విశాఖపట్నం

నేటి నుంచి నగరంలో ఐపిఎల్ హంగామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 7 : మొదటిసారిగా నగరంలో ఆరు ఐపిఎల్ మ్యాచులు జరగనుండడంతో నగరంలో క్రికెట్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. ఆదివారం రోహిత్‌శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్, వార్నర్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రసవత్తర పోటీకి ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం విశాఖ చేరుకున్న ముంబయి ఇండియన్స్ జట్టు రెండు రోజులు స్టేడియంలో సాధన చేస్తే, సన్‌రైజర్స్‌తో మ్యాచ్ కోసం వ్యూహాల్ని సిద్ధం చేస్తోంది. ముంబయి ఇండియన్స్ ఈ స్టేడియంను హోంగ్రౌండ్‌గా ఎంచుకోవడంతో స్టేడియం లోపం, బయటా ఎక్కడ చూసినా నీలివర్ణం హోర్డింగులు, కటౌట్లు, ఫ్లెక్సీలతో కళకళలాడుతోంది. ఆఖరికి కుర్చీలకు కూడా నీలివర్ణం అద్దడంతో అంతా నీలంగా కనిపిస్తోంది. ముంబయి ఇండియన్స్ ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఫూణె, కోల్‌కతా, నైట్‌రైడర్స్ కింగ్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్‌పై విజయాలు సాధించగా ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్‌ల మధ్య, పూణె చేతిలో ఓటమి చవిచూసింది. ముంబయి కెప్టెన్ రోహిత్‌శర్మ 383 పరుగులతో బ్యాటింగులో మంచి ఫామ్‌ను కనబరుస్తున్నాడు. సన్‌రైజర్స్ విషయానికి వస్తే ఆ జట్టు ఆడిన 8 మ్యాచులలో 5 మ్యాచులలో గెలిచి 10 పాయింట్లలో నాలుగవ స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్‌పై, గుజరాత్ లయన్స్ పై రెండు సార్లు విజయం సాధించింది. అయితే పూణె, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలయింది. ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ 480 పరుగులతో ముందుండగా, గుజరాత్‌పై 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శిఖర్‌ధావన్ 228 పరుగులతో ఆ జట్టు బ్యాటింగు భారాన్ని మోస్తున్నాడు.
బ్యాటింగుకు అనుకూలం
పిచ్ బ్యాటింగుకు అనుకూలంగా ఉంటుందని, ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోరు సాధించే అవకాశం ఉందని పిచ్ క్యూరేటర్ మల్లయ్య తెలిపారు. బ్యాటింగుకు స్వర్గ్ధామంలా ఉండే పిచ్‌పై పరుగుల వరద పారుతుందన్నారు. టి-20 ఫార్మాట్‌లో ప్రేక్షకులు కేరింతలు కొట్టాలంటే బ్యాటింగ్ మెరుపులు అవసరమని, ఆ దృష్టితోనే పిచ్‌ని సిద్ధం చేశామన్నారు. అందుకు తగ్గట్టుగానే ఔట్‌ఫీల్డ్ కూడా ఉంటుందని ఆంధ్రభూమికి తెలిపారు.
జోరందుకున్న టిక్కెట్ల అమ్మకాలు
ఆన్‌లైన్‌లో పెట్టిన తొలిరోజే రెండు వేల రూపాయల టిక్కెట్లు అమ్ముడైపోయాయి. ఆ తర్వాత కౌంటర్లలో టిక్కెట్లన్నీ రెండు రోజుల వరకు నత్తనడకన సాగినా అమ్మకాలు శనివారం జోరందుకున్నాయి.
సన్‌రైజర్స్‌కు సాదర స్వాగతం
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శనివారం విశాఖ చేరుకుంది. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నుండి వచ్చిన సన్‌రైజర్స్ జట్టు సభ్యులకు విమానాశ్రయంలో, వసతి ఏర్పాటు చేసిన నోవాటెల్ హోటల్లో సాదర స్వాగతం లభించింది. హోటల్ సిబ్బంది జట్టు సభ్యులకు బొట్టు పెట్టి, దండలు వేసి స్వాగతం పలికారు.
ముంబయి ఇండియన్స్ ముమ్మర సాధన
ముంబయి ఇండియన్స్ జట్టు శనివారం కూడా ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో ముమ్మరంగా సాధన చేసింది. ఫిట్‌నెస్, రిక్రియేషన్ గేమ్స్ ఆడిన అనంతరం రోహిత్‌శర్మ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. పొలార్డ్, హార్దిక్ పాండ్యా, రాయుడు కూడా బ్యాటింగులో ఎక్కువ సేపు సాధన చేశారు. శనివారం సాయంత్రం విశాఖ చేరుకున్న సన్‌రైజర్స్ జట్టు ప్రయాణ బడలికతో హోటల్ గదికే పరిమితం అయింది.
