నల్గొండ

భూవివాదమే ప్రాణం బలిగొంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 24: జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణంలో స్టేఇన్ హోటల్ లాడ్జిలో ఈ నెల 20వ తేదిన హాత్యకు గురైన మట్ట సైదయ్య చౌదరి హత్య కేసులో నిందితులు ముగ్గురిని అరెస్టు కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లుగా ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితులు శాలిగౌరారం మండలం వల్లాలకు చెందిన బొడిగె వెంకటేశ్వర్లు, పన్నాల సత్తిరెడ్డి, కేతెపల్లి మండలం ఇనుపాములకు చెందిన కంచర్ల జగన్‌మోహన్‌రెడ్డిలను హాజరుపరిచి కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. సైదయ్యకు నకిరేకల్‌లో మూసీ రోడ్ వెంట ఉన్న 21 ఎకరాల పది గుంటల భూమిని కోటి 25 లక్షలకు కొనుగోలు చేసేందుకు గత ఆగస్టు 20న అగ్రిమెంట్ చేసుకుని 50లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఈ అడ్వాన్స్‌లో 25 లక్షలు సైదయ్య తన రియల్ ఎస్టేట్ భాగస్వాములకు తెలువకుండా వ్యక్తిగతంగా తీసుకున్నారు. అయితే ఒప్పందం మేరకు గడువులోగా నిందితులు వెంకటేశ్వర్లు, సత్తిరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలు మిగతా డబ్బును చెల్లించకపోవడంతో సైదయ్య సదరు భూమిని వేరొకరికి విక్రయించాడు. ఈ వివాదంలో తమ అడ్వాన్స్ డబ్బులు 50 లక్షలు ఇవ్వాలని నిందితులు సైదయ్యపై ఒత్తిడి చేశారు. అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వడంలో సైదయ్య ఆలస్యం చేస్తుండటంతో పగ పెంచుకున్న నిందితులు అతడిని పథకం మేరకు హోటల్ లాడ్జికి రప్పించి కత్తులతో నరికి చంపారు. హత్య అనంతరం వారు ముగ్గురు పరారీలో ఉండగా గాలింపు చర్యల్లో భాగంగా వారిని సోమవారం పానగల్ బైపాస్ వద్ద టూటౌన్ పోలీస్ బృందం అరెస్టు చేసినట్లుగా ఎస్పీ తెలిపారు. వారి నుండి హత్యకు ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లు, కత్తులను ఇతర సాక్షాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పీ రాంగోపాల్, టూటౌన్ సిఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.
కేసు తప్పిస్తానంటు మోసం.. ఇద్దరి అరెస్టు
సైదయ్య హత్య కేసులో నిందితుడు కంచర్ల జగన్‌మోహన్‌రెడ్డిని కేసు నుండి తప్పిస్తానంటు అతని భార్య నుండి మూడు లక్షలు తీసుకుని మోసగించిన కేసులో వల్లాల ఎంపిటి ఇంతియాజ్, రఘుపతిలను అరెస్టు చేసినట్లుగా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. తనకు తెలిసిన పోలీస్ అధికారుల ద్వారా ఈ హత్య కేసులో జగన్‌మోహన్‌రెడ్డిని తప్పిస్తానంటు అందుకు మూడు లక్షలు ఖర్చవుతుందంటు వారు జగన్‌మోహరెడ్డి కుటుంబ సభ్యులను నమ్మించారు. దీంతో జగన్‌మోహన్‌రెడ్డి భార్య ఈ నెల 21న ఇంతియాజ్ సూచన మేరకు నల్లగొండకు వచ్చి రఘుపతికి మూడు లక్షలు అందించింది. ఐనప్పటికి పోలీసులు ఈ కేసులో తన భర్తను అరెస్టు చేసి కేసులు కొనసాగించడంతో ఖంగుతిన్న తనను ఇంతియాజ్, రఘుపతిలు మోసం చేశారంటు నల్లగొండ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతియాజ్‌ను అరెస్టు చేసి 2లక్షలు, రఘుపతిని అరెస్టు చేసి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారని, వారిని కోర్టుకు రిమాండ్ చేయనున్నట్లుగా ఎస్పీ వివరించారు.

