విశాఖపట్నం

తీరం కోతపై సత్వరమే స్పందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: సాగరతీరం కోతను నివారించే చర్యలను వేగవంతం చేయాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ కోరారు. నెదర్లాండ్స్‌కు చెందిన డెల్టారేస్ సంస్థ ఇప్పటికే కొంతకాలంగా అధ్యయనం చేసి రూపొందించిన నివేదకను సమీక్షించాల్సిందిగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటి)ను కోరారు. డెల్టారేస్, ఎన్‌ఐఓటి ప్రతినిధులతో కమిషనర్ మంగళవారం సమావేశమై నివేదికపై సమీక్షించారు. డెల్టారేస్ సంస్థ అధ్యయనం మేరకు అన్ని అంశాలను పూర్తి స్థాయిలో సమీక్షించాల్సిందిగా ఎన్‌ఐఓటి ప్రతినిధులను కమిషనర్ కోరారు. ఇప్పటికే సముద్ర తీరంలో కోత నివారణకు తాత్కాలిక చర్యలు తీసుకోవడం జరిగిందని, పూర్తి స్థాయిలో నియంత్రణ, పరిష్కార మార్గాలను సూచించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎన్‌ఐఓటి ఇంజనీర్లు, సైంటిస్టులు డెల్టారేస్ సంస్థ నివేదిక పరిశీలించి తుది నివేదికను ఫిబ్రవరి మొదటి వారంలో అందజేయాలని కోరారు. అంతకుముందు డెల్టారేస్ ప్రతినిధులు బీచ్‌కోతపై పూర్తి వివరాలతో కూడిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమీక్షలో జివిఎంసి ఎస్‌ఇ వి చంద్రయ్య, ఇఇ వెంకటి తదితరులు పాల్గొన్నారు.

ఐఎఫ్‌ఆర్ పనులను ఆకర్షణీయంగా నిర్వహించండి
* ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 19: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) పనులను ఎటువంటి లోపాల్లేకుండా, ఆకర్షణీయంగా నిర్వహించాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఐఎఫ్‌ఆర్ పనులను మంగళవారం సమీక్షించిన ఆయన అన్ని రహదార్లు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టు నుంచి మద్దిలపాలెం వరకూ జాతీ రహదారిని, కానె్వంట్ జంక్షన్, ఎల్‌ఐసి అంబేద్కర్ కూడలి, జగదాంబ నుంచి కలెక్టరేట్ మీదుగా కోస్టల్ బ్యాటరీ వరకూ రహదార్లు, ఇరువైపులా పెయింటింగ్‌లను పూర్తి చేయాలన్నారు. జివిఎంసి ప్రధాన కార్యాలయం, సెంట్రల్ పార్కు సహా అన్ని రహదార్లు సెంట్రల్ మీడియన్‌లో మొక్కలు పెంచాలని, డివైడర్లకు రంగులు వేయాలని అదేశించారు. అన్ని ముఖ్య కూడళ్లలోని ట్రాఫిక్ ఐలాండ్స్, పార్కులను అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే అతిధులను ఆకట్టుకునే విధంగా నగరాన్ని సుందరంగా మార్చాలన్నారు. ఇప్పటికే పనులు దాదాపు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని సైతం సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఇలు వి చంద్రయ్య, కె ఆనందరావు, ఎస్ మరియన్న, హార్టీకల్చర్ ఎడి దామోదర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తుల వెల్లువ
* 60 వేల దరఖాస్తుల తిరస్కరణ
* పరిశీలక సిబ్బందికి 20 శిక్షణ
* 21 నుంచి క్షేత్రస్థాయి విచారణ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 19: అందరికీ ఇళ్లు పేరిట కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో మంజూరు చేసిన ఇళ్లకు ఎక్కడలేని డిమాండ్ పెరిగింది. అర్హులతో పాటు అనర్హులు సైతం ఇళ్లకోసం దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో జివిఎంసికి ఇబ్బడి ముబ్బడిగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. జివిఎంసి పరిధిలో 20,170 ఇళ్లను మంజూరు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయగా, లక్షల్లో దరఖాస్తులు అందాయి. ఇళ్లకోసం దరఖాస్తులు చేసుకునేందుకు డిసెంబర్ 31 ఆఖరి తేదీకాగా అప్పటి వరకూ 1.82 లక్షల దరఖాస్తులు అందాయి. ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించినప్పటికీ దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకూ దరఖాస్తులను పరిశీలించిన జివిఎంసి అధికారులు సుమారు 60వేల దరఖాస్తులను తిరస్కరించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్లకు రూ.2 లక్షలు బ్యాంకు రుణంగా మంజూరు చేస్తుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు సబ్సిడీకాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.80వేలు సమకూరుస్తుంది. మిగిలిన రూ.50వేలను లబ్దిదారు భరించాల్సి ఉంటుంది. నగరంలోని 72 వార్డుల్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించగా, అనకాపల్లి, భీమునిపట్నం మున్సిపాలిటీల్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు కాలేదు. విలీన మున్సిపాలిటీల్లో చోటుచేసుకున్న సాంకేతిక కారణాల వల్ల ఇక్కడ దరఖాస్తులను తీసుకోలేదని, త్వరలోనే ఇక్కడ కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని జివిఎంసి అధికారులు వెల్లడించారు.
జివిఎంసి పరిధిలో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకోసం అర్హులను గుర్తించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 250 మంది సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశారు. వీరికి ఈ నెల 20 దరఖాస్తుల పరిశీలనపై శిక్షణను ఇవ్వనున్నారు. అనంతరం 21 నుంచి క్షేత్ర స్థాయిలో యంత్రాంగం దరఖాస్తు దార్లను స్వయంగా కలిసి వివరాలను సేకరిస్తుంది. దరఖాస్తుల పరిశీలలో భాగంగా వచ్చే సిబ్బందికి బ్యాంకు పాస్‌బుక్‌తో పాటు పాస్‌పోర్టు సైజు ఫోటోను అందించాల్సి ఉంటుంది.

నాక్ బృందం ఎయు సందర్శన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 19: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నాలుగు రోజుల పాటు నాక్ బృందం పర్యటన మంగళవారం ప్రారంభమైంది. నాక్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్‌ఎఫ్ పాటిల్ ఆధ్వర్యంలో బృందం ఎయులోని పలు విభాగాలను సందర్శించి, పలువురు అధ్యాపకులు, విద్యార్థులతో చర్చించింది. ఈ సందర్భంగా నాక్ కమిటీ చైర్మన్ పాటిల్ మాట్లాడుతూ దేశంలోని వర్శిటీలన్నింటిలోనూ ఆంధ్రాయూనివర్శిటీ ఆదర్శవంతంగా నిలవాలని అభిలషించారు. దేశంలోని ప్రాంతీయ విశ్వవిద్యాలయాల్లో అగ్రగామిగా నీరాజనాలందుకునేందుకు ఎయు అర్హత కలిగిందేనన్నారు. చారిత్రక నేపథ్యంలో దేశ,విదేశాల్లో ఖ్యాతి గడించిన యూనివర్శిటీలతో పోటీపడి ర్యాంకులను సాధించిన ఘనత ఎయుకు ఉందన్నారు. నాక్ బృంద సభ్యులు మూడు బృందాలుగా విడిపోయి వర్శిటీలో అన్ని విభాగాలను సందర్శించారు. ఒక బృందం ఆర్ట్ కళాశాలను సందర్శించగా, మరో బృందం సైన్స్ కళాశాలను సందర్శించింది. మరో బృందం కాకినాడలోని పిజి సెంటర్‌ను సందర్శించింది. అనంతరం మధ్యాహ్నం విజయనగరంలోని పిజి కళాశాలతో పాటు వర్శిటీ సైన్స్ కళాశాలను సందర్శించారు. వర్శిటీలో విద్యార్థుల వసతి గృహాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నుంచి వినతులు స్వీకరించారు. విభాగాల సందర్శనతో పాటు వర్శిటీ ప్రగతిని సమీక్షించారు.

విశాఖలో ఐఐహెచ్ అండ్ టిఎంను నెలకొల్పాలి
* కేంద్ర పర్యాటకశాఖామంత్రికి టిఎస్సార్ లేఖ
విశాఖపట్నం, జనవరి 19: ఆసియా ఖండంలోనే అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందుతోన్న విశాఖనగరంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ (ఐఐహెచ్ అండ్ టిఎం)ను నెలకొల్పాల్సిందిగా కోరుతూ రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖామంత్రి (ఇండిపెండెంట్) డాక్టర్ మహేష్‌శర్మకు లేఖ రాశారు. సముద్ర, వాయు, రహదారి, రవాణా వ్యవస్థలో మెరుగైన సదుపాయాలు కలిగి ఉండే విశాఖ పర్యాటకంగాను అభివృద్ధిచెందుతోందన్నారు. అందువలన తరచూ విదేశీ పర్యాటకులు ప్రకృతి, సహజసిద్ధమైన తూర్పు కనుమలు, సముద్రతీర ప్రాంతాలు సందర్శనకు వస్తుంటారని పేర్కొన్నారు. ఇంతటి ప్రాముఖ్యత నగరంగా ఉన్న విశాఖలో గిరిజన బాలురు ఉన్నారని, అందువల్ల వీరికి శిక్షణిస్తే ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడతాయన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, దీనిని దృష్టిలోపెట్టుకుని ఐఐహెచ్ అండ్ టూరియన్ మేనేజ్‌మెంట్‌ను విశాఖలోనే నెలకొల్పితే తగిన అందరికీ ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

గిరిజనులపై పోలీసుల వేధింపులు
* సిపిఎం రాష్టక్రార్యదర్శివర్గ సభ్యులు నరసింగరావు
విశాఖపట్నం, జనవరి 19: గిరిజనులపై మావోయిస్టుల ముద్ర వేస్తూ పోలీసులు వీరిని తరచూ వేధిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సిహెచ్.నర్సింగరావు ఆరోపించారు. జగదాంబ జంక్షన్ యల్లమ్మతోట పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న గిరిజనులను పోలీసులు పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఇటీవల జెర్రెల సర్పంచ్ సాగి వెంకరరమణను మావోయిస్టులు చంపిన తరువాత గిరిజన యువకులను గిరిజనులై పోలీసులు దమనకాండకు పాల్పడుతున్నారన్నారు. స్థానిక యువకులను పోలీసులు విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. ఈ నేపధ్యంలోనే 8వ తేదీన పోలీసులు బాక్సైట్ ప్రభావిత గ్రామాల్లో ఇళ్ళలోకి వెళ్ళి 60 మందికిపైగా గిరిజనులను నిర్భందించారన్నారు. వీరిలో కేసులు పెట్టిన 12 మందిని 14వ తేదీ వరకరు ఎక్కడ ఉన్నారో కూడా పోలీసులు వారి కుటుంబ సభ్యులకు తెలియజేయలేదన్నారు. చివరకు ఎస్సీ,ఎస్టీ కమిషన్ జోక్యం చేసుకున్న తరువాతనే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టులు చూపించారని పేర్కొన్నారు. దీంతో వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వీరంతా విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నారన్నారు. విశాఖ ఏజెన్సీలో ఎలాగైనా బాక్సైట్ తవ్వకాలు జరపాలన్న ఉద్ధేశ్యంతోనే ప్రభుత్వం పోలీసుల ద్వారా దమనకాండ చేయిస్తోందన్నారు. ప్రజలు ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేయకుండా ప్రభుత్వం రాష్ట్రంలో అప్రటికత ఎమెర్జన్సీ వాతావరణం నెలకొనేలా చేస్తుందన్నారు. ఏజెన్సీలోని 300 గ్రామాల్లో పోలీసులు కూంబింగ్ పేరుతో గిరిజనులకు వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. సీపిఎం జిల్లా కార్యదర్శి లోకనాధం మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన గిరిజనులను పోలీసులు తక్షణమే విడుదల చేయాలన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం కొనసాగుతుందన్నారు. పలువురు గిరిజనులు ఇందులో పాల్గొన్నారు.

బలవంతపు భూ సేకరణ నిలిపివేయాలి
* కలెక్టరేట్ వద్ద సిఐటియు నిరసన
విశాఖపట్నం, జనవరి 19: రైతుల నుంచి బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద సిఐటియు రైతు సంగాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1982 నజవరి 19న అఖిల భారత సార్వత్రిక సమ్మె జరిగిందని, ఆ రోజు పలు రాష్ట్రాల్లో జరిగిన పోలీసు కాల్పుల్లో కనీసం పది మంది అమరులయ్యారన్నారు. కనీస వేతనాలు 15 వేలుగా నిర్ణయించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కార్మికులకు రెండు వందల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు పలు డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలనికోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న, సీఐటియు కార్యదర్శి నరసింహాం, సీఐటియు నగర కార్యవర్గ సభ్యులు పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

తగ్గని రద్దీ...
* రైళ్ళు, బస్సులు అంతే...
* లభించని బెర్తులు...దళారీలదే రాజ్యం
విశాఖపట్నం, జనవరి 19: తిరుగు ప్రయాణికులతో బస్సులు, రైళ్ళు విపరీతమైన రద్దీతో నడుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా రద్దీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు ఎన్ని నడుస్తున్నా చాలని పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ బస్సులకు దీటుగా ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. సౌకర్యాలను ఎరగా చూపి మరీ అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. సర్‌చార్జి పేరుతో చార్జీలు వసూలు చేస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో విశాఖ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణాలు చేస్తున్నారు. విశాఖ-హైదరాబాద్‌ల మధ్య దాదాపు 100 బస్సులు నడుపుతున్నా, ఇందులో అన్నింటికీ డిమాండ్ ఏర్పడింది. ముందు రోజు నుంచి రిజర్వేషన్ టికెట్లకు డిమాండ్ నెలకొంది. విశాఖ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, తిరుపతి ప్రాంతాలతోపాటు కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, కావలి తదితర ప్రాంతాలకు వెళ్ళే డీలక్స్, గరుడ+, ఏసిలు నాన్ ఏసిలు సైతం రద్దీగా నడుస్తున్నాయి. దీంతో ప్రతిరోజు ఆర్టీసీకి కోటి రూపాయలు తక్కువ లేకుండా ఆదాయం వస్తోంది. అలాగే విశాఖ నుంచి దాదాపు 50 ప్రత్యేక రైళ్ళు నడుస్తుండగా ఇవి కాకుండా ప్రతిరోజు 90కి పైగా సూపర్‌పాస్ట్‌లు, ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ళు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వేసవి సీజన్ వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు రిజర్వేషన్ బెర్తులు నిండిపోయాయి. ప్రస్తుతం అన్నింటిలోను చాంతాడంత వెయిటిలింగ్ లిస్ట్ చూపుతోంది. రద్దీగా నడుస్తోన్న రైళ్ళు విశాఖకు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. మరో రెండు రోజులవరకు రైళ్ళు, ఆర్టీసీ బస్సుల రద్దీ తప్పదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

సి.ఎం దత్తత గ్రామాల్లో రోడ్లు
అరకులోయ, జనవరి 19: ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ రహదారుల అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు కోట్ల ఒక లక్ష రూపాయల నిధులతో ఇంటర్నల్, ఎప్రోచ్ సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగు శాఖ పర్యవేక్షణలో 20 హేబిటేషన్లలో ఇంటర్నల్ రోడ్లు, ఏడు హేబిటేషన్లలో ఎప్రోచ్ సిమెంట్ రోడ్లు నిర్మించాలని ఇంజనీరింగు అధికారులు నిర్ణయించారు. ఈ రహదారి నిర్మాణ పనులు మార్చి నెలాఖరునాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. దీంతో మొదటి విడతగా పలు గిరిజన గ్రామాల్లో ఇంటర్నల్, ఎప్రోచ్ సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి దత్తత గ్రామాల్లో అభివృద్ధి పనులు ఒక్కొక్కటీ ప్రారంభమవుతున్నాయి. పలు గ్రామాల్లో బోరు బావులు ఏర్పాటు చేసిన అధికార ఘనం ప్రస్తుతం రోడ్ల నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యింది. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

అరకులోయ గజగజ
అరకులోయ, జనవరి 19: ఆంధ్రా ఊటీ అరకులోయ గజగజ వనికిపోతుంది. సాయంత్రం నుంచే గజగజలాడే పరిస్థితి ఎదురవుతోంది. నిండా దుప్పటి ముసుగేసుకుంటే తప్ప ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. దట్టమైన పొగమంచు కురుస్తుండడంతో క్రమంగా చలి పెరుగుతోంది. గతం వారం రోజులుగా చలి గాలులు బలంగా వీస్తుండడంతో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా అరకులోయ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోతున్నాయి. పర్యాటక కేంద్రంపై పులి పంజా విసురుతుండడంతో స్థానికులు, పర్యాటకులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. రోజురోజుకూ వీరి పరిస్థితి దయనీయంగా మారింది. చలి గాలుల భారి నుంచి తప్పించుకొనేందుకు కొందరు చలి మంటలు వేసుకుంటుండగా మరికొంత మంది ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. శీతల గాలులు తీవ్రంగా వీస్తుండడంతో చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపధ్యంలో కొందరు తమ పనులను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయను సందర్శించే పర్యాటకులు దట్టమైన పొగ మంచు, ఆపై ఎముకలు కొరికే చలి గాలుల మధ్య ఆహ్లాద బరితంగా గడుపుతున్నారు. హిమ సోయగాలులను ఆస్వాదిస్తూ సందడి చేస్తున్నారు. మంచు ముసుగులో చాయా చిత్రాలను తీసుకొనేందుకు పోటీ పడుతున్నారు. అదేవిధంగా ప్రకృతి ప్రసాధించిన సుందర దృశ్యాల మధ్య సినిమా షూటింగ్‌లు జరుపుతున్నారు. ఈ మధ్య కాలంలో పలు చిత్రాల చిత్రీకరణ జోరు ఇక్కడ పెరిగింది.

నైట్ హాల్ట్ సర్వీసును పునరుద్ధరించాలి
ముంచంగిపుట్టు, జనవరి 19: విశాఖపట్నం నుంచి జోలాపుట్టు నైట్ హాల్ట్ బస్సు సర్వీసును గత 15 రోజుల నుంచి రద్దు చేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ నైట్‌హాల్ట్ బస్సు సర్వీసు జోలాపుట్టు నుంచి మండల కేంద్రానికి ఉదయం 7 గంటల సమయంలో అందుబాటులో ఉండేదని, ఆ బస్సులోనే పెదబయలుకు వెళ్లే 40 మంది కానె్వంట్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు ప్రయాణాలు సాగిస్తున్నారని, ఆర్.టి.సి అధికారులు అర్థాంతరంగా రద్దు చేయడంతో ఆ సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విశాఖపట్నంకు చెందిన ఆర్.టి.సి బస్సు రద్దు చేసినప్పటికీ పాడేరు ఆర్.టి.సి అధికారులు కూడా బస్సును కొనసాగించకపోవడంతో ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నామని వారు అంటున్నారు. ఇప్పటికైనా విశాఖ-పాడేరు డిపోలకు చెందిన ఆర్.టి.సి అధికారులు నైట్ హాల్ట్ బస్సు సర్వీసును పునరుద్దరించాలని వారు కోరుతున్నారు.

నేటి నుంచి పీసా కమిటీలకు శిక్షణ
పాడేరు, జనవరి 19: విశాఖ ఏజెన్సీలోని పీసా కమిటీల అధ్యక్ష, కార్యదర్శులకు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 11వ తేది వరకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎం.హరినారాయణన్ మంగళవారం విలేఖరులకు తెలిపారు. మండల అభివృద్ధి అధికారుల నేతృత్వంలో మండల పరిషత్ కార్యాలయాల్లో శిక్షణ తరగతులను నిర్వహించి పీసా చట్టంపై అవగాహన కల్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 20,21వ తేదీలలో అనంతగిరి మండల కేంద్రంలోనూ, 22,23 తేదీలలో అరకులోయ, 27,28న డుంబ్రిగుడ, 29.30న హుకుంపేట, వచ్చే నెల 2,3 తేదీలలో పెదబయలు, 4,5న ముంచంగిపుట్టు, 9,10న పాడేరు, 11,12న జి.మాడుగుల, మార్చి 2,3 తేదీలలో చింతపల్లి, 4,5న గూడెంకొత్తవీధి, 8,9న కొయ్యూరు, 10,11 తేదీలలో నాతవరం మండలంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. ఈ శిక్షణా తరగతుల్లో పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులకు కూడా పీసా చట్టాన్ని సమర్థంగా అమలు చేసే విధంగా అవగాహన కల్పిస్తామని హరినారాయణన్ చెప్పారు.

ట్రైకార్ లబ్ధిదారులకు రేపు ఇంటర్వ్యూ
పాడేరు, జనవరి 19: 2015-16 ఆర్థిక సంవత్సరంలో ట్రైకార్ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న పాడేరు మండలంలోని లబ్ధిదారులకు ఈ నెల 21వ తేదిన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఎం.పి.డి.ఒ. డి.గుణలక్ష్మి తెలిపారు. పాడేరు మండలంలో ఉన్న వివిధ బ్యాంకు అధికారుల సమక్షంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరయ్యే లబ్ధిదారులు ఆన్‌లైన్ దరఖాస్తు, కుల దృవీకరణ, రేషన్ కార్డు, ఆధార్, విద్యార్హతల దృవపత్రాల నకళ్లను మూడు కాపీలు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు మూడు, వాహనాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారు డ్రైవింగ్ లైసెన్స్, వికలాంగులైతే వికలాంగ దృవీకరణ పత్రాలను తమ వెంట తీసుకురావాలని ఆమె సూచించారు.

హమాలీల సమస్యలు పరిష్కరించాలి
జి.మాడుగుల, జనవరి 19: గిరిజన సహకార సంస్థలో పనిచేస్తున్న హమాలీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఎ.ఐ.టి.యు.సి. జిల్లా అధ్యక్షుడు వి.పండుబాబు కోరారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జి.సి.సి.లో సంవత్సరాల తరబడి హమాలీలుగా పనిచేస్తున్న వారికి శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని చెప్పారు. చంద్రన్న సంక్రాంతి కానుక సరుకుల పంపిణీలో కూడా వేతనాల చెల్లింపులో తీవ్ర వ్యత్యాసం చూపించారని ఆయన అన్నారు. జి.మాడుగుల మండలంలో పనిచేస్తున్న హమాలీలకు చంద్రన్న సంక్రాంతి కానుక సరుకుల పంపిణీలో క్వింటాకు రెండు రూపాయలు చెల్లిస్తే, పాడేరు ప్రాంతంలో పనే్నండు రూపాయలు చెల్లించారని ఆయన చెప్పారు. జి.మాడుగులలో జి.సి.సి. అధికారులు హమాలీల శ్రమ దోపిడీకి పాల్పడి వారికి తీరని అన్యాయం చేసారని ఆయన ఆరోపించారు. హమాలీలకు చెల్లించాల్సిన వేతనాలను కూడా అధికారులు స్వాహా చేసారని ఆయన అన్నారు. అరకులోయ జి.సి.సి. గోదాము ప్రాంగణంలో ఈ నెల 25న జిల్లాలోని హమాలీలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు హమాలీలంతా తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.

