నల్గొండ

వచ్చేనెల 15 నుండి ఉపాధి కార్మికులకు 20శాతం కూలీ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, జనవరి 21: రానున్న వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉపాధిహామీ కార్మికులకు వచ్చేనెల 15 నుండి ఇరవైశాతం కూలీ అదనంగా చెల్లించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. సత్యనారాయణరెడ్డి అన్నారు. మండలంలోని జనంపల్లి, ఉత్తటూరు, ఇస్కిళ్ల గ్రామాలలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద నిర్వహిస్తున్న పలు పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఆయా గ్రామాలలోని పనులు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాలలోని కూలీలు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. రోజంతా కష్టపడినా తమకు అరవైరూపాయల కూలీకూడ గిట్టుబాటు కావడం లేదని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లకుండా నివారించడానికే ప్రభుత్వం ఉపాధిహామీ పథకం అమలు చేస్తుందని అన్నారు. కూలీలు కాలయాపన చేయకుండా పనులను సత్వరం పూర్తిచేసుకుంటే గిట్టుబాటు కూలీ లభిస్తుందని అన్నారు. కఠినమైన పనులను ఒకటే గ్రూపునకు కాకుండా అన్ని గ్రూపులకు కేటాయించాలని సూచించారు. వచ్చే వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కూలీలకు ఇరవైశాతం వేతనాలు పెంచడం జరుగుతుందని అన్నారు. అనంతరం ఆయా గ్రామాలలో నిర్వహిస్తున్న ఉపాధిహామీ పనుల వివరాలను, కూలీల వేతనాల రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట డ్వామా పిడి దామోదర్, ఏపిడి సంగీతలక్ష్మీ, ఎంపిడివో జానకిరెడ్డి, ఎంపిపి కక్కిరేణి ఎల్లమ్మవిజయ్, జెడ్పీటిసి జినుకల వసంతాప్రభాకర్, సర్పంచ్‌లు పోచబోయిన మల్లేషం, గెగ్గెనపల్లి యాదిరెడ్డి, ఎంపిటిసి బండ పద్మాదామోదర్‌రెడ్డి, ఏపిఎం ఈశ్వరయ్య, సాక్షరభారతి కోఆర్డీనేటర్ బత్తుల వెంకటేశం తదితరులు ఉన్నారు.

కల్లు మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
దేవరకొండ, జనవరి 21: చందంపేట మండలం తిమ్మాపురం గ్రామంలో బుధవారం విషపూరితమైన కల్లును సేవించి మృతి చెందిన నోముల రాములు కుటుంబసభ్యులను ఎమ్మెల్యే రవీంద్రకుమార్ గురువారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో ఉన్న రాములు మృతదేహాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. విషపూరితమైన కల్లును తాగి రాములు మృతి చెందడమే గాక అతని ఇద్దరు కుమారులు వెంకటయ్య, శ్రీనయ్య, గీతకార్మికుడు కుంభం లక్ష్మయ్యలు తీవ్ర అస్వస్థతకు గురి కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లు విషతుల్యం కావడం యాదృచ్చికంగా జరిగిందా లేక ఎవరైనా కల్లులో ఉద్దేశపూర్వకంగా విషాన్ని కలిపారా అన్నది పోలీస్‌లు విచారణ చేసి వాస్తవాలను నిగ్గుతేల్చాలని ఆయన కోరారు. రాములు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రాములు కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో దేవరకొండ జడ్పీటీసి ఆలంపల్లి నర్సింహ్మ, సిపి ఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, చందంపేట మాజీ జడ్పీటీసి బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, మండల పార్టీ కార్యదర్శి యాసాని పాండురంగారావు తదితరులు ఉన్నారు.