విశాఖపట్నం

స్మార్ట్ అభివృద్ధిలో భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 11: విశాఖ నగరాన్ని స్మార్ట్‌సిటీగా రూపొందించే ప్రక్రియలో తాము భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నట్టు నగర ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. యునైటెడ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (యుఎస్‌టిడిఎ) ఆహ్వానం మేరకు అధికారులతో పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన నగర ఎమ్మెల్యేలు తమ అనుభవాలను విలేఖరులతో పంచుకున్నారు. నగర తెలుగుదేశం అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు మాట్లాడుతూ ఎనిమిది రోజుల పాటు అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్‌టన్, శాన్‌ఫ్రాన్సిస్కో, తదితర రాష్ట్రాల్లో పర్యటించిన తాము అక్కడి స్థితిగతులు, జీవన విధానం తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయగలిగామన్నారు. ముఖ్యంగా విశాఖను స్మార్డ్‌సిటీగా తీర్చిదిద్దేందుకు చేయూత నిస్తున్న అమెరికాలో పర్యటించడం ద్వారా తాము ఎంతో నేర్చుకున్నామన్నారు. అభివృద్ధిలో అగ్రగామి అమెరికాలో తాము పర్యటించిన ప్రాంతాల్లో ప్రజలు ఎంతో క్రమశిక్షణతో నిబంధనలు పాటించడం గమనించామన్నారు. పారిశుద్ధ్యం, ట్రాఫిక్, తదితర అంశాల్లో అక్కడి ప్రజలు ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన దాఖలాల్లేవన్నారు. అలాగే అక్కడి స్థానిక సంస్థలు కూడా ప్రజలకు అవసరమైన వౌలిక సదుపాయాలు సమకూర్చడంతో పాటు, పర్యావరణ హితమైన వాతావరణాన్ని కల్పించాయన్నారు. ట్రాఫిక్ వ్యవస్థను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించే నగరాల్లో అమెరికా అగ్రగామిగా పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం పర్యావరణానికి పెద్ద పీట వేస్తుందని, పర్యావరణ హితమైన వాతావరణం స్మార్ట్‌సిటీలో ప్రధాన అంశమన్నారు. అమెరికాలో తాము జరిపిన పర్యటన విశాఖ నగరాన్ని స్మార్ట్‌సిటీగా రూపొందించేందుకు ఉపకరిస్తుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. తాము జరిపిన అధ్యయనం, పరిశీలించిన అంశాలతో స్మార్ట్‌సిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పలో పాలుపంచుకుంటామన్నారు. అమెరికా సంస్థ యుఎస్‌టిడిఎ ఆధ్వర్యంలో స్మార్ట్‌సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సంస్థలకు తమ సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకు స్మార్ట్‌సిటీ రూపొందుతుందని, అందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
దళారీ వ్యవస్థను ప్రోత్సహించవద్దు
విశాఖపట్నం, మార్చి 11: రెవెన్యూ వ్యవస్థలో దళారీలను ప్రోత్సహించవద్దని ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెవెన్యూ వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. అలాంటి సమయంలో దళారులను ప్రోత్సహించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని ఆయన హితవు పలికారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ జిల్లా పరిషత్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రెవెన్యూ వ్యవస్థలో గందరగోళ పరిస్థితి ఉండేదని, నూతన ఆలోచనలతో ‘మీ భూమి-మీ ఇంటికే’ విధానం ప్రవేశపెట్టిన తరువాత భూ తగాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. మీ సేవ ద్వారా 90 శాతం సేవలు అందించగలుగుతున్నామన్నారు. వీఆర్వోలు వారంలో కనీసం రెండు రోజులైనా స్థానికంగా ఉండి అక్కడి రైతు సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. భూ సర్వేల కోసం 300 ఇటిఎస్ యంత్రాలను సరఫరా చేశామన్నారు. వాటిని ఉపయోగించుకుని భూ తగాదాలు లేకుండా వాటిని సరి చేయాలన్నారు. పరిశ్రమలకు కేటాయిస్తున్న భూములు వివాదాస్పదంగా మారుతున్నాయని, అలాంటి సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలన్నారు.
