విశాఖపట్నం

ఆద్యంతం అద్భుతం నౌకాదళ విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 4: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్‌కె బీచ్‌లో తూర్పునౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన విన్యాసాలు ఆద్యంతం కనువిందు చేశాయి. నౌకాదళ శక్తి సామర్థ్యాలను చాటే విధంగా సైనికులు, సెయిలర్లు చేసిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. పౌరవిమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు ముఖ్యఅతిధిగా హాజరై నౌకాదళ విన్యాసాలను తిలకించారు. సాయంత్రం 4.15 గంటలకు ఆకాశంలో స్కైడైవర్లు ఒక్క సారిగా దర్శనమిచ్చి సందర్శకులను పలుకరించగా విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఆకాశంలో సుమారు 6000 అడుగుల ఎత్తు నుంచి ఎనిమిది మంది స్కై డైవర్లు ఈ విన్యాసాల్లో పాల్గొనగ, గాలి వేగాన్ని నియంత్రించుకుంటూ నిర్ధేశిత లక్ష్యంలో నేలకు దిగే ప్రక్రియ ఆకట్టుకుంది. వీరిలో ఒకరు భారత జాతీయ పతాకాన్ని, మరొకరు నౌకాదళ పతాకాన్ని ఎగురవేస్తూ నేలకు దిగి, ముఖ్యఅతిధికి గౌరవ వందనం చేశారు.
అనంతరం నౌకాదళంలో శత్రు విధ్వంసక నౌకలుగా పేర్గాంచిన ఐఎన్‌ఎస్ శివాలిక్, ఐఎన్‌ఎస్ సత్పుర, ఐఎన్‌ఎస్ రణ్‌విజయ్, ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ యుద్ధ నౌకలపై నౌకాదళంలో సేవలందిస్తున్న సీకింగ్, కమోవ్ 28, చేతక్ హెలికాఫ్టర్లు ల్యాండయ్యే విన్యాసం ఆకట్టుకుంది. సముద్రపు అలలకు వేగంగా అటుఇటు కదులుతున్న నౌకపై హెలికాఫ్టర్‌ను దించే విన్యాసం ఎంతో కష్టసాధ్యం, దీనికి నైపుణ్యంతో పాటు చాకచక్యం ఉండాల్సిందే. అనంతరం నౌకదళంలో విస్తృత సేవలందిస్తున్న హాక్ తరహా యుద్ధ విమానాల విన్యాసాలు సందర్శకులను కట్టిపడేశాయి. ఆకాశంలో చక్కర్లు కొడుతూ సందర్శకులను కనువిందు చేశాయి. అనంతరం నౌకాదళంలో అత్యంత వేగంగా పయనించే ఇమీడియట్ సపోర్ట్ వెసల్స్ (ఐఎస్‌వి) సముద్రంలో తమ పోరాటపటిమను ప్రదర్శించాయి. హెవీ మెషీన్‌గన్స్‌ను కలిగి ఉండే ఈ తరహా చిన్న తరహా నౌకలు యుద్ధ సమయాల్లో శత్రువుల కదలికల మేరకు మెరుపుదాడులకు దిగుతాయి. అనంతరం నౌకాదళంలో సెర్చ్ అండ్ రెస్క్యూ అంశాల్లో సేవలందించే యుహెచ్ 3హెచ్ హెలికాఫ్టర్లు సముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించే విన్యాసాలు నిర్వహించారు. సముద్రంలో చిక్కుకున్న బోట్లలో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చే విన్యాసం ఆకట్టుకుంది.
తీరంలో నౌకాదళ కమాండోలు చేసిన విన్యాసాలు, పోరాటాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. మెరైన్ కమాండోలు నాలుగు జెమినీ బోట్లపై తీరానికి చేరుకుని, తీరంలో మాటువేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టే విన్యాసాలు ఒళ్లుగగుర్పొడిచేలా చేశాయి. అలాగే నౌకాదళంలోని సీకింగ్ హెలికాఫ్టర్ల ద్వారా కమాండోలు సముద్రంలో బోట్లపై దిగి, తీరానికి చేరుకున్న విధానం, కమాండోల శక్తి సామర్థ్యాలను కళ్లకు కట్టినట్టు చూపారు. కమాండోలు శత్రు దేశాలకు చెందిన ఆయిల్ రిగ్‌ను పేల్చివేసిన దృశ్యం భయాందోళనకు గురిచేసింది. పెద్ద పేలుడుతో తీరానికి అతి సమీపంలో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడే సన్నివేశం ఆకట్టుకుంది. మార్క్, హాక్ యుద్ధ విమానాల విన్యాసాలు, చేతక్, సీకింగ్, కమోవ్ 28 హెలికాఫ్టర్ల విన్యాసాలు అద్భుతంగా చేసి చూపని సైనికుల ప్రతిభాపాటవాలను సందర్శకులు వేనోళ్ల కొనియాడారు.
ఆదివారం నౌకాదళ దినోత్సవం
ప్రతి యేటా నిర్వహించే నౌకాదళ దినోత్సవం ఈ సారి ఆదివారం రావడంతో సాగరతీరం జనసంద్రమైంది. నౌకాదళ విన్యాసాలను తిలకించేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. దీంతో రోడ్లున్నీ జనంతో కిక్కిరిసాయి. విన్యాసాలను తిలకించేందుకు లక్షకు పైజా సందర్శకులు హాజరై ఉంటారని అంచనా. అయితే పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్శకులకు పోలీసులతో తిప్పలు తప్పలేదు. ఎక్కడ పడితే అక్కడ ఆంక్షలు విధించడంతో సందర్శకులు ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోయారు. దీనికి తోడు బస్సులను దారిమళ్లించడంతో కూడా ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది.