విశాఖపట్నం

భూ కుంభకోణంలో రాజకీయ కోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 22: అనూహ్యంగా రాజుకున్న విశాఖ భూ కుంభకోణం అనేక మలుపులు తిరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు సై అంటే సై అనుకునే పరిస్థితిని తెచ్చింది. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో విశాఖ నగరం దద్దరిల్లిపోతోంది. భూ కుంభకోణంతో సంబంధం అధికార పార్టీ వారికి సంబంధం ఉందో, లేదో తెలియదు కానీ, వారికి తెలియకుండానే తమ్ముళ్లు నిందితులైపోయారు. లక్ష ఎకరాల భూమి, 20 వేల కోట్ల రూపాయల కుంభకోణం అంటూ కలెక్టర్ చేసిన ప్రకటన అధికార పార్టీ నేతల కొంప ముంచింది. దానికి మంత్రి అయ్యన్న ఆజ్యం పోశారు. మరో మంత్రి గంటా నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాసి, వ్యవహారాన్ని పీకల దాకా తెచ్చుకున్నారు. ఇవన్నీ ప్రతిపక్షానికి కలిసొచ్చాయి. అధికార పార్టీ కుంభకోణం ఊబిలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టడానికి విపక్షాలన్నీ ఏకమై ప్రతిపక్ష పోరాటానికి మద్దతు ఇచ్చాయి. అధికార పార్టీ గుక్క తిప్పులేని స్థితిలో ఉండడంతో టిడిపియేతర పార్టీలన్నీ ఏకమై స్వరాన్ని పెంచాయి. ఇప్పుడు టిడిపికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. భూ కుంభకోణంలో తెలుగుదేశం నేతల పాత్ర ఏపాటిదో తెలియదు. కానీ జిల్లాలో పార్టీ బదనం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేందుకు అర్బన్ అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నాలు పార్టీకి బెడిసికొడుతున్నాయి. జగన్ సభ రోజునే సంకల్ప సభ నిర్వహించాలని అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి ఇచ్చిన పిలుపును పార్టీ నేతలెవ్వరూ అందుకోలేదు. ఆయన నిర్ణయం తప్పని వేలెత్తి చూపారు. విధిలేని స్థితిలో ఆ కార్యక్రమాన్ని 24కు వాయిదా వేసుకున్నారు. ఇలా చేతులు కాల్చుకున్న అధికార పార్టీ నేతలు గురువారం జగన్ సభ జరిగిన తరువాత మళ్లీ బయటకు వచ్చి ఆ స్థలాన్ని శుద్ధి చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇటువంటి చర్యలు పార్టీని ప్రజల్లో చులకన చేసేవిగా కనిపిస్తున్నాయి.
విశాఖ భూ కుంభకోణం వైకాపాకు బ్రేక్ ఇచ్చింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని చంద్రబాబును కార్నర్ చేయడానాకి జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. గురువారం విశాఖలో మహా ధర్నాకు భారీగానే జనం తరలి వచ్చారు. ఈ కుంభకోణాన్ని ఆయుధంగా చేసుకుని తెలుగుదేశంపై యుద్ధం చేయడానికి వైకాపా సిద్ధమవుతోంది. గురువారం ధర్నాతో వైకాపాలో జోష్ పెరిగింది. ఈ సభలో జగన్ చంద్రబాబు సహా మంత్రులు, అధికార యంత్రాంగంపై ఒంటి కాలిపై లేచారు. రెండేళ్లలో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, భూ కుంభకోణంలో ఇరుక్కున్న వారందరికీ జైలు జీవితం తప్పదంటూ చేసిన ప్రసంగంతో తెలుగు తమ్ముళ్లు అసహనానికి గురయ్యారు. ముదపాక భూ కుంభకోణంలో అక్కడి ఎమ్మెల్యే బండారు హస్తం ఉందని ఎంపి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఎమ్మెల్యే బండారు గురువారం స్పందిస్తూ, ఆరోపణలు రుజువు చేయకపోతే చెప్పుతో కొడతానని అన్నారు. టిడిపియేతర పార్టీలన్నీ కలిసి, టిడిపిపై దాడి చేయడాన్ని ఆ పార్టీ నేతలు సహించలేకపోతున్నారు. విశాఖలో పార్టీ బజారున పడినా రాజకీయ దురంధరుడు చంద్రబాబు జోక్యం చేసుకుని, నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. విశాఖ భూ కుంభకోణంలో తెలుగుదేశం వారి పాత్ర లేదని చెప్పడానికి ఆయన సాహసించలేకపోతున్నారు. అన్ని విధాలా ఇరకాటంలో పడిన అధికార పార్టీని మరింత కార్నర్ చేయడానికి వైకాపా చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ సఫలీకృతమవుతాయో చూడాలి.