డేనైట్ మ్యాచ్
సన్‌రైజర్స్, ముంబయి ఇండియన్ మధ్య పోటీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను డేలైట్‌లో ప్రారంభించినప్పటికీ సాయంత్రం 5.30 గంటల నుండి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్ జరగనుంది.
ఉద్యాన పంట రైతులకు రూ. 384..47 కోట్ల రుణ మాఫీ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 7: రాష్ట్రంలోని ఉద్యాన పంట రైతులకు సంబంధించి దాదాపు 384.47 కోట్ల రూపాయల మేరకు రుణాలను మాఫీ చేయనున్నట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మాఫీ వల్ల 2.23 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలోని సబ్బవరం మండల అభివృద్ధి కార్యాలయంలో జరిగిన రైతు రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమంలో శనివారం పాల్గొని రుణ విముక్తి పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎటువంటి హామీ ఇవ్వకపోయినప్పటికి ఉద్యాన పంట రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 55 లక్షల మంది రైతులకు మేలు చేకూర్చే విధంగా 24 వేల కోట్ల రూపాయలను మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించనప్పటికీ రైతులకు మేలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్యవసాయ, ఉద్యాన రంగాలను లాభసాటిగా మార్చేందుకు ఎన్నో పద్ధతులను అమల్లోకి తీసుకువచ్చిందని, భూసార పరీక్షలు, మేలు రకపు విత్తనాలు, సేంద్రియ వ్యవసాయం వంటివి ప్రోత్సాహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ తమ నియోజక వర్గ పరిధిలో 10712 మంది రైతుకలు మేలు చేకూరే విధంగా 14.6 కోట్ల రూపాయ మేరకు పంట రుణాలను, 1.24 కోట్ల మేరకు రుణాలను మాఫీ చేశారన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి ముత్యాల నాయుడు, జడ్పీటీసీ సభ్యుడు జి.సత్యనారాయణ, పరవాడ ఎంపిపి అప్పల నాయుడు, సర్పంచ్ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు విజయప్రసాద్, ఉద్యాన వన శాఖ అధికారి రాధిక తదితరులు పాల్గొన్నారు.
కోటిజన్మల పుణ్యఫలం నిజరూప దర్శనం
సింహాచలం, మే 7: లోకంలో నారసింహ క్షేత్రాలు అనేకం ఉన్నా..వరాహ నారసింహ అవతారాల కలయికతో ధ్వయావతార రూపుడిగా భగవంతుడు కొలువైవున్న మహా పుణ్యక్షేత్రం సింహాచలం. 364 రోజులు శ్రీ గంధం పూతలో ఉన్న సింహగిరి నరహరి ఒక రోజు మాత్రమే వైశాఖ శుద్ధ తదియ నాడు తన నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కలుగజేస్తాడు. విలక్షణమైన ఆస్వామి వారి నిజరూప దర్శనం కోటి జన్మల పుణ్యఫలంగానే లభిస్తుందంటారు. హరితోత్తములు. భక్తకోటి మనసంతా కళ్లు చేసుకొని ఎదురుచూసిన రోజు వచ్చేసింది. సోమవారం తెల్లవారు ఝామున సింహాచలం నుంచి నిజరూప దర్శనం భక్తులకు లభించనుంది. చందనోత్సవంగా కీర్తించబడుతున్న ఈ వేడుకలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి రోజున అర్చకులంతా సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలుపుతారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాల ప్రకారం వైదికాధికులు నిర్వహిస్తారు. వేదపారాయణలు జరుగుతుండగా వైదిక పెద్దలు మూలవిరాట్‌పై ఉన్న గంథాన్ని విసర్జిస్తారు. స్వామివారిని నిజరూపంలోకి తీసుకువచ్చి శిరస్సు, హృదయంపైన పచ్చి గంధం ముద్ధలను ఉంచుతారు. సుమారు 49 మందిని ప్రభుత్వం భక్తజన సేవా సమితి పేరుతో చందనోత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సోమవారం తెల్లవారు ఝామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభించే అవకాశం ఉంది. ఆలయంలో సనాతనంగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి ఈవో రామచంద్రమోహన్, వైదికులు పూసపాటి వంశీయులతో తొలి దర్శనం చేయిస్తారు. అనంతరం భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తారు. రాత్రి వరకు దర్శనాలు కొనసాగుతాయి.