క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత
రామగిరి, జూలై 24: క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తు ప్రొత్సహిస్తుందని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎన్‌జి కళాశాలలో జిల్లా ఫుట్ బాల్ అసొసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంఛ ఫుట్ బాల్ దినోత్సవంలో ఆయన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి పాల్గొని ఫుట్ బాల్ ప్రచార కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులకు ఫుట్‌బాల్స్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతు తెలంగాణలో అన్ని రకాల క్రీడలను ప్రొత్సహించి జాతీయ స్థాయిలో దేశానికి మంచి క్రీడాకారులను అందించేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. త్వరలోనే మన దేశంలో ప్రపంచ ఫుట్ బాల్ టోర్నమెంట్ సైతం జరుగబోతుందన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి కబడ్డీ, ఫెన్సింగ్, జూడో తదితర పోటీలను గత ఏడాదిన్నరలో నిర్వహించి రాష్ట్రంలో క్రీడల నిర్వాహణలో జిల్లా ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి, డాక్టర్ పుల్లారావు, ఫుట్‌బాల్ అసొసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్ హయాంలో దళితులపై పెరిగిన దాడులు
భువనగిరి, జూలై 24: దళితుల పేరుతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో వారిపై దాడులు పెరిగాయని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో బిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదన్నారు. ఎన్నికల మ్యానిపెస్టొలో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతి నిరుపేద దళిత కుటుంభానికి 3ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూం గృహాలు నిర్మించి ఇస్తానన్న ముఖ్యమంత్రి హమీలను అమలుచేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. రాష్టప్రతి దళితుడైనందున కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలో దలితులు మరణిస్తున్నా పట్టించుకోక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లా నేరెళ్ల గ్రామంలో ఇసుక రవాణాను అడ్డుకున్నా పాపానికి వారం రోజులలో 18 మంది దళితులు చనిపోతే కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఇసుకమాఫియాకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 26న రాష్ట్ర ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలను నిరసిస్తు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మహాధర్నా కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత జానారెడ్డి హాజరుకానున్నట్లుగా బిక్షమయ్యగౌడ్ తెలిపారు. ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎడమ బాలక్రిష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు బి.సత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోత్నాక్ ప్రమోద్‌కుమార్, దేవరకొండ నర్సింహచారి, చిక్కుల వెంకటేశ్, ఎండి షరీఫ్, సాబన్‌కార్ వెంకటేశ్, మైనార్టి నాయకులు మజ్హర్ బబ్లూ, ఆబెద్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ ఇళ్ల పనులు వేగవంతం
మిర్యాలగూడ టౌన్, జూలై 24: డబుల్‌బెడ్ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఉప్పల్‌గౌరవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని ఆలగడప, వెంకటాద్రిపాలెం గ్రామాల్లో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించిన సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ భూసేకరణ జరిగిన ప్రతి చోట పనులను వేగవంతం చేయాలన్నారు. ఆలగడప గ్రామంలో ఇటీవల పనులను చేపట్టామని త్వరలో పూర్తి చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. అదే విధంగా వెంకటాద్రిపాలెం గ్రామ శివారులో హమాలీలు, గుమాస్తాలకు గతంలో కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసిన అనంతరం అక్కడ డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను కోరారు. పట్టాలు పొంది ఉన్న వారిలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ ఇళ్లు పరిశీలిస్తామని పేర్కొన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి నియోజకవర్గ కార్యాలయం కమ్ ఎమ్మెల్యే క్వార్టర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అదేవిధంగా మిర్యాలగూడ మండల పరిషత్ పూర్తిచేసుకున్న భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ బి.కిషన్‌రావు, తహశీల్దార్ మాలి కృష్ణారెడ్డి, హౌజింగ్ డిఇ సూర్యనారాయణ, ఆర్‌ఐ వెంకటేశ్వరరావు, విఆర్‌ఓ అజయ్‌కుమార్ తదితరులున్నారు.

హరితహారంలో 37లక్షల మొక్కలు నాటాం
సూర్యాపేట, జూలై 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మూడవ విడత తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 37లక్షలు మొక్కలు నాటినట్లు కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ తెలిపారు. హరితహారం కార్యక్రమంపై సోమవారం ఆయన జిల్లాపరిధిలోని ఎంపిడివోలు, మండల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో మంగళవారం మంత్రులు జగదీశ్‌రెడ్డి, జోగు రామన్నలు పర్యటించి హరితహారంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ప్రతి మండలంలో 50వేల చొప్పున జిల్లావ్యాప్తంగా ఒకే రోజు 10లక్షలు మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హరితహారంలో చిలుకూరు, చివ్వెంల, సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం ముందున్నట్లు తెలిపి మండల అధికారులను అభినందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 40వేల మొక్కలు నాటిన గ్రామపంచాయతీల వివరాలను వెంటనే నివేధించాలని కోరారు. జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 68 నర్సరీల్లో 60లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కొన్ని నర్సరీల నుండి నేటి వరకు ఒక్క మొక్కను కూడా తరలించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. పండ్లు, పూల మొక్కలను పేద కుటుంబాల వారికి పంపిణిచేయాలని సూచించారు. ఈనెల 28న ఎక్సైజ్ డేను విజయవంతం చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌డివో సుందరి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చెరువులో పడి బాలిక మృతి
