విశాఖపట్నం

బీచ్‌లో మరణాలు నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 12: విశాఖ నగరంతో పాటు యారాడ, గంగవరం బీచ్‌లలో సంభవిస్తున్న మరణాల నియంత్రణకు పటిష్ట కార్యాచరణ చేపట్టాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. బీచ్‌కు వస్తున్న సందర్శకులు మృత్యువాత పడటం కలవరపరుస్తోంది, ఇటీవల యారాడ బీచ్‌లో ఆరుగురు యువకులు దుర్మరణం పాలవడం, తక్షణమే దీనికి పరిష్కారం కనుగొనాలన్న లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పోలీసు, వుడా, జీవీఎంసీ, టూరిజం తదితర విభాగాల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ బీచ్‌లో మరణాల నియంత్రణకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న పలు నిర్ణయాల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేశామని, సాంకేతిక కారణాల రీత్యా కొన్నింటిని అమలు చేయలేకపోయామన్నారు. బీచ్ సేఫ్టీకి అవసరమైన సురక్షిత ప్రమాణాలు అమలు చేసేందుకు నిధుల లేమిపై ప్రతినిధులు చర్చించారు. ఈతగాళ్లు, లైఫ్‌గార్డులకు ప్రతి నెలా చెల్లించాల్సి జీతాల విషయంలో సమన్వయం కొరవడుతున్నట్టు గుర్తించారు. గార్డులు, ఈతగాళ్లకు జీతాలు చెల్లించలేని పరిస్థితులను ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అయితే బీచ్‌లో ఎటువంటి అవాంఛనీయ మరణాలు సంభవించకుండా పటిష్టకార్యాచరణ రూపొందించి అమలు చేయాలని రెవెన్యూ, పోలీసు, పర్యాటకం, మత్స్యశాఖల అధికారులకు సూచించారు. ఈ శాఖల అధికారుతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సురక్షితమైన బీచ్‌లను గుర్తించి, అక్కడకు మాత్రమే పర్యాటకులను అనుమతించాలని, మిగిలిన వాటిలో ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించారు. సురక్షితమైన బీచ్‌లు గుర్తించేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా బీచ్‌లో నిఘా కెమేరాలను ఏర్పాటు చేయాలని జీవీఎంసీని, పర్యాటకులను అప్రమత్తం చేసే విధంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖను కలెక్టర్ ఆదేశించారు. పోలీసు కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా మాట్లాడుతూ విశాఖ సాగరతీరంలో గత ఏడాది 38 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకూ 30 మంది మృత్యువాత పడ్డారన్నారు. ఇది అత్యంత తీవ్రమైన సమ్యగా పేర్కొంటూ తక్షణమే దీనికి మంచి పరిష్కారం కనుగొనాల్సి ఉందన్నారు. పోలీసు శాఖ పరంగా ఎటువంటి సహాయ, సహకారాలు, చర్యలు తీసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. దీనికోసం పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాష్ట్రీయ లైఫ్ సేవింగ్ సొసైటీ ప్రతినిధి శర్మ మాట్లాడుతూ బీచ్‌లో సంభవిస్తున్న మరణాల నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు రాధాకృష్ణ, జిల్లా పర్యాటక అధికారి పూర్ణిమదేవి, మత్స్యశాఖ సంయక్త సంచాలకులు కోటేశ్వర రావు, నేవీ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

చదువు, సంగీత కళలను నేర్చుకోవాలి
* మంత్రి గంటా శ్రీనివాసరావు

మధురవాడ, నవంబర్ 12: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులకు ఇకపై చదువుతో పాటు సంగీత కళలను కూడా ఉచితంగా నేర్పించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక చంద్రంపాలేం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు ఆన్‌లైన్ ద్వారా సంగీత శిక్షణా తరగతులను బిగ్ పోష్టర్‌ను ఆవిష్కరించి మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి గంటా మాట్లాడుతూ భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు కచ్ఛపి ప్రవేశిక అన్నపేరుతో ఆన్‌లైన్ ద్వారా కర్ణాటక సంగీతం (గాత్రం) తరగతులను ఉచితంగా శిక్షణనిచ్చే బృహత్కార్యానికి ప్రభుత్వ శ్రీకారం చుట్టిందన్నారు. జె చారిటీస్ సౌజన్యంతో అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ కళలు మరియు సంగీత పాఠశాల అయిన కచ్ఛపి స్వరధార ఫౌండేషన్ డైరెక్టర్, సంగీత దిగ్గజం, శ్రీమతి లలితా పద్మిని సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా రూపొందించిన ఈ ఆన్‌లైన్ తరగతుల ద్వారా కర్ణాటక సంగీతం (గాత్రం) ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధ్థులకు ఇక నుండి సంగీత పాఠాలు ఉచితంగా అందనున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల్లో క్రీడా స్పూర్తిని పెంచేందుకు ఎంతో కృషిచేస్తోందని, ఇప్పుడు క్రీడలతో పాటు సంగీత పరిజానం కూడా పెంచుకోడానికి ఈ శిక్షణా తరగతులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఏ ప్రభుత్వం ఇంతవరకు చేపట్టలేదని, విద్యార్ధులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి లాలం భవాని భాస్కర్, డిఇఓ లింగేశ్లరరెడ్డి, సినీ దర్శక, రచయిత జగధీష్ దానేటి, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ షర్మిలాదేవి, రాధికా బెహరా, దీప్తి, పాఠశాల సిబ్బంది, అధికారులు, దేశం పార్టీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంతోషిమాత ప్రచార రథం ప్రారంభం
ఆనందపురం, నవంబర్ 12: ఆనందపురం గ్రామంలో గల జై సంతోషిమాత ఆలయ విశిష్టతను తెలియజేస్తూ ప్రచార రధం మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తుందని ఆలయ ధర్మకర్త బత్తుల జగన్ తెలిపారు. సోమావరం ప్రచార రదాన్ని ఆయన ప్రారంభిస్తు మాట్లాడారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 23న ఆలయ 31వ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రచార రధం నెల రోజులపాటు తిరుగుతుందని ముగింపు రోజున అమ్మవారికి పాలాభిషేకం, అష్టోత్తర కుంకుమార్చన, 1008 పుష్పాలతో దంపతులచే సహాస్రనామ పూజలు జరుగుతాయని తెలిపారు. అదేరోజు అమ్మవారి లడ్డు వేలంపాట, అన్న సమారాధన జరుగునున్నట్లు ఆలయ ధర్మకర్త జగన్ తెలిపారు.