సహస్ర ఘటాభిషేకం
సోమవారం రాత్రి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. వందలాదిమంది శ్రీ వైష్ణవ స్వాముల సంప్రదాయ స్వరూపంతో గంగధార నుంచి పవిత్ర జలాలు తీసుకురాగా ఆలయంలో వైదిక పెద్దలు స్వామి వారికి అభిషేకం చేస్తారు. పంచామృతాభిషేకం కూడా నిర్వహిస్తారు.
కరవు నివారణకు శాశ్వత ప్రతిణాళిక
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 7: రాష్ట్రంలో నెలకొన్ని తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన కరవును శాశ్వతంగా నివారించేందుకు ప్రభుత్వం ప్రణాళికా యుతంగా ముందుకు సాగుతోందని బిసి సంక్షేమం, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కరవు నివారణ చర్యలపై జిల్లా అధికారులతో జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరవు పరిస్థితులపై అథ్యయనం చేయడంతో పాటు శాశ్వత నివారణ చర్యలను అనే్వషించేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని సిఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిన నేపథ్యంలో ఇంకుడు గుంతలు, ఫార్మ్‌పాండ్స్ ఏర్పాటును ఉద్యమ స్పూర్తితో చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ఉపాధిహామీ, నీరు-చెట్టు, మనవూరు- మనచెరువు, పనులతో పాటు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రిజర్వాయర్లలో పూడికతీత పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి బోర్‌వెల్స్ ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అలాగే వేసవి తీవ్రత దృష్ట్యా పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మజ్జిగ, మంచినీటి కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలన్నారు. దీనికోసం జిల్లాకు రూ.3 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కరవు నివారణ నిమిత్తం చేపట్టిన కార్యాచరణను కలెక్టర్ ఎన్ యువరాజ్ మంత్రి రవీంద్రకు వివరించారు. జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థలు, స్వచ్ఛంధ సంస్థల ఆధ్వర్యంలో 1470 చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో 204 మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హేబిటేషన్ల వారీగా బోర్ల మరమ్మతులు, కొత్త బోర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 8268 ఓఆర్‌ఎస్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని, వైద్య సిబ్బంది ద్వారా ఇప్పటి వరకూ 2.4 లక్షల ప్యాకెట్లను పంపిణీ చేశామన్నారు. ఎన్‌టిఆర్ జలసిరి ఫేజ్ 2 ద్వారా చేపట్టిన పనులను కలెక్టర్ మంత్రి రవీంద్రకు వివరించారు. ఫిర్యాదులు, పత్రికా వార్తల ఆధారంగా తక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ లాలం భవానీ, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, డిఆర్‌ఓ చంద్రశేఖర రెడ్డి, డ్వామా పిడి శ్రీరాములు నాయుడు, డిఎంహెచ్‌ఓ సరోజిని, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ జెడిలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందుకు మంత్రి రవీంద్ర అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఎయు విసి పదవికి మూడు పేర్లు సిఫారసు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 7: ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ నియామకానికి సంబంధించి మూడు పేర్లను సెర్చ్ కమిటీ శనివారం సిఫారుసు చేసింది. ఈ మేరకు ఆ పేర్లను సీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అందచేసింది. గత కొంత కాలంగా ఎయు వీసీ నియామకంపై కసరత్తు జరగడం తెలిసిందే. రాష్ట్ర ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా, మాజీ వీసీ ఆనంద్ కృష్ణన్, యుజిసి ప్రతినిధి రాజ్‌పాల్ సింగ్‌లతో కూడిన త్రిసభ్య సెర్చ్ కమిటీ హైదరాబాద్‌లో శనివారం సమావేశమైంది. గత కొంత కాలంగా అమల్లో ఉన్న ఇన్‌చార్జి పాలనకు తెరదించేందుకు ప్రభుత్వం సెర్చ్ కమిటీ నియమించింది. వీసీ పదవి కోసం దాదాపు 150 మందికి పైగా దరఖాస్తు చేశారు. కొందరు మంత్రులు కూడా తమ వారికి ఆ పదవి దక్కేలా పావులు కదిపారు. రెండు సార్లు సెర్చ్ కమిటీ సమావేశం జరిగినప్పటికీ వీసీ ఎంపిక వ్యవహారం కొలిక్కిరాలేదు. దీంతో తాజాగా శనివారం కమిటీ సమావేశమై మూడు పేర్లు ఖరారు చేసింది. ఆ పేర్లను గోప్యంగా ఉంచారు. ఈ పేర్లను ముఖ్యమంత్రి పరిశీలించి, ఒక పేరును ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు పంపుతారు. ఆయన లాంఛనంగా ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరో 10 రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు.