సేంద్రియ వ్యవసాయంతో అధిక ఆదాయం
కొయ్యూరు,జనవరి 19: సేంద్రియ వ్యవసాయ సాగు వలన అధిక దిగుబడులు సాధించడమే కాకుండా రైతాంగానికి ఆర్ధికంగా మేలు చేకూరుతుందని మండల వ్యవసాయ విస్తరణాధికారి రాజారావు సూచించారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి, బలుసుకూరపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఇఓ మాట్లాడుతూ రైతులంతా ఆధునిక వ్యవసాయ పద్దతులను పాటిస్తూ ఆధునిక వ్యవసాయ పరికరాలను వినియోగించుకోవాలన్నారు. మట్టి పరీక్షల ద్వారా కలిగే మేలును వివరించారు. మట్టి పరీక్షల వలన ఏ ఏఏ ఎరువులు ఎంత మోతాదులో అవసరమో తెలియడం ద్వారా తద్వారా ఎరువులను వినియోగిస్తూ ఆర్ధికంగా రైతాంగం నిలదొక్కుకోవచ్చన్నారు. ఆధునిక పరికరాల వినియోగం, సేంద్రియ ఎరువుల వాడకం, భూసార పరీక్షల ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను సాధించి ఆదాయాన్ని పొందేందుకు వీలుంటుందని రైతాంగాని వివరించారు. ఆయా గ్రామాల్లోని మట్టి నమూనాలను సేకరించారు. రైతులకు రబీ పంటల సాగుపై తగు సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఇఓలు కృపామణి, సత్యనారాయణలతో పాటు ఆయా గ్రామాల రైతాంగం పాల్గొన్నారు.

దిగుబడి తగ్గిన పుచ్చకాయలు
కోటవురట్ల, జనవరి 19: ఈ ఏడాది పుచ్చకాయలు (వాటర్ మిలాన్) దిగుబడి ఆశాజనకంగా లేకపోయినా మార్కెట్‌లో ధర బాగుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో కొడవటిపూడి, కె వెంకటాపురం, చినబొడ్డేపల్లి, పి.కొత్తపల్లి తదితర గ్రామాల్లో ఈ సీజన్‌లో 200 హెక్టార్లలో రైతులు పుచ్చ తోటలను సాగు చేస్తున్నారు. ముందుగా పుచ్చ తోటల సాగును చేపట్టడంతో సీతాకాలంలోనే పుచ్చకాయలు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం టన్ను పుచ్చకాయల ధర 6,100 రూపాయల ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. ఎకరం విస్తీర్ణంలో పెట్టుబడి పోను ఏకరానికి 20 వేల రూపాయల వరకు ఆదాయం ఉంటుందని పుచ్చసాగు చేస్తున్న రైతులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లోకి అంతంత మాత్రంగానే పుచ్చకాయలు వస్తుండడంతో ధర ఆశాజనకంగా ఉంది. మార్చి నెలలో మార్కెట్‌లోకి ఇబ్బడి ముబ్బడిగా పుచ్చకాయలు వచ్చే అవకాశం ఉండడంతో రేటు బాగా తగ్గిపోతుందని వ్యాపారులు తెలిపారు. పుచ్చ తోటలకు ఈ ఏడాది వైరస్ సోకడంతో దిగుబడితో పాటు నాణ్యత కూడా తగ్గిందని కొడవటిపూడికి చెందిన రైతు మాణిక్యం తెలిపారు.

చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు ప్రతిపాదనలు
మాకవరపాలెం,జనవరి 19: మండలంలో భారీ వర్షాలకు మరమ్మతులకు గురైన చెక్‌డ్యామ్‌లను ఎంపిడిఓ ఉదయశ్రీ, ఎపిఓ యరకయ్య మంగళవారం పరిశీలించారు. మండలంలోని పాపయ్యపాలెం, పైడిపాల, తాడపాల, తూటిపాల, పెద్దిపాలెం, లచ్చన్నపాలెం గ్రామాల్లో తుపాను వలన ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్న చెక్‌డ్యామ్‌లు కోతకు గురయ్యాయి. వీటిని మరమ్మతులు చేయించేందుకు ఒక్కొక్క చెక్‌డ్యామ్‌కు రెండు నుంచి నాలుగు లక్షల వరకు నిధులు మంజూరు చేసేందుకు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ పై గ్రామాల్లో చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు ఇప్పటికే కొన్నింటికి నిధులు మంజూరయ్యాయని, మిగిలిన వాటికి కూడా నిధులు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసేందుకు వీటిని పరిశీలించామని చెప్పారు.

