విశాఖపట్నం

ఆక్వా హబ్‌గా ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: రానున్న రోజుల్లో అక్వా కల్చర్ ఎగుమతుల్లో విదేశాలతో పోటీ పడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సముద్ర ఉత్పత్తులకు విలువల జోడింపు చేయడం ద్వారా అధిక ఆదాయం సాధించే దిశగా దృష్టి సారిస్తున్నామన్నారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో మత్స్య ఉత్పత్తులపై ప్రచారం కల్పించే యోచన ఉందని తెలిపారు. 20వ ఇండియన్ ఇంటర్నేషనల్ సీఫుడ్ షో నగరంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సీఫుడ్ షోలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశం నుంచి ఎగుమతి అవుతున్న సముద్ర ఆహార ఉత్పత్తుల్లో మూడో వంతు రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో మూడింట రెండో వంతు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చైనా, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాలతో పోటీ పడేలా ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. సముద్ర ఉత్పత్తులకు విలువలను జోడించి ఎగుమతి చేయడం ద్వారా మరింత ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన వారు ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు గమనించాలని, అన్నీ సరళీకృతం చేశామని, త్వరగా ఇస్తామని వివరించారు. దేశంలో 2009-2010 సంవత్సరంతో పోల్చుకుంటే 2014-15 సంవత్సరంలో 335 శాతం మేరకు సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో వృద్ధి సాధించామని తెలిపారు. ప్రస్తుతం దేశీయ ఎగుమతుల్లో 45 శాతం రాష్ట్రం నుంచే జరుగుతోందని, తాము తీసుకుంటున్న చర్యల వల్ల ఇది 60 నుంచి 70 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నానన్నారు. రాష్ట్రాన్ని అక్వా హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. దిగుమతులకు ప్రత్యామ్నాయాలను ఇచ్చే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. నిర్లక్ష్యానికి గురైన ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, నిధుల సమస్య లేదని స్పష్టం చేశారు. నీలి విప్లవం కింద ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇస్తున్నదన్నారు. కేజ్ కల్చర్‌ను ఇప్పటికే ఆరు చోట్ల చేపట్టామని, మరో ఆరు చోట్ల ప్రారంభించే యోచన ఉందన్నారు. అక్వా రంగానికి వ్యవసాయ రంగ హోదా కల్పించాలని, బీమా కూడా వర్తింప చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని కోరారు. రొయ్యలు, చేపల ఉత్పత్తిలో నాణ్యతను పర్యవేక్షించేందుకు టాస్క్ఫోర్సు బృందాలను ఏర్పాటు చేశామని, 160 ప్రయోగశాలను ఒకే నెట్‌వర్క్ పరిధిలోకి తెచ్చామన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సంప్రదాయ మత్స్యకారుల వేటకు డిమాండ్ ఉందని, దానిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సముద్ర ఆహార ఉత్పత్తులకు విలువల జోడింపు అన్నది కీలమన్నారు. ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతల మనుషులని, కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేస్తే అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధిని ఒకే ఒక్కడు అడ్డుకుంటున్నాడని, సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. నేతల కంటే ప్రజలే తెలివైనవారన్నారు.దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉందన్నారు. ప్రపంచ దేశాల్లో మాంద్యం నెలకొన్నప్పటికీ దేశంలో వృద్ధి నమోదైందన్నారు. ఎంపి కె.హరిబాబు మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా పని చేసే 100 డీప్ సీ ట్రాలర్లు కనుమరుగైనాయని, డీజల్ ఖర్చు పెరగడమే కారణమన్నారు. అక్వా రంగానికి వ్యవసాయ హోదా ఇవ్వాలని, వివిధ రాయితీలను వర్తింప చేయాలన్నారు. పోర్టులను అభివృద్ధి చేసే సమయంలో మత్స్యకారులను దృష్టిలో ఉంచుకుని జెట్టీ లేదా ఫిషింగ్ హార్బర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. రొయ్యల ఎగుమతికి వ్యవసాయ మార్కెట్‌లతో సంబంధం లేనప్పటికీ మార్కెట్ సెస్‌ను చెల్లించాల్సి వస్తున్నదని, దీని నుంచి మినహాయింపు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, ఎంపెడా చైర్మన్ ఎ.జయతిలక్, సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ పద్మనాభం, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇంద్రకుమార్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ కృష్ణబాబు పాల్గొన్నారు.