సముద్ర ఉత్పత్తుల నిల్వకు ప్రత్యక బ్యాగులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 7: సముద్ర ఉత్పత్తులు త్వరితగతిన పాడవకుండా ఉండేలా ఫిష్ బ్యాగ్‌లను సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, ఐసిఎఆర్ సంయుక్తంగా రూపొందించింది. వేట ముగించుకుని తీసుకువచ్చిన సముద్ర ఉత్పత్తులను హర్బర్ నుంచి మార్కెట్‌కు తీసుకువెళ్లేందుకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. వేసవిలో చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులు వేసవి త్వరగా పాడవుతుంటాయి. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా, పాడైన చేపల వల్ల ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంటుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు సిఐఎఫ్‌టి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాగ్‌లను రూపొందించింది. మూడు పొరలుగా ఉండే బ్యాగ్‌లో సముద్ర ఉత్పత్తులు సుమారు 6 గంటల పాటు తాజాగా ఉంటాయి. వీటిని ఎంవిపి కాలనీ, నెహ్రూ బజార్, ఇతర మార్కెట్‌లో విక్రయాలు సాగించే సంప్రదాయ మత్స్యకారులకు వీటిని ఉచితంగా పంపిణీ చేశారు.
నేటి నుండి మోదకొండమ్మ జాతర
పాడేరు, మే 7: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రఖ్యాతిగాంచి అశేష భక్త జనులతో కొలవబడే పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే మోదమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రాష్ట్ర వేడుకగా ప్రకటించడంతో ఈ ఉత్సవాలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అమ్మవారి జాతర నిర్వహణకు ఉత్సవ కమిటీ, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 8వ తేది ఉదయం నుంచి ప్రారంభమయ్యే జాతర మహోత్సవాలు 10వ తేదీ మంగళవారం వరకు లక్షలాది మంది భక్తుల నడుమ కోలాహలంగా జరగనున్నాయి. కొండ దేవతా నీకు కోటి దండాలంటూ భక్తజనంతో కొలవబడుతున్న పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. నవ్యాంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో జరిగే జాతరలలో పాడేరు మోదకొండమ్మ జాతర ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. గత మూడు దశాబ్ధాలకు పైగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న అమ్మవారి జాతర మన్యానికే గణ కీర్తిని ఆపాదిస్తోందని చెప్పవచ్చు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, మన్య ప్రాంతవాసుల ఆరాధ్య దైవంగా పిలువబడే శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుండడం ఈ ఉత్సవాలకు ఉన్న మరో ప్రత్యేకత. భక్తజన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని గిరిజన, గిరిజనేతరుల ఆరాధ్యదైవంగా కొలవబడుతున్న మోదకొండమ్మ అమ్మవారి మహిమల గురించి తెలియని వారుండరు.
శ్రీ మోదకొండమ్మ అమ్మవారి మహిమల గురించి, పుట్టు పూర్వోత్తరాల గురించి పూర్వీకులు చెప్పే కథ ఈ ప్రాంతంలో విస్తృత ప్రచారంలో ఉంది. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు నరజాతి వినాశనాన్ని కోరుకుంటూ భీతావాహాన్ని సృష్టించేవాడు. రాక్షసుడు సృష్టించే భీభత్సానికి లోకంలో కల్లోలం సంభవిస్తూ అశాంతి నెలకొనేది. ఈ పరిస్ధితుల్లో భక్తుల ఆక్రందనలు విన్న సమస్త మహిమలు కలిగిన ఆదిపరాశక్తి దుష్ట సంహారం, శిష్టరక్షణ చెయ్యాలని భూలోకంపై అవతరించింది. ఆదిపరాశక్తి మహిషాసురునికి మధ్య భీకర యుద్ధం జరిగింది. అయితే రాక్షసుని మాయా యుద్ధానికి ఆదిపరాశక్తి చాలా కాలం మహిషాసురునితో యుద్ధం చేయవలసి వచ్చిందని చెబుతారు. ఆదిపరాశక్తికి రాక్షసునికి మధ్య జరిగే యుద్ధంలో రాక్షసుని శరీరం నుంచి నేల రాలిన ప్రతీ రక్తపుబొట్టు నుంచి ఒక్కొక్క రాక్షసుడు జన్మిస్తుండడంతో యుద్ధంలో ఆదిపరాశక్తి ఇబ్బందులను ఎదుర్కొనేదని అంటారు. దీంతో తన మహిమలతో నూట ఒక్క స్ర్తి మూర్తులను అవతరింపజేసిందని, ఈ స్ర్తి మూర్తులకు తన మహిమలను ప్రసాదించినట్టు చెబుతారు. ఆదిపరాశక్తి మహిమలతో (మిగతా 2వ పేజీలో)