార్ ఇఎ నారాయణ, వర్శిటీ ప్రిన్సిపాళ్లు, డీన్లు తదితరులు పాల్గొన్నారు.

రూ. అరకోటి గంజాయి పట్టివేత
* హైటెక్ తరహాలో స్మగ్లింగ్
* చిన్నతరహా పరిశ్రమ రీతిన వ్యాపారం
* ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు
గోపాలపట్నం, జనవరి 23: ఆటోల అడుగు భాగంలో ప్రత్యేకంగా అమరిక... పెద్ద పెద్ద పాకెట్ల రూపంలో గంజాయి దిగుమతి... చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారీ... ఇతర రాష్ట్రాలకు ఎగుమతి... చిన్న తరహా పరిశ్రమను తలపించే రీతిలో వ్యాపారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఎక్సైజ్ శాఖ పోలీసు అధికారులు వలపన్ని నలుగురు నిందితులను పట్టుకున్నారు. వారితో పాటు ఒక స్కార్పియో, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సూపరింటెండెంట్ ఎం రవీంద్రప్రసాద్ తెలిపిన వివరాల మేరకు... గోపాలపట్నం ప్రాంతానికి చెందిన అహ్మద్ షబూద్‌ఖాన్ తొమ్మది నెలల క్రితం కొత్తపాలెం దరి భగత్‌సింగ్ నగర్‌లో గృహాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఆయనకు ముక్కుడుపల్లి చినఅప్పారావు సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని రహస్యంగా రప్పించే ఖాన్ సదరు గృహంలో భద్రపరిచేవాడు. వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మలిచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేసేవాడు. జి మాడుగుల, పాడేరు తదితర ప్రాంతాలనుంచి ఆటోల ద్వారా గంజాయి దిగుమతయ్యేది. పోలీసుల కళ్లు గప్పేందుకుగాను ఆటోల దిగువ భాగాన ప్యాకెట్లను ప్రత్యేకంగా కట్టి రవాణా చేసేవారు. ఈ విధంగా గత కొంత కాలంగా వ్యాపారం నిర్వహిస్తున్న ఖాన్ వ్యవహారంపై ఎక్సైజ్ పోలీసులకు ఉప్పందింది. దీంతో శనివారం నరవ దరి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మాటువేసిన పోలీసులకు ఎపి30ఎఫ్6669 నంబరు గల స్కార్పియో తారసపడింది. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి దొరకడంతో ఖాన్, చిన అప్పారావును అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న విషయం వెలువడడంతో భగత్‌సింగ్‌నగర్‌లోని గృహాన్ని తనిఖీ చేశారు. తనిఖీలో సుమారు 50 లక్షల రూపాయల విలువ చేసే 300 కేజీల గంజాయి ఉన్నట్టుగా తేలడంతో దానితో పాటు నిందితులను, స్కార్పియోను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కటకటాల్లోకి అప్పుడే వచ్చిన నిందితులు
కాగా దాడి జరుగుతున్న సమయంలో గంజాయి సరఫరా చేసేందుకు జి మాడుగుల దరి లింగేటి గ్రామానికి చెందిన గౌతమ్, సూర్య రెండు ఆటోల్లో అదే ప్రాంతానికి చేరుకున్నారు. రెండు ఆటోలను కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టగా గంజాయి లభించింది. దాడి జరుగుతున్న విషయాన్ని గ్రహించని ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కిపోయారు. ఆటోల అడుగుభాగంలో ప్రత్యేకంగా కట్టి ఉంచిన గంజాయి ప్యాకెట్లను చూసి పోలీసులతో పాటు స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు. గంజాయితో పాటు రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో రవీంద్రప్రసాద్‌తో పాటు సిఐ, ఎస్‌ఐ కె వినయ్‌కుమార్, పెందుర్తి సిఐ కె సూర్యనారాయణ, ఎస్‌ఐ బి మధుకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

నేడు టిడిపి అర్బన్ జిల్లా
ఎస్టీ విభాగం ప్రమాణ స్వీకారం
* ఉపాధ్యక్షునిగా కంచర దాలెం దొర
విశాఖపట్నం, జనవరి 23: తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అర్బన్ జిల్లా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎంవిపి కాలనీ గిరిజన భవన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నట్టు టిడిపి గిరిజన విభాగం అర్బన్ జిల్లా కమిటీ ప్రతినిధి శనివారం ప్రకటనలో తెలిపారు. గత కొనే్నళ్ళుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పేద, బడుగు వర్గాలకు విశేషంగా సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా కంచర దాలెం దొరకు కమిటీలో స్థానం కల్పించారు. కమిటీ ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు.