మునుగోడు, జూలై 24: మండల పరిధిలోని సోలిపురం గ్రామంలో చెరువులో పడి ఓ బాలిక మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోలిపురం గ్రామానికి చెందిన ఇరిగి కలమ్మకు ఇద్దరు కూతురులు, ఒక కుమారుడు. భర్త లింగయ్య ఏడు సంవత్సరాల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. నాటి నుండి పిల్లలను చదివించుకుంటూ కూలీ పని, తనకున్న కొద్దిపాటి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. చిన్న కూతురు ఇరిగి ప్రవళిక (9) ఇదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ప్రవళిక గేదెలను కాసేందుకు వెళ్లింది. ఉదయం నుండి సాయంత్రం వరకు గేదెలను మేపుకోని వాటికి నీళ్లు తాగించేందుకు చెరువు వద్దకు తీసుకెళ్లింది. నీళ్లు తాగేందుకు చెరువులోకి వెళ్లిన గేదెలను బయటకు తోలుకరావడానికి ఒడ్డున చెప్పులు, కర్రను వదిలి వెళ్లిన ప్రవళిక చెరువులో ఉన్న గుంతను గ్రహించకపోవడంతో గుంతలో పడి నీట మునిగింది. ఆ సమయంలో ఎవ్వరు లేక పోవడంతో ప్రవళికను కాపాడలేకపోయారు. సాయంత్రం సమయంలో గేదెలు మాత్రమే ఇంటికి వచ్చి తన కూతురు రాకపోవడంతో కంగారు పడ్డ బాలిక తల్లి కలమ్మ గ్రామస్థుల సహాయంతో గాలింపు మొదలు పెట్టింది. చెరువు ఒడ్డున ప్రవళిక చెప్పులు కనపడంతో చెరువులో పడినట్లు గ్రామస్తులు గుర్తించి చెరువులో గాలించారు. సమాచారం తెలుసుకున్న చండూర్ సిఐ రమేష్, స్థానిక తహశీల్దార్ వై.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై రాములు తన సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి చెరువులో ప్రవళిక కోసం వెతికారు. రాత్రి సమయం కావడంతో ప్రవళిక దొరుకలేదు. సోమవారం తెల్లవారుజామున కంప చెట్టుకు చిక్కుకున్న ప్రవళిక మృతదేహం గమనించిన పోలీసులు, గ్రామస్థులు మృతదేహాన్ని బయటకు తీశారు. బాలిక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థుల్లో విషాధచాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్డు నిమిత్తం నల్లగొండ అసుపత్రికి తరలించారు, మృతిరాలు తల్లి కలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.

పుట్టంగండిని పరిశీలించిన జెన్‌కో సీఈ
పెద్దఅడిశర్లపల్లి, జూలై 24: ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్‌లో భాగంగా పుట్టంగండి ఎత్తిపోతల పథకాన్ని జెన్‌కో సీఈ ఉపేందర్ సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం పుట్టంగండి జీరో పాయింట్ వద్ద జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులను పరిశీలించి స్థానిక జెన్‌కో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఈగా నియామకమైన మొదటిసారి పుట్టంగండికి రావడంతో ప్రాజెక్ట్ సమగ్ర సమాచారాన్ని అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్రోచ్ కెనాల్ సర్జ్ఫిల్‌తో పాటు 220 కెవి స్విచ్ యార్డ్‌ను సందర్శించి మోటార్ల పనితీరును పరిశీలించారు. ఆయన వెంట ఎస్‌ఈ రాజనర్సయ్య, డీఈ రాములు, ఏడిలు సత్యనారాయణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పేటలో మంత్రుల పర్యటన
సూర్యాపేట, జూలై 24: రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర అటవీ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రి జోగు రామన్నలు మంగళవారం జిల్లాకేంద్రంలో పర్యటించనున్నట్లు కలెక్టర్ కె. సురేంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9గంటలకు జిల్లాకేంద్రంలోని బీమారం రోడ్డులో, 20వ వార్డులో, మండలపరిధిలోని దాసాయిగూడెం గ్రామంలో ఉన్న సువెన్ పరిశ్రమలో నిర్వహించే హరితహారం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. అదే విధంగా మధ్యాహ్నం 12గంటలకు కలెక్టరేట్‌లో జిల్లాలో హరితహారం కార్యక్రమం, మిషన్ భగీరథ, పాలేరు మంచినీటి పథకం పనుల పథకంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 5గంటలకు చివ్వెంల మండలపరిధిలోని తుల్జారావుపేట గ్రామంలో పలు అభివృద్ది పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
గుర్రంపోడు, జూలై 24: పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొతలాపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన చేగొండి శ్రీను(35) కొతలాపురం గ్రామంలో తన బత్తాయి తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనుకు 4 లక్షల 50 వేల రూపాయల అప్పు ఉందని, అప్పు తీర్చే మార్గం లేక బత్తాయి తోటలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
గుట్కా ప్యాకెట్ల పట్టివేత
చండూరు, జూలై 24: మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామ సమీపంలో పోలీసులు చేస్తున్న తనిఖీలో భాగంగా సోమవారం సాయంత్రం 1400 గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు సిఐ రమేష్ తెలిపారు. నిందితుడు మహ్మద్ జహంగీర్ ఆటోలో చిప్స్ ప్యాకెట్ల మధ్యలో గుట్కాలను ఉంచి చండూరుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయించడం నేరమని, ఎవరైనా అమ్మినట్లయితే తమకు సమాచారం అందించాలని కోరారు. తనిఖీలో ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.