ముదపాక కథ ముగిసినట్టే!
విశాఖ భూ కుంభకోణంలో బాధితులకు ఎంత వరకూ న్యాయం జరుగుతుందో తెలియదు. భూ కుంభకోణం ఏ రేంజ్ ఉందో..ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో కూడా తెలియదు. కానీ ముదపాక రైతులు మాత్రం బాగుపడే అవకాశాలు కనుచూపుమేరలో కనిపిస్తున్నాయి. ముదపాకలోని సుమారు వెయ్యి ఎకరాల అసైన్డ్ భూమిని చేజిక్కించుకునేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ భూమిని అడ్డగోలుగా స్వాధీనం చేసుకునేందుకు కొంతమంది పెద్ద మనుషులు రైతుల మధ్య చిచ్చుపెట్టారు. అత్యంత విలువైన ముదపాక భూమిని చౌకగా కొట్టేసేందుకు హైదరాబాద్ వ్యక్తులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గత ఏడాది జూన్‌లో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం అండతో ముదపాక భూములను కాజేసేందుకు కనే్నశారు. ఎకరా పది లక్షలకు కొనుగోలు చేస్తామని రైతులకు డబ్బు ఎర చూపారు. లక్ష రూపాయల అడ్వాన్స్ ఇచ్చి, దస్తావేజులపై సంతకాలు చేయించుకున్నారు. ఇచ్చిన లక్ష రూపాయలు ఖర్చుపెట్టేసిన రైతులు, వచ్చే తొమ్మిది లక్షల కోసం ఎదురు చూస్తున్నారు. భూములు ఇవ్వని రైతుల పొలాల మీదుగా రోడ్లు వేశారు. పచ్చని చెట్లను నేలకూల్చారు. విశాఖలో భూ సమీకరణ చేయడానికి ప్రభుత్వం 304 జిఓను కూడా జారీ చేసింది. భూస్వాములు ముదపాకలో చేసిన దందా, వారికి ప్రభుత్వం సహకరించిన వైనం అంతా బయటకొచ్చింది. దీంతో అధికార పార్టీ డిఫెన్స్‌లో పడింది. రైతుల పక్షాన ఉద్యమించడానికి టిడిపియేతర పార్టీలన్నీ రోడ్డెక్కాయి. చేసిన పొరపాటుకు ప్రభుత్వం లెంపలు వేసుకునే పరిస్థితి దాపురించింది. ముదపాక కేంద్రంగా తిరుగుతున్న రాజకీయాన్ని అధికార పార్టీ తట్టుకోలేకపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ముదపాకలో భూ సమీకరణ చేసే అవకాశం లేదు. అలాగే ఎకరా పది లక్షల కన్నా ఎక్కువ పలుకుతుందని రైతులకు తెలిసిపోయింది. ఇచ్చిన లక్ష రూపాయలు తిరిగి ఇచ్చే అవకాశం లేదు. డబ్బు ఎర వేసి రైతుల నుంచి తీసుకున్న పట్టాలు, పట్టాదార్ పాస్ పుస్తకాలు వగైరాలను సదరు పెద్ద మనుషులు తిరిగి రైతులకు ఇచ్చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కాదని ప్రభుత్వం అడుగు ముందుకువేస్తే, భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని విశే్లషకులు భావిస్తున్నారు.