దేశ నాయకుల విగ్రహాలు శుభ్రం చేద్దాం
* నెహ్రూ యువ కేంద్రం పిలుపు
విశాఖపట్నం, జనవరి 23: ఈ నెల 30 తేదీ వరకు గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో జాతీయ నాయకుల విగ్రహాలు శుభ్రం చేయడంతో పాటు పరిసరాలు శుభ్రం చేస్తున్నట్టు నెహ్రూ యువకేంద్రం కో-ఆర్డినేటర్ కె.వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగా దేశ నాయకులు నేతాజీ జయంతి నుండి గాంధీ వర్ధంతి వరకు దేశ నాయకుల విగ్రహాల శుభ్రత కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ గత నెల ‘మన్‌కి బాత్’ కార్యక్రమంలో దేశ యువతకు ఈ సూచన చేశారన్నారు.
‘కార్మికుల పట్ల వేధింపులు మానుకోవాలి’
విశాఖపట్నం, జనవరి 23: ఆర్టీసీ గ్యారేజీ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ మద్దిలపాలెం డిపో యూనియన్ కార్యదర్శి ఎంవిఎస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఐఎస్ బాబును విధుల్లోకి తీసుకోవాలని, దీనికి కారణమైన షిప్ట్ సూపర్‌వైజర్, ఎంఎఫ్‌లపై చర్యలు తీసుకోవలసిందిగా శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. లేని పక్షంలో ధర్నాలు, నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.
కోఆపరేటివ్ బ్యాంకు నూతన శాఖ ప్రారంభం
విశాఖపట్నం, జనవరి 23: విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు 36వ బ్రాంచిని మురళీనగర్‌లో శనివారం వుడా వైస్-చైర్మన్ టి.బాబురావునాయుడు ప్రారంభించారు. మురళీనగర్‌లో ఏర్పాటు చేసిన బ్యాంక్ మార్గదర్శకాలు ఎమిరేట్స్ చైర్మన్ మానం ఆంజనేయులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార రంగంలో పూర్తిగా లాభాల కోసమే పని చేయకూడదని, వ్యాపార సంబంధంగా కాకుండా సభ్యుల విశ్వాసాన్ని పొందాలన్నారు. ఈ బ్యాంకు విజయవంతానికి పాలకవర్గమే కారణమన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలో 13 జిల్లాలకు బ్యాంకు సేవలు విస్తరిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, కనకమహాలక్ష్మీ బ్యాంకు చైర్మన్ రఘునాథరావు, మహరాజా కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎంఆర్‌కె రాజు, కాకినాడ కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చిట్టూరి రవీంద్ర, డైరెక్టర్లు పాల్గొన్నారు.