కలెక్టరేట్ ముట్టడి
విశాఖపట్నం, మార్చి 11: దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక విశాఖ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన వికలాంగుల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. ప్రశాంత వాతావరణంలో ఏడు రోజులుగా దీక్షా బిబిరం నిర్వహించిన వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో చేసేదిలేక దీనిని తీవ్రతరం చేయాలిన నిర్ణయించారు. దీనిలోభాగంగా శుక్రవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వికలాంగుల పట్ల కేంద్ర, రాష్ట ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని దుయ్యబట్టారు. జిల్లా నలుమూలల నుంచి వికలాంగులు తరలి వచ్చారు.రూ. 2500 పింఛన్ ఇవ్వాలని, ఇళ్ళ స్థలాలు కేటాయించాలని, మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వీరందర్ని అక్కడి నుంచి తరిమి వేసేందుకు ప్రయత్నించారు. ప్రధాన గేట్లను మూసివేయడం, పోలీసుల పహరాతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే తాము అధికారులకు సమస్యలు విన్నవించుకునేందుకు మాత్రమే వెళ్తామని, తప్పితే దౌర్జన్యం వెళ్ళే పరిస్థితుల్లేవంటూ పోలీసులకు వికలాంగులు కొంతమంది తమ గోడును వినిపించుకున్నారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు అరెస్టులు విరమించుకోగా, కొద్దిసేపు నిరసనలతో ఈ ప్రాంతం హోరెత్తింది. తదుపరి దీక్షా శిబిరం కొనసాగింది. వికలాంగులను ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటుంది తప్పితే సమస్యల పరిష్కారం పట్ల ఏ మాత్రం చొరవ చూపడంలేదంటూ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు అప్పలనాయుడు అన్నారు. వికలాంగులపట్ల జాలి, దయ చూపాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. వికలాంగుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదన్నారు. ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషనర్లు వికలాంగలకు ఇవ్వాల్సి ఉన్నా అమలు కావడంలేదన్నారు. వికలాంగుల చట్టం ప్రకారం వీరికి అందాల్సిన సౌకర్యాలు ఏవీ దక్కడంలేదన్నారు. వీటికి పాలకపార్టీల విధానాలే కారణమని తేల్చి చెప్పారు. వికలాంగులు చదువుకోవడానికి మెరుగైన ఉపకార వేతనాలు అందివ్వాలన్నారు. ప్రత్యేక శిక్షణా విద్యాలయాలు నెలకొల్పాలన్నారు. వికలాంగులందరికీ రూ,.2500 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో లక్షా 26 వేల మంది వికలాంగులు ఉండగా కేవలం 26 వేల మందికే పింఛన్లు వస్తున్నాయన్నారు. వికలాంగుల సబ్‌ప్లాన్‌కు రూపకల్పన చేసి నిధులు కేటాయించాలన్నారు. ప్రైవేటు రంగంలోను మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.
నేడు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు
విశాఖపట్నం, మార్చి 11: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బృందం నేడు ఢిల్లీకి బయలుదేరనుంది. విశాఖ నుంచి ఎపి ఎక్స్‌ప్రెస్‌లో పిసిసి చీఫ్ రఘువీరాతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర,రాష్ట్ర మాజీ మంత్రులు, పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు తదితరులు బయలుదేరనున్నారు. తూర్పగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా తదితర జిల్లాల నుంచి కాంగ్రెస్ ప్రతినిధులు వీరితో పాటు బయలుదేరతారు. ఈ నెల 14న కాంగ్రెస్ సారధ్యంలో ప్రతినిధులు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ సహా విభజన చట్టంలో పొందుపరచిన హామీలను అమలు చేయాలని కోరనున్నారు. అలాగే 15, 16 తేదీల్లో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కాంగ్రెస్ బృందం కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించడంతో పాటు రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని కోరనున్నారు. అలాగే ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులను కలిసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని కోరనున్నారు.
నిధులు రాబట్టడంలో మంత్రులు విఫలం
విశాఖపట్నం, మార్చి 11: రాష్ట్ర బడ్జెట్‌లో విశాఖకు నిధులు రాబట్టడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో నీటిపారుదల శాఖకు రూ. 200 కోట్లు అవసరం కాగా, కేవలం రూ. 5 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. విశాఖ నగరానికి తాగునీటితో పాటు సాగు నీరందించే రైవాడ ప్రాజెక్టుకు రూ.75 కోట్లు అవసరం కాగా, రూ.6 లక్షలు, పెద్దేరుకు రూ.30 కోట్లు అవసరం కాగా, రూ.5 లక్షలు కేటాయించారన్నారు. ఇక కల్యాణపులోవ, లోతుగెడ్డ, అరవగెడ్డలకు నిధుల కేటాయింపు ఊసే లేదన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ. 10 వేల కోట్లు అవసరం కాగా, కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించారన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో విశాఖ జిల్లాకు నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయంపై మంత్రులు కనీసం ప్రశ్నించే సాహసం చేయకపోవడం దారుణమన్నారు. ఇద్దరు మంత్రులు ఒకరినొకరు విమర్శించుకోవడానికి ఇస్తున్న ప్రాధాన్యం జిల్లాకు నిధులను రాబట్టడంలో చూపాలన్నారు. ఇక ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (విమ్స్)కు ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండా ఏప్రిల్ 7న ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విమ్స్‌ను ప్రారంభించాలంటే వైద్య పరికరాల కొనుగోలుతో పాటు సిబ్బంది నియామకం పూర్తి కావాల్సి ఉందని, ఇది తెలియకుండా మంత్రి కామినేని ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రకటించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. నియోజవకర్గాలు కనీస అభివృద్ధికి నోచుకోవట్లేదని, ప్రజలంతా అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతగాని తనాన్ని అసహ్యించుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసి, తమ అసంతృప్తిని వెల్లడించాలన్నారు.
బాబును ప్రధాని మోదీ నమ్మరు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరును ప్రధాని నరేంద్ర మోదీ నమ్మిట్లేదని, అందుకే రాష్ట్రానికి నిధులు కేటాయించే విషయంలో వివక్ష చూపుతున్నారని ప్రసాదరెడ్డి అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించలేదు సరికదా, పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్లను మాత్రమే విదల్చడం దీనికి నిదర్శనమన్నారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఏ మూలకు సరిపోతాయన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజలను మోసపుచ్చే విధానాలకు స్వస్తిచెప్పి వాస్తవాలను అంగీకరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైకాపా నాయకులు పసుపులేటి ఉషాకిరణ్, కంపా హనోక్ తదితరులు పాల్గొన్నారు.