1వ యూనిట్ నుంచి నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి
సీలేరు, జనవరి 19: స్థానిక జల విద్యుత్ కేంద్రంలో ఒకటో యూనిట్ మరమ్మతులకు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ జల విద్యుత్ కేంద్రంలో 60 మోగా వాట్లు ఉత్పత్తి చేసే నాలుగు యూనిట్లున్నాయని, ఇందులో 1వ యూనిట్ ఎలక్ట్రికల్ ట్రేటర్ ఎర్త్ మరమ్మతులకు గురి కావడంతో దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, మిగతా 2,3,4 యూనిట్లు నుంచి విద్యుత్ ఉత్పత్తి నిరాటకంగా జరుగుతుందన్నారు. ఒకటో యూనిట్ మరమ్మతు పనుల నిమిత్తం మార్దర్ కంపెనీకి ఈపనులు అప్పగించామని, వారు పనులు ప్రారంభించారన్నారు. ఈ పనులు పూర్తయ్యేందుకు వారం రోజులు పడుతుందని, మిగతా యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. సోమవారం ఒక్కరోజు మూడు యూనిట్లు నుంచి 2.04 మిలియన్ యూనిట్లు విద్యుత్ చేశామని తెలిపారు. మార్చి చివరి వరకు విద్యుత్ ఉత్పత్తికి నీటి నిల్వలున్నాయని, ఎటువంటి సమస్యలు తలెత్తవన్నారు. గోదావరి డెల్టాకు నీటిని ఇవ్వడంతో ఏప్రిల్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.

రోహిత్ మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలి
* ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
నర్సీపట్నం,జనవరి 19: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన ఎబివిపి, బిజెపి నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కమిటీ కార్యదర్శి ఎ ఓంకార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛను ఏ మాత్రం సహించలేని మతోన్మాద శక్తులు ఒక్కక్షణం కూడా అధికారంలో ఉండటానికి వీలు లేదన్నారు. రోహిత్ మరో నలుగురు విద్యార్థులను యూనివర్శిటీ నుండి బహిష్కరణకు గురి చేసిన హెచ్‌సివి అధికారులను కూడా విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రోహిత్‌ను కనీసం పరామర్శించని వైస్ ఛాన్సలర్ అప్పారావును డిస్మస్ చేయాలన్నారు. మతతత్వ వాదుల ఆగడాలు ఇలాగే కొనసాగితే దేశం కులాల వారీగా, మతాల వారీగా చీలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువకులు, మేధావులు, ప్రజాతంత్ర వాదులు, మతోన్మాదుల ఆగడాలపై గళం విప్పాల్సిన సమయం అసన్నమైందని ఓంకార్ పేర్కొన్నారు. రోహిత్ మరణ సంఘటనను ఖండించాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
* మంత్రి అయ్యన్నకు వైద్యమిత్ర కార్యకర్తలు వినతి
నర్సీపట్నం, జనవరి 19: ఎన్టీఆర్ వైద్య మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని పలువురు వైద్యమిత్ర కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మంత్రి స్వగృహంలో అయ్యన్నను పలువురు వైద్యమిత్ర కార్యకర్తలు కలిసి సమస్యలను విన్నవించారు. ఆరోగ్యమిత్రలుగా గత ఎనిమిదేళ్ళుగా పని చేస్తున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తమ పేర్లను ఎన్టీఆర్ వైద్యమిత్రలుగా మార్చారన్నారు. ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్నామన్నారు. ఎఎన్‌ఎం, డిగ్రీ ద్వారా డిఆర్‌డిఎలో పరీక్ష రాసి క్వాలిఫై అయి విధుల్లో చేరామన్నారు. తాజాగా విద్యార్హతలు సరిపోవని బిఎస్సీ నర్సింగ్, జిఎన్‌ఎంలను మాత్రమే తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొనడం సరైంది కాదన్నారు. ఆరోగ్యమిత్రలుగా పని చేస్తూ ప్రపంచ స్థాయిలో 12 అవార్డులు అందుకున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం తమ పనితీరును పరిగణలోకి తీసుకుని ఉద్యోగాల్లో కొనసాగించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలని వైద్యిమిత్ర కార్యకర్తలు మంత్రి అయ్యన్నపాత్రుడిని కోరారు.

