విశాఖపట్నం

ఎన్‌ఏడి ఫ్లైఓవర్ గుదిబండా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న జంక్షన్ ఏదైనా ఉందంటే, అది ఎన్‌ఏడి జంక్షన్ ఒక్కటే. ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయితే, ఎండైనా, వానైనా ఆ ట్రాఫిక్‌లోనే సతమతమైపోవాలి తప్ప వేరే మార్గం లేదు. ఎన్‌ఏడి జంక్షన్ సమీపిస్తోందంటే, వాహన చోదకుల్లో ఆందోళన మొదలవుతుంది. ఈ జంక్షన్ దాటిపోగానే, వారు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య ఈ జంక్షన్‌లో ట్రాఫిక్ ఎంత అస్తవ్యస్థంగా ఉంటుందో చెప్పలేం. ఈ సమయంలో పోలీసులు కూడా ట్రాఫిక్‌ను నియంత్రించలేక చేతులెత్తేసుంటారు. ప్రతి రోజు ఈ జంక్షన్ మీదుగా సుమారు అక్షరాలా లక్షా పది వేలకు పైగా వాహనాలు నడుస్తున్నాయని పోలీసులు ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది.
వాహనాల మాట ఇలా ఉండే, ప్రతి రోజు ఈ జంక్షన్ మీదుగా రోజుకు 20 నుంచి 25 వేల మంది పాదచారులు వెళుతున్నట్టు సర్వేలో తేలింది. ఇంత రద్దీగా ఉండే జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలన్న ప్రతిపాదన చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఫ్లైఓవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మించాలి, అది ఎలా ఉండాలన్న అంశంపై సంవత్సరాల నుంచి చర్చ జరుగుతునే ఉంది. ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఇక్కడొక అంతర్జాతీయ స్థాయి ఫ్లైఓవర్ నిర్మించడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. సుమారు 122 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించే బాధ్యత విజయ్ నిర్మాణ్ కంపెనీకి అప్పగించారు. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే, వాహనాలు మెరుపు వేగంతో దూసుకుపోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. అయితే, కొంత మంది మాత్రం ఇక్కడ ఫ్లైఓవర్ వుడాకు గుదిబండగా మారబోతోందని చెపుతున్నారు. ఆశీల్‌మెట్ట జంక్షన్ వద్ద సామాన్యమైన ఫ్లైఓవర్ నిర్మించడానికి మూడేళ్లు పట్టింది. నిర్మాణ సమయంలో ట్రాఫిక్ సమస్యతో జనం సతమతమయ్యారు. పోనీ ఈ ఫ్లైఓవర్ జనానికి అంతగా ఉపయోగపడుతోందా? అంటే అదీ లేదు. ఇటువంటి అనుభవాలను క్రోడీకరించిన కొంతమంది అధికారులు ఎన్‌ఏడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించడం అంత సామాన్యమైన విషయం కాదని అంటున్నారు. జాతీయ రహదారి వెంబడి వందల సంఖ్యలో భారీ వాహనాలు నడుస్తుంటాయి. వీటిని దారి మళ్లించడం అంత సామాన్య విషయం కాదు. వీటన్నింటికీ మించి భూసేకరణ కూడా స్థానిక నాయకులకు శిరోభారమయ్యే పరిస్థితి ఉంది. గతంలో బిఆర్‌టిఎస్ రోడ్డు నిర్మిస్తున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకుల వత్తిడులకు తలొగ్గి, రోడ్డు డిజైన్‌లో మార్పులు చేయడం వలన గోపాలపట్నం రైల్వే స్టేషన్ రోడ్డు జంక్షన్ నుంచి సింహాచలం జంక్షన్ వరకూ రోడ్డు కుచించుకుపోయింది. దీనివలన అక్కడ వాహనాల రాకపోకలు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో స్థానిక నాయకులకు తెలియంది కాదు. అటువంటి తప్పిదం ఎన్‌ఏడి ఫ్లైఓవర్ వద్ద జరిగితే జనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్‌ఏడి వద్ద నిర్మించాలనుకుంటున్న ఫ్లైఓవర్ డిజైన్ సామాన్యమైనది కాదు. అత్యంత చాకచక్యంగా దీన్ని నిర్మించాలి. వీటన్నింటికీ మించి 122 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినా, పూర్తయ్యేనాటికి దాదాపూ రెట్టింపు మొత్తాన్ని చెల్లించుకోవలసి వస్తుంది. ఈ ఫ్లైఓవర్‌ను రెండేళ్లలో నిర్మిస్తామని చెపుతున్నారు. కానీ పై చిత్రంలో ఉన్న డిజైన్‌ను చూసినవారెవ్వరైనా రెండేళ్లలో పూర్తవుతుందంటే నమ్ముతారా? ఇప్పటికే అస్తవ్యస్థంగా మారిన ఎన్‌ఏడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోయినా, జనానికి అనుకున్న స్థాయిలో అందుబాటులోకి రాకపోయినా, ప్రభుత్వం అభాసుపాలుకాక తప్పదు.

ఇదిగో ప్రత్యామ్నాయం!
ఎన్‌ఏడి వద్ద వందల కోట్లు ఖర్చు చేసి ఫ్లైఓవర్ నిర్మించేకన్నా, చాలా తక్కువ ఖర్చుతో ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి పోలీసుల వద్ద మంచి ప్రత్యామ్నాయం ఉంది. ఓల్డ్ ఎయిర్‌పోర్టు జంక్షన్ నుంచి విమాన్‌నగర్ రైల్వే ట్రాక్ మీదుగా బాజీ జంక్షన్‌కు కలుపుతూ ఒక రోడ్డు ఉంది. దీన్ని చాలా తక్కువ మంది వినియోగిస్తున్నారు. ఈ రోడ్డును విస్తరిస్తే గాజువాక నుంచి గోపాలపట్నం వైపు వెళ్లాల్సిన వారంతా ఈ రోడ్డు మీదుగా వెళ్లిపోవచ్చు. అలాగే గోపాలపట్నం నుంచి హైవే మీదుగా నగరంలోకి వెళ్లే మార్గంలో ఎన్‌ఎస్‌టిఎల్ గేటు ఉంది. ఈ గేటును తొలగించడానికి అనుమతి కూడా మంజూరైంది. ఈ గేటు తొలగించి, గోపాలపట్నం ఎన్‌ఎస్‌టిఎల్ రోడ్డును విస్తరిస్తే, చాలా వరకూ ట్రాఫిక్ అటు మళ్లిపోతుంది. కేవలం ఈ రెండు రోడ్ల విస్తరణ వలన ఎన్‌ఏడి జంక్షన్ వద్ద 40 శాతం ట్రాఫిక్ తగ్గుముఖం పడుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫ్లైఓవర్‌పై పునరాలోచించాలి
విశాఖ నగరానికి అత్యంత కీలకమైన ఎన్‌ఏడి జంక్షన్ వద్ద ఆదరబాదరగా ఫ్లైఓవర్ నిర్మించేకన్నా, దీనిపై పునరాలోచన చేయాల్సి అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చేపుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఫ్లైఓవర్‌ను నిర్మించి తరువాత చేతులెత్తేస్తే, ప్రభుత్వం అప్రతిష్టపాలవుతుంది. వుడా ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టడం కరెక్టా? కాదా? అని ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.