రోహిత్ మృతికి కారకులైన వారిని శిక్షించాలి
* లేదంటే ఉద్యమం ఉధృతం : సిపిఎం
విశాఖపట్నం, జనవరి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన దళిత రీసెర్చి స్కాలర్ వేముల రోహిత్ మరణానికి కారకులైన యూనివర్సిటీ వైస్-్ఛన్సలర్, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను పదవుల నుండి తొలగించాలని సిపిఎం జగదాంబ జోన్ కార్యదర్శి జిఎస్ రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పూర్ణామార్కెట్ స్ప్రింగ్‌రోడ్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఏబివిపి నాయకుడు సుశీల్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. రోహిత్‌ను ఆత్మహత్యకు పురిగొల్పిన పరిస్థితులను వివరించారు. రోహిత్ అట్టడుగు వర్గాల నుండి వచ్చిన ఆణిముత్యం అని, అతను జీవితంలో ఎన్నో ఆటంకాలు, అవమానాలు, వేధింపులు అధిగమించి, యూనివర్సిటీ ఉన్నత విద్యలో పరిశోధకుని స్థాయికి ఎదిగాడని తెలిపారు. ఇది సహించలేని దళిత వ్యతిరేక ఏబివిపి నాయకులు అయిదుగురు దళిత విద్యార్థులపై చేసిన తప్పుడు ఆరోపణల ఆధారంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అయిదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేయడంతో పాటు వారు సంఘ బహిష్కృతులు అయ్యేవరకు నిద్రపోలేదన్నారు. దీంతో వారి స్కాలర్‌షిప్‌లు ఏడు మాసాలుగా నిలిపోవడమే కాకుండా హాస్టల్ నుండి తొలగించబడ్డారని, లైబ్రరీలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకుల్లో వీరి ప్రవేశాన్ని నిషేధించడంతో కుమిలిపోయి, రోహిత ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. రోహిత్ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు వారి కుటుంబాన్ని ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. లేకపోతే ప్రజలను పెద్దఎత్తున కదిలించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తొలుత రోహిత్ చిత్రపటానికి రాజేశ్వరరావు, కళాసీల సంఘం నాయకులు నాయడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎం.సుబ్బారావు, వై.రాజు, ట్రాన్స్‌పోర్టు నాయకులు డి.అప్పలరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యమిత్రలకు న్యాయం చేస్తా : మంత్రి గంటా
విశాఖపట్నం (జగదాంబ), జనవరి 23: ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పని చేస్తున్న వైద్యమిత్రలను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్క జీవోతో తొలగించిన విషయంపై ఈ నెల 25న విజయవాడలో జరిగే కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి తగిన న్యాయం చేస్తానని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం తన నివాసంలో వైద్య మిత్రలంతా కలసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైద్య మిత్రల యూనియన్ నాయకులు అప్పలరాజు, దుర్గాప్రసాద్, సంతోష్ మాట్లాడుతూ విద్యార్హత పేరుతో పాతవారిని తొలగించి కొత్తవారిని నియమించడం సరి కాదన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్షల మందికి వైద్య సేవలు అందించామని, మూడు నెలలుగా పలు కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన శిబిరాలు నిర్వహించామన్నారు. తమ సేవలను గుర్తించకుండా ఏకంగా జీవో జారీ చేసి రోడ్డున పడేశారన్నారు. దీనిపై స్పందించిన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో సిఎంతో ప్రత్యేకంగా మాట్లాడి తిరిగి మళ్లీ విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరతానన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఒక్కసారిగా అందరినీ తొలగించడం సరి కాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ రమేష్‌కుమార్, టీం లీడర్లు సత్యనారాయణ, భాను, రమేష్, వైద్య మిత్రలు విజయ, సునీత, పద్మ, శోభ తదితరులు పాల్గొన్నారు.
కుట్రతోనే సిబ్బందిని తొలగిస్తున్నారు
పిసిసి అధ్యక్షుడు రఘువీరా
కేవలం రాజకీయ కుట్రతోనే ఎన్టీఆర్ వైద్య సేవలో పని చేస్తున్న సిబ్బందిని తొలగిస్తున్నారని, వైద్యమిత్రలను తొలగించడం కుట్ర పూరితమని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయనను వైద్య మిత్రలంతా కలసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ ‘బాబు వస్తే.. జాబ్ వస్తుంది అని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు రెండు సంవత్సరాల కాలంలో పలు శాఖల్లో పని చేస్తున్న సిబ్బందిని తొలగించారని, చేతకాని ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయక... ఉన్న ఉద్యోగులను తొలగించడం సరికాదు’ అన్నారు. దీనిపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి తిరిగి మళ్లీ విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
మహా గోల్‌మాల్
నామినేషన్ పద్ధతిలో రూ.30 లక్షల వస్త్రాలు
నాసిరకం అంటూ సిబ్బంది గగ్గోలు
విశాఖపట్నం (జగదాంబ), జనవరి 23: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి)లో పారిశుద్ధ్య కార్మికులకు, సిబ్బందికి అందజేసే వస్త్రాల కొనుగోలు విషయంలో గోల్‌మాల్ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో నాసిరకం వస్త్రాలను కొనుగోలు చేసి కార్మికులకు అందజేస్తున్నారు. ప్రజారోగ్యం విభాగం ద్వారా కొనుగోలు చేసిన వస్త్రాలు నాసిరకంగా ఉన్నాయంటూ సిబ్బంది గగ్గోలుపెడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జివిఎంసిలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి ఏటా మూడు జతల వస్త్రాలను అందజేస్తారు. అయితే గత మూడేళ్లుగా అందజేయకపోవడం, ఈ ఏడాది ఒక్కసారిగా వాటిని అందజేయడంతో ఒక్కొక్కరికి 9 జతల బట్టలను అందిస్తున్నారు. అయితే వీరిలో 86 మంది ఎఎన్‌ఎంలకు రూ.350 నుంచి 450 రూపాయల విలువచేసే చీరలను అందజేసినట్టు అధికారులు లెక్కలు చూపుతున్నారు. కానీ వాస్తవంగా వీటిని విజయనగరంలో ఓ ట్రేడర్స్ షాపు నుంచి కేవలం 110 రూపాయలకే కొనుగోలు చేసి వీరికి అందజేసినట్టు సమాచారం. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులకు ఖాకీ వస్త్రంతో పాటు తెలుపు రంగు బట్టలు ఇవ్వాల్సి ఉంది. అలాగే ఎనిమిది వేల తువాళ్లు కొనుగోలు చేశారు. వీటన్నిటికి దాదాపు రూ.30 లక్షలు ఖర్చుచేశారు. వాస్తవానికి ఏ విభాగంలోనైనా పది లక్షల రూపాయలు ఖర్చు చేయాలంటే టెండర్లు ఆహ్వానించాల్సి ఉంది. ఎటువంటి టెండర్లూ ఆహ్వానించకుండా కమిషనర్‌ను సైతం తప్పుదోవ పట్టించి కేవలం ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ స్థాయి అధికారులు, ఆయా గుత్తేదారులతో కుమ్మక్కై ఈ వ్యవహారం అంతా జరిపినట్టు తెలిసింది. ఈ విషయంపై కమిషనర్ ప్రవీణ్‌కుమార్ దృష్టిసారిస్తే మరింత అవినీతి, అక్రమాలు బయటపడే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా వాస్తవానికి ప్రతి ఏటా ఈ వస్త్రాలను ఆప్కో నుంచి కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది ఆ విధంగా కొనుగోలు చేయకుండా ఆప్కో విశ్రాంతి ఉద్యోగి ద్వారా ఈ పైరవీలు జరిపినట్టు సమాచారం.
వివరణ: ఈ వస్త్రాల కొనుగోలు విషయంలో జరిగిన అవకతవకలపై అదనపు కమిషనర్ (జనరల్) మూర్తిని వివరణ కోరగా వస్త్రాలన్నింటినీ ఆప్కో నుంచే కొనుగోలు చేయాలని ఆదేశించామని, అలా కాకుండా బయటి నుంచి కొనుగోలు చేస్తే బిల్లులు నిలిపివేస్తామని వివరణిచ్చారు.
ప్రవచనా సామ్రాట్
మల్లాది చంద్రశేఖర శాస్ర్తీకి ఘన సన్మానం
ఆరిలోవ, జనవరి 23: ప్రవచనా సామ్రాట్ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్ర్తీని అతిథులు ఘనంగా సన్మానించి అర్ష విద్యాభారతి బిరుదు ప్రదానం చేశారు. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో మల్లాది చంద్రశేఖర శాస్ర్తీ సాహితీప్రవచనం, ఆయనకు బిరుదు ప్రదాన కార్యక్రమాలు జరిగాయి. అతిథులు విఎండిఎ వ్యవస్థాపక అధ్యక్షుడు సిఎస్‌ఎన్ రాజు, కార్యదర్శి జిఆర్‌కె ప్రసాద్ (రాంబాబు), ఆచార్య కె మలయవాసిని, జ్యోతి మాధవి, సుసర్ల రామ్‌గోపాల్, అన్నరాజు సత్యనారాయణ చంద్రశేఖర శాస్ర్తీని ఘనంగా సత్కరించారు.

మరో 4లక్షల ఎకరాల్లో కాఫీ సాగు
గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వెల్లడి
పాడేరు, జనవరి 23: విశాఖ మన్యంలో రానున్న ఏడు సంవత్సరాల కాలంలో మరో నాలుగు లక్షల ఎకరాలలో అదనంగా కాఫీ తోటల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఎ విద్యాసాగర్ వెల్లడించారు. పాడేరు మండలం మినుములూరు, హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ చిట్టెంపాడు గ్రామాలలో జిసిసి ఏర్పాటు చేసిన కాఫీ కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం పరిశీలించారు. గిరిజన రైతుల నుంచి జిసిసి సేకరించిన ప్యాక్ చేసిన కాఫీని ఆయన పరిశీలించారు. అనంతరం కాఫీ సాగు వలన ప్రయోజనాలు, జిసిసి కొనుగోలు విధానం వంటి అంశాలను రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కాఫీని ప్రభుత్వం జిసిసి ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో 526 కోట్ల రూపాయలతో కాఫీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని చెప్పారు. పాడేరు మన్య ప్రాంతం కాఫీ సాగుకు ఎంతో అనుకూలమైన ప్రదేశమని, ఈ ప్రాంతంలో పండించే కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మన్యంలో కాఫీ సాగును మరింత విస్తరించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు ఆయన చెప్పారు. మన్యంలో ఇప్పటికే సాగు చేస్తున్న కాఫీకి అదనంగా మరో నాలుగు లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేపట్టాలని యోచిస్తూ ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఏజెన్సీలో ప్రస్తుతం లక్ష మంది రైతులు కాఫీ సాగు వలన ఆర్థిక ప్రయోజనం పొందుతున్నట్టు చెప్పారు. కాఫీని పండించడం వలన గిరిజన రైతులు అధిక ఆదాయాన్ని సమకూర్చుకుని పేదరికం నుంచి బయటపడవచ్చని ఆయన అన్నారు. గిరిజన రైతులు ఆర్గానిక్ పద్ధతిలో కాఫీ పండించే విధంగా అధికారులు వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. తాను ఐదు ఎకరాలలో పండించిన కాఫీ పంటకు గతంలో కిలోకు వంద నుంచి నూట ఇరవై రూపాయలు మాత్రమే వచ్చేదని, దళారీల బెడద లేకుండా జిసిసి నేరుగా కొనుగోలు చేస్తుండడంతో కిలోకు అదనంగా మరో 70 రూపాయలు లభిస్తుందని మినుములూరు గ్రామానికి చెందిన కొండబాబు అనే రైతు ప్రిన్సిపాల్ కార్యదర్శికి వివరించారు. ఎకరాకు తాను వంద కిలోల కాఫీ దిగుబడి సాధిస్తుండగా ఇకపై సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా ఆర్గానిక్ కాఫీని పండిస్తానని చెప్పారు. మినుములూరు గ్రామానికి చెందిన కాఫీ రైతులు మణికంఠ పాత్రుడు, ప్రవీణ్‌కుమార్, కన్నాపాత్రుడు, త్రినాథపాత్రుడు మాట్లాడుతూ రసాయన ఎరువులు, మందులకు బదులుగా సేంద్రియ ఎరువులను వాడడం ద్వారా కాఫీ దిగుబడి మరింత పెరగడమే కాకుండా భూసార పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. చీడపీడల నివారణకు కూడా తక్కువ వ్యయం అవుతుందని ప్రిన్సిపాల్ కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించి తగిన చర్యలు తీసుకోనున్నట్టు విద్యాసాగర్ హామీ ఇచ్చారు. హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ చిట్టెంపాడు గ్రామానికి చెందిన మహిళా సంఘాల ప్రతినిధులతో ప్రిన్సిపాల్ కార్యదర్శి మాట్లాడుతూ మహిళా సంఘాలు చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేసుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబన పొందవచ్చునని సూచించారు. గ్రామంలో నిర్వహిస్తున్న మినీ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో మూలకు చేరిన మంచినీటి బావిని వినియోగంలోకి తీసుకురావాలని, గ్రావిటీ స్కీం ద్వారా మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని, సిసి రోడ్డు మంజూరు చేయాలని చిట్టెంపాడు గ్రామ గిరిజనులు కోరడంతో వీటి పనులను మంజూరు చేయాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు. అనంతరం హుకుంపేటలోని కాఫీ పంట నిల్వ చేసేందుకు నిర్దేశించిన గొడౌన్‌ను, హెచ్‌పిసిఎల్ ఆధ్వర్యంలో జిసిసికి కేటాయించిన పెట్రోలు బంక్ నిర్మాణ తీరును ఆయన పరిశీలించి త్వరితగతిన బంక్ నిర్మాణాన్ని పూర్తి చేసి జిసిసికి అందించాలని విద్యాసాగర్ ప్రాజెక్టు అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎం హరినారాయణన్, జిసిసి మేనేజింగ్ డైరెక్టర్ ఎఎస్‌పిఎస్ రవిప్రకాశ్, జనరల్ మేనేజర్ అశోక్‌కుమార్, ఆర్థిక సలహాదారి రాధాకృష్ణ, కాఫీ సలహాదారు మహేశ్, పాడేరు డివిజనల్ మేనేజర్ మోహనరావు, మేనేజర్ ఎస్ భాస్కరరావు, ప్రాజెక్టు ఉద్యానవన అధికారి కె చిట్టిబాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

‘కథలో రాజకుమారి’ షూటింగ్
అరకులోయ, జనవరి 23: అందాల అరకులోయ పరిసర ప్రాంతాల్లో ‘కథలో రాజకుమారి’ సినిమా షూటింగ్ జరుగుతోంది. మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ గంగుడ్డి గ్రామ సమీపంలోని కొండపై భారీ నర్సరీ సెట్ వేసి సినిమాకు సంబంధించిన ముఖ్య సన్నివేశాలు, పాటలను చిత్రీకరిస్తున్నారు. కడియం నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన పూల మొక్కలతో 23 లక్షల రూపాయల ఖర్చుతో వేసిన నర్సరీ సెట్‌లో హీరో, హీరోయిన్, పలువురు నటీనటులపై సినిమా షూటింగ్ జరుపుతున్నారు. మాగ్నూస్ సినీప్రేమ్ ప్రయివేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కార్తికేయ సినిమా నిర్మాత బొగ్గారామ్ వెంకట శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలో నారా రోహిత్ కథానాయకుడు కాగా, కథా నాయకగా నమితా ప్రమోద్ నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఈమెను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా సూరపనేని మహేష్ పరిచయమవుతున్నారు. అంతకు ముందు దర్శకుడు తేజ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు వద్ద వైజయంతి మూవీస్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాకు రచయితగా పనిచేసినట్టు డైరెక్టర్ మహేష్ విలేఖరులకు తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ వరకు భారీ నర్సరీ సెట్ వద్ద పలు ముఖ్య సన్నివేశాలు, పాటలను చిత్రీకరిస్తామని చెప్పారు. ఆ తరువాత విశాఖపట్నం పరిసరాల్లో చిత్రం షూటింగ్ జరుగుతుందన్నారు. ఈ చిత్రంలో పరుచూరి వెంకటేశ్వరరావు, తనికెళ్ల భరణి, సుమిత్ర, ప్రభాస్ శ్రీను, అనంత్, అజయ్ నటిస్తుండగా కొరియోగ్రాఫర్‌గా మాస్టర్ స్వర్ణ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూరుస్తున్నారు.