విశాఖపట్నం

సొంతింటి కల నెరవేర్చుతా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవాడ, సెప్టెంబర్ 23: నిరుపేదల సొంత ఇల్లు కలను నెరవేర్చేందుకు 4వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో నాలుగు లక్షల ఇళ్లను నిర్మిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా పరవాడ వద్ద జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద 50.40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 1839 గృహాల సముదాయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పరవాడ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నిరుపేదలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే తన లక్ష్యం అన్నారు. నిరుపేద కుటుంబాలకు భద్రత కల్పించేందుకు చంద్రన్న బీమా పథకం అక్టోబర్ 2వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిరుపేద కుటుంబానికి 10వేల రూపాయల మేర నెలవారి ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నానన్నారు. ప్రజా సాధికార సర్వే కేవలం ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకే అన్నారు. సాధికార సర్వే ద్వారా రాష్ట్రంలో గల 3కోట్ల 40లక్షల కుటుంబాల వివరాలను సేకరించామన్నారు. మరో కోటి 50లక్షల కుటుంబాల వివరాలను సేకరించాల్సి ఉందన్నారు. 2022 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఒక్కటిగా నిలబెడతానన్నారు. 2029 సంవత్సరానికి దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను కల్పించి ప్రాజెక్ట్ నిర్మాణ పనులను మాత్రం రాష్ట్రానికే అప్పగించిందన్నారు.దీనికి 25వేల కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అవడం ద్వారా విశాఖపట్నం ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించి సస్యశ్యామలం అవుతుందన్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న 30వేల 436 ఇళ్లను పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందించే 3లక్షల రూపాయల సబ్సిడీతో పాటు ప్రవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో పట్టణ నిరుపేదలకు ఖరీదైన ఇళ్లను కట్టించే ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిరుపేదల నిర్మించే ఇళ్ల వద్దే ఆర్థికంగా బలపడిన కుటుంబాలకు చెందిన ఇళ్లను నిర్మించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం వస్తుందో అటువంటి ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ సాధించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. దీనిపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. విశాఖపట్నాన్ని ఎడ్యూకేషన్ హబ్‌గా, పారిశ్రామిక కేంద్రంగా, ఆర్థిక పరిపుష్టి గల ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖపట్నంలో పలు యూనివర్శిటీలను మంజూరు చేసిందని, ట్రైబుల్ యూనివర్శిటీ, ఎన్‌ఐటి వంటి ఎడ్యూకేషన్ యూనివర్శిటీలు కేంద్ర మంజూరు చేయాల్సి ఉందన్నారు. వీటిపై ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తుందన్నారు. విశాఖపట్నంలో ఫార్మాస్యూటికల్స్ రీసెర్చ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. అంతకుముందు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై జగన్మోన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇదే బాటలో ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు పయినించారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కె.మృణాళిని, గంటా శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవానీ, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, పీలా గోవింద సత్యనారాయణ, పల్లా శ్రీనివాసరావు, కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీలు పప్పు చలపతిరావు, గాదె శ్రీనివాసులనాయుడు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జెసి నివాస్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటీసీ పయిల జగన్నాథరావు పాల్గొన్నారు.