ఆస్తి తగాదాలతో అన్నను హత్య చేసిన తమ్ముడు
సీలేరు,జనవరి 19: ఆస్తి తగాదాల కారణంగా అన్నను తమ్ముడు హత్య చేసిన సంఘటన మాదిగమల్లు గ్రామంలోచోటు చేసుకుంది. ఈసంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జి.కె.వీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ మాదిగమల్లు గ్రామానికి కూలంగి పురుషోత్తంను తమ్ముడు జగబందు ఆదివారం రాత్రి హత్య చేసాడు. గత కొద్ది రోజుల నుంచి వీరి మధ్య భూతగాదాలున్నాయి. అన్న పురుషోత్తం ఎనిమిది ఎకరాలు మాదిగమల్లులో సాగు చేస్తున్నాడు. జగబందు కొయ్యూరులో నివాసం ఉంటూ ఏడెకరాల పొలం సాగు చేసుకుంటున్నాడు. వీరిద్దరికీ 15 ఎకరాల ఎకరాల భూమి ఉండడంతో దీనిని పంపకాలు చేయమని తమ్ముడు తరచూ అన్నపై వత్తిడి తెచ్చేవాడు. ఈనేపధ్యంలో ఆదివారం రాత్రి గొడవ వివాదంగా మారడంతో మద్యం మత్తులో ఉన్న జగబందు అన్న పురుషోత్తంను వేట బాణాలతో హతమార్చాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.అనంతరం బంధువులు సీలేరు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై ఎస్సై జి. సత్యనారాయణ కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నారు. పురుషోత్తం మృత దేహాన్ని సీలేరులో పంచనామా చేసి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై వి. సత్యనారాయణ తెలిపారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
పాయకరావుపేట,జనవరి 19: సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఎమ్మెల్యే వి అనిత కోరారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ దేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భరంగా ఆమె మాట్లాడుతూ పింఛన్లు, ఇళ్ళు, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పథకంలో ఇళ్ళు నిర్మించుకునేందుకు గ్రామాల్లో అధిక సంఖ్యలో అర్హులైన వారు ఉన్నందున ఆమేరకు ఇళ్ళు మంజూరయ్యేలా కృషి చేయాలని పలువురు నాయకులు ఎమ్మెల్యేను కోరారు. సమావేశంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు, కొప్పిశెట్టి వెంకటేష్, లాలం కాశీనాయుడు, తనే్నరు ఎరకయ్య, పట్టణ దేశం పార్టీ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావుతో పాటు నాలుగు మండలాలకు చెందిన సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మతోన్మాదానికి విద్యార్థులు బలి కావడం దురదృష్టం
పాయకరావుపేట,జనవరి 19: మతోన్మాదానికి అమాయకులైన విద్యార్థులు బలి కావడం దురదృష్టకరమని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి డి వెంకట్రావు అన్నారు. మంగళవారం కాకినాడలో జరిగిన డిహెచ్‌పిఎస్ రాష్ట్ర రెండవ మహాసభలకు పాయకరావుపేట నుండి జిల్లా శాఖ అధ్యక్షుడు వి శివప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు దళిత నాయకులు తరలివెళ్ళారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మృతిపై తక్షణమే దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యులైన కేంద్ర మంత్రులను పదవులను నుండి బర్తరఫ్ చేయాలన్నారు. లేకుంటే బిజెపి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సక్రమంగా అమలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిహెచ్‌పిఎస్ నాయకులు బోడపాటి అప్పారావు, వి సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.

బాలింత మృతిపై ఉన్నతాధికారులకు నివేదిక
చింతపల్లి, జనవరి 19: బాలింత మృతిపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని చింతపల్లి క్లష్టర్ అధికారి శర్మ అన్నారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ బలభద్రం గ్రామానికి చెందిన చిన్నారి అనే మహిళ ప్రసవం నిమిత్తం చింతపల్లి ఆసుపత్రికి ఈనెల 17న వచ్చిన విషయం తెలిసిందే. ప్రసవ అనంతరం రక్తస్త్రావం ఆగకపోవడంతో వైద్యులు నర్సీపట్నం తరలించారు. మార్గ మధ్యలో బాలింత మృతిచెందడంపై పలు అనుమానాలు వస్తున్న నేపధ్యంలో ఆస్తికలు కోసం వెళ్ళిన కుటుంబీకులకు కత్తెర్లు దొరకడంపై మరింత అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపధ్యంలో చింతపల్లి క్లష్టర్ అధికారి శర్మ, తాజంగి వైద్యాధికారిణి కుసుమ పావని వైద్యుల బృందం బలభద్రం గ్రామానికి విచారణ నిమిత్తం వెళ్ళారు. అప్పటికే ఆగ్రహించిన కుటుంబీకులు, గ్రామస్థులు ప్రసవం నిర్వహించిన వైద్యులను తమ గ్రామానికి తీసుకువస్తే కాని విచారణ జరుగనీయమని హెచ్చరించి వెనక్కి పంపించారు. దీనిపై క్లష్టర్ అధికారి శర్మ పూర్తి విచారణ నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదించిన తరువాత విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు.